You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
జొన్నగిరి గోల్డ్: ఆంధ్రప్రదేశ్‌లోని ఈ గని భారతదేశపు 'బంగారం' అవసరాలను ఎంత వరకు తీర్చగలదు?
బంగారం మైనింగ్ అనగానే కర్ణాటకలోని కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ (కేజీఎఫ్) గుర్తుకు వస్తుంది.
కానీ, ఇప్పుడు భారత్‌లో మరో 'బంగారు గని'లో మైనింగ్ అధికారికంగా మొదలైంది.
ఆంధ్రప్రదేశ్‌లోని జొన్నగిరి గోల్డ్ ఫీల్డ్స్ నుంచి బంగారం వాణిజ్య అవసరాలకు తగ్గట్టుగా ఉత్పత్తి అవుతోంది.
ఇది, భారత్‌కు స్వాతంత్య్రం వచ్చాక ఆపరేట్ అవుతున్న 'మొట్టమొదటి అతిపెద్ద ప్రైవేటు గోల్డ్ మైన్' అని జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ప్రకటించింది.
జియో మైసూర్ సర్వీసెస్ (ఇండియా) ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ ఇక్కడ బంగారం ఉత్పత్తి ప్రారంభించింది.
నాలుగు బ్లాకుల్లో నిక్షేపాలు గుర్తింపు
జొన్నగిరి ప్రాంతం ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు జిల్లా తుగ్గలి మండలంలో ఉంది. ఇక్కడి జొన్నగిరి, పగిడిరాయి, ఎర్రగుడి గ్రామాల పరిధిలో అపారమైన బంగారు ఖనిజ నిక్షేపాలు (గోల్డ్ ఓర్) ఉన్నట్లుగా జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా గుర్తించింది.
జొన్నగిరిలో దోనా టెంపుల్ బ్లాక్, ఈస్ట్, నార్త్, సౌత్.. ఇలా నాలుగు బ్లాకుల్లో నిక్షేపాలు గుర్తించినట్లు జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా డిప్యూటీ డైరెక్టర్ జనరల్ (రిటైర్డ్) ఎస్.ఆనంద మూర్తి బీబీసీతో చెప్పారు.
''మేం సుమారు పదేళ్లపాటు పరిశోధనలు జరిపాం. సాధారణంగా బంగారం.. వెండితో కలిసి ఉంటుంది. జొన్నగిరిలో పూర్తిగా బంగారు ఖనిజమే ఉంది. సల్ఫైడ్స్ కూడా చాలా తక్కువ స్థాయిలోనే గుర్తించాం'' అని ఆనంద మూర్తి వివరించారు.
జొన్నగిరిలో బంగారం ఎంత ఉంది?
డ్రిల్లింగ్ అండ్ ఎవాల్యుయేషన్ తర్వాత ఈస్ట్ బ్లాకులో 6.8 టన్నుల బంగారం నిల్వలు ఉన్నట్లు గుర్తించామని జియోమైసూర్ సర్వీసెస్ కంపెనీ చెబుతోంది.
ఈ బ్లాకులో, 597.82 హెక్టార్ల (1477.24 ఎకరాలు) మైనింగ్ లీజును ఈ కంపెనీ దక్కించుకుంది.
రూ.405 కోట్ల పెట్టుబడితో, డెక్కన్ గోల్డ్ మైన్స్ లిమిటెడ్ అనే మరో కంపెనీతో కలిసి జియో మైసూర్ సర్వీసెస్ కంపెనీ ఇక్కడ ప్లాంట్ ఏర్పాటు చేసింది.
ఈస్ట్ బ్లాకులోనే టన్ను ఖనిజం నుంచి 1.78 గ్రాముల బంగారం ఉత్పత్తికి అవకాశం ఉందని జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా అంచనా వేసింది. కొన్ని శాంపిల్స్‌లో 3.5 గ్రాముల వరకు ఫలితాలు లభించాయని పేర్కొంది.
మొత్తం నాలుగు బ్లాకుల్లో కలిపి జొన్నగిరి ప్రాంతంలో జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ అంచనా ప్రకారం, 50 టన్నుల బంగారు నిల్వలు ఉన్నట్లు ఏపీ మైన్స్ డిపార్ట్‌మెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీ ముకేశ్ కుమార్ మీనా పీటీఐతో చెప్పారు.
ఇదే విషయాన్ని జొన్నగిరి గోల్డ్ మైన్ ప్రారంభం సందర్భంగా జూన్ 24న ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రస్తావించారు.
ఈస్ట్ బ్లాక్‌లో మైనింగ్
జియోమైసూర్ సర్వీసెస్ కంపెనీ 5.97 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో మైనింగ్ లీజు కోసం 2006లో అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకుంది.
ఆ తర్వాత ప్రభుత్వ సూచన మేరకు, 2008లో ఇండియన్ బ్యూరో ఆఫ్ మైన్స్‌కు మైనింగ్ ప్లాన్ సమర్పించింది. అదే ఏడాది ఆగస్టు 4న ఆ ప్లాన్‌ను ఆమోదించింది.
2043 వరకు చెల్లుబాటు అయ్యేలా 2010లో కేంద్ర ప్రభుత్వం పర్యావరణ అనుమతి ఇచ్చింది. ఏపీ పీసీబీ నుంచి అనుమతులు వచ్చాయి.
ప్రస్తుతం ఒక ప్లాంట్ ద్వారా ఉత్పత్తి జరుగుతుండగా, త్వరలో రెండో ప్లాంట్ కూడా అందుబాటులోకి వస్తుందని జియోమైసూర్ కంపెనీ ఎండీ ప్రభాకరన్ చెప్పారు.
''సుమారు 800 మీటర్ల లోతు వరకు బంగారం ఖనిజ నిల్వలు గుర్తించాం. దానికి తగ్గట్టుగా వివిధ పద్ధతుల్లో మైనింగ్ చేపట్టనున్నాం'' అని ఆయన చెప్పారు.
మొదట ఈస్ట్ బ్లాకులో మైనింగ్ మొదలైన నేపథ్యంలో దాని ప్రత్యేకతలను బీబీసీకి వివరించారు జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా డిప్యూటీ డైరెక్టర్ జనరల్ (రిటైర్డ్) ఆనందమూర్తి.
''మా పరిశోధనలో ఈస్ట్ బ్లాకులో 31.2 మీటర్ల వెడల్పుతో 450-800 మీటర్ల పొడవుతో సిస్ట్ బెల్ట్ ఉంది. ఇది బల్క్ మైన్. 7.93 మిలియన్ టన్నుల బంగారం ఓర్ (ముడి ఖనిజం) ఉందని గుర్తించాం. మా పరిశోధనలో 180 మీటర్ల వరకు గుర్తించినప్పటికీ, ఇంకా లోతుల్లో మరింత ముడి ఖనిజం ఉండే అవకాశం ఉంది'' అని ఆయన చెప్పారు.
''జొన్నగిరి నుంచి వెలికితీసే బంగారం నుంచి మొదటి 400 కేజీలకు రూ.57 కోట్లు, 900 కేజీలకు రూ.144 కోట్ల వరకూ రాయల్టీ రూపంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఆదాయం రానుంది'' అని ఏపీ ప్రభుత్వం తెలిపింది.
1914లో మొదటిసారిగా పరిశోధనలు
జొన్నగిరిలో బంగారం ఖనిజ నిక్షేపాలు ఉన్నట్లు పూర్వ కాలం నుంచి ప్రచారంలో ఉంది.
జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా వద్ద ఉన్న సమాచారం ప్రకారం, జొన్నగిరిలో బంగారం నిక్షేపాలను తొలిసారిగా 1914లో అప్పట్లో భారత్‌లో మైనింగ్ కార్యకలాపాలు నిర్వహించిన బ్రిటిష్ కంపెనీ ఈస్ట్రన్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్‌కు చెందిన బోస్‌వర్త్ స్మిత్ గుర్తించారు.
ఇక్కడ గవనికొండ బ్లాకులో బంగారం, రాగి కోసం ఆయన పరిశోధనలు చేపట్టారు. ఆ సమయంలో ఆశించిన ఫలితాలు రాకపోవడంతో పరిశోధనలు ముందుకు సాగలేదని చెప్పారు ఆనందమూర్తి.
తర్వాత వివిధ దశలలో జరిపిన పరిశోధనల్లో 'సిస్ట్ బెల్ట్' గుర్తించారు. గనిలో బంగారం ఆనవాళ్లు ఎక్కువగా ఉండే ప్రాంతమే సిస్ట్ బెల్ట్.
''1993 నుంచి 2002 మధ్య మా పరిశోధనలు సాగాయి. దోనా టెంపుల్ బ్లాక్, గవనికొండ ప్రాంతాల్లో జియోలాజికల్ మ్యాపింగ్, లితోజియో కెమికల్ శాంప్లింగ్ సహా వివిధ పరిశోధనలు చేశాం. ఆ సందర్భంగా దోనా టెంపుల్ బ్లాక్‌తోపాటు ఈస్ట్, నార్త్, సౌత్ బ్లాకుల్లో బంగారు ఖనిజ నిల్వలు గుర్తించాం'' అని చెప్పారు ఆనందమూర్తి.
బంగారు ఖనిజ నిక్షేపాలు కనుగొన్నందుకు జీఎస్ఐ శాస్త్రవేత్తలు కె.శ్రీరామచంద్రరావు, ఎంఎస్ జయరాం, ఎస్.ఆనందమూర్తి, డి.రూప్ కుమార్‌కు 2000 సంవత్సరంలో భారత ప్రభుత్వం నేషనల్ మినరల్ అవార్డు అందజేసింది.
జొన్నగిరిలో భూ ఉపరితలం నుంచే బంగారం ఖనిజం గుర్తించామని ఆయన చెబుతున్నారు.
మరోవైపు, జొన్నగిరి, పగిడిరాయి ప్రాంతాలలో వజ్రాలు లభిస్తుంటాయని స్థానికులు చెబుతుంటారు.
జొన్నగిరిలోనే ముడి ఖనిజం ఎందుకుంది?
జొన్నగిరి ప్రాంతం ఈస్ట్రన్ ధార్వాడ్ క్రాటన్ రీజియన్ కిందకు వస్తుంది. కేజీఎఫ్, హట్టి గోల్డ్ మైన్స్ కూడా ఇదే రాతి పరిధిలో ఉన్నాయి.
ఇక్కడ రాతి శిలలు సుమారు 2000-2500 మిలియన్ సంవత్సరాల నాటివిగా గుర్తించామని ఆనందమూర్తి వివరించారు.
''వల్కనైజేషన్ కారణంగా రాయి పొరలు పొరలుగా ఏర్పడి మడతలు పడింది. ఆ క్రమంలో క్వార్జ్‌గా మారింది'' అని వివరించారు.
జొన్నగిరి సిస్ట్ బెల్ట్ సుమారు 25 కిలోమీటర్ల పొడవు, ౦.5-5 కిలోమీటర్ల వెడల్పుతో 50 చ.కి.మీ.లలో విస్తరించి ఉందని వివరించారు.
ఓపెన్ మైనింగ్ కారణంగా తక్కువ ఖర్చుతోనే బంగారం ఉత్పత్తి చేయవచ్చని, ఇది లాభదాయకం కూడా అవుతుందని ఆనందమూర్తి బీబీసీతో అన్నారు.
''సహజంగా కోలార్ గోల్డ్ ఫీల్డ్స్‌లో సగటున టన్ను ముడి ఖనిజం నుంచి 5 గ్రాముల బంగారం ఉత్పత్తి చేసేవారు. అది అండర్ గ్రౌండ్ మైనింగ్. ఖర్చు ఎక్కువ. జొన్నగిరిలో టన్ను ముడి ఖనిజం నుంచి 1.78 గ్రాముల బంగారం ఉత్పత్తి జరుగుతున్నప్పటికీ, ఓపెన్ మైనింగ్ కావడంతో ఖర్చు తక్కువ. అండర్ గ్రౌండ్ మైనింగ్‌తో పోల్చితే ఓపెన్ మైనింగ్‌లో ఐదింతల ఖర్చు తగ్గుతుంది'' అని చెప్పారు.
మరి భారత్ అవసరాలకు సరిపోతుందా?
దిగుమతుల పరంగా చూస్తే, 2025-26 సంవత్సరంలో 721.04 టన్నుల బంగారాన్ని భారత్ దిగుమతి చేసుకున్నట్లు కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ గణాంకాల ద్వారా తెలుస్తోంది.
2024-25లో 757.09 టన్నులు, 2023-24లో 795.2టన్నులు టన్నులు దిగుమతి చేసుకుందని ఆ రిపోర్టులో ఉంది.
ఇక విలువ పరంగా చూస్తే, 2025-26లో 71.98 బిలియన్ డాలర్లు కాగా, 2024-25లో 58 బిలియన్ డాలర్లు, 2023-24లో 45.54 బిలియన్ డాలర్లుగా ఉంది.
భారత్ లో ఒకప్పుడు కర్ణాటకలోని కోలార్ గోల్డ్ ఫీల్డ్స్(కేజీఎఫ్) బంగారం ఉత్పత్తికి ప్రధాన వనరుగా ఉండేది.
బంగారం ఉత్పత్తి 1880 నుంచి 2001 సంవత్సరాల మధ్య ఇక్కడ సుమారు 800 టన్నుల వరకు జరిగిందని 2014లో రీసెర్చ్ గేట్ లో ప్రచురితమైన ఒక పరిశోధన పత్రం ద్వారా తెలుస్తోంది.
భూమి ఉపరితలం నుంచి దాదాపు 3.2 కిలోమీటర్ల లోతు వరకు బంగారం ముడి ఖనిజం కోసం తవ్వకాలు జరిగాయి.
దాదాపు 200 ఏళ్ల కిందట టిప్పు సుల్తాన్ కాలం నుంచి ఇక్కడ బంగారం అన్వేషణ జరిగినట్లుగా ఈ పరిశోధనపత్రం చెబుతోంది.
లండన్ కు చెందిన జాన్ టేలర్ అండ్ సన్స్ మైన్స్ కంపెనీ ఆధ్వర్యంలో, 1880లో పారిశ్రామిక స్థాయిలో బంగారం ఉత్పత్తి మొదలైంది. ఆ తర్వాత 1950లో కర్ణాటక ప్రభుత్వం కేజీఎఫ్‌ను టేకోవర్ చేసుకోగా, 1972లో భారత ప్రభుత్వం టేకోవర్ చేసుకుంది.
ఇక్కడ బంగారం నిల్వలు అయిపోయాయన్న ఉద్దేశంతో కేంద్ర కేబినెట్ నిర్ణయం మేరకు 2001 మార్చిలో కేజీఎఫ్‌ను భారత ప్రభుత్వం మూసివేసింది.
1972 నుంచి 2001లో మూతపడే వరకు కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే భారత్ గోల్డ్ మైన్స్ లిమిటెడ్ ఇక్కడ మైనింగ్ చేసింది.
కర్ణాటక, ఝార్ఖండ్, ఆంధ్రలో మైనింగ్
భారత్‌లో ప్రస్తుతం కర్ణాటక, ఝార్ఖండ్, ఆంధ్రప్రదేశ్ లలో మాత్రమే బంగారం ఉత్పత్తి జరుగుతోంది.
కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వ లెక్కల ప్రకారం, 2025 మార్చి 31 నాటికి హట్టి గోల్డ్ మైన్స్‌లో 21.58 మిలియన్ టన్నుల బంగారు ముడి ఖనిజం నుంచి 101.64 టన్నుల బంగారం ఉత్పత్తి జరిగింది. ఇక్కడ సగటున టన్నుకు 4.71 గ్రాముల బంగారం ఉత్పత్తి అవుతోంది.
2023లో ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో విడుదల చేసిన గణాంకాల ప్రకారం, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఝార్ఖండ్, కర్ణాటక, రాజస్థాన్ రాష్ట్రాల్లో బంగారం ఖనిజ నిల్వలు ఉన్నట్లుగా జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా గుర్తించింది.
కేంద్ర గనుల శాఖ డేటా ప్రకారం కర్ణాటక, ఝార్ఖండ్, ఆంధ్రప్రదేశ్‌లలో కలిపి 2025-26 సంవత్సరంలో 1.8 టన్నుల బంగారం ఉత్పత్తి అయ్యింది.
జొన్నగిరిలో మైనింగ్ ప్రారంభం కావడంతో దేశీయంగా మరికొంత బంగారం అందుబాటులోకి రానుంది.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ లెక్కల ప్రకారం, ''మొదటి ఏడాది (2026)లో 400 కిలోల బంగారం ఉత్పత్తి జరగనుంది. రెండో ఏడాది (2027)లో 900 కిలోల బంగారం ఉత్పత్తి జరగనుంది. అలా పెంచుకుంటూ వెళ్లి ఏడాదికి 2 టన్నుల బంగారం ఉత్పత్తి చేసేలా ప్లాంట్ల సామర్థ్యాన్ని పెంచనున్నారు'' అని ఏపీ ప్రభుత్వం తెలిపింది.
జొన్నగిరిలో 50 టన్నుల బంగారం నిల్వల అంచనా దృష్ట్యా దాదాపు 30 ఏళ్లకుపైగానే మైనింగ్‌కు ఇక్కడ అవకాశం ఉండొచ్చు.
ఇక్కడ ఉత్పత్తి జరిగే బంగారంతో దిగుమతుల విషయంలో భారత్‌కు కొంతమేర ప్రయోజనం దక్కతుందని ఎస్.ఆనందమూర్తి అభిప్రాయపడ్డారు.
''బంగారానికి భారత్‌లో డిమాండ్ ఎక్కువగా ఉంది. దేశీయంగా కనీసం పది శాతం ఉత్పత్తి అంచనాలు చేరుకున్నప్పటికీ, ఆ మేరకు విదేశీ మారక నిల్వలు ఆదా చేసేందుకు వీలుంటుంది'' అని చెప్పారు.
అనంతపురం జిల్లాలోని రామగిరి గోల్డ్ ఫీల్డ్స్‌తో పాటు, కేజీఎఫ్ తిరిగి ఉత్పత్తి ప్రారంభించగలిగితే కచ్చితంగా అదనపు ప్రయోజనం కలుగుతుందని ఆనందమూర్తి అభిప్రాయపడ్డారు.
మార్కెట్‌లోకి జొన్నగిరి బంగారం
జియోమైసూర్ కంపెనీ ఉత్పత్తి చేసిన బంగారం ఆంధ్రప్రదేశ్ బులియన్ మార్కెట్‌లోకి విడుదలైంది.
50 గ్రాములు, 100 గ్రాములు, 500 గ్రాములలో ఇది లభిస్తోందని కర్నూలు షరాఫ్ బజార్‌కు చెందిన వ్యాపారులు చెబుతున్నారు.
''దిగుమతి కారణంగా బంగారంపై సుంకాలు పడుతున్నాయి. ఇప్పుడు దేశీయంగా లభిస్తే, ఆ మేరకు సుంకాలు తగ్గి కొంత తక్కువ ధరలోనే వ్యాపారులకు బంగారం లభించే వీలుంది'' అని కర్నూలుకు చెందిన వ్యాపారి జగదీష్ చెప్పారు.
జొన్నగిరిలో ఉత్పత్తి దశల వారీగా పెరగనుందని కర్నూలు జిల్లా కలెక్టర్ సిరి వివరించారు.
''దాదాపు ఆరు నెలల నుంచి మైనింగ్ చేసి పైలట్ కింద జియోమైసూరు కంపెనీ బంగారం ఉత్పత్తి చేస్తోంది. 30 కేజీల ఉత్పత్తి సామర్థ్యం సాధించింది. దీన్ని మరింత పెంచనుంది'' అని చెప్పారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్, ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.