నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ: ఎన్టీఏలో సంస్కరణలకు రాధాకృష్ణన్ కమిటీ చేసిన సిఫార్సులు ఏమయ్యాయి?

ఎన్టీఏ, రాధాకృష్ణన్ కమిటీ, ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా, పరీక్షలు, ప్రశ్న పత్రాల లీకేజీలు

ఫొటో సోర్స్, Getty Images

నీట్ సహా వివిధ పరీక్షల ప్రశ్న పత్రాల లీకేజీ వ్యవహారంతో కేంద్ర విద్యాశాఖ మంత్రి పదవికి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసిన తర్వాత నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్టీఏ)పై విస్తృత చర్చ జరుగుతోంది.

ఎన్టీఏను రద్దు చేయాలని, సంస్కరణలు తీసుకురావాలనే డిమాండ్లు పెద్దఎత్తున వినిపిస్తున్నాయి.

అయితే, ఎన్టీఏలో సంస్కరణల కోసం దాదాపు రెండేళ్ల కిందట కేంద్ర ప్రభుత్వం ఇస్రో మాజీ చైర్మన్ కె.రాధాకృష్ణన్ నేతృత్వంలో కమిటీని నియమించింది.

పారదర్శకంగా, సాఫీగా, సజావుగా పరీక్షలు నిర్వహించేందుకు ఆ కమిటీ ప్రతిపాదించిన సిఫార్సులు పూర్తి స్థాయిలో ఇంకా అమల్లోకి రాలేదని విద్యా రంగ నిపుణులు చెబుతున్నారు.

''సిఫార్సులు చేసి రెండేళ్లు గడచిపోతోంది. ఇప్పటికీ అవి పూర్తి స్థాయిలో అమల్లోకి రాలేదు. ముఖ్యంగా, పేపర్ లీకేజీలకు సంబంధించి చట్టాన్ని మరింత కఠినతరం చేసి అమలు వేగవంతం చేయాలి'' అని శ్రీ చైతన్య విద్యాసంస్థల నీట్ జాతీయ కోర్డినేటర్ వి.కుమార్ బీబీసీతో చెప్పారు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

అయితే, తమ కమిటీ సూచించిన సిఫార్సులలో 80 శాతం అమలు దశలో ఉన్నాయని కె.రాధాకృష్ణన్ మే 21న డీడీ ఇండియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు.

దేశంలోని విద్యార్థులు, తల్లిదండ్రుల నుంచి వచ్చిన 37 వేల సూచనలను పరిగణనలోకి తీసుకుని సిఫార్సులు చేసినట్లుగా రాధాకృష్ణన్ చెప్పారు.

మరోవైపు, యువత ఆందోళనల నేపథ్యంలో దేశంలో పరీక్షల సంస్కరణల కోసం నందన్ నీలేకని నేతృత్వంలో ఉన్నత స్థాయి కమిటీ వేస్తున్నట్లుగా జులై 26న ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారు.

ఎన్టీఏ, రాధాకృష్ణన్ కమిటీ, ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా, పరీక్షలు, ప్రశ్న పత్రాల లీకేజీలు

ఫొటో సోర్స్, NTA

ఫొటో క్యాప్షన్, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ నిర్వహించే పోటీ పరీక్షలు

2018లో ఎన్టీఏ ఏర్పాటు

నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీని కేంద్ర ప్రభుత్వం 2018లో ఏర్పాటు చేసింది.

జేఈఈ(మెయిన్), జేఈఈ(అడ్వాన్స్డ్), నీట్(యూజీ), సీయూఈటీ(యూజీ), సీయూఈటీ(పీజీ), సీఎస్ఐఆర్-నెట్, యూజీసీ-నెట్ సహా వివిధ పరీక్షలను ఎన్టీఏ నిర్వహిస్తోంది.

కొన్నేళ్లుగా వరుసగా ఎన్టీఏను వివాదాలు చుట్టుముడుతూ వచ్చాయి. నీట్, యూజీసీ-నెట్, సీయూఈటీ(యూజీ) పరీక్షల్లో అవకతవకలు జరిగాయన్న ఆరోపణలు వినిపించాయి.

వీటిపై ఎప్పటికప్పుడు దర్యాప్తు సంస్థలతో విచారణ చేయిస్తున్నట్లుగా కేంద్రం ప్రకటించింది.

ఎన్టీఏ ఏర్పాటు చేసినప్పట్నుంచి 2025 ఆగస్టు నాటికి 250కు పైగా పరీక్షలను ఈ సంస్థ నిర్వహించినట్లుగా కేంద్ర విద్యాశాఖ సహాయ మంత్రి శుకాంత మజుందార్ గతేడాది ఆగస్టులో లోక్‌సభలో ప్రకటించారు.

ఎన్టీఏ, రాధాకృష్ణన్ కమిటీ, ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా, పరీక్షలు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, నీట్ సహా పలు కీలక పరీక్షలను ఎన్టీఏ నిర్వహిస్తోంది.

వరుసగా పరీక్షల ప్రశ్న పత్రాల లీకేజీ ఆరోపణలు

2024 మే 5న జరిగిన నీట్ (యూజీ)కి సంబంధించి ప్రశ్న పత్రాలు లీకయ్యాయన్న ఆరోపణలు వచ్చాయి. దీనిపై కొన్ని కేసులు కూడా రిజిస్టర్ అయ్యాయని ఈ ఏడాది ఫిబ్రవరిలో, అప్పటి కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ప్రకటించారు.

అలాగే, 2024 జూన్ 18న జరిగిన యూజీసీ-నెట్ ప్రశ్న పత్రం లీకైనట్లుగా ఆరోపణలు వచ్చాయి. పరీక్ష రద్దు చేసి ఆగస్టులో తిరిగి నిర్వహించింది ఎన్టీఏ.

పేపర్ లీకేజీకి సంబంధించి విచారణను సీబీఐకు అప్పగించింది కేంద్ర ప్రభుత్వం.

ఈ పరిణామాలతో నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీలో సంస్కరణల కోసం ఇస్రో మాజీ ఛైర్మన్ కె.రాధాకృష్ణన్ నేతృత్వంలో కేంద్ర ప్రభుత్వం కమిటీ వేసింది. ఏడుగురితో 2024 జూన్ 22న ఈ కమిటీ ఏర్పాటైంది.

ప్రధానంగా పోటీ పరీక్షల ప్రక్రియను బలోపేతం చేయడం, డేటా లీకేజీని అరికట్టడం, ఎన్టీఏ వ్యవస్థను సమీక్షించి పునర్నిర్మాణం చేయడం వంటి మూడు ప్రధాన అంశాలపై కేంద్ర ప్రభుత్వం ఈ కమిటీని నియమించింది.

తర్వాత సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు, పోటీ పరీక్షల నిర్వహణలో భద్రత, సురక్షిత సాంకేతికత వినియోగం, రాష్ట్రాల భాగస్వామ్యం, అంతర్జాతీయ భాగస్వామ్యం, సిబ్బందికి శిక్షణ, విద్యార్థుల మానసిక ఆందోళన సమస్యలకు తగిన సాయం అందించడం వంటి అంశాలను జోడించి సిఫార్సులు చేసింది కమిటీ.

ఎన్టీఏ, రాధాకృష్ణన్ కమిటీ, ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా, పరీక్షలు

ఫొటో సోర్స్, Getty Images

101 సిఫార్సులతో నివేదిక

'రీఫార్మేషన్ ఆఫ్ నేషనల్ కామన్ ఎంట్రన్స్ టెస్టింగ్' పేరుతో అదే ఏడాది అక్టోబరు 21న తన నివేదికలో 101 సిఫార్సులను రాధాకృష్ణన్ కమిటీ సూచించింది.

అయితే, రాధాకృష్ణన్ కమిటీ సిఫార్సులకు సంబంధించిన నివేదిక ఆన్‌లైన్‌లో అందుబాటులో లేదు. ప్రస్తుతం కేంద్ర విద్యా శాఖ వెబ్‌సైట్‌లో నివేదిక కోసం ప్రయత్నిస్తుంటే, 'ఎర్రర్' చూపిస్తోంది.

ఇదే వెబ్ లింకును లోక్‌సభకు కేంద్ర విద్యాశాఖ సహాయ మంత్రి శుకాంత మజుందార్ లిఖితపూర్వకంగా ఇచ్చిన సమాధానంలోనూ ఇచ్చారు. అయినప్పటికీ, అది ఓపెన్ అవ్వడం లేదు.

రాధాకృష్ణన్ కమిటీ చేసిన సిఫార్సుల్లో ప్రధానంగా ఎన్టీఏ పునర్నిర్మాణం, కంప్యూటర్ ఆధారిత పరీక్షలు, రాష్ట్రాల భాగస్వామ్యం, ప్రశ్న పత్రాల పంపిణీ వ్యవస్థలో మార్పులు సహా 60 స్వల్పకాలిక, 41 దీర్ఘకాలిక సిఫార్సులున్నాయి.

అలాగే, ఆయా సంస్కరణల అమలుకు రాధాకృష్ణన్ నేతృత్వంలో ఉన్నత స్థాయి పర్యవేక్షక కమిటీని ఏర్పాటు చేసినట్లుగా ఈ ఏడాది ఫిబ్రవరిలో కేంద్ర విద్యాశాఖ మాజీ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ లిఖిత పూర్వకంగా రాజ్యసభకు చెప్పారు.

నీట్ విషయంలో పెన్ పేపర్ టెస్టు నుంచి క్రమంగా కంప్యూటర్ ఆధారిత పరీక్షకు మారాలని సిఫార్సు చేసినట్లుగా రాధాకృష్ణన్ చెప్పారు.

''నీట్ విషయంలో కంప్యూటర్ బేస్డ్ టెస్టు నిర్వహణ కొంత సవాలుతో కూడుకున్నదే. 20-25 లక్షల మంది విద్యార్థులకు ఒకేసారి పరీక్ష నిర్వహించడం సాధ్యం కాకపోవచ్చు. ఇందుకు వేర్వేరు సెషన్లలో పరీక్ష పెట్టాలి. అందుకు ముందుగా దేశవ్యాప్తంగా 1000 సెంటర్లను కేంద్ర, రాష్ట్రాల విద్యాసంస్థల అనుసంధానంతో ఏర్పాటు చేసుకోవాలని సూచించాం'' అని డీడీ ఇండియా ఇంటర్వ్యూలో చెప్పారు రాధాకృష్ణన్.

వచ్చే ఏడాది నుంచి నీట్ యూజీ పరంగా కంప్యూటర్ బేస్డ్ టెస్టు నిర్వహించేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నట్లుగా ఇప్పటికే కేంద్ర విద్యాశాఖ ప్రకటించింది.

నీట్‌ను రెండు పరీక్షలుగా జరపాల్సిన అవసరం ఉందని బిట్స్ పిలానీ గ్రూప్స్ వైస్ ఛాన్సలర్ కె. రామ్‌గోపాల్ రావు అభిప్రాయపడ్డారు.

ఆయన బీబీసీతో మాట్లాడుతూ, ''రెండుసార్లు పరీక్ష జరిగితే దానివల్ల ఏ పరీక్షలో బెస్ట్ స్కోర్ సాధిస్తే అది తీసుకునేందుకు వీలవుతుంది. దీనివల్ల విద్యార్థులపై ఒత్తిడి తగ్గుతుంది'' అని అన్నారు.

పరీక్షల నిర్వహణకు అవసరమైన మౌలిక సదుపాయాలను దేశవ్యాప్తంగా సమకూర్చుకోవాలని రామ్‌గోపాల్ రావు సూచించారు.

''కంప్యూటర్లు, పరీక్ష సెంటర్లు, సాంకేతికత, నిర్వహణ సిబ్బంది.. ఇలా ప్రతీది దేశవ్యాప్తంగా సమకూర్చుకుంటే సులభంగా నిర్వహించేందుకు వీలుంటుంది'' అని వివరించారు.

ఎన్టీఏ, రాధాకృష్ణన్ కమిటీ, ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా, పరీక్షలు

ఫొటో సోర్స్, Saumya Khandelwal/Hindustan Times via Getty Images

''56 శాతం సిఫార్సులే పూర్తిగా అమలు''

రాధాకృష్ణన్ కమిటీ చేసిన 101 సిఫార్సుల్లో 57 మాత్రమే పూర్తిగా అమలైనట్లు తమ విశ్లేషనలో తేలిందని హిందుస్థాన్ టైమ్స్ ప్రచురించింది.

ఇది 56.4 శాతం అమలుకు సమానమని తెలిపింది.

మరో పది సిఫార్సులు పాక్షికంగా అమలులో ఉన్నట్లుగా తెలిపింది. ఇప్పటివరకు అమలు అయిన సిఫార్సుల్లో ఎక్కువ భాగం ఎన్టీఏ పునర్నిర్మాణానికి సంబంధించినవిగా చెప్పింది.

మరో మూడు సిఫార్సులు అమలు దశలో ఉండగా.. నాలుగు అమలు చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు హిందూస్థాన్ టైమ్స్ కథనం వెల్లడించింది.

ఎన్టీఏ పునర్నిర్మాణం అనేది యూపీఎస్సీ తరహాలో జరగాల్సిన అవసరం ఉందని బిట్స్ పిలానీ గ్రూప్ వైస్ ఛాన్సలర్ వి.రామ్‌గోపాల్ రావు బీబీసీతో అన్నారు.

''స్వయం ప్రతిపత్తితో కూడిన వ్యవస్థగా ఎన్టీఏ ఉండాలి. విద్య, సాంకేతిక, పరీక్షల విభాగం, పాలనపరమైన నిపుణులతో కూడిన నాయకత్వం ఉండాలి'' అని చెప్పారు.

మరోవైపు, నీట్ వంటి పోటీ పరీక్షలకు సంబంధించి సిలబస్ కూడా తగ్గించాల్సిన అవసరం ఉందని వి.కుమార్ బీబీసీతో అన్నారు.

''నీట్ విషయంలో కూడా జేఈఈ తరహా ఫార్ములా అవసరం. ప్రిలిమ్స్, మెయిన్ పరీక్ష నిర్వహించడం ద్వారా విద్యార్థుల పరంగా వడపోత జరుగుతుంది. దానివల్ల కంప్యూటర్ బేస్డ్ పరీక్ష నిర్వహణ సులువు అవుతుంది'' అని చెప్పారు.

అలాగే జేఈఈ(మెయిన్)కు సంబంధించి 2025 జనవరి నుంచి ఆధార్ ఆధారిత అథెంటికేషన్, పకడ్బందీ తనిఖీలు, రిపీటెడ్ బయోమెట్రిక్ వెరిఫికేషన్ అమలులోకి వచ్చాయి.

అయితే, రాధాకృష్ణన్ కమిటీ చేసిన సిఫార్సుల్లో ఇంకా 27 సిఫార్సులు అమలు కావాల్సి ఉందని హిందుస్థాన్ టైమ్స్ తెలిపింది.

60 స్వల్పకాలిక సిఫార్సులు ఎక్కువగా అమలులోకి రాగా, 41 దీర్ఘకాలిక సిఫార్సుల్లో ఎక్కువ శాతం అమలులోకి రాలేదని విశ్లేషణలో తేలింది.

డిజీ ఎగ్జామ్ ఐడెంటిటీ వెరిఫికేషన్, హైబ్రీడ్ అండ్ కంప్యూటర్ సాయంతో ప్రశ్న పత్రాల పంపిణీ, గ్రామీణ ప్రాంతాల్లో మెబైల్ టెస్టింగ్ సెంటర్లు, పరీక్షల నిర్వహణకు సంబంధించి అంతర్జాతీయ స్థాయిలో భాగస్వామ్యం వంటివి ఇంకా ఉన్నాయి.

కమిటీ సిఫార్సుల అమలుపై ఎన్టీఏను మెయిల్ ద్వారా బీబీసీ సంప్రదించింది. వారి నుంచి స్పందన రావాల్సి ఉంది. రాగానే అప్డేట్ చేస్తాం.

ఎన్టీఏ, రాధాకృష్ణన్ కమిటీ, ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా, పరీక్షలు

ఫొటో సోర్స్, Rohit Lohia/NurPhoto via Getty Images

పేపర్ లీకులపై తీసుకున్న చర్యలేమిటి?

గత మూడు సంవత్సరాలలో జాతీయ స్థాయిలో జరిగే పోటీ పరీక్షల పరంగా ఎన్ని ప్రశ్న పత్రాలు లీకయ్యాయనే విషయంపై 2026 ఫిబ్రవరిలో ఎంపీ సందీప్ కుమార్ పాఠక్ రాజ్యసభలో ప్రశ్న లేవనెత్తారు.

నీట్(యూజీ), నీట్(పీజీ), సీయూఈటీ, యూజీసీ-నెట్ సహా పోటీ పరీక్షల ప్రశ్నపత్రాల లీకేజీపై తీసుకున్న చర్యలు చెప్పాలని ప్రశ్నించారు.

దీనికి అప్పట్లో కేంద్ర విద్యాశాఖ మంత్రిగా ఉన్న ధర్మేంద్ర ప్రధాన్ సమాధానం ఇచ్చారు.

''పోటీ పరీక్షలను జాతీయ, రాష్ట్ర స్థాయిలో వివిధ విద్యా సంస్థలు నిర్వహిస్తుంటాయి. చట్టాలకు లోబడి రాష్ట్రాల పోలీసులు, జాతీయ దర్యాప్తు సంస్థలు పోటీ పరీక్షల లీకేజీలు వంటి విషయాలపై కేసులు నమోదు చేస్తుంటాయి'' అని చెప్పారు.

ఈ సమాధానంలో ఎక్కడా కూడా ఎన్ని పరీక్షల ప్రశ్నపత్రాలు లీకయ్యాయనే విషయాన్ని స్పష్టం చేయలేదు.

అయితే, పోటీ పరీక్షలలో పారదర్శకత కోసం ''ది పబ్లిక్ ఎగ్జామినేషన్స్(ప్రివెన్షన్ ఆఫ్ అన్ ఫెయిర్ మీన్స్) యాక్ట్ అండ్ రూల్స్, 2024 తీసుకువచ్చినట్లు ధర్మేంద్ర ప్రధాన్ అప్పట్లో ప్రకటించారు.

ఇప్పుడు ఇదే చట్టానికి మరోసారి సవరణలు చేస్తున్నట్లుగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది.

గతంలో ఉన్న చట్టంలో సవరణలు చేసి పేపర్ లీకేజీలకు పాల్పడితే మరింత కఠిన శిక్షలు, జరిమానాలను విధించేలా చట్టం చేస్తున్నట్లుగా ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారు.

చట్టం చేయడమే కాకుండా అమలు కచ్చితంగా ఉండాలని శ్రీ చైతన్య విద్యా సంస్థల నీట్ జాతీయ కోఆర్డినేటర్ వి.కుమార్ అన్నారు.

''తప్పు జరిగితే శిక్షలు పడేందుకు ఎక్కువ సమయం తీసుకోకూడదు. దానివల్ల ఉదాసీనత పెరిగిపోతోంది'' అని చెప్పారు.

త్వరగా శిక్షలు పడతాయనే భయం ఉంటేనే తప్పులు జరిగే అవకాశం తగ్గుతుందని చెప్పారు.

( బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,  ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)