You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
కేప్ వెర్డే: మెస్సీ టీమ్‌కే గట్టి పోటీ ఇచ్చిన ఈ జట్టుకు స్వదేశంలో ఘనస్వాగతం... అసలు ఈ దేశం ఎక్కడుంటుంది?
- రచయిత, పాల్ ఎన్జీ
- హోదా, బీబీసీ ప్రతినిధి
- ప్రచురణ
- చదివే సమయం: 4 నిమిషాలు
ప్రపంచ కప్‌లో అద్భుత ప్రదర్శన తర్వాత స్వదేశానికి తిరిగొచ్చిన కేప్ వెర్డే ఫుట్‌బాల్ జట్టుకు ఆ దేశ ప్రజలు ఘన స్వాగతం పలికారు.
ప్రస్తుత చాంపియన్ అర్జెంటీనాతో జరిగిన ఉత్కంఠభరిత మ్యాచ్ తర్వాత టోర్నమెంట్ నుంచి నిష్క్రమించిన బ్లూ షార్క్స్ జట్టు, ఆదివారం రాజధాని నగరం ప్రైయాకు చేరుకుంది.
అభిమానులు ఉత్సాహంతో డప్పులు కొడుతూ, నృత్యాలు, నినాదాలు చేస్తూ ఎయిర్‌పోర్ట్‌లో సందడి సృష్టించారు.
"మా ప్రజలతో ఇక్కడ ఉండటం చాలా గొప్ప క్షణం" అని తన ఆటతో ప్రపంచం దృష్టిని ఆకర్షించిన గోల్ కీపర్ వోజిన్హా అన్నారు. ఆయన బీబీసీతో ప్రత్యేకంగా మాట్లాడారు.
"మేమింగా ఎక్కువ సాధించాలనుకున్నాం. కానీ తర్వాతి దశకు చేరుకోలేకపోయాం. ఇప్పుడీ క్షణాన్ని ఆస్వాదిస్తూ మాప్రజలతో కలిసి వేడుక చేసుకుంటున్నాం" అని కేప్ వెర్డే పేరు రాసి ఉన్న తెల్లటి టీ షర్డు వేసుకున్న వోజిన్హా చెప్పారు.
ప్రపంచ కప్‌లో రెండో అతి చిన్న దేశానికి ప్రాతినిధ్యం వహిస్తోంది కేప్ వెర్డే దేశపు జట్టు. ఇంతకు ముందెన్నడూ ఈ టోర్నీలో ఆడకున్నా, స్పెయిన్, ఉరుగ్వే వంటి దిగ్గజాలకు దీటుగా నిలిచిన బ్లూ షార్క్స్‌కు కృతజ్ఞతలు చెప్పడానికే తాను ఈ ఎయిర్‌పోర్ట్‌కు వచ్చినట్లు ఓ అభిమాని బీబీసీతో అన్నారు.
ఎయిర్‌పోర్ట్‌లో అభిమానులు వోజిన్హాతో పాటు సెంటర్ బ్యాక్ ఆటగాడు పికో లోప్స్ వంటి ఇతర ఆటగాళ్ల పేర్లతో పెద్ద పెద్దగా కేకలు పెట్టారు.
సంబరాల మధ్య ఆటగాళ్లు ఒకరి తర్వాత ఒకరు అభిమానుల టీషర్టులపై సంతకాలు చేశారు.
ఆటగాళ్లు కేప్ వెర్డే స్వాతంత్ర్య దినోత్సవవం రోజున స్వదేశానికి తిరిగి రావడంతో ఉత్సాహం రెట్టింపైంది. ఈ ద్వీపం పోర్చుగీసు వలస పాలన నుంచి విముక్తి పొంది 51 ఏళ్లైన సందర్భంగా ప్రజలు వేడుకలకు సిద్ధమైన రోజునే ఆ దేశ జట్టు స్వదేశానికి తిరిగొచ్చింది.
కేప్ వెర్డే ప్రపంచ కప్‌లో అడుగు పెట్టిన రోజు సాకర్ ప్రపంచ ర్యాంకింగ్‌లో ఆ దేశం 67వ స్థానంలో ఉంది. గ్రూప్ దశలో మూడు మ్యాచ్‌లను డ్రా చేసుకోవడం, ఇందులో భాగంగా తమ తొలి మ్యాచ్‌లో యూరోపియన్ చాంపియన్ స్పెయిన్‌ను 0-0తో నిలువరించడం కూడా ఉంది.
అర్జెంటీనాతో జరిగిన మ్యాచ్‌లో మెస్సీ గోల్‌తో ఈ జట్టు వెనుకబడినా పుంజుకుని 1-1తో స్కోరును సమం చేసి ఆటను అదనపు సమయానికి తీసుకెళ్లారు.
ఆ తర్వాత ఈ జట్టు మళ్లీ వెనుకబడింది. అయితే సిడ్నీ లోప్స్ కాబ్రాల్ కొట్టిన అద్భుతమైన షాట్‌తో మరోసారి స్కోరును సమం చేశారు. క్రిస్టియన్ రొమెరో హెడర్‌తో కొట్టిన బంతి డైనీ బోర్జెస్‌కు తగిలి దారి మళ్లడంతో అర్జెంటీనా తదుపరి రౌండ్‌కు అర్హత సాధించింది.
ఓడిపోయినుప్పటికీ అర్జెంటీనాను 10 నిమిషాల వ్యవధిలోనే పెనాల్టీ షూటౌట్‌లోకి నెట్టినందుకు గర్వంగా ఉందని జట్టు మేనేజర్ పెడ్రో లిటావో బ్రిస్టో చెప్పారు.
"మాది చిన్న దేశమే కావచ్చు, కానీ ప్రపంచంలోని అత్యుత్తమ జట్లతో పోటీపడగలమని నిరూపించాం. అది మాకు గర్వకారణం" అని ఆయన అన్నారు.
"మనం మన దేశ చరిత్ర సృష్టించాం. మన దేశానికి ప్రాతినిధ్యం వహించినందుకు వాళ్లు ( ఆటగాళ్లు) గర్వపడవచ్చు" అని పెట్రో తెలిపారు.
కేప్ వెర్డే ఎక్కుడుంది?
ఒకప్పటి పోర్చుగీస్ కాలనీ అయిన కేప్ వెర్డే 1975లో విదేశీ పాలన నుంచి స్వాతంత్య్రం పొందింది.
10 దీవులు, ఐదు చిన్న దీవుల సమాహారమే ఈ దేశం. వీటిలో మూడు తప్ప మిగతావన్నీ పర్వత ప్రాంతాలే. ఈ ద్వీప సమూహం ఆఫ్రికా పడమటి తీరానికి సుమారు 500 కిలోమీటర్ల దూరంలో ఉంది.
ఒకప్పుడు ఇది బానిస వ్యాపారానికి ముఖ్య కేంద్రంగా ఉండేదని చరిత్ర చెబుతోంది.
20వ శతాబ్దంలో తీవ్రమైన కరువులు 2 లక్షల మంది ప్రాణాలను బలి తీసుకున్నాయి. దీనివల్ల భారీ స్థాయిలో వలసలు జరిగాయి.
నేడు, ఈ దీవుల మూలాలున్న ప్రజలు ఎక్కువమంది దేశం బయటే నివసిస్తున్నారు.
విదేశాలలో వారు సంపాదించిన డబ్బును స్వదేశానికి పంపుతుంటారు. ఆ డబ్బే వారికి విదేశీ మారక ద్రవ్యాన్ని అందిస్తుంది.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్, ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)