తాప్సీ పన్ను: ‘నెలకు కరెంట్ బిల్లు రూ.36 వేలు, లాక్‌డౌన్ కాలంలో బిల్లు అంత ఎలా పెరిగింది?’ - ప్రెస్ రివ్యూ

ఫొటో సోర్స్, facebook/taapseeofficial
అదానీ కంపెనీ దెబ్బకు కరెంట్ బిల్ చూస్తే షాక్ కొడుతోందని హీరోయిన్లు చెబుతున్నారని ఆంధ్రజ్యోతి పత్రిక ఒక కథనంలో పేర్కొంది.
ఆ కథనం ప్రకారం.. ఒకప్పటి కథానాయిక రాధ కుమార్తె, తెలుగులో 'జోష్', 'దమ్ము', 'బ్రదర్ ఆఫ్ బొమ్మాళి' చిత్రాల్లో నటించిన కార్తీకా నాయర్ అమాంతం ఎక్కువ వచ్చిన కరెంట్ బిల్‌పై ఆశ్చర్యం వ్యక్తం చేశారు.
''జూన్ నెలకు గాను ఎలక్ట్రిసిటీ బిల్ దగ్గర దగ్గర లక్ష రూపాయలు వచ్చింది. ముంబైలో అదానీ కంపెనీ ఎటువంటి కుంభకోణానికి పాల్పడుతోంది? ముంబై ప్రజలు నుంచి ఇటువంటి కంప్లయింట్స్ చాలా వింటున్నాను'' అని కార్తీక అన్నారు.
'మీకు హోటల్ ఉందా?' అని నెటిజన్ ప్రశ్నిస్తే... ''అది నా హోటల్ బిల్ అయితే బావుండేది. కానీ, నా ఇంటికి వచ్చిన కరెంట్ బిల్'' అని ఆమె సమాధానం ఇచ్చారు.
అల్లు అర్జున్ 'ఆర్య 2', ప్రభాస్ 'డార్లింగ్', గోపీచంద్ 'మొగుడు' చిత్రాల్లో రెండో కథానాయికగా నటించిన శ్రద్ధా దాస్ సైతం రూ. 34 వేలు కరెంట్ బిల్ వచ్చిందని నోరెళ్లబెట్టారు. ఆమె కూడా అదానీ కంపెనీపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది
తాజాగా తాప్సీ ఈ జాబితాలో చేరారు.
''ఏప్రిల్‌లో రూ. 4,390, మేలో రూ. 3,850 బిల్ వచ్చింది. జూన్‌కి రూ. 36,000 బిల్ పంపారు. గత నెల మా కరెంట్ బిల్ అంతలా పెరగడానికి మూడు నెలల లాక్‌డౌన్ కాలంలో నేను ఏమైనా కొత్త ఎలక్ట్రిక్ వస్తువులు కొన్నానా? ఎక్కువ వినియోగించానా? అని ఆశ్చర్యపోయా. అదానీ ఎలక్ట్రిసిటీ ఏ అధికారంతో ఇంత వసూలు చేస్తుంది?'' అని తాప్సీ ట్వీట్ చేశారు. ఓ విధంగా ఎలక్ట్రిక్ షాక్ కొట్టినట్టుందని పేర్కొన్నారామె. ఎవరూ లేని అపార్ట్‌మెంట్‌కి రూ. 8,640 బిల్ పంపించడంపై తాప్సీ వ్యంగ్యంగా స్పందించారు. ''శుభ్రం చేయడానికి వారానికి ఒకసారి వెళ్లడం తప్ప ఈ అపార్ట్‌మెంట్‌లో ఎవరూ ఉండటం లేదు. మార్చిలో రూ. 570, ఏప్రిల్‌లో రూ. 730 రాగా... మే నెలకి గాను రూ. 8,640 బిల్ వచ్చింది. మాకు తెలియకుండా ఎవరైనా అపార్ట్‌మెంట్ ఉపయోగిస్తున్నారేమోనని ఆందోళన చెందుతున్నా. వాస్తవాలు తెలుసుకోవడంలో మాకు అదానీ కంపెనీ సహకరించింది'' అని తాప్సీ పేర్కొన్నారు. అంత పవర్ బిల్ చూసి తన ముఖంలో చిరునవ్వు చెదురుతోందని ఆమె అన్నారు.

ఫొటో సోర్స్, ANI
పీఎం కేర్స్ ఫండ్‌కి చైనా విరాళాలు - కాంగ్రెస్ పార్టీ ఆరోపణ
భారత్, చైనా మధ్య ఉద్రిక్తత నెలకొన్న ఈ సంక్షోభ పరిస్థితుల్లో పీఎం కేర్స్ ఫండ్‌కి చైనా సంస్థలు ఇస్తున్న విరాళాలు కేంద్రం ఎందుకు స్వీకరిస్తోందని కాంగ్రెస్ పార్టీ ప్రశ్నించిందని సాక్షి దినపత్రిక ఒక కథనంలో పేర్కొంది.
ఆ కథనం ప్రకారం.. ప్రధానమంత్రి మోదీ చైనాని ఒక దురాక్రమణదారుడిగా ఎందుకు చూడడం లేదని కాంగ్రెస్ అధికార ప్రతినిధి అభిషేక్ సింఘ్వీ నిలదీశారు. లద్దాఖ్‌లో మన భూభాగాన్ని ఆక్రమిస్తున్న వారికి తగిన బుద్ధి చెబుతామని మోదీ మన్ కీ బాత్‌లో చెప్పిన కాసేపటికే సింఘ్వీ కేంద్రంపై ప్రశ్నల వర్షం కురిపించారు.
గత ఆరేళ్లలో చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌తో 18సార్లు సమావేశమైన మోదీ ఆ దేశ దురాక్రమణని ఎందుకు గుర్తించలేదన్నారు. చైనాని దురాక్రమణదారుడుగా మోదీ అంగీకరించి తీరాలన్నారు.
పీఎం కేర్స్ ఫండ్‌కి చైనా సంస్థల నుంచి నిధులు స్వీకరించడం జాతీయ భద్రతకి పెను ముప్పు అని ఆందోళన వ్యక్తం చేశారు. చైనా కంపెనీల నుంచి కోట్లాది రూపాయల నిధులు స్వీకరిస్తూ ఆ దేశం చేస్తున్న ఆక్రమణల నుంచి దేశాన్ని ఎలా రక్షించగలరో ప్రధాని సమాధానం చెప్పాలని అన్నారు. పీఎం కేర్స్‌కి చైనా కంపెనీలైన హవాయి రూ. 7 కోట్లు, టిక్‌టాక్ రూ. 30 కోట్లు, పేటీఎం రూ.100 కోట్లు, షియామీ రూ.15 కోట్లు, ఒప్పో రూ. కోటి ఇచ్చినట్టుగా సింఘ్వీ ఆరోపించారు.

ఫొటో సోర్స్, Survey General of India
ఆంధ్రా-తెలంగాణ సరిహద్దులో వాహనాల రాకపోకలపై ఆంక్షలు
ఏపీ సరిహద్దులో వాడపల్లి మీదుగా వెళ్లే వాహనాలకు రాత్రి 7 గంటల వరకే అనుమతి ఉంటుందని నల్లగొండ ఎస్పీ ఏవీ రంగనాథ్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారని నమస్తే తెలంగాణ పత్రిక ఒక కథనంలో పేర్కొంది.
ఆ కథనం ప్రకారం.. సరకు రవాణా, అత్యవసర సేవలకు మినహాయింపు ఉంటుందని పోలీసులు తెలిపారు. నల్లగొండ నుంచి ఏపీలోకి వచ్చే అన్ని వాహనాలను రాత్రి 7 గంటలకు నిలిపివేస్తామని గుంటూరు ఎస్పీ తెలిపారని, ప్రయాణికులు అందుకు అనుగుణంగా రాకపోకలు సాగించాలని కోరారు. నాగార్జున సాగర్-మాచర్ల రహదారిలో ఎలాంటి రవాణా వాహనాలను ఏపీ పోలీసులు అనుమతించటం లేదని ఎస్పీ వివరించారు. సరకు రవాణా, అత్యవసర సేవల వాహనాలు మినహా ఏపీవైపు వెళ్లే అన్ని ప్రైవేటు వాహనాల వారికి విధిగా పాస్ ఉండాలని చెప్పారు.

ఫొటో సోర్స్, facebook/amitshahofficial
చైనా, పాకిస్తాన్‌లకు నచ్చేలా రాహుల్ గాంధీ వ్యాఖ్యలు - అమిత్ షా విమర్శ
కాంగ్రెస్ పార్టీ నాయకుడు రాహుల్ గాంధీ చేస్తున్న వ్యాఖ్యలు చైనా ,పాకిస్తాన్‌లకు నచ్చేలా ఉంటున్నాయని కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా విమర్శించినట్లు వెలుగు దినపత్రిక ఒక కథనంలో పేర్కొంది.
ఆ కథనం ప్రకారం.. 'ఇండియా వ్యతిరేక ప్రచారాన్ని మేం సమర్థంగా తిప్పికొట్టగలం. అయితే అతి పెద్ద పొలిటికల్ పార్టీకి మాజీ ప్రెసిడెంట్ అయి ఉండి ఇలాంటి నిస్సార రాజకీయాలు చేసినప్పుడు బాధాకరంగా ఉంటుంది' అని షా మండిపడ్డారు.
'చైనా, పాకిస్తాన్‌లు రాహుల్ హ్యాష్‌ట్యాగ్‌ను ముందు తీసుకెళ్తున్నాయి. రాహుల్‌తోపాటు కాంగ్రెస్ పార్టీ ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిన తరుణమిది. ఇది నా కోసం కాదు. తమ లీడర్‌ను పాక్, చైనాలు ప్రోత్సహిస్తున్నాయని కాంగ్రెస్ గ్రహించాలి. ఈ విపత్కర సమయంలో చైనా, పాకిస్థాన్ ఏం ఇష్టపడతాయో మీరు అవే చెబుతున్నారు. అడ్వాణీ తర్వాత రాజ్‌నాథ్ సింగ్, నితిన్ గడ్కరీ బీజేపీ ప్రెసిడెంట్‌గా ఉన్నారు. ఇప్పుడు నడ్డా అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. వీరిలో ఒకే కుటుంబానికి చెందిన వారెవరైనా ఉన్నారా? ఇందిర తర్వాత గాంధీ కుటుంబం నుంచి కాక కాంగ్రెస్ ప్రెసిడెంట్‌గా వ్యవహరించిన బయటి వ్యక్తి పేరు చెప్పండి? ఏ ప్రజాస్వామ్యం గురించి మీరు మాట్లాడుతున్నారు?' అని షా దుయ్యబట్టారు.
ఇవి కూడా చదవండి:
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)























