రావణ్: అయిదు రోజుల్లో నాలుగు సార్లు అరెస్ట్, బెయిల్.. ఎవరీ యూట్యూబర్? పవన్‌ కల్యాణ్, చంద్రబాబులపై దూషణ కేసుల నుంచి ఉపా చట్టం ప్రయోగించే వరకు ఈ కేసుల్లో ఏం జరిగింది

    • రచయిత, గరికిపాటి ఉమాకాంత్‌
    • హోదా, బీబీసీ కోసం
  • ప్రచురణ
  • చదివే సమయం: 6 నిమిషాలు

యూట్యూబర్‌ బచ్చలకూరి జోసెఫ్‌ అలియాస్‌ ప్రశ్న రావణ్‌పై ఆంధ్రప్రదేశ్‌లోని వివిధ పోలీస్‌స్టేషన్లలో కేసులు, అరెస్టులు, బెయిల్‌ వ్యవహారం కొద్దిరోజులుగా చర్చనీయంగా మారింది.

ఈ నేపథ్యంలో రావణ్‌పై చట్ట వ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం (యూఏపీఏ–ఉపా) కింద కేసు నమోదు చేసి ఆదివారం రాత్రి న్యాయస్థానంలో హాజరుపరచగా, కోర్టు జులై 18 వరకు రిమాండ్‌ విధించినట్టు కృష్ణాజిల్లా గన్నవరం సీఐ బీ.వీ. శివప్రసాద్‌ బీబీసీకి వెల్లడించారు.

అయితే, కేవలం ప్రశ్నిస్తున్నందుకు ఉగ్రవాది తరహాలో తన భర్తపై కేసులు పెట్టారని రావణ్ భార్య అనూష ఆరోపించారు.

అసలు ఎవరీ రావణ్‌.. ఆయనపై ఎందుకు ఇన్ని కేసులు, దేశంలోనే అత్యంత కఠినమైన చట్టంగా పేర్కొనే ఉపా చట్టం కింద కేసు ఎందుకు నమోదు చేశారనే దానిపై పోలీసులు ఏం చెబుతున్నారు?

హైదరాబాద్‌లో నివాసముండే బచ్చలకూరి జోసెఫ్‌.. ప్రశ్న అనే ఓ యూట్యూబ్‌ ఛానల్‌లో రాజకీయ, సామాజిక అంశాలపై వీడియోలు చేస్తుంటారు. ప్రధానంగా ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాలు, అధికార పక్షంపై అభిప్రాయాలను వ్యక్తం చేస్తుంటారు.

కేసుల వివాదం ఎక్కడ మొదలైందంటే..

ఏలూరులో ఈ ఏడాది జూన్‌ 28న జరిగిన 'దళిత క్రైస్తవ సమర శంఖారావం' సభలో ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌పై రావణ్‌ అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ పిఠాపురానికి చెందిన జనసేన నాయకుడు బొజ్జా కుమార్‌ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

పవన్‌ను వ్యక్తిగతంగా దూషించారని, రావణ్‌పై చర్యలు తీసుకోవాలని ఆయన ఫిర్యాదులో పేర్కొన్నారు.

దీనిపై కేసు నమోదు చేసిన పిఠాపురం పోలీసులు జూన్‌ 30వ తేదీ రాత్రి హైదరాబాద్‌ వెళ్లి రావణ్‌ను అదుపులోకి తీసుకున్నారు.

జులై 1న ఫిఠాపురం పోలీసు స్టేషన్‌కు తీసుకొచ్చి విచారించి కోర్టులో హాజరుపరచగా, న్యాయస్థానం ఆ కేసులో బెయిల్‌ మంజూరు చేసింది.

వరుస ఫిర్యాదులు, అరెస్టులు.. బెయిల్‌

ఈ నేపథ్యంలో రావణ్‌పై జనసేన నేతలు రాష్ట్రంలోని వివిధ పోలీస్‌స్టేషన్లలో ఫిర్యాదు చేశారు.

రావణ్‌ తన ప్రసంగాలు, యూట్యూబ్‌ వీడియోల్లో రాజకీయ నాయకులపై వ్యక్తిగత వ్యాఖ్యలు చేయడంతో పాటు అభ్యంతరకర పదజాలం ఉపయోగిస్తున్నారని, సామాజిక ఉద్రిక్తతలకు దారితీసేలా మాట్లాడుతున్నారని, మతపరమైన భావోద్వేగాలను దెబ్బతీసే వ్యాఖ్యలు చేస్తున్నారని ఫిర్యాదులు చేశారు.

అలాగే సోషల్‌ మీడియాలో అసభ్యకర థంబ్‌నెయిల్స్, వ్యక్తిగత విమర్శలు, దూషణాత్మక వ్యాఖ్యలు చేశారని పేర్కొన్నారు.

ఈ ఫిర్యాదుల ఆధారంగా పోలీసులు కేసులు నమోదు చేశారు. ఆ క్రమంలో పిఠాపురం కేసులో బెయిల్‌ వచ్చిన కొద్దిసేపటికే కాకినాడ సర్పవరం పోలీసులు మరో కేసులో ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు.

2025లో గొల్లప్రోలు మండలంలోని ఓ పాఠశాల విద్యార్థుల మధ్య జరిగిన గొడవను కులాల మధ్య ఘర్షణగా చిత్రీకరిస్తూ వీడియో చేశారంటూ కేసు నమోదు చేశారు. ఈ కేసులో కూడా రావణ్‌కు కోర్టు బెయిల్‌ మంజూరు చేసింది.

ఆ తర్వాత మచిలీపట్నం డివిజన్‌ ఇనగుదురు పోలీసులు అదుపులోకి తీసుకుని కోర్టులో హాజరుపరచగా బెయిల్‌ మంజూరైంది.

అటు తర్వాత అనకాపల్లి జిల్లా పాయకరావుపేట పోలీసులు అరెస్టు చేసి స్థానిక కోర్టులో హాజరుపరచగా, ఆ కేసులోనూ బెయిల్‌ వచ్చింది.

మొత్తంగా అయిదు రోజుల వ్యవధిలో నాలుగు సార్లు అరెస్టు కాగా, ఆ నాలుగు కేసుల్లో కోర్టులు ఆయనకు రిమాండ్‌ నిరాకరిస్తూ బెయిల్‌ మంజూరు చేశాయి.

నిరంతరం జైలులో ఉంచాలనే కేసులు: రావణ్

అయితే, ఒక కేసులో బెయిల్‌ వచ్చిన వెంటనే మరో కేసులో అరెస్టు చేస్తూ తనను నిరంతరం జైలులోనే ఉంచాలని ప్రభుత్వం ప్రయత్నిస్తోందని రావణ్‌ ఆరోపించారు.

తనపై నమోదవుతున్న కేసులు భావ ప్రకటన స్వేచ్ఛను అణచివేసే ప్రయత్నమని రెండు రోజుల కిందట చేసిన వీడియోలో ఆయన ఆరోపించారు. రాష్ట్రంలో ప్రజా సమస్యలను పక్కనబెట్టి పోలీసులు తనపైనే దృష్టి పెట్టారని రావణ్ అన్నారు. ప్రభుత్వ తీరుకు నిరసనగా నిరాహార దీక్ష చేస్తున్నట్టు కూడా ప్రకటించారు.

మరోవైపు తనపై రాష్ట్రవ్యాప్తంగా నమోదైన అన్ని కేసులను ఒకేచోట విచారించేలా ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ రావణ్‌ హైకోర్టును ఆశ్రయించారు. వివిధ జిల్లాల్లో విడివిడిగా నమోదైన కేసులన్నింటినీ ఒకే కేసుగా పరిగణించాలని ఆయన పిటిషన్‌లో కోరారు.

అలాగే ప్రభుత్వం ఏకపక్షంగా వ్యవహరిస్తోందని ఆరోపిస్తూ, కేసుల విచారణను సీబీఐ లేదా స్వతంత్ర న్యాయపరమైన సంస్థకు అప్పగించాలని కూడా విజ్ఞప్తి చేశారు. ఈ పిటిషన్‌పై ఇంకా విచారణ జరగాల్సి ఉంది.

గన్నవరంలో ఉపా కేసు

ఈ నేపథ్యంలోనే రావణ్‌పై కృష్ణాజిల్లా గన్నవరంలో చట్ట వ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం (యూఏపీఏ–ఉపా) కింద జులై 4న కేసు నమోదైంది.

మావోయిస్టులకు అనుకూలంగా యువతను రెచ్చగొట్టేలా గతంలో రావణ్‌ వీడియోలు చేశారని, అదేవిధంగా మతపరమైన విద్వేషాలను సృష్టించేలా వీడియోలు చేశారంటూ జనసేన నేత, రోడ్డు డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ డైరెక్టర్‌ గరికిపాటి శివశంకర్‌ ఫిర్యాదు చేయడంతో ఎఫ్‌ఐఆర్‌ (క్రైం నెంబరు 188/2026) నమోదు చేసినట్టు గన్నవరం సీఐ శివప్రసాద్‌ బీబీసీకి తెలిపారు.

"రావణ్‌పై బీఎన్‌ఎస్‌ 147, 148, 192, 197(1)(డీ), 353(1) సెక్షన్లతో పాటు ఉపా చట్టంలోని సెక్షన్లు 13, 39 కింద అభియోగాలు నమోదుచేశాం. ఈ కేసు విషయమై శనివారం(జూలై 4) సాయంత్రం రావణ్‌ను అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలం వేంపాడు టోల్‌ప్లాజా వద్ద అదుపులోకి తీసుకుని, రోడ్డుమార్గాన ఆదివారం గన్నవరానికి తీసుకొచ్చాం. అరెస్టు సమాచారాన్ని ఆయన భార్య అనూషకు తెలియజేశాం. ఆదివారం రాత్రి గన్నవరంలో అదనపు జూనియర్‌ సివిల్‌ జడ్జి కోర్టులో హాజరుపరిచాం'' అని సీఐ వివరించారు.

ప్రశ్న పేరుతో రావణ్‌ చేసిన ప్రతి వీడియోలోనూ విద్వేష ప్రసంగం ఉందని పోలీసుల తరఫు న్యాయవాది, డైరెక్టర్‌ ఆఫ్‌ ప్రాసిక్యూషన్స్‌ (డీవోపీ) బైరా రామకోటేశ్వరరావు తెలిపారు. ఆదివారం రాత్రి కోర్టులో సుదీర్ఘంగా విచారణ జరిగింది.

రావణ్‌ ఇప్పటివరకు 5,100 వీడియోలను తన యూట్యూబ్‌ చానల్‌లో పోస్టు చేశారని, మావోయిస్టు నేతలు హిడ్మా, కె.సాంబయ్యను ఎన్‌కౌంటర్‌ చేసిన తర్వాత యువతను, విద్యార్థులను రెచ్చగొట్టేలా చేసిన వ్యాఖ్యల వీడియోలు కూడా వాటిలో ఉన్నాయని డీవోపీ పేర్కొన్నారు.

వారిద్దరూ చనిపోయినా మరింత మంది హిడ్మాలు, సాంబయ్యలు పుడతారని విశ్లేషణ చేశారని.. గన్నవరంలో నమోదైన కేసుకు, కాకినాడ జిల్లా సర్పవరం, పిఠాపురంలో నమోదైన కేసులకు సంబంధం లేదన్నారు.

అయితే ఆ వీడియోలన్నీ ఏఐ సృష్టేనని రావణ్‌ తరఫు న్యాయవాది జడ శ్రవణ్‌కుమార్‌ అన్నారు. వాదనల అనంతరం రావణ్‌కు ఈ నెల 18 వరకు జ్యుడీషియల్‌ రిమాండ్‌ విధిస్తూ న్యాయాధికారి గాయత్రి ఉత్తర్వులు జారీచేశారు. దీంతో పోలీసులు ఆయన్ను నెల్లూరు సెంట్రల్‌ జైలుకు తరలించారు.

రావణ్ అరెస్టు నేపథ్యంలో ఆయన భార్య అనూష పత్రికా ప్రకటన విడుదల చేశారు.

అందులో, "నా భర్తపై జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదు. అది కల్పిత వీడియో. అది సృష్టించిన వీడియో. తమ తప్పులను సమర్థించుకునేందుకు, లేని వీడియోను సృష్టిస్తూ ఈ తప్పుడు ప్రచారానికి దిగారు. వీటిని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను" అని తెలిపారు.

"సమాజంలో మంచి మార్పు రావాలని, రాజ్యాంగం ప్రకారం వ్యవస్థలు నడుచుకోవాలన్న సిద్ధాంతమే రావణ్ ది తప్ప, ఏ ఒక్కరినీ కించపరచాలని, ఎవ్వరినీ నొప్పించాలని కాదు. ఒక ప్రజాస్వామ్య వాదిగా ప్రశ్నిస్తాడు. గట్టిగానే ప్రశ్నిస్తాడు. ప్రశ్నించడం ఆయన నైజం. బాధ్యత కలిగిన వారు వాటికి సమాధానాలు ఉంటే చెప్పాలి, లేదంటే, లోపాలను సరిదిద్దుకోవాలి. అంతేకానీ, ఇలా చట్టవ్యతిరేకంగా నడుచుకోవడం అన్యాయం. కేవలం ప్రశ్నిస్తున్నందుకు ఉగ్రవాది తరహాలో కేసులు పెట్టడం దారుణం'' అని అనూష చెప్పారు.

రావణ్‌కి పోలీసులతో పాటు, కోర్టులంటే కూడా లెక్కలేకుండా ఉందని, అన్నిచోట్లా బెయిల్‌ రాగానే తన హావభావ విన్యాసాలతో మరింత రెచ్చగొట్టేలా వ్యవహరించారని ఫిర్యాదుదారు జనసేన నాయకుడు శివశంకర్‌ బీబీసీతో అన్నారు.

అందుకే తాను గతంలో రావణ్‌ చేసిన వీడియోలన్నీ పరిశీలిస్తే.. ప్రతి వీడియోలోనూ విద్వేష ప్రసంగాలే ఉన్నాయని, దేశభద్రతకు ముప్పు వాటిల్లేలా చేసిన వ్యాఖ్యలపై ఫిర్యాదు చేశానని చెప్పారు.

ఓ వీడియోలో 'నేను దేశభక్తుడిని కాను.. నాకు దేశమంటే భక్తి లేదు. కరెక్ట్‌గానే వింటున్నారు. నాకు దేశమంటే భక్తి లేదు.. నేను దేశభక్తుడిని కాను' అని రావణ్‌ అన్నారనీ, అలాగే మరో వీడియోలో ఉగ్రవాదులకు మానవ హక్కులు ఉండవా? ప్రపంచంలో ప్రతి మనిషికీ మానవహక్కులు ఉంటాయని, ఇంకో వీడియోలో సనాతనంపై దారుణమైన వ్యాఖ్యలు చేశారని, ఇవన్నీ సోషల్‌ మీడియాలో ఇంకా ఉన్నాయని, అతను వందశాతం ఉపా కేసుకు అర్హుడని శివశంకర్‌ అన్నారు.

అయితే, అవన్నీ ఏఐతో చేసిన ఫేక్‌ వీడియోలని న్యాయవాది జడ శ్రవణ్‌ మీడియాతో అన్నారు.

"రావణ్‌ ఏ అంశంపైనా మాట్లాడొచ్చు. భావవ్యక్తీకరణ స్వేచ్ఛ అతనికి ఉంది. అందులో తప్పు లేదు. కానీ ఆయన మాట్లాడే భాష, వ్యక్తీకరణ మాత్రం సరిగ్గా లేదు. అది అభ్యంతరకరమే. కానీ, దానికే ప్రభుత్వం ఉపా కేసు నమోదు చేయడం అన్యాయం" అని సీనియర్‌ జర్నలిస్టు ఉషా ఎజ్‌ డానీ అభిప్రాయపడ్డారు.

"ఉగ్రవాదులపై ప్రయోగించాల్సిన ఆ చట్టాన్ని ఇలా వాడుతూ పోతే చివరికి పాలకపక్షాలను విమర్శించే సామాన్య మానవులపై కూడా ప్రయోగించేస్తారు. అందరూ దీన్ని ఖండించాల్సిన అవసరం ఉంది" అని డానీ బీబీసీతో అన్నారు.

ప్రభుత్వ ప్రతీకారంలో భాగంగానే కేసులు: విరసం

"రాజ్యాలు తమకు వ్యతిరేకంగా ఉండే వారిపై ఉపా కేసులు పెడుతూ వస్తుంటాయి. 2022లో మాపై తెలంగాణ ప్రభుత్వం ఉపా కేసు నమోదు చేసింది. ఇది చాలా తీవ్రమైన కేసు, బెయిల్‌ తొందరగా రాదు" అని గతంలో ఉపా కేసు నమోదైన విప్లవ రచయితల సంఘం(విరసం) తెలుగు రాష్ట్రాల అధ్యక్షుడు అరసవల్లి కృష్ణ బీబీసీతో అన్నారు.

రావణ్‌పై ఉపా కేసు పెట్టాల్సిన పరిస్థితే లేదని, ఆయనకు ఎక్కడా ఉగ్రవాదులతో సంబంధం లేదని, రుజువులు కూడా లేవని అభిప్రాయపడ్డారు. పాలకులను గట్టిగా విమర్శిస్తే ఉపా వంటి తీవ్రమైన కేసు పెట్టడం దారుణమన్నారు.

ఉపా చట్టాన్ని కేంద్ర ప్రభుత్వం 1967లో తీసుకువచ్చిందనీ, దేశాన్ని విభజించే కుట్రలు, ఉగ్రవాద కార్యకలాపాలను అరికట్టేందుకు ఈ చట్టం తీసుకువచ్చినట్టు అప్పట్లో పాలకులు చెప్పినట్లు అరసవల్లి కృష్ణ అన్నారు. అయితే, తర్వాతి కాలంలో రాజ్యానికి(పాలకులకు) వ్యతిరేకంగా చర్యలకు దిగే వారిపై కేసులు నమోదు చేసేవారనీ, చివరికి ఓ యూట్యూబర్‌పై కేసులు పెట్టే పరిస్థితికి పాలకులు దిగజారిపోయారని ఆయన అన్నారు.

భావప్రకటనా స్వేచ్ఛను అడ్డుకునేందుకే ఉపా చట్టం పేరిట తప్పుడు కేసులు పెట్టారని పౌరహక్కుల సంఘం ఆంధ్రప్రదేశ్‌ అధ్యక్షుడు చిట్టిబాబు ఆరోపించారు.

కాగా, రావణ్‌ అరెస్టును సినీనటుడు ప్రకాష్‌ రాజ్ సోషల్‌మీడియా వేదికగా ఖండించారు. ఆయన విడుదల చేసిన ఒక వీడియోలో, "ఓ యూట్యూబర్‌పై ఉపా కేసు పెట్టి రిమాండ్‌లోకి పంపిస్తారా, యువరాజును ప్రశ్నిస్తే దేశద్రోహం వెరీగుడ్‌.. ఇది ప్రశ్నించే గొంతులను నొక్కడానికి మీరు చేసే కుట్రలని అందరికీ అర్థమైంది" అన్నారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,  ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)