సరుకులు కొనుక్కుని తిరిగివస్తున్న తల్లీకూతుళ్లను కిడ్నాప్ చేశారు... 24 ఏళ్లపాటు వేరే దేశంలో ఉండిపోయిన కుమార్తె... అసలేం జరిగింది, ఎవరు కిడ్నాప్ చేశారు?

జపాన్, ఉత్తర కొరియా, అమెరికా, వియత్నాం యుద్ధం, హిటోమి సోగా

ఫొటో సోర్స్, Hitomi Soga

ఫొటో క్యాప్షన్, హిటోమి సోగాఆమె భర్త చార్లెస్‌ల పాత ఫోటో
    • రచయిత, బెక్కా జోన్స్
    • హోదా, బీబీసీ ప్రతినిధి
  • ప్రచురణ
  • చదివే సమయం: 7 నిమిషాలు

జపాన్‌లోని సాదో ద్వీపం.. ఒక ఆహ్లాదకరమైన ఆగస్టు నెల సాయంత్రం .. 19 ఏళ్ల హిటోమి సోగా జీవితం శాశ్వతంగా మారిపోయింది.

ఆమె తన తల్లితో కలిసి సరకులు కొనడానికి వెళ్లి కొద్ది దూరం నడిచిన తర్వాత ఇద్దరూ ఇంటికి తిరిగొస్తున్నారు.

అకస్మాత్తుగా ముగ్గురు వెనుక నుంచి వచ్చి తల్లీకూతుళ్లను కిడ్నాప్ చేశారు.

"మా నోటిపై ఏదో పెట్టారు. ఆ తర్వాత మా తలలకు ఒక రకమైన సంచిని తొడిగారు" అని సోగా గుర్తు చేసుకున్నారు.

తర్వాతి కొన్ని రోజులు గందరగోళంగా గడిచిపోయాయి. మొదట వాళ్లను తీరం నుంచి స్పీడ్‌బోట్‌లోకి, ఆ తర్వాత ఒక పెద్ద నౌకలోకి తీసుకువెళ్లారు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

అపహరణకు గురైన తరువాత తనకు తల్లితో మాట్లాడే అవకాశం ఎప్పుడూ రాలేదని సోగా చెప్పారు.

తన తల్లి ఉదారమైన, తెలివైన, ప్రేమించే మహిళ అని సోగా గుర్తు చేసుకున్నారు.

"నేను చివరిసారి మా అమ్మతో ఉన్న సమయంలో ఏమీ మాట్లాడలేకపోయాను" అని ఆమె చెప్పారు.

కొన్ని రోజుల తర్వాత కళ్లకు కట్టిన గంతలను తీసేశారు. అప్పుడు ఆమె "ఇది జపాన్ కాదు" అని అనుకున్నారు.

ఆమెను ఉత్తర కొరియా తీసుకెళ్లారు.

1970, 80ల కాలంలో ప్రభుత్వ అండదండలతో రహస్యంగా చేపట్టిన అపహరణల్లో సోగాను తీసుకువెళ్లారు.

ఆ తర్వాత ఆమె 24 ఏళ్లు ఉత్తర కొరియాలో ఉన్నారు.

జపాన్, ఉత్తర కొరియా, అమెరికా, వియత్నాం యుద్ధం, హిటోమి సోగా

ఫొటో సోర్స్, National Police Agency, Japan

ఫొటో క్యాప్షన్, అపహరణకు గురైనప్పటి నుంచి ఇప్పటివరకు సోగా తన తల్లిని చూడలేకపోయారు.

మిలటరీ క్యాంపులో రెండేళ్లు

ఉత్తర కొరియా అధికారులు తాము కిడ్నాప్ చేసిన జపనీయుల్ని 'లివింగ్ టెక్స్ట్‌బుక్స్'గా భావించారు. వారి ద్వారా తమ గూఢచారులు జపాన్ భాష, ఆచార వ్యవహారాల్ని నేర్చుకుని జపాన్‌లో చొరబడవచ్చని అనుకున్నారనేది ఒక సిద్ధాంతం.

ఇలా 1977 నుంచి 1983 మధ్య 17 మంది కిడ్నాప్‌కు గురైనట్లు జపాన్ గుర్తించింది. అయితే ఈ సంఖ్య ఇంకా ఎక్కువగా ఉండవచ్చని అంచనా.

"నన్ను ఉద్దేశపూర్వకంగా లక్ష్యంగా చేసుకున్నారో లేక అది అనుకోకుండా జరిగిందో నాకు ఇప్పటికీ తెలియదు" అని సోగా అన్నారు.

ఆమెను మొదటి రెండేళ్లు సైనిక శిబిరంలో ఉంచారు. తన తల్లి ఎక్కడ ఉందో ఆమెకు తెలియదు. తనను ఎందుకు తీసుకువచ్చారని కూడా ఆమె వాళ్లను ఎప్పుడూ అడగలేదు. ఒకవేళ అడిగినా వాళ్లు నిజం చెప్పరని భావించినట్లు సోగా తెలిపారు.

"నేను బ్యారక్‌ల నుంచి బయటకెళ్లి అకాశం, చంద్రుడు, నక్షత్రాలను చూస్తూ జపాన్‌లో ఉన్న నా కుటుంబం గురించి ఆలోచిస్తూ వారిని మళ్లీ ఎప్పుడు చూస్తానో అని తలచుకుని ఏడ్చేదానిని" అని ఆమె చెప్పారు.

భయం, ఒంటరితనం ఉన్నప్పటికీ ఏదో ఒక రోజు తనకు స్వేచ్ఛ లభిస్తుందనే ఆశ నిలుపుకోవడానికి ప్రయత్నించారు.

"నేను ఆ విషయాన్ని ఎప్పుడూ నాలోనే దాచుకున్నాను. ఇదంతా ముగిసిపోవాలని ఆశించాను. ఆ ఆశ ఎన్నడూ పోలేదు" అని సోగా చెప్పారు.

జపాన్, ఉత్తర కొరియా, అమెరికా, వియత్నాం యుద్ధం, హిటోమి సోగా

ఫొటో సోర్స్, National Police Agency, Japan

ఫొటో క్యాప్షన్, సోగా అపహరణకు గురైన తర్వాత జపాన్ పోలీసులు ఆమె బ్లాక్ అండ్ వైట్ ఫోటో విడుదల చేశారు.

‘అమెరికా సైనికుడితో బలవంతపు పెళ్లి’

చివరకు 1980లో బ్యారక్‌లను వదిలి వెళ్లేందుకు సోగాకు అనుమతి లభించింది.

ఆమె ఇంతకు ముందు ఎన్నడూ కలవని వ్యక్తిని పెళ్లి చేసుకోవాల్సి వచ్చిందని ఆమె చెప్పారు.

అమెరికన్ సైనికుడు చార్లెస్ జెంకిన్స్ 1965లో డీ మిలిటరైజ్ జోన్ దాటి ఉత్తర కొరియాకు పారిపోయి వచ్చారు.

తనను వియత్నాంలో యుద్ధం చేసేందుకు పంపుతారని ఆయన భావించారు. తాను ఉత్తర కొరియాలో లొంగిపోతే తనను అక్కడ నుంచి అమెరికా పంపిస్తారని అనుకున్నారు.

అమెరికా, ఉత్తర కొరియా శత్రువులైనప్పటికీ.. జపాన్, అమెరికా ఒకటేనంటూ ఉత్తర కొరియా ప్రచారం చేస్తూ వచ్చింది.

"మేం తొలిసారి కలుసుకున్న రోజు నాకు గుర్తుంది. అప్పుడు బాగా వర్షం కురుస్తోంది. నేను చాలా ఆందోళనగా, కంగారుపడుతూ ఉన్నాను" అని సోగా గుర్తు చేసుకున్నారు.

జెంకిన్స్‌ను పెళ్లి చేసుకోవాలని ఆమె కోరుకోనప్పటికీ పెళ్లయిన తరువాత కాలక్రమంలో ఆమె తన భర్తను గాఢంగా ప్రేమించారు.

వారికి ఇద్దరు కుమార్తెలు. జెంకిన్స్ వారి కోసం బొమ్మలు, చిన్నచిన్న వస్తువులు తయారు చేసేవారు.

"అదంతా చాలా సహజంగా అనిపించడం మొదలైంది. పిల్లలు పుట్టిన తర్వాతి రోజులు నా జీవితంలో చాలా సంతోషకరమైనమవి" అని సోగా గుర్తు చేసుకున్నారు

"పిల్లలను నా భర్త ప్రేమగా చూసుకునేవారు. వారిపై ఆయనకు చాలా శ్రద్ధ ఉండేది. ఆయనలో నాకు అన్నిటికన్నా ఎక్కువగా నచ్చింది అదే" అని ఆమె చెప్పారు.

జపాన్, ఉత్తర కొరియా, అమెరికా, వియత్నాం యుద్ధం, హిటోమి సోగా,  కిడ్నాపింగ్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, చార్లెస్ జింకెన్స్ తన భార్య కుమార్తెలతో కలిసి 2004 జులై 18న టోక్యోలోని హనెడా విమానాశ్రయానికి చేరుకున్నారు.

ఆంక్షల మధ్య జీవితం

ఆ దంపతులకు అధికారికంగా జీతం వచ్చే ఉద్యోగం ఏదీ లేదు.

ఉత్తర కొరియాలో కఠినమైన ఆంక్షలు, నిఘా మధ్య వారు జీవించాల్సి వచ్చింది. చివరకు వారు తమ సమయం ఎలా గడపాలనే విషయంలోనూ తీవ్రమైన ఆంక్షలు ఉండేవి.

కూరగాయల మొక్కలు పెంచుతూ తాను సమయం గడిపేదాన్నని సోగా చెప్పారు.

"మ్యూజిక్ కన్సర్ట్‌లు సినిమాలు లేవు. వినోదం ఏమీ ఉండేది కాదు. రోజంతా భయం, ఆందోళన. కుటుంబం తోడుగా ఉండటంతో నాకు కొంత ఊరట లభించింది" అని ఆమె అన్నారు.

2002లో ఆమె జీవితం హఠాత్తుగా మారిపోయింది. అప్పుడు సోగా అపహరణ వెనుక ఉన్న నిజం ప్రపంచానికి తెలిసింది.

జపాన్, ఉత్తర కొరియా సంబంధాల పునరుద్ధరణ కోసం శిఖరాగ్ర సమావేశం జరిగింది.

జపాన్‌లో కిడ్నాపైనట్లు అనుమానించిన 17 మందిలో 13 మందిని ఉత్తర కొరియా కిడ్నాప్ చేసిందని ఆ సమావేశంలో అప్పటి ఉత్తర కొరియా సర్వోన్నత నాయకుడు కిమ్ జోంగ్-ఇల్ అంగీకరించారు.

వారిలో ఐదుగురు మాత్రమే బతికి ఉన్నారని అధికారులు తెలిపారు. సోగా తల్లి మియోషి ఉత్తర కొరియాకు చేరుకున్నారో లేదో కూడా వారు ధ్రువీకరించలేదు.

కొన్ని రోజుల తర్వాత తాను జపాన్ వెళ్లి రావడానికి అనుమతి లభిస్తుందని సోగా తెలుసుకున్నారు.

"జపాన్‌లో నా కుటుంబాన్ని చూడాలన్న ఆలోచన తప్ప నా మనసులో ఇంకేమీ లేదు" అని ఆమె చెప్పారు.

"బహుశా మా అమ్మను మళ్లీ కలిసే అవకాశం లభిస్తుందేమో అని నాకు అనిపించింది" అని సోగా అన్నారు.

జపాన్, ఉత్తర కొరియా, అమెరికా, వియత్నాం యుద్ధం, హిటోమి సోగా,  కిడ్నాపింగ్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, హిటోమి జపాన్ తిరిగొచ్చిన తర్వాత రెండేళ్ల పాటు కుమార్తెలకు దూరంగా ఉన్నారు.

కుటుంబాన్ని చూసేందుకు జపాన్‌కు ప్రయాణం

ఉత్తర కొరియాలో భర్త, కుమార్తెలకు వీడ్కోలు చెప్పిన సోగా జపాన్‌ వెళ్లేందుకు విమానం ఎక్కారు.

జపాన్‌లో ఉంటున్న తన అక్క, తండ్రిని కలవడానికి ఆమె బయల్దేరారు. ఆమె రాక కోసం ఆమె కుటుంబం 20 ఏళ్లకు పైగా ఎదురు చూసింది. సోగా బతికే ఉన్నారో లేదో కూడా వారికి తెలియదు.

"మళ్లీ కలుసుకుని ఒకరినొకరు కౌగిలించుకున్నప్పుడు, మేమందరం ఏడ్చాం" అని సోగా అన్నారు.

సోగా జపాన్‌లోనే ఉండిపోవాలని నిర్ణయించుకున్నారు. భర్త, కుమార్తెలను తిరిగి కలుసుకోవడానికి ఆమెకు రెండేళ్లు పట్టింది.

తాను జపాన్ వెళితే అమెరికన్ సైన్యం తనను అరెస్ట్ చేస్తుందేమోనని చార్లెస్ భయపడ్డారు.

అధికారుల మధ్య చర్చలు, రాజీ మార్గంలో ఈ సమస్య పరిష్కారమైంది. పారిపోవడం, శత్రువుకు సాయపడటం గురించి తాను చేసిన నేరాలను చార్లెస్ జెంకిన్స్ అంగీకరించారు.

ఆయనకు 30 రోజుల జైలు శిక్ష విధించడంతో 25 రోజులు జైలులో ఉన్నారు

2004లో, ఆ కుటుంబం మొత్తం జపాన్‌లో సాదో ద్వీపంలో శాశ్వతంగా జీవించేందుకు అనుమతి లభించింది.

"నా కూతుళ్లు ఇంతకు ముందెన్నడు సాదో ద్వీపానికి వెళ్లలేదు" అని సోగా చెప్పారు.

జపాన్, ఉత్తర కొరియా, అమెరికా, వియత్నాం యుద్ధం, హిటోమి సోగా,  కిడ్నాపింగ్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, జపాాన్‌లో కిడ్నాపై ఆచూకీ దొరకని వారి కోసం సోగా ప్రయత్నిస్తున్నారు. ఈ ఫోటోలో ఆమె (ఎడమ నుంచి రెండో వ్యక్తి ) తన తల్లి ఫోటో పట్టుకుని ఉన్నారు.

కిడ్నాపైన వారిని రక్షించే ఆపరేషన్

జెంకిన్స్ 2017లో జపాన్‌లో మరణించారు. ఆ తర్వాత సోగా జపాన్‌లో కిడ్నాపైన వారిని తీసుకొచ్చే కార్యక్రమంలో చురుగ్గా పని చేస్తూ వచ్చారు.

జపాన్‌లో కిడ్నాపై ఇప్పటికీ ఉత్తర కొరియాలో చిక్కుకుపోయిన వారికి "ప్రతి రోజూ విలువైనదే" అని ఆమె చెప్పారు

అపహరణకు గురైనవారిలో ఏ మాత్రం ఆశ వదులుకోని వ్యక్తి ఒక్కరే ఉన్నారు. ఆమె తల్లి మియోషి

తన తల్లి ఎక్కడ ఉన్నా, తన సంకల్పం ఆమెకు కూడా స్ఫూర్తిగా నిలుస్తుందని ఆమె భావిస్తున్నారు.

"నా కుమార్తె పోరాడుతూ, ఎప్పటికీ పోరాడుతూ ఉంటే, నేను కూడా పోరాడతాను అని ఆమె అనుకుంటుందని నాకు అనిపిస్తూ ఉంటుంది" అని సోగా చెప్పారు.

(బీబీసీ వరల్డ్ సర్వీస్ 'అవుట్‌లుక్' కార్యక్రమంలో ఒక ఎపిసోడ్ ఆధారంగా రాసిన కథనం)

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,  ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)