కేరళ: మతాల వారీగా వాట్సాప్ గ్రూప్‌లు, ఇద్దరు ఐఏఎస్ అధికారుల సస్పెన్షన్.. అసలేమైంది?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, ఇమ్రాన్ ఖురేషి
- హోదా, బీబీసీ ప్రతినిధి
- ప్రచురణ
- చదివే సమయం: 4 నిమిషాలు
కేరళలో ఇద్దరు ఐఏఎస్ అధికారులను ప్రభుత్వం సస్పెండ్ చేయడం చర్చనీయాంశంగా మారింది. అయితే, చాలామంది బ్యూరోక్రాట్లకు ఈ సస్పెన్షన్ ఆశ్చర్యంగా ఏమీ అనిపించలేదు.
ఎందుకంటే, ఈ ఇద్దరు అధికారులు చేసిన పని బ్యూరోక్రాట్లను కలవరపరిచింది. సివిల్ సర్వీస్ విలువలను ఉల్లంఘించేలా వీరు వ్యవహరించారని ఆయా వర్గాలు అనుకుంటున్నాయి.
సస్పెండ్ అయిన ఇద్దరు అధికారుల్లో 2013 బ్యాచ్‌కు చెందిన గోపాలకృష్ణన్ ఒకరు. ఆయన కేరళ పరిశ్రమలు, వాణిజ్య శాఖ డైరెక్టర్.
మరో అధికారి ఎన్. ప్రశాంత్. ఆయనది 2007 బ్యాచ్. రాష్ట్ర వ్యవసాయ శాఖ ప్రత్యేక కార్యదర్శిగా విధులు నిర్వహిస్తున్నారు.
‘హిందూ’ పేరుతో అధికారులతో కూడిన ఒక వాట్సాప్ గ్రూపును క్రియేట్ చేశారని గోపాలకృష్ణన్‌పై ఆరోపణలు వచ్చాయి.
ఇలాంటి ఒక గ్రూపును ఏర్పాటు చేయడాన్ని కొంతమంది యువ అధికారులు విమర్శించారు. ఆ తర్వాత ‘ముస్లిం’ పేరుతో మరో గ్రూపును సృష్టించారు.
ఈ అంశంపై రిటైరైన కొంతమంది అధికారులు తమ అభిప్రాయాలను వెల్లడించారు. తమ పేరు వెల్లడించడానికి ఈ అధికారులు ఇష్టపడలేదు. సివిల్ సర్వీసులో ఇలాంటిది ఇంతకు ముందెన్నడూ జరుగలేదని వారు అన్నారు.


ఫొటో సోర్స్, Getty Images
ప్రభుత్వం ఏం చెప్పింది?
కేరళ ప్రభుత్వం ఈ అంశంపై స్పందిస్తూ.. గతంలో ఇలా ఎప్పుడూ జరుగలేదని చెప్పింది.
ఆ అధికారుల చర్యలు విభజనను ప్రోత్సహించేలా ఉన్నాయని, ఆలిండియా సర్వీస్ క్యాడర్ అధికారుల మధ్య ఐక్యతను విచ్ఛిన్నం చేసేలా, వైరుధ్యాలను పెంచేలా ఉన్నాయని వ్యాఖ్యానించింది.
ఐఏఎస్ ప్రశాంత్‌ను మరో విషయంలో సస్పెండ్ చేశారు.
సోషల్ మీడియాలో తీవ్ర పదజాలంతో ఆర్థిక శాఖ అదనపు ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఎ. జయతిలక్‌ను ప్రశాంత్ దూషించారని ఆరోపణలు వచ్చాయి.
ప్రశాంత్ చర్యను తీవ్ర క్రమశిక్షణారాహిత్యంగా, రాష్ట్రంలో పాలనా యంత్రాంగం ప్రతిష్ఠను దిగజార్చే చర్యగా ప్రభుత్వం పరిణిస్తోంది.
ప్రశాంత్ వ్యాఖ్యలు ఐఏఎస్‌లలో విభజనను తీసుకొచ్చేలా, పరస్పర విభేదాలకు దారితీసేలా ఉన్నాయని ఉన్నతాధికారులు భావిస్తున్నారు.

చాలా ప్రమాదకరం: మాధవన్
గోపాలకృష్ణన్ చేసిన పనికి ఆయన్ను సస్పెండ్ చేయడం తగిన శిక్ష కాదని బిహార్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా పనిచేసిన రిటైర్డ్ ఆఫీసర్ ఎన్‌ఎస్ మాధవన్ అన్నారు.
‘‘గోపాలకృష్ణన్‌ను సస్పెండ్ చేశారు. ఇక్కడితోనే దీన్ని ఆపేయాలని నేను అనుకోవట్లేదు. ఎలాంటి విచారణ లేకుండానే ఆయనను డిస్మిస్ చేసే రాజ్యాంగ నిబంధనలు ఉన్నాయి. ఆయన చేసిన పని జాతీయ భద్రతకు ప్రమాదకరం. సివిల్ సర్వీస్ అధికారుల్లో విభజనను సృష్టిస్తుంది. ఇది చాలా ప్రమాదకరం’’ అని బీబీసీతో మాట్లాడుతూ మాధవన్ చెప్పారు.

ఫొటో సోర్స్, Getty Images
ప్రభుత్వ ఆదేశాల్లో ఏముంది?
ఈ అంశంపై నవంబర్ 11 (సోమవారం) రాత్రి కేరళ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. పోలీసులకు గోపాలకృష్ణన్ ఒక ఫిర్యాదు చేసినట్లు అందులో పేర్కొంది.
తన మొబైల్ ఫోన్ హ్యాక్ అయ్యిందని, తన అనుమతి లేకుండానే ఎవరో వాట్సాప్ గ్రూపును ఏర్పాటు చేసి అందులో అందరినీ చేర్చారని ఫిర్యాదులో గోపాలకృష్ణన్ పేర్కొన్నారని తెలిపింది.
గోపాలకృష్ణన్ ఫిర్యాదు చేసినట్లుగా ఆయన ఫోన్ హ్యాక్ అయినట్లుగా దర్యాప్తులో ఎలాంటి ఆధారాలు దొరకలేదని తన ఆదేశాల్లో ప్రభుత్వం వెల్లడించింది.
ఫోరెన్సిక్ దర్యాప్తుకు తన ఫోన్‌ను ఇవ్వడానికి ముందు గోపాలకృష్ణన్ అనేకసార్లు ఫ్యాక్టరీ రీసెట్ చేసినట్లు కూడా తమ దర్యాప్తులో తేలిందని చెప్పింది.
రాష్ట్రంలోని ఆలిండియా సర్వీస్ క్యాడర్ అధికారుల మధ్య విభేదాలను సృష్టించడానికి, ఐక్యతను నాశనం చేయాలనే దురుద్దేశంతో గోపాలకృష్ణన్ ఈ వాట్సాప్ గ్రూపును ఏర్పాటు చేసినట్లుగా ప్రాథమికంగా ప్రభుత్వం భావిస్తోంది.
ప్రశాంత్ చర్యలను తీవ్రమైన క్రమశిక్షణా రాహిత్యంగా పరిగణిస్తున్నట్లు ఆదేశాల్లో తెలిపింది.
గోపాలకృష్ణన్, ఆలిండియా సర్వీసెస్ నిబంధనలను (1968) ఉల్లంఘించినట్లు ప్రభుత్వం పేర్కొంది.
ఒక యువ అధికారి తనకు వ్యతిరేకంగా గొంతెత్తిన తర్వాతే గోపాలకృష్ణన్, పోలీసులను ఆశ్రయించారని బీబీసీతో మాట్లాడుతూ మాధవన్ అన్నారు.
‘‘ఆయన హిందూ గ్రూపు ప్రారంభించినప్పుడు చాలామంది యువ అధికారులు ఆయన చర్యను వ్యతిరేకించారు. అప్పడు మరో ముస్లిం గ్రూపును ఏర్పాటు చేయడం ద్వారా తన చర్యను సమర్థించుకునే ప్రయత్నం చేశారు. అప్పుడు ఒక యువ అధికారి గోపాలకృష్ణన్‌కు వ్యతిరేకంగా తన గొంతెత్తారు’’ అని మాధవన్ వివరించారు.
ఐఏఎస్ అధికారుల సంఘం పాత్ర ఏంటి?
ఈ విషయంపై కేరళ ఐఏఎస్ అధికారుల సంఘం అధ్యక్షుడు బి. అశోక్‌తో బీబీసీ మాట్లాడింది.
ఒక వ్యక్తిపై తీసుకున్న క్రమశిక్షణ చర్యలపై ఐఏఎస్ అధికారుల సంఘం ఎలాంటి వ్యాఖ్యలు చేయదని ఆయన చెప్పారు.
‘పాలసీ పరంగా ఇది ప్రభుత్వానికి, ఆ అధికారికి మధ్య వ్యవహారం. అయితే, ఎస్‌ఓపీ ప్రకారం ఆయన మా నుంచి ఏదైనా సహాయాన్ని కోరుకుంటున్నారో తెలుసుకునేందుకు ప్రయత్నిస్తాం. వాస్తవానికి ఈ సంఘానికి కొన్ని పరిమితులు ఉంటాయి.
ప్రభుత్వమే తమ యజమాని అనే ప్రాథమిక ఆలోచనతో అధికారులు పనిచేస్తుంటారు. కాబట్టి ప్రభుత్వం పనికి దూరంగా ఉండాలని ఆదేశించినప్పుడు ఆ అధికారి ప్రభుత్వ ఆదేశాలను తప్పకుండా పాటించాలి.
పరిస్థితిపై సమీక్ష చేసే కమిటీ ఒకటి ఉంది. ప్రతీ మూడు నెలలకు, ఆరు నెలలకు ఈ కమిటీ సమీక్ష చేస్తుంది. ఒకవేళ ఒక అధికారిపై 12 నెలలకు మించి సస్పెండ్ చేయాల్సి వస్తే దానికి ప్రభుత్వ ఆమోదం పొందాల్సి ఉంటుంది’’ అని అశోక్ వివరించారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్, ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)





























