You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ఉల్లి సాగు చేసిన ఈ రైతుకు ఎంత ఆదాయం వచ్చిందంటే... :ప్రెస్‌రివ్యూ
ఉల్లి ధరలు సామన్యుడిని బెంబేలెత్తిస్తున్నా, ఓ రైతును కోటిశ్వరుడిగా మార్చాయంటూ ఆంధ్రజ్యోతి దినపత్రిక ఓ కథనం ప్రచురించింది.
కర్నాటకలో అప్పుల్లో ఉన్న రైతు ఉల్లి సాగు ద్వారా నెల తిరిగే లోపు కోటీశ్వరుడయ్యారు.
చిత్రదుర్గ జిల్లా దొడ్డసిద్దవ్వనహళ్లికి చెందిన మల్లికార్జున (42) కొన్నాళ్ల క్రితం ఉల్లి సాగు చేయాలని నిర్ణయం తీసుకున్నారు.
అప్పటికే తనకు అప్పులున్నా, మరికొంత అప్పు చేసి రూ.15 లక్షల పెట్టుబడితో 20 ఎకరాల్లో ఉల్లి సాగు చేశారు.
ఆయనకు దాదాపు 240 టన్నుల ఉల్లి దిగుబడి వచ్చింది. అదే సమయంలో ఉల్లి ధర అమాంతం పెరిగిపోయింది.
క్వింటాలుకు రూ.7 వేలు చొప్పున విక్రయించగా.. రూ.1.68 కోట్ల ఆదాయం వచ్చింది.
చేసిన అప్పులన్నీ తీర్చేశానని, ఇల్లు కట్టుకునేందుకు ప్రణాళికలు వేసుకుంటున్నానని ఆయన చెబుతున్నారు.
అయితే, పంట సరిగ్గా పండకపోయినా, ఉల్లి ధరలు పడిపోయినా.. తాను అప్పుల ఊబిలో మరింతగా కూరుకుపోయేవాడినని అన్నారు.
నల్లమలలో మళ్లీ యురేనియం సర్వే భయాలు
నల్లమల అభయారణ్యం మీదుగా విమానాలు తిరుగుతుండటంతో యురేనియం కోసం సర్వే జరుగుతోందని స్థానిక గ్రామాల ప్రజలు ఆందోళన చెందుతున్నారంటూ వెలుగు దినపత్రిక ఓ వార్త ప్రచురించింది.
అక్టోబర్ 15, 25న నల్లమలపై విమానాలు చక్కర్లు కట్టాయి. మళ్లీ డిసెంబర్ 13 నుంచి నిత్యం విమానాలు తిరుగుతూ కనిపిస్తున్నాయి.
గతంలో యురేనియం సర్వేల పేరుతో గుర్తించిన ప్రాంతాలైన తిర్మలాపూర్, వటవర్లపల్లి, సార్లపల్లి, కుడిచింతల బయలు, ఉడిమిళ్ల, పెట్రాల్‌చేను పంటపొలాలగుండా, అడవుల్లో అతితక్కువ ఎత్తులో ప్రయాణిస్తున్నాయి.
నల్లమల అభయారణ్యంపై విమానానాలు సంచరిస్తున్నాయని సోషల్ మీడియాలో కథనాలు వస్తున్నాయని, దీనిపై అధికారికంగా తమకు ఎటువంటి సమాచారం లేదని జిల్లా అటవీశాఖ అధికారి జోజి చెప్పారు.
తెర వెనక ఏదో జరగుతున్నట్లు అనిపిస్తోందని, ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తే మళ్లీ యురేనియానికి వ్యతిరేకంగా ఉద్యమించి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఖరిని ఎండగడతామని యురేనియం వ్యతిరేక రాజకీయ జేఏసీ కన్వీనర్ కల్ముల నాసరయ్య అన్నారు.
నల్లమలలో యురేనియం అన్వేషణ కొనసాగదని చట్టసభల్లో తెలంగాణ ప్రభుత్వం తీర్మానం చేసింది.
ఏపీలో మద్యం దుకాణాలు తగ్గినా, ఆదాయం పెరిగింది
మద్యపాన నిషేధం దిశగా అడుగులు వేస్తున్నామని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చెబుతున్నప్పటికీ... మద్యం అమ్మకాల ద్వారా వచ్చే ఆదాయం మాత్రం పెరుగుతూనే ఉందని ప్రజాశక్తి దినపత్రిక ఓ వార్త ప్రచురించింది.
ఏపీలో ఎక్సైజ్ ఆదాయం గత ఏడాది కన్నా రూ.500 కోట్లు పెరిగింది. పోయిన ఏడాది నవంబర్ వరకు దాదాపు రూ.13 వేల కోట్ల ఆదాయం లభించగా, ఈ ఏడాది ఆ మొత్తం రూ.13,572 కోట్లకు చేరింది. అంటే దాదాపు 3.86% పెరుగుదల.
గత ఏడాది నవంబర్ వరకు 2.54 కోట్ల లిక్కర్ కేసుల విక్రయాలు జరగ్గా, ఈ ఏడాది నవంబర్ వరకు 2.04 కోట్ల కేసులు అమ్ముడయ్యాయి.
దశల వారీ మద్య నిషేధంలో భాగంగా మద్యం దుకాణాల సంఖ్యను ఏపీ ప్రభుత్వం తగ్గించింది. జనవరి నుంచి బార్ల సంఖ్యను కూడా తగ్గించనున్నట్లు ప్రకటించింది.
మద్యం వినియోగం తగ్గినా, ఖజానాకు వచ్చే ఆదాయం భారీగా పెరగడానికి ధరల పెరుగుదలే కారణం.
ఉప్పల్ భగాయత్‌లో గజం భూమి గరిష్ఠంగా రూ.79,900
ఉప్పల్ భగాయత్ లేఅవుట్‌లోని 45 ఫ్లాట్లకు ఆదివారం నిర్వహించిన ఈ-వేలం పోటాపోటీగా సాగినట్లు ఈనాడు ఓ కథనం ప్రచురించింది.
భగాయత్ లేఅవుట్‌లోని 41 ఫ్లాట్ల (28,909 చదరపు గజాలు) విక్రయంతో హెచ్‌ఎండీఏకు రూ.185.21 కోట్ల ఆదాయం సమకూరింది.
చదరపు గజం ధర అత్యధికంగా రూ.79,900, అత్యల్పంగా రూ.30,200 పలికింది.
హెచ్‌ఎండీఏ కనీస ధర రూ.30 వేలుగా నిర్ణయించగా సగటున రూ. 46,769 ధర పలికింది.
ఫేజ్-1 లేఅవుట్‌లోని 58 ఫ్లాట్లకు శనివారం నిర్వహించిన ఈ-వేలంలో 52 ఫ్లాట్లు అమ్ముడుపోయాయి. రూ.155 కోట్ల ఆదాయం సమకూరింది.
ఇవి కూడా చదవండి:
- ఉల్లి చరిత్ర ఏమిటి? వాటిని ఎక్కువగా తింటున్న దేశం ఏది...
- షారుఖ్ ఖాన్ ఇంటర్వ్యూ: ‘అందుకే నా సినిమాలు ఫ్లాప్ అయ్యాయి.. నేను మళ్లీ వస్తా’
- సస్పెన్స్ థ్రిల్లర్‌ను తలపించే తేయాకు కథ: చైనా నుంచి టీ రహస్యాన్ని ఆంగ్లేయులు ఎలా దొంగిలించారు?
- దిల్లీలో పౌరసత్వ సవరణ చట్టంపై ఆందోళనలు... పోలీస్ హెడ్‌క్వార్టర్స్ ఎదుట ధర్నా అనంతరం విద్యార్థుల విడుదల
- హైదరాబాద్ ఎన్కౌంటర్: ‘పోలీసుల కథనం చిన్నపిల్లలు కూడా నమ్మేలా లేదు’
- మిస్ యూనివర్స్ 2019 జోజిబిని తుంజీ: ఫైనల్ రౌండ్ ప్రశ్న, సమాధానం ఏంటి?
- సర్దార్ పటేల్: ‘రాజులను అంతం చేయకుండానే, రాజ్యాలను అంతం చేసిన నాయకుడు’
- ‘ఇలాంటి ఎన్కౌంటర్లు సినిమాల్లో చేస్తే చప్పట్లు కొడతాం.. నిజజీవితంలో చేస్తే ఎన్హెచ్ఆర్సీని పిలుస్తారు’ - వైఎస్ జగన్
- 'ఒక ఎంపీ నన్ను రేప్ చేశాడు.. కానీ, నా తండ్రి ఎవరికీ చెప్పకుండా దాచేయమన్నాడు’ - మాజీ ప్రధాని కుమార్తె
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)