ఇండియా లాక్‌డౌన్: పట్టాలెక్కనున్న రైళ్లు.. ప్రయాణికులు పాటించాల్సిన నియమ, నిబంధనలు ఇవే..

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, సరోజ్ సింగ్
- హోదా, బీబీసీ ప్రతినిధి
- ప్రచురణ
భారత్‌లో దినసరి కరోనావైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య తొలిసారి 4200కు మించి నమోదైంది. ఇదే సమయంలో కేంద్ర ప్రభుత్వం ఓ కీలక నిర్ణయం తీసుకుంది. మే 12 నుంచి రైళ్లు నడపనున్నట్లు రైల్వే మంత్రిత్వశాఖ ప్రకటించింది. అయితే, మొదటి విడతలో 30 (15 జంట) రైళ్లు మాత్రమే నడుస్తాయని తెలిపింది.
మార్చి 25న దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ అమల్లోకి వచ్చింది. అప్పటి నుంచి రైళ్లు నడవడం లేదు. ఇప్పుడు లాక్‌డౌన్ మూడో విడత నడుస్తోంది. ఇది కొనసాగుతుండగానే ప్రభుత్వం రైళ్లు నడపాలని నిర్ణయం తీసుకోవడంపై కొందరిలో ఆందోళనైతే ఉంది.
రైల్వే మంత్రిత్వశాఖ తాజా నిర్ణయాన్ని ప్రధాన ప్రతిపక్ష పార్టీ కాంగ్రెస్ స్వాగతించింది.
ఇదే తరహాలో రాబోయే రోజుల్లో రోడ్డు రవాణా, విమాన సేవలను ప్రారంభించాలని కేంద్ర మాజీ ఆర్థిక మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత పి.చిదంబరం ట్వీట్ చేశారు.

ఫొటో సోర్స్, TWITTER / PIYUSH GOYAL
అయితే, ప్రభుత్వ నిర్ణయాన్ని తప్పుపడుతున్నవారూ ఉన్నారు.
కొత్తగా ఏసీ రైళ్లనే నడపాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంపై సామాజికవేత్త యోగేంద్ర యాదవ్ ట్విటర్‌లో అభ్యంతరం వ్యక్తం చేశారు. లాక్‌డౌన్‌లో చిక్కుకుపోయినవారిని విస్మరించి, యాత్రికులను తరలిస్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు.
రైల్వే వెల్లడించిన సమాచారం ప్రకారం ఇప్పుడు నడిపే రైళ్లన్నీ ఏసీ కోచ్‌లున్నవే.
ఈ రైళ్లు న్యూదిల్లీ నుంచి పట్నా, రాంచీ, హౌరా, డిబ్రూగఢ్, అగర్తలా, బిలాస్‌పుర్, భువనేశ్వర్, సికింద్రాబాద్, బెంగళూరు, తిరువనంతపురం, మడ్గావ్, ముంబయి సెంట్రల్, అహ్మదాబాద్, జమ్మూ తవిలకు వెళ్తాయి.
వీటిలో టికెట్ల కోసం బుకింగ్ ఈరోజు (మే 11వ తేదీ సోమవారం) సాయంత్రం ఆరు గంటలకు మొదలైంది. ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్‌లోను, ఐఆర్‌సీటీసీ కనెక్ట్ యాప్‌లో మాత్రమే టిక్కెట్లు బుక్ చేసుకోవచ్చు.

ఫొటో సోర్స్, Ministry of Railways, GOI
ఛార్జీలు ఇదివరకటిలానే...
మంగళవారం నుంచి జరిగే రైలు ప్రయాణాల కోసం రైల్వే... రైళ్లు నడపడం, ఛార్జీలు, భౌతిక దూరం నిబంధనలు వంటి వాటి గురించి కొత్త సర్క్యులర్ జారీ చేసింది.
ఈ సర్క్యులర్‌లోని ముఖ్యాంశాలను ఐఆర్‌సీటీసీ సీఎండీ ఎంపీ మల్ బీబీసీకి వివరించారు.
ఆయన చెప్పిన వివరాల ప్రకారం ఈ 15 జంట రైళ్లు రాజధాని రైళ్లే. ఇదివరకు ఈ మార్గాల్లో ఉండే ఛార్జీలే, ఇప్పుడు కూడా వర్తిస్తాయి. కానీ, కేటరింగ్ ఛార్జీలు ఉండవు. లాక్‌డౌన్‌కు ముందు రాజధాని రైళ్లలో ‘డైనమిక్ ప్రైసింగ్’ ఉండేది. సీట్లు నిండుతున్న కొద్దీ, ఛార్జీలు పెరిగేవి.
నీళ్లు, ప్యాకేజ్డ్ ఆహారాన్ని రైళ్లలో ప్రయాణికులు కొనుగోలు చేయవచ్చు. మార్గం మధ్యలో బెడ్ రోల్ ఇవ్వరు.
ఈ రైళ్లలో 1ఏసీ, 2ఏసీ, 3ఏసీ కోచ్‌లు ఉంటాయి. 1ఏసీ, 2ఏసీ కోచ్‌ల్లో భౌతిక దూరం పాటించడానికి ఇబ్బందులేమీ ఉండవు. 3ఏసీలో ఎలాంటి ఏర్పాట్లు చేస్తారన్నదానిపై మాత్రం స్పష్టత లేదు. ఆ కోచ్‌ల్లో 72 సీట్లను ఇస్తారా? లేక తగ్గిస్తారా? అన్నది ఇంకా తెలియరాలేదు.
శ్రామిక్ ప్రత్యేక రైళ్లలోనూ 1200 మందికి బదులుగా 1700 మంది ప్రయాణికులను అనుమతించే విషయంపైనా చర్చ జరుగుతోంది.
కొత్త నిబంధనల ప్రకారం:
- ఏడు రోజుల ముందుగానే రైళ్లలో సీట్లు బుక్ చేసుకోవాలి
- తత్కాల్ బుకింగ్ ఉండదు
- ఆర్ఏసీ టికెట్లు కూడా ఉండవు
- ఏజెంట్ల ద్వారా బుకింగ్ జరగదు
- ప్రయాణం ప్రారంభమయ్యే సమయం కన్నా 90 నిమిషాల ముందుగానే ప్రయాణికులు రైల్వే స్టేషన్‌కు చేరుకోవాలి
- ప్రయాణానికి 24 గంటల ముందు వరకూ టికెట్ రద్దు చేసుకోవచ్చు.

ఫొటో సోర్స్, Indian Railway
వారంలో ఎన్ని రైళ్లు నడుస్తున్నాయి?
సమగ్రమైన టైమ్ టేబుల్‌ను ఇంకా విడుదల చేయలేదు. కానీ, రైల్వే ఇచ్చిన సమాచారం ప్రకారం 30 రైళ్లలో 16 రైళ్లు రోజూ నడుస్తాయి. 8 రైళ్లు వారానికి రెండుసార్లు, రెండు రైళ్లు వారానికి రెండుసార్లు, నాలుగు రైళ్లు వారానికి ఒకసారి నడుస్తాయి.
ఈ రైళ్లు ఆగే స్టేషన్ల సంఖ్య కూడా ఇదివరకటి కన్నా తక్కువగా ఉంటుంది. లాక్‌డౌన్‌కు ముందు ఆయా మార్గాల్లో రైళ్లు వారంలో ఎన్నెన్ని రోజులు నడిచేవో, ఇప్పుడూ అన్నే రోజులు నడుస్తాయి.
ప్రయాణికులు, వారి వాహనాలను నడిపేవారు స్టేషన్‌కు రావడానికైనా, పోవడానికైనా కన్ఫర్మ్ అయిన రైలు టికెట్ చూపించాల్సి ఉంటుంది.

ఫొటో సోర్స్, Twitter/piyushgoyal
హాట్‌స్పాట్లకు వెళ్తున్న రైళ్లు
ముంబయి సెంట్రల్, అహ్మదాబాద్‌ల్లో కరోనావైరస్ పాజిటివ్ కేసులు పెరుగుతూనే ఉన్నాయి. ముంబయి ప్రస్తుతం కరోనావైరస్ హాట్‌స్పాట్‌గా ఉంది.
రైళ్లలో వచ్చే ప్రయాణికులు క్షేమంగా ఇళ్లకు చేరేలా ఏర్పాట్లు చేయడం, వారిని క్రమం తప్పకుండా పరీక్షించడం ఆయా రాష్ట్రాలకు మరింత కష్టమవుతుంది.
శ్రామిక్ ప్రత్యేక రైళ్ల విషయంలో కేంద్రానికి, పశ్చిమ బెంగాల్ ప్రభుత్వానికి మధ్యలో విభేదాలు ఏర్పడ్డాయి. ఇప్పుడు ఈ కొత్త రైళ్లపై ఆ రాష్ట్ర సీఎం మమత బెనర్జీ ఎలా స్పందిస్తారో చూడాలి.
ఈ రైళ్ల ప్రయాణికులకు ముందుగానే స్టేషన్లలో స్క్రీనింగ్ నిర్వహిస్తారు. శానిటైజర్ ఇస్తారు. ప్రయాణానికి ముందు, ప్రయాణ సమయంలో మాస్క్ ధరించడం తప్పనిసరి.
స్టేషన్‌లో దిగిన తర్వాత, ఆయా రాష్ట్ర ప్రభుత్వాల నియమాలు పాటించాల్సి ఉంటుంది.
రాష్ట్ర ప్రభుత్వాలు క్వారంటీన్‌లో ఉండమని సూచించినా, గృహ నిర్బంధంలో ఉండాలని చెప్పినా ప్రయాణికులు పాటించాల్సిందే.

ఫొటో సోర్స్, Twitter/Piyush Goyal
ఏసీలో ఎలా...
నడిచే 30 రైళ్లూ ఏసీవే అని రైల్వే శాఖ స్పష్టం చేసింది.
సెంట్రల్ ఏసీతో ముప్పు ఉందని ప్రభుత్వం ఇదివరకు ఓ సర్క్యులర్ జారీ చేసింది.
అయితే విమానాల్లోనూ ఏసీ ఉంటుందని, పరిసరాలకు తగ్గట్లు రైళ్లలో ఏసీ ఉష్ణోగ్రతను కొనసాగిస్తే సమస్యేమీ ఉండదని పబ్లిక్ హెల్త్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడు శ్రీనాథ్ రెడ్డి బీబీసీతో అన్నారు.
నిబంధనలు, జాగ్రత్తలు పాటిస్తే కరోనావైరస్ వ్యాప్తి ముప్పును తగ్గించవచ్చని చెప్పారు.
‘‘కరోనావైరస్‌తో కలిసి జీవించడం మనం అలవాటు చేసుకోవాలి. ఎప్పటికీ రైళ్లు, విమానాలను నిలిపివేయలేం కదా! ఎక్కడో ఓ చోట మొదలుపెట్టాల్సిందే’’ అని ఆయన అభిప్రాయపడ్డారు.

ఫొటో సోర్స్, Getty Images
శ్రామిక్ రైళ్లు కొనసాగుతాయి
ఇతర రాష్ట్రాల్లో చిక్కుకుపోయి, స్వస్థలాలకు వెళ్లాలనుకునే వలస కార్మికుల కోసం శ్రామిక్ రైళ్లు కొనసాగుతాయని రైల్వే మంత్రిత్వశాఖ తెలిపింది.
రైల్వే ఇచ్చిన సమాచారం ప్రకారం సోమవారం ఉదయం వరకు 468 శ్రామిక్ రైళ్లు నడిచాయి. సుమారు ఐదు లక్షల మంది వలస కార్మికులు తమ తమ ప్రాంతాలకు చేరుకున్నారు.
మరో 300 శ్రామిక్ రైళ్లను నడిపే ప్రణాళికలు ఉన్నట్లు రైల్వే మంత్రి పీయూష్ గోయల్ ఆదివారం ట్విటర్‌లో తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వాల అభ్యర్థనల మేరకు వీటిని నడుపుతున్నట్లు చెప్పారు.
ప్రయాణీకుల రైళ్లు నడపొద్దు - కేసీఆర్
కరోనా వ్యాప్తి నియంత్రణ చర్యల్లో భాగంగా దేశంలో నిలిపేసిన ప్రయాణికుల రైళ్లను ఇప్పుడే పునరుద్ధరించవద్దని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి విజ్ఞప్తి చేశారని సీఎం కార్యాలయం తెలిపింది.
‘‘దేశంలోని ప్రధాన నగరాలైన దిల్లీ, ముంబయి, చెన్నై, హైదరాబాద్ తో పాటు చాలా నగరాల్లో కరోనా ప్రభావం ఉంది. ఈ ప్రాంతాల్లో ఎక్కువ సంఖ్యలో కరోనా బాధితులున్నారు. కాబట్టి ఇప్పుడే ప్రయాణీకుల రైళ్లను నడిపితే ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి రాకపోకలు ఎక్కువగా జరుగుతాయి. ఎవరు ఎటు పోతున్నారో తెలియదు. వారికి కరోనా ఉందో లేదో తెలియదు. అందరికీ టెస్టులు చేయడం కుదరదు. రైళ్లలో వచ్చిన ప్రయాణీకులను క్వారంటైన్ చేయడం కూడా కష్టం. కాబట్టి ఇప్పుడిప్పుడే ప్రయాణీకుల రైళ్లను నడపొద్దు’’ అని కేసీఆర్ సూచించారని సీఎం కార్యాలయం వెల్లడించింది.

- కరోనావైరస్- మీరు తప్పక తెలుసుకోవాల్సిన విషయాలు
- కరోనావైరస్ లక్షణాలు ఏంటి? ఎలా సోకుతుంది? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
- కరోనావైరస్ ఇన్ఫెక్షన్ సోకకుండా ఉండడానికి పాటించాల్సిన జాగ్రత్తలు... ఆరు మ్యాపుల్లో
- కరోనావైరస్: ఒకసారి వైరస్ నుంచి కోలుకున్న తర్వాత మళ్లీ వస్తుందా?
- కరోనావైరస్; ఎండ వేడి ఎక్కువగా ఉంటే వైరస్ నశిస్తుందా?
- కరోనావైరస్: వస్తువులు, ఇతర ఉపరితలాల మీద, గాలిలో ఈ వైరస్ ఎంత కాలం సజీవంగా ఉంటుంది?
- కరోనావైరస్ మన శరీరం మీద ఎలా దాడి చేస్తుంది? ఇది సోకిన వారిలో కొందరు చనిపోవడానికి కారణం ఏమిటి
- మాస్క్‌లు వైరస్ల వ్యాప్తిని అడ్డుకోగలవా

కరోనావైరస్ హెల్ప్‌లైన్ నంబర్లు: కేంద్ర ప్రభుత్వం - 01123978046, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ - 104. మానసిక సమస్యల, ఆందోళనల పరిష్కారానికి హెల్ప్‌లైన్ నంబర్ 08046110007


ఇవి కూడా చదవండి:
- కరోనావైరస్ సాకుతో కార్మికుల హక్కులపై వేటు.. మూడేళ్ల వరకూ కొన్ని చట్టాలు రద్దు
- పోర్న్ సైట్లకు క్రెడిట్ కార్డులతో చెల్లింపులు ఆపండి: స్వచ్ఛంద సంస్థల విజ్ఞప్తి
- "మా సిబ్బందికి కరోనావైరస్ వస్తుందో లేదో తెలియదు, కానీ వాళ్లు ఆకలితో చనిపోయేలా ఉన్నారు"
- 1918లో 5 కోట్ల మందిని బలి తీసుకున్న స్పానిష్ ఫ్లూ కట్టడికి ఏం చేశారంటే...
- కరోనావైరస్లో వందల సంఖ్యలో కొత్త మ్యుటేషన్లు: పరిశోధనలో ఉన్న వ్యాక్సీన్లు పనికి రాకుండా పోతాయా?
- లిపులేఖ్ రోడ్డు విషయంలో భారత్ తీరుపై నేపాల్‌లో ఆగ్రహం ఎందుకు
- కాలాపానీ: నేపాల్ సరిహద్దులోని 35 చ.కి.మీ భూమి సమస్యను వాజ్‌పేయి నుంచి మోదీ వరకు ఎవ్వరూ ఎందుకు పరిష్కరించలేదు?
- వుహాన్‌లో లాక్ డౌన్ ఎత్తేసిన చైనా ప్రభుత్వం.. రైళ్లు, విమానాల్లో మొదలైన ప్రయాణాలు
- ఇండియా లాక్‌డౌన్: ‘‘నెల రోజులు బండ్లు తిరగకపోతే.. బతుకు బండి నడిచేదెలా?’’ - రవాణా, అనుబంధ రంగాల కార్మికుల వేదన
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)























