ప్రెస్‌రివ్యూ: ఏపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఒకే రోజు 3 అంశాల్లో హైకోర్టు తీర్పులు, ఆదేశాలు

ఏపీ సీఎం జగన్‌మోహన్ రెడ్డి

ఫొటో సోర్స్, FACEBOOK/YS JAGAN MOHAN REDDY

ఫొటో క్యాప్షన్, ఏపీ సీఎం జగన్‌మోహన్ రెడ్డి
ప్రచురణ

ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఒకే రోజు మూడు అంశాల్లో తీర్పులు, ఆదేశాలు ఇచ్చిందని ఈనాడు కథనం ప్రచురించింది.

రాష్ట్ర ప్రభుత్వానికి ఒకే రోజు మూడు అత్యంత కీలకమైన అంశాల్లో ఎదురుదెబ్బ తగిలింది, మూడు భిన్నమైన కేసుల్లో సర్కారుకు వ్యతిరేకంగా హైకోర్టు కీలక తీర్పులు, ఆదేశాలు వెలువరించిందని తెలిపింది.

ప్రభుత్వ కార్యాలయాలకు పార్టీ రంగులు వేయవద్దని గతంలో తాము చెప్పినా బేఖాతరు చేస్తున్నారని హైకోర్టు ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.

ప్రభుత్వ కార్యాలయాలకు వేసిన పార్టీ రంగులు తొలగించాలన్న తీర్పును పట్టించుకోలేదంటూ సీఎస్‌, పంచాయతీరాజ్‌శాఖ ముఖ్యకార్యదర్శి, కమిషనర్‌లపై కోర్టు ధిక్కరణ కేసు నమోదు చేయాలనీ ఆదేశించిందని పత్రిక రాసింది.

తాజాగా రాష్ట్రంలో సంచలనం రేపిన విశాఖ వైద్యుడు సుధాకర్‌ కేసులో పోలీసులు వ్యవహరించిన తీరును తప్పుబట్టింది.

దీనిపై ప్రభుత్వ నివేదికకు, మెజిస్ట్రేట్‌ నమోదు చేసిన వాంగ్మూలానికి చాలా తేడాలున్నాయని, ప్రభుత్వ వివరాల్ని నమ్మే పరిస్థితి లేదని వ్యాఖ్యానించినట్లు ఈనాడు చెప్పింది.

నిష్పక్షపాత దర్యాప్తు కోసం కేసును సీబీఐకి అప్పగించాలని ఆదేశించింది.

మరో కేసులో సీనియర్‌ ఐపీఎస్‌ అధికారి ఏబీ వెంకటేశ్వరరావును సస్పెండ్‌ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం గతంలో జారీ చేసిన ఉత్తర్వులను కొట్టివేసిందని కథనంలో రాశారు.

ఆ ఉత్తర్వులు చట్టవిరుద్ధం, ఏకపక్షమని తేల్చిచెప్పిన హైకోర్టు, ఆయనను వెంటనే సర్వీసులోకి తీసుకోవాలనీ.. ఆయనకు దక్కాల్సిన ఆర్థిక ప్రయోజనాలన్నీ అందించాలని స్పష్టం చేసినట్లు ఈనాడు వివరించింది.

కేసీఆర్, చిరంజీవి

ఫొటో సోర్స్, Telangana CMP

ఫొటో క్యాప్షన్, కేసీఆర్, చిరంజీవి

దశలవారీగా సినిమా షూటింగులు, పోస్ట్ ప్రొడక్షన్ పనులు

లాక్‌డౌన్‌ వల్ల హైదరాబాద్‌లో ఆగిపోయిన సినిమా షూటింగులు, పోస్ట్‌ ప్రొడక్షన్లను దశలవారీగా పునరుద్ధరిస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించినట్లు నమస్తే తెలంగాణ కథనం రాసింది.

లాక్‌డౌన్‌ నిబంధనలు, కొవిడ్‌ వ్యాప్తి నివారణ మార్గదర్శకాలు పాటిస్తూ షూటింగ్‌లు నిర్వహించేలా ఎవరికివారు స్వీయ నియంత్రణ పాటించాల్సి ఉంటుందని సూచించారు. షూటింగ్‌లు ఎలా నిర్వహించుకోవాలనే దానిపై విధివిధానాలు రూపొందించాలని అధికారులను ఆదేశించారు.

శుక్రవారం ప్రగతిభవన్‌లో సినీరంగ ప్రముఖులతో సీఎం కేసీఆర్‌ సమావేశమయ్యారు.

షూటింగ్‌లకు అనుమతి ఇవ్వాలని, థియేటర్లు తెరిచే అవకాశం ఇవ్వాలని సినీరంగ ప్రముఖులు ముఖ్యమంత్రికి విజ్ఞప్తిచేశారు. దీనిపై సీఎం కేసీఆర్‌ సానుకూలంగా స్పందించారని పత్రిక చెప్పింది.

సినీపరిశ్రమపై ఆధారపడి లక్షల మంది జీవిస్తున్నందున పోస్ట్‌ ప్రొడక్షన్‌, షూటింగ్‌ల నిర్వహణ, థియేటర్లలో ప్రదర్శనలను దశలవారీగా పునరుద్ధరించాల్సిన అవసరం ఉన్నదని సీఎం అభిప్రాయపడ్డారు.

తక్కువ మందితో ఇండోర్‌ లో చేసే వీలున్న పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులు మొదట ప్రారంభించుకోవాలని చెప్పారు. ఆ తర్వాత దశలో జూన్‌లో సినిమా షూటింగులు ప్రారంభించాలని సూచించారు.

చివరగా పరిస్థితిని బట్టి సినిమా థియేటర్ల పునఃప్రారంభంపై నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. సినీపరిశ్రమ బతకాలని, ఆదే సందర్భంగా కరోనా వ్యాప్తి చెందవద్దన్నారని నమస్తే తెలంగాణ రాసింది.

అం దుకోసం సినిమా షూటింగ్‌లను వీలైనంత తక్కువ మందితో లాక్‌డౌన్‌ నిబంధనలు పాటిస్తూ, కరోనా వ్యాప్తి నివారణ మార్గదర్శకాలను అనుసరిస్తూ నిర్వహించుకోవాలని చెప్పారు.

ప్రభుత్వం కచ్చితమైన మార్గదర్శకాలు రూపొందించి షూటింగ్‌లకు అనుమతి ఇస్తుందని వివరించారు. కొద్దిరోజులు షూటింగ్‌లు నడిచిన తర్వాత అప్పటి పరిస్థితిపై అంచనా వస్తుందని, థియేటర్లు తెరువడంపై నిర్ణయం తీసుకుంటామని చెప్పారని కథనంలో తెలిపారు.

ఎండ

ఫొటో సోర్స్, iStock

ఆంధ్రప్రదేశ్‌లో పెరుగుతున్న ఉష్ణోగ్రతలు

ఆంధ్రప్రదేశ్‌లో ఉష్ణోగ్రతలు తీవ్రంగా పెరుగుతున్నాయని సాక్షి కథనం ప్రచురించింది.

రాష్ట్రంలో భానుడి భగభగలు కొనసాగుతున్నాయి. అంతకంతకూ పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో ప్రజలు విలవిల్లాడుతున్నారు.

శుక్రవారం సాధారణం కంటే 2 నుంచి 3 డిగ్రీల అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. పలు జిల్లాల్లో వడగాడ్పులు హడలెత్తించాయి. దీనికితోడు విపరీతమైన ఉక్కపోతతో జనం అల్లాడారు.

రాష్ట్రంలో అత్యధికంగా విజయవాడలో 46 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదైనట్లు విశాఖ వాతావరణ కేంద్రం తెలిపింది. అలాగే, బాపట్ల, జంగమహేశ్వరపురంలలో 45 డిగ్రీలకుపైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని సాక్షి తెలిపింది.

ఉంపన్‌ పెను తుపాను కారణంగా.. గాలిలోని తేమంతా తుడిచిపెట్టుకుపోవడం వల్లే రాష్ట్రంలో ఒక్కసారిగా ఉష్ణోగ్రతలు పెరిగాయని విశాఖ వాతావరణ శాఖ అధికారులు వివరించారు.

రానున్న రెండు రోజులపాటు ఇదే పరిస్థితి ఉంటుందని, ప్రజలు అప్రమత్తంగా ఉంటూ ఎండ నుంచి ఉపశమనం పొందేందుకు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

మరోవైపు ఉంపన్‌ పూర్తిగా బలహీనపడింది. ఉత్తర బంగ్లాదేశ్‌ దాని పరిసర ప్రాంతాల్లో కొనసాగుతున్న తీవ్ర అల్పపీడనం మరింత బలహీనపడి అల్పపీడనంగా మారింది.

విపరీతమైన ఎండల కారణంగా వడదెబ్బకు గురై విశాఖ జిల్లాలో శుక్రవారం ఒకరు మరణించినట్లు సాక్షి వివరించింది.

యాదాద్రి
ఫొటో క్యాప్షన్, యాదాద్రి

టీటీడీ బాటలో యాదాద్రి

టటీడీ తరహాలో బల్క్‌ ఆర్డర్లలో యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి లడ్డూలు విక్రయించేందుకు తెలంగాణ దేవాదాయ శాఖ సిద్ధమవుతోందని ఆంధ్రజ్యోతి కథనం రాసింది.

పెళ్లిళ్లు, పుట్టిన రోజు, ఇతర శుభకార్యాల్లో ఆహూతులకు స్వామి వారి లడ్డూ ప్రసాదాన్ని కానుకగా ఇచ్చేందుకు ఆసక్తి ఉన్న భక్తులు బల్క్‌లో లడ్డూలు బుక్‌ చేసుకోవచ్చు.

యాదాద్రిలోని కల్యాణ మండపాన్ని, హైదరాబాద్‌ బర్కత్‌పురాలో కొత్తగా నిర్మించిన మరో కల్యాణ మండపాన్ని బుక్‌ చేసుకునే వారిని బల్క్‌లో లడ్డూలు కావాలా? అని అడిగి వారు సరే అంటే సరఫరా చేస్తారని పత్రిక తెలిపింది.

రెండు కల్యాణ మండపాల వద్ద చిన్నపాటి స్టాళ్లు ఏర్పాటు చేసి స్వామివారి ప్రసాదం, లాకెట్‌, క్యాలెండర్‌, ఇతర వస్తువుల్ని భక్తులకు విక్రయిస్తారు.

ఇలా చేయడం వల్ల స్వామి వారిని భక్తులకు చేరువ చేయడంతో పాటు విక్రయాల ద్వారా ఆదాయం పెంచుకోవచ్చనేది అధికారుల ఆలోచన అని కథనంలో రాశారు.

ఈ మేరకు దేవాదాయ శాఖ రూపొందించిన ప్రతిపాదనలను త్వరలోనే ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి, అనుమతి రాగానే ఆచరణలో పెట్టనున్నారు.

టీటీడీలో బల్క్‌లో లడ్డూలు అమ్మడంపై విమర్శలు వస్తున్న నేపథ్యంలో యాదాద్రి లడ్డూల విషయంలో సీఎం ఎలా స్పందిస్తారన్నది ఆసక్తికరంగా మారిందని కథనంలో చెప్పారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)