కరోనావైరస్: మలేసియా నుంచి విశాఖ చేరుకున్న 186 మంది విద్యార్థులు

కౌలాలంపూర్‌లో చిక్కుకున్న భారతీయ విద్యార్థులు బుధవారం రాత్రి అక్కడి నుంచి ప్రత్యేక విమానంలో విశాఖపట్నానికి చేరుకున్నారు.
మొత్తం 186 మంది విద్యార్థులు విశాఖ విమానాశ్రయానికి రాగా వారందరికీ స్క్రీనింగ్ టెస్ట్‌లు చేస్తున్నారు. వీరిలో ఏపీతో పాటు కర్ణాటక, తమిళనాడుకు చెందిన విద్యార్థులూ ఉన్నారు.ఈ పరీక్షల తరువాత వారిలో లక్షణాలను బట్టి ఏ, బీ, సీ వర్గాలుగా విభజించి సీ వర్గంలో ఉన్నవారిని ఇంటికి పంపించి హోం క్వారంటీన్ సూచిస్తారు.
ఏ, బీ కేటగిరీలో ఉన్నవారిని విశాఖలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఐసోలేషన్ కేంద్రానికి తరలిస్తారు.
ఇతర రాష్ట్రాలకు చెందిన విద్యార్థుల్లో ఎవరికైనా వ్యాధి లక్షణాలు లేకపోతే వెంటనే వారిని సొంత రాష్ట్రానికి పంపిస్తామని అధికారులు చెప్పారు.
కరోనావైరస్‌పై జనసేన లేఖ
జనసేన పార్టీ తన కార్యకర్తలకు రాసిన బహిరంగ లేఖలో కరోనా గురించి సంపూర్ణ అవగాహన కల్పించే ప్రయత్నం చేసింది.
ఆ పార్టీ విడుదల చేసిన మరో లేఖలో ప్రపంచ ఆరోగ్య సంస్థ అధ్యక్షుడి ఉపన్యాసం తెలుగులో ప్రచురించారు.
అనుమానితుడి కోసం వేట
మార్చి 13న ఏపీ సంపర్క క్రాంతి రైలులోని ఎస్ తొమ్మిది పెట్టెలో ప్రయాణించిన వారి వివరాలు కావాలని తెలంగాణ ప్రభుత్వం రైల్వే అధికారులను కోరింది.
కరోనా అనుమానితుడు ఆ పెట్టెలో ప్రయాణించడం ఇందుకు కారణం.
ఐఎన్ఎస్ విశ్వకర్మలలో క్వారంటీన్ సెంటర్
విదేశాల నుంచి వచ్చిన భారతీయులను క్వారంటైన్ లో పెట్టడం కోసం ఐఎన్ఎస్ విశ్వకర్మలో ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్టు విశాఖ కేంద్రంగా ఉన్న తూర్పు నావికా దళం ప్రకటించింది. ఇందులో రెండు వందల మందిని ఉంచవచ్చని ప్రకటించింది

ఫొటో సోర్స్, Getty Images
ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వ్యాపించకుండా నివారించేందుకు గాను రాష్ట్రంలోని అన్ని విద్యా సంస్థలనూ మూసివేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
ఈ మేరకు ముఖ్యమంత్రి ప్రత్యేక కార్యదర్శి పీవీ రమేశ్ ప్రకటించారు.
అన్ని పాఠశాలలు, కాలేజీలు, యూనివర్సిటీలు, కోచింగ్ సెంటర్లకు సెలవులు ప్రకటించారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 1
ఇండియన్ ఆర్మీ శిక్షణ కార్యక్రమాలన్నీ వాయిదా
కోవిడ్-19 కారణంగా అన్ని సమావేశాలూ వాయిదా వేయాలని భారత సైన్యం అన్ని కమాండ్స్‌ను ఆదేశించింది.
ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలోఅన్ని శిక్షణ కార్యక్రమాలూ వాయిదా వేయడమో రద్దు చేయడమో చేయాలని సూచించింది.
పరిస్థితులు మెరుగుపడేవరకు తప్పనిసరి అయినవారికి సెలవులు ఇవ్వాలనీ సూచించారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 2
తెలంగాణలో మరో కరోనా పాజిటివ్ కేసు పెరిగింది.
యూకే నుంచి వచ్చిన ఓ వ్యక్తికి కరోనావైరస్ సోకినట్లు నిర్ధరణ కావడంతో తెలంగాణలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య ఆరుకు చేరింది.
ఆరుగురిలో ఒకరికి ఇప్పటికే నయం కావడంతో ఆసుపత్రి నుంచి డిశ్చార్జి చేశారు. దీంతో ప్రస్తుతం తెలంగాణలో 5 యాక్టివ్ కేసులు ఉన్నట్లు.

ఫొటో సోర్స్, Getty Images
కరోనావైరస్ లాంటి మహమ్మారులు ప్రతి 100ఏళ్లకోసారి వస్తున్నాయని సుప్రీం కోర్టు జడ్జి జస్టిస్ అరుణ్ మిశ్రా వ్యాఖ్యానించారు.
"ప్రజలు ఎంత భయపడుతున్నారో చూడండి. మీరు ఏమైనా చెయ్యండి, ఏదైనా చెయ్యండి, అన్ని రకాల వనరులనూ ఉపయోగించండి. కానీ, ఈ వైరస్‌తో పోరాడలేరు. దీనికి ఎవరికి వారే తమ వ్యక్తిగత స్థాయిలో పోరాటం చేయాలి" అని జస్టిస్ మిశ్రా అన్నారు.
"ప్రభుత్వం మాత్రమే పోరాటం చేస్తే సరిపోదు, ప్రతి పౌరుడూ తన స్థాయిలో తను పోరాడాలి. అందరూ దీన్ని ఎదుర్కోవాలి. మీకోసం మీరే పోరాడాలి" అని జస్టిస్ మిశ్రా సూచించారు.
"బార్ కౌన్సిల్‌కు మాదో విజ్ఞప్తి. ఓ సీనియర్ అడ్వొకేట్ మరొక జూనియర్ అడ్వొకేట్‌తో రావచ్చు. కానీ మీరంతా ఐదారుగురు అడ్వొకేట్లతో వస్తున్నారు. ఈ జాగ్రత్తలన్నీ మనందరికోసమే కదా" అని జిస్టిస్ ఎంఆర్ షా సీనియర్ అడ్వొకేట్ అరిమన్ సుందరమ్‌తో అన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
కరోనావైరస్ రోగులకు చికిత్స చేసే ఓ డాక్టర్‌కు ఆ వైరస్ సోకింది. లక్నోలో కేజీఎంయూ ఐసోలేషన్ వార్డులో కోవిడ్-19 రోగులకు చికిత్స అందిస్తున్న ఓ జూనియర్ డాక్టర్ కూడా కరోనా బారిన పడినట్లు ఐసోలేషన్ వార్డు ఇంచార్జ్ డాక్టర్ సుధీర్ సింగ్ తెలిపారు.
అయితే, ఆయన ఆరోగ్య పరిస్థితి స్థిరంగా ఉందని, ఎలాంటి ఆందోళనా అవసరం లేదని వివరించారు.

మలేసియాలో చిక్కుకున్న భారతీయులను వెనక్కి రప్పించేందుకు ఎయిర్ ఏసియా ద్వారా ప్రత్యేక విమానాలను ఏర్పాటు చేస్తున్నట్లు విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి ఎస్.జైశంకర్ తెలిపారు.
దిల్లీకి, విశాఖపట్నానికి విమానాలు నడిపి కౌలాలంపూర్ విమానాశ్రయంలో ఎదురుచూస్తున్న భారతీయులను వెనక్కి తీసుకువస్తామని ఆయన వెల్లడించారు.
ప్రస్తుతం ఉన్నది క్లిష్టమైన సమయం, ఇలాంటప్పుడు వారు కూడా పరిస్థితులను అర్థం చేసుకుని విమానయాన సంస్థకు సహకరించాలని ఆయన సూచించారు.
రోమ్, చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్న భారతీయ విద్యార్థులకు సాధ్యమైనంత మద్దతు, సహాయాన్ని అందిస్తామని ఇటలీలోని భారత రాయబార కార్యాలయం వెల్లడించింది.
ఇటలీలో లాక్ డౌన్ కొనసాగుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో, అందుబాటులో ఉన్న పరిమిత వనరులతోనే సాధ్యమైన చర్యలు తీసుకుంటున్నామని అధికారులు తెలిపారు. వైద్య పరీక్షల కోసం వారి నుంచి నమూనాలు సేకరించామని, నివేదికల కోసం ఎదురుచూస్తున్నామని చెప్పారు.
కరోనావైరస్ కారణంగా మూసివేయాలని ఆదేశాలు జారీచేసినా వాటిని ఉల్లంఘించినందుకు కొన్ని కోచింగ్ సెంటర్లు, స్కూళ్లు, జిమ్స్, బార్లతో కలిపి మొత్తం 66 కేంద్రాలను సీల్ చేసినట్లు గ్రేటర్ హైదరాబాద్ మేయర్ బొంతు రామ్మోహన్ తెలిపారు.
"మార్చి 31 వరకూ మూసేయాలనే ఆదేశాలను వారు ఉల్లంఘించారు. ప్రతిరోజూ తనిఖీలు చేయడానికి 18 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశాం" అని ఆయన చెప్పారు.

ఫొటో సోర్స్, ANI
ఓ సైనికుడికి కరోనావైరస్
లద్ధాఖ్‌కు చెందిన ఓ సైనికుడికి కరోనావైరస్ సోకింది. ఆయన తండ్రి ఇటీవల ఇరాన్ వెళ్లి వచ్చారు. ఈ విషయాన్ని భారత సైన్యం ధ్రువీకరించింది.
లద్ధాఖ్ స్కౌట్స్‌లో పనిచేస్తున్న 34 సంవత్సరాల ఓ లాన్స్ నాయక్‌కు కోవిడ్-19 పాజిటివ్ అని తేలిందని సీనియర్ సైనికాధికారులు ప్రకటించారు.
ఇరాన్ యాత్రకు వెళ్లొచ్చిన ఆయన తండ్రి ఫిబ్రవరి 29నుంచి క్వారంటైన్‌లో ఉన్నారు. మార్చి 6న ఆయనకు కరోనా పాజిటివ్ అని తేలింది. ఈ జవాన్ ఫిబ్రవరి 25 నుంచి మార్చి 1 వరకూ సెలవులో ఉన్నారు. మార్చి 2న తిరిగి విధుల్లో చేరారు.
మార్చి 7నుంచి ఈ సైనికుడిని కూడా క్వారంటైన్ చేశారు. మార్చి 16న పరీక్షల్లో పాజిటివ్ అని నిర్థరణైంది. దీంతో ఈ జవాను భార్య, సోదరి, ఇద్దరు పిల్లలను కూడా క్వారంటైన్ చేశారు.

ఫొటో సోర్స్, ANI
పుణెలోని హోటళ్లు, రెస్టారెంట్లను మార్చి 20 వరకూ మూసివేస్తున్నట్లు పుణె రెస్టారెంట్లు, హోటలియర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు జి.షెట్టీ తెలిపారు.
"మా కార్యకలాపాలు నిలిపివేయాలని పోలీసులు సూచించారు. పైగా అది మా నైతిక బాధ్యత కూడా" అని ఆయన వ్యాఖ్యానించారు. పుణెలో దాదాపు 850 హోటళ్లున్నాయి. వీటిలో 25000 మంది పనిచేస్తుంటారు.
137కు చేరిన కేసులు
భారత్‌లో కరోనా పాజిటివ్ కేసులు 137కి పెరిగాయి. వీరిలో భారతీయులు 113 మంది కాగా విదేశీయులు 24 మంది. మహారాష్ట్రలో అత్యధికంగా 36 పాజిటివ్ కేసులు నిర్ధరణయ్యాయి.
కేరళలో 24, ఉత్తర ప్రదేశ్‌లో 14, కర్నాటకలో 11 కేసులు పాజిటివ్‌గా తేలాయి.
మలేసియాలో చిక్కుకున్న తెలుగు విద్యార్థులు
ఫిలిప్పీన్స్‌లో వైద్య విద్య అభ్యసిస్తున్న తెలుగు విద్యార్థులు, ఉత్తర భారతదేశానికి చెందిన విద్యార్థులు సుమారు 200 మంది మలేసియాలో చిక్కుకుపోయారు.
కరోనా వైరస్ ప్రభావంతో ఫిలిప్పీన్స్ నుంచి భారత్‌కు వీరు తిరుగు ప్రయాణం కాగా హఠాత్తుగా మలేసియాలో విమానాలను రద్దు చేశారు.
దీంతో అక్కడ చిక్కుకుపోయిన విద్యార్థులంతా భారత ప్రభుత్వం జోక్యం చేసుకుని స్వదేశానికి వచ్చేలా చేయాలని కోరారు.
కంటెంట్ అందుబాటులో లేదు
మరింత సమాచారం కోసం Facebookఇతర వెబ్‌సైట్లలో సమాచారానికి బీబీసీ బాధ్యత వహించదు.పోస్ట్ of Facebook ముగిసింది
మలేసియాలో చిక్కుకున్న తెలుగు విద్యార్థుల్లో అనంతపురానికి చెందిన తలారి హర్షిణి బీబీసీతో మాట్లాడుతూ మళ్లీ విమానాలు ఎప్పటి నుంచి తిరుగుతాయో మలేసియా ప్రభుత్వం కానీ, అక్కడి విమానాశ్రయ అధికారులు కానీ స్పష్టత ఇవ్వలేదని చెప్పారు. భారత ప్రభుత్వం జోక్యం చేసుకుని తమను స్వస్థలాలకు చేర్చాలని కోరారు.
కాగా మలేసియాలో చిక్కుకున్న తెలుగు విద్యార్థులను స్వస్థలాలకు రప్పించేందుకు తగిన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి జగన్ అధికారులను ఆదేశించారు. ఎప్పటికప్పుడు పరిస్ధితులు నివేదించాలంటూ దిల్లీలోని ఏపీ భవన్ అధికారులను సీఎం ఆదేశించారు.
ముంబయిలో కరోనా ‘ముద్ర’
ముంబయిలో ఇళ్లు దాటి బయటకు రాకుండా ఉండాలని(హోం క్వారంటీన్) వైద్యులు సూచించిన కరోనా వైరస్ పీడితుల ఎడమ చేతిపై ముద్ర వేస్తున్నారు.
ముంబయి విమానాశ్రయంలోనూ ఇదే తరహాలో వేస్తున్నారు. ఇందుకోసం 14 రోజుల పాటు చెరిగిపోకుండా ఉండేలా ఇండెలిబుల్ ఇంక్ వాడుతున్నారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 3

ఫొటో సోర్స్, Facebook/bhadrachalamtemplecity
భక్తులు లేకుండానే భద్రాద్రి రామయ్య కల్యాణం
కరోనావైరస్ నేపథ్యంలో శ్రీరామనవమి వేడుకలను కూడా భక్తులు లేకుండా నిర్వహించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది.
కల్యాణం సమయంలో వేల సంఖ్యలో భక్తులు చేరితే, వైరస్ వ్యాప్తికి అవకాశం ఉంటుందని, ప్రభుత్వం దీనికి సిద్ధంగా లేదని మంత్రి పువ్వాడ అజయ్ తెలిపారు. కరోనావైరస్ ముప్పును ఎదుర్కొనేందుకు అన్ని ఏర్పాట్లూ చేసినట్లు ఆయన వెల్లడించారు.

ఫొటో సోర్స్, ANI
కరోనావైరస్ వ్యాప్తి నేపథ్యంలో మహారాష్ట్రలోని షిర్డీ సాయిబాబా ఆలయాన్ని మంగళవారం మధ్యాహ్నం 3 గంటల నుంచి మూసివేస్తున్నారని ఏఎన్ఐ వార్తా సంస్థ తెలిపింది.
తదుపరి ఆదేశాలు వచ్చేవరకూ ఈ మూసివేత అమల్లో ఉంటుందని తెలిపింది.
శని సింగణాపూర్ ఆలయం కూడా తదుపరి ఆదేశాలు వచ్చేవరకూ మూసివేస్తున్నట్లు ఆలయవర్గాలు తెలిపాయి.

ఫొటో సోర్స్, Getty Images
ఆగ్రాలోని తాజ్‌మహల్‌కు సైతం కరోనావైరస్ బెడద తప్పలేదు. పర్యటకులు ఎవరూ రావద్దని, ఈ కట్టడాన్ని మూసివేస్తున్నామని అధికారులు తెలిపారు.
ప్రతిరోజు వేల మంది ఈ కట్టడాన్ని సందర్శిస్తారు. అందువల్ల ప్రస్తుత పరిస్థితుల్లో దీన్ని మూసేయడం తప్ప మరో మార్గం లేదని అధికారులు వెల్లడించారు.
తాజ్ మహల్ చూడ్డానికి దేశవిదేశాల నుంచి రోజూ దాదాపు 70000 మంది వస్తుంటారు.
కేంద్ర విదేశాంగ శాఖ సహాయ మంత్రి వి.మురళీధరన్ కేరళలోని త్రివేండ్రమ్‌లో స్వీయ ప్రత్యేక పర్యవేక్షణలో ఉన్నారు. అయితే, ఆయనకు కరోనావైరస్ లేదని పరీక్షల్లో తేలిందని ఏఎన్ఐ తెలిపింది.
ఉత్తరాఖండ్ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు సూర్యకాంత్ ధస్మానా 14రోజుల పాటు తన ఇంట్లోనే క్వారంటీన్‌లో ఉంటారని డెహ్రాడూన్ జిల్లా మెజిస్ట్రేట్ ఆశిష్ కుమార్ వెల్లడించారు. సూర్యకాంత్ సోమవారం అనుమానిత కరోనావైరస్ రోగిని డూన్ హాస్పిటల్ ఐసోలేషన్ వార్డులో కలిశారు.

ఫొటో సోర్స్, ANI
కరోనావైరస్ నిరోధానికి చేపడుతున్న చర్యలకు సంబంధించి ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ హర్ష్ వర్ధన్ రాజ్యసభలో ఓ ప్రకటన చేశారు.
"డాక్టర్లు, పారామెడికల్ సిబ్బంది, పైలట్లు, విమానయాన సిబ్బంది.. ప్రత్యేకించి ఇలాంటి క్లిష్టమైన సందర్భాల్లో విదేశాల్లో చిక్కుకున్న భారతీయులను వెనక్కి తీసుకువచ్చినవారు.. అందరూ అభినందనీయులు. ప్రత్యేకించి, ప్రమాదం పొంచి ఉన్నా, రోగులకు చికిత్స అందిస్తున్న వైద్యులు, పారామెడికల్ సిబ్బందిని అభినందించడానికి మాటలు చాలవు. ఈ దేశం తరపున, మీ అందరి తరపున వారికి ధన్యవాదాలు.
ప్రపంచవ్యాప్తంగా కరోనావైరస్ వ్యాప్తి నిరోధానికి, నియంత్రణకు ఏం చర్యలు చేపడుతున్నారో ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రిసెర్చ్ (ఐసీఎంఆర్) శాస్త్రవేత్తలు పరిశీలిస్తున్నారు. రిట్రోవైరల్ డ్రగ్స్‌ను మేం కొందరు రోగులకు ఇస్తున్నాం. శాస్త్రీయంగా సంతృప్తి చెందిన తర్వాతే మేం అనుమతులిస్తున్నాం.
అమెరికాలో క్లోరోక్వైన్‌పై కొంత అధ్యయనం జరిగిందని మా దృష్టికి వచ్చింది. శాస్త్రీయంగా పరిశీలించిన తర్వాతే అనుమతులిచ్చాం. ఈ అనుమతులిచ్చింది కూడా మంత్రిత్వ శాఖ కాదు, ఐసీఎంఆర్ శాస్త్రవేత్తల బృందం. రోగులకు అందుబాటులో ఉన్న అత్యుత్తమ చికిత్స అందించేందుకు ప్రయత్నిస్తున్నాం" అని హర్ష్ వర్ధన్ తెలిపారు.
టోక్యో ఒలింపిక్స్‌కు సిద్ధమవుతున్న అథ్లెట్ల బృందం శిక్షణ కార్యక్రమాలు తప్ప ఇతర జాతీయ క్యాంపులన్నింటినీ వాయిదా వేస్తున్నట్లు యువజన వ్యవహారాలు, క్రీడల శాఖ మంత్రి కిరణ్ రిజిజూ తెలిపారు.

ఫొటో సోర్స్, ANI
కరోనావైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు భారత్ చేస్తున్న ప్రయత్నాలు ప్రశంసనీయం అని ప్రపంచ ఆరోగ్య సంస్థ భారత ప్రతినిధి హెంక్ బెకెడామ్ అన్నారు.
"భారత ప్రభుత్వ కృతనిశ్చయం, ప్రధాని మోదీ కార్యాలయం తీసుకుంటున్న చర్యలు అమోఘంగా ఉన్నాయి. అందుకే భారత్ కరోనావైరస్ వ్యాప్తి నియంత్రణలో సమర్థంగా పనిచేస్తోంది. మొత్తం యంత్రాంగం అంతా కలసి పనిచేయడంపై నాకు చాలా అద్భుతంగా అనిపిస్తోంది" అని ఆయన వ్యాఖ్యానించారు.
"భారత్‌లో మాకు మంచి పరిశోధనా వనరులున్నాయి. వాళ్లు వైరస్ వ్యాప్తిని అరికట్టడంలో వారు సఫలమవుతారు, ఇప్పుడు మా పరిశోధనా బృందంలో భారత్ కూడా తన పాత్ర పోషిస్తుంది" అని హెంక్ వ్యాఖ్యానించారు.
అఫ్ఘానిస్తాన్, ఫిలిప్పీన్స్, మలేషియాల నుంచి భారత్‌కు ప్రయాణికుల రాకపై మార్చి 31 వరకూ ప్రభుత్వం నిషేధం విధించింది.

ఫొటో సోర్స్, Getty Images
భారత్‌లో మూడో మృతి
కరోనావైరస్ కారణణంగా భారత్‌లో మూడో మరణం సంభవించింది. మహారాష్ట్రలోని కస్తూర్బా హాస్పిటల్‌లో కోవిడ్-19తో బాధపడుతున్న 64 ఏళ్ల వ్యక్తి మరణించారు.
తమిళనాడులో కుటుంబ సభ్యులు, లేదా విజిటర్లు ఎవరినీ జైళ్లలో ఖైదీలను కలిసేందుకు అనుమతించవద్దని ఆదేశాలు జారీ అయ్యాయి. ఇవి వచ్చే రెండు వారాలు అమల్లో ఉంటాయని పేర్కొన్నారు. కొత్తగా వచ్చే ఖైదీలను పర్యవేక్షించడానికి ప్రత్యేక స్క్రీనింగ్ రూమ్‌లను ఏర్పాటుచేశారు.
కర్ణాటకలో మరో రెండు కొత్త కరోనావైరస్ కేసులు నిర్థరణయ్యాయి. బ్రిటన్ నుంచి వచ్చిన ఓ 20 ఏళ్ల యువతికి పాజిటివ్ అని తేలింది. కలబుర్గిలో కరోనావైరస్ కారణంగా మరణించిన వ్యక్తితో సంబంధమున్న 60 ఏళ్ల మరో వ్యక్తికి కూడా కరోనావైరస్ పాజిటివ్ అని నిర్థరణైంది.
దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 10కి చేరింది.
ఈ ఇద్దరినీ కరోనావైరస్ రోగులకు ఏర్పాటుచేసిన ఐసోలేషన్ వార్డులో చేర్చి, చికిత్స అందిస్తున్నారు.
మహారాష్ట్రలో మొత్తం కేసుల సంఖ్య 39కి చేరింది.
నాగ్‌పూర్ మహరాజ్ బాగ్ జూను తాత్కాలికంగా మూసివేశారు. పూణెలోని షాపులన్నీ మూడురోజుల పాటు మూసేయాలని ఫెడరేషన్ ఆఫ్ అసోసియేషన్ ఆఫ్ పుణె పిలుపునిచ్చింది.
నోయిడాలోని గౌతమ్ బుద్ధ నగర్‌లో ఫ్రాన్స్ నుంచి వచ్చిన ఇద్దరికి కరోనావైరస్ పాజిటివ్ అని తేలింది. దీంతో వీరిద్దరినీ ఐసోలేషన్ వార్డుకు తరలించినట్లు సీఎంఓ అనురాగ్ భార్గవ్ తెలిపారు.

ఫొటో సోర్స్, ANI
పార్లమెంట్ లైబ్రరీ భవనంలో జరుగుతున్న బీజేపీ పార్లమెంటరీ పార్టీ సమావేశానికి ఆ పార్టీ ఎంపీ రాజ్‌కుమార్ చాహర్ ఓ టోపీ ధరించి వచ్చారు. దానిపై 'కరో న హ్యాండ్ షేక్ - కరో నమస్తే' (కరచాలనం వద్దు - నమస్కారం చేయండి) అని రాసి ఉంది.

ఫొటో సోర్స్, ANI
హైదరాబాద్, జైసల్మేర్, కోల్‌కతా, గోరఖ్‌పూర్, చెన్నై, సూరత్, ఝాన్సీ, జోధ్‌పూర్‌లతో పాటు మరికొన్ని ప్రదేశాల్లో క్వారంటీన్ సెంటర్లను ఏర్పాటుచేస్తున్నట్లు డైరెక్టర్ జనరల్ ఆఫ్ మెడికల్ సర్వీసెస్ (ఆర్మీ) లెఫ్టినెంట్ జనరల్ ఆర్ఎస్ గ్రేవాల్ వెల్లడించారు.
నావికా దళం, వైమానిక దళాల తోడ్పాటుతో వీటిని ఏర్పాటుచేస్తున్నట్లు ఆయన తెలిపారు.

ఫొటో సోర్స్, ANI
మార్చి 16 నాటికి ముంబయి విమానాశ్రయంలో 2.46 లక్షల మందికి స్క్రీనింగ్ నిర్వహించినట్లు ముంబయి మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు వెల్లడించారు.
వీరిలో 14మందికి కరోనావైరస్ పాజిటివ్ వచ్చినట్లు బృహన్ముంబయి మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) ఆరోగ్య విభాగం డిప్యూటీ డైరక్టర్ దక్షా షా తెలిపారు. ఈ 14మందిలో ఆరుగురు ముంబయివాసులు, ఎనిమిది మంది బయటివారని చెప్పారు.
అత్యవసరం కాని సేవల విభాగాల్లో 50శాతం సిబ్బందితోనే పని చేయాలని నిర్ణయించామని బీఎంసీ కమిషనర్ ప్రవీణ్ పర్దేశీ తెలిపారు. ఈ ఆదేశాలను ఉల్లంఘిస్తే వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని తెలిపారు.

ఫొటో సోర్స్, ANI
అమృత్‌సర్‌లోని స్వర్ణ దేవాలయానికి వచ్చే భక్తులకు హ్యాండ్ శానిటైజర్లను అందిస్తున్నట్లు శిరోమణి గురుద్వారా ప్రబంధక్ కమిటీ (ఎస్జీపీసీ) తెలిపింది. కరోనావైరస్ వ్యాప్తి చెందకుండా ఈ జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు వెల్లడించింది.
భారత్‌లో విద్యాసంస్థలన్నీ బంద్
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ నేతృత్వంలో కేంద్ర మంత్రుల బృందం ఉన్నతస్థాయి సమావేశం సోమవారం జరిగింది. ఈ సమావేశంలో కొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నారు.
1. దేశంలోని అన్ని స్కూళ్లు, యూనివర్సిటీలు, జిమ్స్, మ్యూజియంలు, సాంస్కృతిక, సామాజిక కేంద్రాలు, స్విమ్మింగ్ పూల్స్, థియేటర్లను మూసేయాలి. విద్యార్థులు ఇళ్లకే పరిమితం కావాలి. ఆన్‌లైన్ విధానంలో విద్యాభ్యాసాన్ని కొనసాగించాలి.
2. అత్యవసరం కాని ప్రయాణాలు రద్దు చేసుకోవాలి. బస్సులు, రైళ్లు, విమానాల్లో ప్రయాణం జనం ఒకచోటకు చేరేలా చేస్తుంది. దీనివల్ల వైరస్ వ్యాప్తికి అవకాశాలు పెరుగుతాయి.
3. ప్రైవేట్ రంగ సంస్థలు తమ ఉద్యోగులను అవకాశం ఉన్నచోట ఇంటి నుంచే పనిచేసేందుకు అనుమతించాలి.
4. సమావేశాలు వీలైనంత వరకూ వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా నిర్వహించాలి. ఎక్కువ మంది పాల్గొనే సమావేశాలను తగ్గించడం లేదా రీషెడ్యూల్ చేయడం మంచిది.

5. రెస్టారెంట్లలో ఎక్కువమంది తాకే ప్రాంతాల్లో తగిన శుభ్రత పాటించేలా యాజమాన్యాలు జాగ్రత్త వహించాలి. టేబుళ్ల మధ్యలో కనీసం మీటరు దూరం ఉండేలా చూసుకోవాలి. వీలైతే ఓపెన్ ఎయిర్ సీటింగ్ ఏర్పాటుకు ప్రయత్నించాలి.
6. ఎక్కువమంది గుమిగూడే అవకాశం ఉన్న క్రీడా ఈవెంట్లు, పోటీల వంటివి వాయిదా వేయాలి.
7. ఎక్కువమంది ఒకచోట గుమిగూడకుండా మతపెద్దలు కూడా జాగ్రత్తలు తీసుకోవాలి.
8. వాణిజ్య సంఘాలు, సభ్యులతో మాట్లాడి వాటి సమయాలను క్రమబద్ధీకరించి, ఒకేసారి ఎక్కువమంది రాకుండా జాగ్రత్తుల తీసుకోవాలి.
9. ప్రజలకు నిరంతరం సరైన సమాచారాన్ని అందించాలి.

కరోనావైరస్: భారత్‌లో ఏ రాష్ట్రంలో ఎన్ని కేసులు నమోదయ్యాయి?
Sorry, your browser cannot display this map


- కరోనావైరస్ ఇన్ఫెక్షన్ సోకకుండా ఉండడానికి పాటించాల్సిన జాగ్రత్తలు... ఆరు మ్యాపుల్లో
- కరోనావైరస్ సోకితే చనిపోయే ఆస్కారం ఎంత?
- కరోనావైరస్కు వ్యాక్సిన్ ఎప్పుడు వస్తుంది... దాన్ని ఎలా తయారు చేస్తారు?
- కరోనా వైరస్: ఈ ప్రపంచాన్ని నాశనం చేసే మహమ్మారి ఇదేనా
- కరోనావైరస్ మన శరీరం మీద ఎలా దాడి చేస్తుంది? ఇది సోకిన వారిలో కొందరు చనిపోవడానికి కారణం ఏమిటి
- కరోనావైరస్: చైనా వస్తువులు ముట్టుకుంటే ఈ వైరస్ సోకుతుందా
- కరోనావైరస్ సోకిన తొలి వ్యక్తి ఎవరు... జీరో పేషెంట్ అంటే ఏంటి?
- కరోనావైరస్: రైళ్లు, బస్సుల్లో ప్రయాణిస్తే ప్రమాదమా?
- మాస్క్‌లు వైరస్ల వ్యాప్తిని అడ్డుకోగలవా
- చికెన్, గుడ్లు తింటే కరోనావైరస్ వస్తుందా... మీ సందేహాలకు సమాధానాలు



(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)
























