'హిందువుల' గురించి పాకిస్తాన్ అధ్యక్షుడు ఆసిఫ్ అలీ జర్దారీ ఏమన్నారు? జావేద్ అక్తర్ ఎందుకు ఎగతాళి చేశారు?

ఫొటో సోర్స్, Jeff Zelevansky/Getty Images
భారత ప్రజలు "యునైటెడ్ ఇండియా"ను విశ్విసిస్తే, పాక్ ముస్లింలు సహనాన్ని విశ్వసిస్తారని పాకిస్తాన్ అధ్యక్షుడు ఆసిఫ్ అలీ జర్దారీ వ్యాఖ్యానించారు.
పాకిస్తాన్‌లో నివసిస్తున్న హిందూ సమాజం గురించి కూడా ఆయన మాట్లాడారు.
పాకిస్తాన్‌లో సుమారు 4 శాతం హిందూ జనాభా ఉందని, వారికి కూడా ఇతర ప్రజల మాదిరిగానే స్వేచ్ఛ ఉందని పేర్కొన్నారు.
ఆయన వ్యాఖ్యల్ని బాలీవుడ్ గేయ రచయిత జావేద్ అక్తర్ "మిస్టర్ 10 పర్సెంట్" అంటూ ఎద్దేవా చేశారు.
పాకిస్తాన్‌లో హిందువుల జనాభా నిరంతరం తగ్గిపోతోందని సోషల్ మీడియాలో చాలామంది పేర్కొన్నారు.


ఫొటో సోర్స్, Getty Images
జర్దారీ ప్రకటనపై జావేద్ అక్తర్ ఏమన్నారు?
పాకిస్తాన్ స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆగస్టు 14న జరిగిన ఒక కార్యక్రమంలో అధ్యక్షుడు ఆసిఫ్ అలీ జర్దారీ ప్రసంగించారు.
ఈ సందర్భంగా ఆయన యునైటెడ్ ఇండియా, పాకిస్తాన్‌లో హిందూ జనాభా గురించి మాట్లాడారు.
"భారతీయులకు భిన్నమైన దృక్పథం ఉంది. వారికి వారి సొంత ఆలోచనా విధానం, వారి సొంత అజెండా ఉన్నాయి. భారతీయులు ఐక్యతను విశ్వసిస్తారు. కానీ మేము ముస్లింలం. వారు కాదు. కానీ మేము సహనం ఉన్న ముస్లింలం" అని జర్దారీ అన్నారు.
"పాకిస్తాన్‌లో 4 శాతం హిందూ జనాభా ఉంది. వారు ఇక్కడ కూడా ఇతర చోట్ల ఉన్నంత స్వేచ్ఛగా ఉన్నారు. వారు భారత్ కంటే మాతో కలిసి జీవించడానికి ఇష్టపడతారు" అని జర్దారీ తన ప్రసంగంలో వ్యాఖ్యానించారు.
జర్దారీ ప్రకటనపై స్పందించిన జావేద్ అక్తర్ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఎక్స్‌లో ఒక పోస్ట్ పెట్టారు.
"బెనజీర్ భుట్టోను వివాహం చేసుకున్న తర్వాత వెలుగులోకి వచ్చిన పాకిస్తానీ వ్యక్తి అయిన జర్దారీ గారు, తమ దేశం 3-4 శాతం హిందూ జనాభా పట్ల సహనంతో ఉందని అంటున్నారు. జర్దారీ గారూ 10 శాతం కంటే తక్కువ ఉన్న వారి పట్ల మీరు సహనంతో లేరనని నేను భావిస్తున్నాను" అని జావెద్ అక్తర్ తన పోస్టులో రాశారు.

ఫొటో సోర్స్, AAMIR QURESHI/AFP via Getty Images
జావెేద్ అక్తర్ ' మిస్టర్ 10 పర్సంట్' అని ఎందుకు ప్రస్తావించారు?
జావేద్ అక్తర్ పోస్ట్‌లో '10 శాతం' ప్రస్తావనను ఆసిఫ్ అలీ జర్దారీ రాజకీయాల్లోకి వచ్చిన పాత రోజులకు ముడిపెట్టారు.
బెనజీర్ భుట్టో మరణానికి ముందే జర్దారీ పబ్లిక్ ఇమేజ్ వివాదాస్పదంగా ఉండేది. 2008 ఫిబ్రవరిలో జరిగిన పాకిస్తాన్ జాతీయ ఎన్నికల ప్రచార సమయంలో పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ ఆయన సభలను తగ్గించేందుకు ప్రయత్నించింది.
ఆ సమయంలో జర్దారీ పార్టీకి భారంగా మారారు. అవినీతి ఆరోపణల కేసులో జైలులో గడిపారు.
కమీషన్లు, లంచాలు తీసుకున్నారని ఆరోపణలు రావడంతో ప్రత్యర్థులు ఆయన్ని 'మిస్టర్ 10 పర్సెంట్' అని పిలిచారు.
1990లో జర్దారీ మరో వివాదంలో చిక్కుకున్నారు. ఒక వ్యాపారవేత్త కాలికి రిమోట్ కంట్రోల్ బాంబు కట్టి బ్యాంకుకు పంపారని ఆయనపై ఆరోపణలు వచ్చాయి.
బ్యాంకు ఖాతా నుంచి డబ్బులు విత్ డ్రా చేసుకోవాలని ఓ వ్యాపారవేత్తను ఆయన ఒత్తిడి చేశారన్నది ఆరోపణ.
జర్దారీపై వచ్చిన ఈ ఆరోపణలు నిరూపణ కాలేదు. బెనజీర్ భుట్టో రాజకీయ ప్రతిష్ఠను దెబ్బతీయడం కోసం జర్దారీని అప్రతిష్ఠ పాలు చేసేందుకు ఐఎస్ఐ ప్రయత్నిస్తోందని పీపీపీ ఆరోపించింది.

ఫొటో సోర్స్, ASIF HASSAN/AFP via Getty Image
పాకిస్తాన్‌లో హిందూ జనాభా
పాకిస్తాన్ అధ్యక్షుడి వాదన ఆధారంగా పాకిస్తాన్‌లో హిందువుల జనాభా తగ్గుతోందని భారతదేశంలోని కొందరు వ్యక్తులు పేర్కొన్నారు.
జర్దారీ వీడియోను ఎక్స్‌లో సీఎన్ఎన్ న్యూస్ 18 ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ నబీలా జమాల్ పోస్ట్ చేశారు.
"పాకిస్తాన్ సొంత జనాభా లెక్కల డేటా దాని జనాభా గురించి భిన్నమైన చిత్రాన్ని చూపిస్తుంది: 1947లో దాని జనాభాలో హిందువులు సుమారు 14.6శాతం ఉండగా, 2023 జనాభా లెక్కల ప్రకారం అది 2.17శాతానికి తగ్గింది" అని ఆమె ఆ వీడియో కింద రాశారు.
పాకిస్తాన్ ప్రభుత్వ గణాంకాల ప్రకారం అక్కడ హిందూ జనాభా సుమారు 55 లక్షలు. అయితే, పాకిస్తాన్ హిందూ పంచాయత్, హిందూ కౌన్సిల్ పాక్‌లో 80 లక్షల మంది హిందువులున్నారని చెబుతున్నాయి. హిందువుల్లో ఎక్కువ మంది సింధ్ ప్రావిన్స్‌లో నివసిస్తున్నారు.
పాకిస్తాన్‌లోని హిందూ జనాభాలో 90 శాతం మంది సింధ్‌లోని 10 జిల్లాల్లో నివసిస్తున్నారు. పంజాబ్‌లో రెండున్నర లక్షల మంది, బలూచిస్తాన్‌లో 60 వేల మంది, ఖైబర్ పఖ్తూన్‌ఖ్వాలో సుమారు 6వేల మంది హిందువులు ఉన్నారని పాకిస్తాన్‌లోని సీనియర్ జర్నలిస్ట్ వసుతుల్లా ఖాన్ చెబుతున్నారు.
పాకిస్తాన్‌లో దైవ దూషణ చట్టాలపై మానవ హక్కుల సంస్థ ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ దృష్టి పెట్టింది.
ఈ చట్టాల్లో స్పష్టత లేదని, మైనారిటీలను మతపరంగా వేధించడానికి పోలీసులు, కోర్టులు వీటిని ఏకపక్షంగా అమలు చేస్తున్నాయని ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ ఆరోపిస్తోంది.
ఈ చట్టాలు వివక్షకు దారి తీస్తున్నాయనేది మానవ హక్కుల సంస్థ వాదన.
తాము సామాజిక, మతపరమైన వివక్ష ఎదుర్కొంటున్నామని కొన్ని రోజుల కిందట పాక్ నుంచి భారత్‌కు వలస వచ్చిన హిందువులు బీబీసీతో చెప్పారు
ముఖ్యంగా సింధ్ రాష్ట్రంలో హిందూ బాలికలను లక్ష్యంగా చేసుకుంటున్నారనే ఆరోపణలు ఉన్నాయి.

ఫొటో సోర్స్, AHMAD GHARABLI/AFP via Getty Images
భారత్ పై పాక్ ప్రధాని ఏం వ్యాఖ్యానించారు
ఒక పక్క అధ్యక్షుడి వ్యాఖ్యలపై చర్చ జరుగుతుండగానే, పాకిస్తాన్ ప్రధానమంత్రి షాబాజ్ షరీఫ్ కూడా భారత్ మీద వ్యాఖ్యలు చేశారు.
సింధు జలాల గురించి మాట్లాడిన ఆయన, పాకిస్తాన్‌లోని ప్రతి నీటి చుక్కా తమ దేశానికి ఒక 'రెడ్ లైన్' అని, దీనిని భారత్ గౌరవించకపోతే ప్రతిస్పందనను ఎదుర్కోవాల్సి వస్తుందని ఆయన హెచ్చరించారు.
గురువారంనాడు ఇస్లామాబాద్‌లోని 'విక్టరీ మాన్యుమెంట్' ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న షాబాజ్ షరీఫ్ ఈ వ్యాఖ్యలు చేశారు.
పాకిస్తాన్ శాంతిని కోరుకుంటుందని ఆయన అన్నారు. ''మాకు యుద్ధం వద్దు. అయితే, శాంతిని కోరుకోవడం బలహీనతగా భావించకూడదు" అని అన్నారు.
2025 ఏప్రిల్‌లో జరిగిన పహల్గాం దాడికి పాకిస్తాన్‌ను బాధ్యురాలిగా పేర్కొంటూ భారత ప్రభుత్వం సింధు జలాల ఒప్పందాన్ని నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది.
అమెరికా, ఇరాన్‌ల మధ్య ఉన్న వివాదాలతోపాటు, సౌదీ అరేబియా, తుర్కియేలతో కుదిరిన ఒప్పందాలను కూడా షాబాజ్ షరీఫ్ ఈ ప్రసంగంలో ప్రస్తావించారు.
అన్ని రకాల సంఘర్షణల నుంచి ప్రపంచం విముక్తి పొందాలని పాకిస్తాన్ కోరుకుంటుందని, కొత్త సంఘర్షణలు తలెత్తకుండా నిరోధించడానికి కృషి చేస్తోందని ఆయన పేర్కొన్నారు.
ఈ కారణంగానే ఇరాన్-అమెరికాల మధ్య తాము మధ్యవర్తిత్వం వహించినట్లు షరీఫ్ చెప్పారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్, ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)




























