You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
'నా భర్త చాలా క్రూరుడు', పాకిస్తాన్‌లో ఫ్రెంచ్ మహిళను, ఆమె పిల్లలను రెస్క్యూ చేసిన పోలీసులు
- రచయిత, మొహమ్మద్ జుబేర్ ఖాన్, అజీజుల్లా ఖాన్
- హోదా, బీబీసీ ఉర్దూ ప్రతినిధులు
- ప్రచురణ
- చదివే సమయం: 3 నిమిషాలు
భార్య, పిల్లలను పదేళ్లకు పైగా ఇంట్లోనే బంధించి, హింసించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఒక వ్యక్తిని పాకిస్తాన్ పోలీసులు అరెస్ట్ చేశారు.
ఫ్రెంచ్ పౌరురాలైన సిల్వీ యాస్మినా.. తన భర్త ప్రతిరోజూ తమను శారీరకంగా, మానసికంగా వేధించేవారని, ఆయన 'చాలా క్రూరుడు' అని చెప్పినట్లు స్థానిక పోలీసులు బీబీసీ ఉర్దూకు తెలిపారు.
వారి కొడుకుల్లో ఒకరు రహస్యంగా బయటకు వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో.. పర్వత ప్రాంతమైన ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రావిన్స్‌లోని బారా అనే మారుమూల గ్రామంలో ఉన్న వారి ఇంటిపై పోలీసులు దాడి చేశారు.
ఒంటిపై గాయాలతో ఉన్న యాస్మినాను, ఆమె ఐదుగురు పిల్లలను ఒక ఇరుకైన, "అత్యంత అధ్వానంగా ఉన్న గది"లో పోలీసులు గుర్తించారు.
యాస్మినాను, పిల్లలను పెషావర్‌లోని మహిళల ఆశ్రయానికి తరలించారు. వారు తిరిగి ఫ్రాన్స్ వెళ్లిపోవాలని అనుకుంటున్నట్లు పోలీసులు చెప్పారు.
54 ఏళ్ల యాస్మినా తెలిపిన వివరాల ప్రకారం, 2014లో ఆస్ట్రేలియా నుంచి పాకిస్తాన్ వచ్చినప్పటి నుంచి భర్త వారిని బందీలుగా ఉంచారు.
"బాధితురాలు చెప్పిన దాని ప్రకారం, ఎవరినీ కలవడానికి ఆమెకు అనుమతి లేదు. వారి పెద్ద పిల్లలిద్దరూ చదువు కోల్పోయారు. చిన్న పిల్లలు ముగ్గురూ పాకిస్తాన్‌లోనే జన్మించారు, వారు అసలు బడికే వెళ్లలేదు" అని ఒక ఉన్నతాధికారి బీబీసీ ఉర్దూతో పేర్కొన్నారు.
అసలు ఎలా పరిచయమయ్యారు?
యాస్మినా భర్త పాకిస్తాన్ పౌరుడు. వారు కలుసుకున్న సమయంలో ఆయన ఆస్ట్రేలియాలో 'అక్రమంగా నివసిస్తున్నట్లు' అధికారులు తెలిపారు. అయితే ఆయన వివరాలను ఇంకా వెల్లడించలేదు.
వారు 2003లో వివాహం చేసుకున్నారు. 2014లో ఇద్దరు పెద్ద పిల్లలతో కలిసి పాకిస్తాన్ వచ్చే వరకు ఆస్ట్రేలియాలోనే ఉన్నారు. అప్పటి నుంచి తనకు బయటి ప్రపంచంతో ఎలాంటి సంబంధాలు లేవని యాస్మినా పేర్కొన్నారు.
"మాకు స్వేచ్ఛ లేకుండా చేశారు. ఒక భర్తగా, నా పిల్లల తండ్రిగా ఆయన మమ్మల్ని సరిగ్గా చూసుకోలేదు. ప్రతిరోజూ మమ్మల్ని కొడుతూ, మమ్మల్ని తీవ్రంగా ఒత్తిడికి గురిచేశారు" అని పోలీసులకు ఇచ్చిన వాంగ్మూలంలో యాస్మినా రాసినట్లు స్థానిక మీడియా రిపోర్ట్ చేసింది.
"నా భవిష్యత్తు ఇప్పటికే నాశనమైపోయిందని అర్థమైంది, పిల్లల భవిష్యత్తు కూడా ఇలాగే ముగిసిపోతుందని భయపడ్డాను" అని ఆమె అన్నారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్, ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)