You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
జ్ఞానేశ్వరి మిస్సింగ్‌కు నెల రోజులు: 'అడవులు, కొండలు, బావులు, చెరువులు..ఎక్కడ వెతికినా ఆచూకీ లేదు'.. పాపకు ఏమై ఉంటుంది?
- రచయిత, లక్కోజు శ్రీనివాస్
- హోదా, బీబీసీ కోసం
- ప్రచురణ
- చదివే సమయం: 8 నిమిషాలు
ప్రతి ఫోన్ రింగ్‌లో ఒక ఆశ. ఒక ఎదురుచూపు. "మీ బిడ్డ ఇక్కడ ఉంది" అని ఎవరైనా చెబుతారేమోనని నెల రోజులుగా ఎదురు చూస్తున్నారు జ్ఞానేశ్వరి తల్లిదండ్రులు. కానీ, నెల అయినా.. ఆ ఒక్క ఫోన్ కాల్ మాత్రం ఇంకా రాలేదు.
కాకినాడ జిల్లా సీహెచ్ అగ్రహారానికి చెందిన జ్ఞానేశ్వరి కనిపించకుండా పోయి జూలై 6కి నెల రోజులు. ఈ నెల రోజులుగా ఒకవైపు పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తుండగా... మరోవైపు, తల్లిదండ్రులు తమ బిడ్డ క్షేమంగా ఉందనే మాట కోసం ఎదురుచూస్తున్నారు.
పోలీసులు అడవులు గాలించారు. కొండలు, బావులు, చెరువులు వెతికారు. డ్రోన్లు ఎగరేశారు. మొబైల్ ఫోన్ డేటాను విశ్లేషించారు. ఎక్కడైనా చిన్నారి కనిపించిందనే సమాచారం వచ్చిన ప్రతిసారీ బృందాలను పంపించారు.
కానీ, జ్ఞానేశ్వరి ఆచూకీ మాత్రం ఇప్పటికీ దొరకలేదు.
జ్ఞానేశ్వరి ఎక్కడ ఉంది? ఆమెకు ఏమైంది? నెల రోజులైనా ఈ ప్రశ్నలకు ఇప్పటికీ సమాధానం దొరకలేదు.
పోలీసుల దర్యాప్తు ఏ దశకు చేరింది?
జ్ఞానేశ్వరి అదృశ్యమైన కేసులో ఇప్పటివరకు అన్ని కోణాల్లో దర్యాప్తు చేశామని పోలీసులు చెబుతున్నారు.
మొబైల్ టవర్ డేటా డంప్, కాల్ డేటా విశ్లేషణ, డ్రోన్ సర్వేలు, ట్రాప్ కెమెరాలు, ఆర్‌ఎఫ్‌ఐడీ పద్ధతులను ఉపయోగించినట్లు తెలిపారు.
జ్ఞానేశ్వరి మిస్సింగ్ కేసు నమోదైనప్పటి నుంచీ ఈ కేసును పర్యవేక్షిస్తున్న పెద్దాపురం డీఎస్పీ ఏబీజీ తిలక్, జ్ఞానేశ్వరి కేసులో కొనసాగుతున్న దర్యాప్తు విషయాలను బీబీసీకి వివరించారు.
"అడవి జంతువుల దాడి జరిగి ఉండొచ్చనే అనుమానాన్ని కూడా పరిశీలించాం. అందులో భాగంగా మాంసం ఉంచిన బొమ్మలను చిన్నారి చివరిసారిగా కనిపించిన ప్రాంతంలో ఏర్పాటు చేసి, ట్రాప్ కెమెరాల ద్వారా గమనించాం. అయితే, ఆ ప్రయోగంలోనూ ఎలాంటి ఆధారాలు లభించలేదు" అని డీఎస్పీ తిలక్ తెలిపారు.
పాప అదృశ్యమైన రోజు భారీ వర్షం కురవడంతో, నీటి ప్రమాదం జరిగి ఉండొచ్చనే కోణాన్ని కూడా పరిశీలించాం. ఎస్డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్ బృందాలతో బావులు, చెరువులు, నీటి నిల్వలను తనిఖీ చేసినా ఎలాంటి ఆధారాలు దొరకలేదన్నారు.
ఆదిలాబాద్, బాపట్ల నుంచి ఫోన్లు...
చిన్నారి కనిపించిందని ఎక్కడి నుంచైనా సమాచారం వచ్చిన ప్రతిసారీ ప్రత్యేక బృందాలను పంపించినట్లు పోలీసులు తెలిపారు.
ఆదిలాబాద్, బాపట్లతో పాటు వివిధ ప్రాంతాలకు వెళ్లి సమాచారాన్ని ధ్రువీకరించే ప్రయత్నం చేసినప్పటికీ ఇప్పటివరకు ఆమె ఆచూకీ లభించలేదన్నారు.
"ఆదిలాబాద్, బాపట్ల నుంచి పాపలా అనిపిస్తుందంటూ ఫోన్ కాల్స్ వచ్చాయి. వీటితో పాటు వివిధ ప్రాంతాలకు వెళ్లి వచ్చిన సమాచారాన్ని పరిశీలించినప్పటికీ ఫలితం లేదు" అని డీఎస్పీ తిలక్ తెలిపారు.
''చిన్నారి ఫలానా ప్రాంతంలో కనిపించిందని సమాచారం వచ్చిన ప్రతిసారీ ప్రత్యేక బృందాలను అక్కడికి పంపిస్తున్నాం. వివిధ ప్రాంతాలకు కూడా బృందాలను పంపించి ధ్రువీకరించే ప్రయత్నం చేసినప్పటికీ, ఇప్పటివరకు ఆమె ఆచూకీ లభించలేదు'' అని పోలీసులు చెప్పారు.
దర్యాప్తును మొదట చిన్నారి చివరిసారిగా కనిపించిన ప్రాంతానికి సమీపంలోని రెండు కిలోమీటర్ల పరిధిలో ప్రారంభించిన పోలీసులు, ఆ తర్వాత దానిని ఐదు కిలోమీటర్లకు, ప్రస్తుతం 15 కిలోమీటర్ల పరిధికి విస్తరించి కూంబింగ్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
"జ్ఞానేశ్వరి కనిపించకుండా పోయిన రోజున మధ్యాహ్నం తర్వాత దాదాపు రెండున్నర గంటల పాటు భారీ వర్షం కురిసింది. తోటలోకి భారీగా నీరు చేరింది. దీంతో ఆ నీటిలో ప్రమాదం జరిగి ఉండొచ్చనే కోణాన్ని కూడా పరిశీలించాం. వెంటనే ఆ దిశగా ఎస్డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్ బృందాలతో బావులు, చెరువులు, నీరు నిలిచిన ప్రాంతాలను తనిఖీ చేశాం. అయినా ఇప్పటివరకు ఎలాంటి ఆధారాలు లభించలేదు" అని బీబీసీకి వివరించారు డీఎస్పీ తిలక్.
‘బొమ్మలు అలాగే ఉన్నాయి’
పామాయిల్ తోటలో పాపని చివరి సారిగా చూశామని చెబుతున్న ప్రాంతంలో పోలీసులు దర్యాప్తులో భాగంగా ఫెన్సింగ్‌కు బొమ్మలను వేలాడదీశారు. వీటిని జూన్ 18న పెట్టారు.
ఆ ప్రాంతానికి బీబీసీ వెళ్లింది. అక్కడ ఆ బొమ్మలు అలాగే ఉన్నాయి. బొమ్మలు పెట్టి మూడు వారాలైనా అక్కడ పోలీసులు ఆశించిన ఎటువంటి క్లూ దొరకలేదు.
"పాపని చివరిసారిగా చూసింది ఆ ఫెన్సింగ్ దగ్గరే కాబట్టి... అక్కడ ఏదైనా జంతువు దాడి చేసుంటుందనే అనుమానంతో... మళ్లీ ఆ రియల్ టైమ్‌ను పరిశీలించేందుకు బొమ్మల్లో ట్రాప్ కెమెరాలు పెట్టి, మాంసం కూడా పెట్టాం. ఆ మాంసం వాసనకు ఏ జంతువైనా తినడానికి వస్తే... మనకు కనిపించే అవకాశం ఉంటుంది. అందుకే వాటిని ట్రాక్ చేయడానికి టీమ్స్ కూడా పెట్టాం. కానీ, ఏ జంతువు ఇప్పటి వరకు రాలేదు. బొమ్మలు అక్కడే ఉన్నాయి" అని డీఎస్పీ తిలక్ చెప్పారు.
13 కొండల్లో ఎక్కడైనా...
పాప ఆచూకీ తెలియకుండా పోయి నెల రోజులైనా... తమ సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతుందని పెద్దాపురం డీఎస్పీ తిలక్ చెప్పారు. పాప అదృశ్యమైన ప్రాంతంతో పాటు... అనుమానం ఉన్న ప్రతి ప్రదేశానికి బృందాలను పంపుతున్నట్లు తెలిపారు.
పాప కుటుంబం నివాసముంటున్న 40 ఎకరాల పామాయిల్ తోటకు ఆనుకుని ఉన్న ప్రాంతానికి మొత్తం 13 కొండలకు వెళ్లే మార్గాలు ఉన్నాయని పోలీసులు చెబుతున్నారు.
ఆ దారుల గుండా ఎవరైనా పాపని తీసుకెళ్లి ఉంటారనే కోణంలో... అటవీశాఖ సహాయం తీసుకుని దర్యాప్తు చేస్తున్నామని డీఎస్పీ తిలక్ తెలిపారు.
"పాప ఆచూకీ కోసం పామాయిల్ తోటల్లోకి పనులకు వచ్చే స్థానికులు, ఇతర ప్రాంతాల వారిని ఎప్పటికప్పుడు విచారిస్తూనే ఉన్నాం. పామాయిల్ తోటలతో పాటు దాని చుట్టూ ఉన్న జీడిమామిడి తోటల్లోకి కూడా జీడిపిక్కలు ఏరుకోడానికి కొందరు వస్తుంటారు. జీడిపిక్కల సీజన్ చివర దశకు వచ్చే సమయంలో వీరు వస్తారు. అటువంటి వారికి అనుకోకుండా పాప కనిపించి... వారికి పిల్లలు లేరనో, అమ్ముకుందామనే ఉద్దేశంతోనో పాపని తీసుకెళ్లారనే కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నాం. అంతేకాకుండా పాప ఆచూకీ తెలిపితే రూ. లక్ష ఇస్తామని పోలీసుల తరఫున ప్రకటన చేశాం" అని పెద్దాపురం డీఎస్పీ చెప్పారు.
ఊరూరా పోస్టర్లు అతికిస్తున్న తండ్రి
పోలీసుల దర్యాప్తు ఒకవైపు సాగుతుండగా, మరోవైపు జ్ఞానేశ్వరి తండ్రి గణేశ్ తన కూతురి ఫోటోతో ఉన్న 'మిస్సింగ్' పోస్టర్లు చేత పట్టుకుని ఊరూరా తిరుగుతున్నారు.
నర్సపట్నం, చింతపల్లి, పాడేరు, అరకు, అడ్డురోడ్డు...ఇలా అనేక ప్రాంతాల్లో తన కుటుంబ సభ్యులతో కలిసి వెళ్లి పోస్టర్లు అతికిస్తున్నారు.
"ఈ పాపను ఎవరైనా చూశారా?" అంటూ ఎదురైన ప్రతి ఒక్కరినీ అడుగుతున్నారు. కనిపించిన గోడ, చెట్లు, విద్యుత్ స్థంభాలు అన్న తేడా లేకుండా పోస్టర్లు అతికిస్తూ, ఎవరైనా ఒక సమాచారం ఇస్తారనే ఆశతో ఎదురుచూస్తున్నారు.
తన కూతురు ఎక్కడో సురక్షితంగానే ఉంటుందని ఇప్పటికీ నమ్ముతున్నానని ఆయన చెబుతున్నారు.
ప్రతి సమాచారం ఆశే
జ్ఞానేశ్వరికి సంబంధించి ఏ ఫోన్ కాలైనా వస్తుందేమోననే ఆశతో పాప కుటుంబ సభ్యులు ఆశగా ఎదురు చూస్తున్నారు.
కొన్నిసార్లు పోలీసులకు బయట నుంచి వచ్చిన ఫోటోలు మాకు పంపితే వాటిని చూసి "మా పాపే అయ్యింటుంది" అనుకుని ఆనందపడ్డామని, దగ్గరగా చూసేసరికి జ్ఞానేశ్వరి కాదని తెలిసి మళ్లీ నిరాశ చెందాల్సి వచ్చిందని ఆమె చిన్నాన్న కోటేశ్వరరావు బీబీసీతో చెప్పారు.
"ఏ గల్లీలోకి వెళ్లినా మా పాప కనిపిస్తుందేమో అనిపించేది. ఎవరి పాప ఏడ్చినా ఒక్కసారి ఆగి చూసేవాళ్లం. ప్రతి ఫోన్ కాల్ ఒక ఆశను తీసుకొచ్చేది. కానీ, అది మా పాప కాదని తెలిసిన ప్రతిసారీ మళ్లీ నిరాశే మిగిలింది" అని ఆయన చెప్పారు.
'ఏం జరిగిందో ఊహించలేకపోతున్నాం'
జ్ఞానేశ్వరిని చివరిసారిగా చూసిన ఆమె తల్లి సుంకర భవాని ఇప్పటికీ ఆ రోజు ఏం జరిగిందో అర్థం చేసుకోలేకపోతున్నారు.
"పాప మిస్సైపోయిందని అనుకోవచ్చు. పాప చనిపోయినా, జంతువు దాడి చేసినా, సృహ కోల్పోయినా... ఇంత పెద్ద దర్యాప్తులో ఏదో ఒక ఆధారం దొరకాలి. కానీ, ఏమీ దొరకకపోవడం అర్థం కావడం లేదు" అని ఆమె చెప్పారు.
"పాప కచ్చితంగా మా దగ్గరకు తిరిగొస్తుందనే నమ్మకం ఉంది. కాకపోతే అప్పటి వరకు ఎలా ఉంటుందనే బాధే కష్టంగా ఉంది" అని జ్ఞానేశ్వరి తల్లి సుంకర భవానీ బీబీసీతో అన్నారు.
ఈ కేసులో ఇప్పటివరకు ఏ ఒక్క కోణాన్నీ పోలీసులు పూర్తిగా కొట్టిపారేయడం లేదు. అపహరణ జరిగిందా? ప్రమాదమా? అడవి జంతువుల దాడా? అన్న ప్రశ్నలకు స్పష్టమైన ఆధారాలు ఇప్పటివరకు లభించలేదు.
అందుకే... "జ్ఞానేశ్వరి ఎక్కడుంది?" అన్న ప్రశ్నకు నెల రోజులు గడిచినా సమాధానం దొరకలేదు.
ఆచూకీ దొరికేనా?
జ్ఞానేశ్వరి ఏ రోజుకైనా తిరిగి తల్లిదండ్రుల దగ్గరికి వస్తుందా, లేక ఆంధ్రప్రదేశ్‌లో ఆచూకీ దొరకని వందల మిస్సింగ్ కేసుల్లో ఒకరిగా ఆమె కూడా మిగిలిపోతుందా సందేహానికి సమాధానం కోసం ఇప్పుడు ఒక కుటుంబం ఎదురుచూస్తోంది.
మరోవైపు... జ్ఞానేశ్వరి ఆచూకీ దొరికే వరకు దర్యాప్తు కొనసాగుతుందని పోలీసులు చెబుతున్నారు.
( బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్, ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)