‘జెట్ స్కీ బోల్తా పడటంతో ఇద్దరు పిల్లలు, తండ్రి 16 గంటలు సముద్రంలో చిక్కుకుపోయారు’

ఫొటో సోర్స్, Koh Samui, Thailand
- రచయిత, జాకబ్ ఫిలిప్స్
- హోదా, బీబీసీ ప్రతినిధి
- ప్రచురణ
- చదివే సమయం: 3 నిమిషాలు
థాయిలాండ్ తీరంలో ఓ ఫ్రెంచ్ కుటుంబం 16 గంటల పాటు సముద్రంలో చిక్కుకుపోయింది.
రెంట్‌కు తీసుకున్న జెట్ స్కీ బోల్తా పడటంతో ఆ కుటుంబానికి ఈ పరిస్థితి ఎదురైంది.
50 ఏళ్ల తండ్రితో పాటు ఆయన ఇద్దరు కొడుకులు(5, 7 ఏళ్లు) రక్షించే సమయానికి "సముద్రపు నీటిని తాగడం వల్ల వాళ్ల మొహాలు పాలిపోయి, నీరసంగా కనిపించారు" అని స్థానిక ప్రభుత్వ అధికారి అమోర్న్ చోమ్‌చోయ్ ఏఎఫ్‌పీ వార్తా సంస్థకు తెలిపారు.
ముగ్గురినీ వైద్య పరీక్షల కోసం ఆసుపత్రికి తీసుకెళ్లామని అయితే కొద్దిసేపటికే వారిని డిశ్చార్జ్ చేశారని ఆయన చెప్పారు.
థాయిలాండ్‌లో పర్యటకులకు ప్రసిద్ధి చెందిన దీవుల్లో ఒకటైన కో స్యాముయిలో స్థానిక కాలమానం ప్రకారం గురువారం సాయంత్రం 5 గంటలకు.. 45 నిమిషాల ప్రయాణం కోసం ఈ కుటుంబం జెట్ స్కీని అద్దెకు తీసుకుందని బ్యాంకాక్ పోస్ట్ తెలిపింది.


ఫొటో సోర్స్, https://bbc.com.im/hindi/articles/cqlxxlrlvgvo%3C/span%3E%3C/p%3E%3C/div%3E%3Cfigcaption class="css-1yar8ly" dir="ltr">ఫొటో క్యాప్షన్, తర్వాత రోజు ఉదయం అధికారులు ఆ కుటుంబాన్ని గుర్తించి రక్షించారు.
రావాల్సిన సమయానికి జెట్ స్కీ తిరిగి రాకపోవడంతో రక్షణ సిబ్బందిని అప్రమత్తం చేశారు.
దీంతో ఆ కుటుంబాన్ని వెతికేందుకు స్పీడ్‌బోట్లు మరిన్ని జెట్ స్కీలను ఉపయోగించి కోస్యాముయి చుట్టుపక్కల, సమీపంలోని కో ఫంగన్ దిశగా ఉన్న ప్రాంతాలలో గాలింపు చేపట్టినట్లు బ్యాంకాక్ పోస్ట్ కథనం పేర్కొంది.
చీకటి పడిన తర్వాత గాలింపు చర్యలను నిలిపివేశారు. తర్వాతి రోజు ఉదయం ఆ కుటుంబం సముద్రంలోనే ఉండటాన్ని గుర్తించినట్లు థాయ్ మీడియా తెలిపింది.
స్థానిక కాలమానం ప్రకారం తర్వాతి రోజు ఉదయం 10 గంటలకు అధికారులు ఆ తండ్రి, బిడ్డలను గుర్తించినట్లు ఏఎఫ్‌పీ వార్తా సంస్థ పేర్కొంది.
అద్దె సమయం ముగిసే దశలో పెద్దపెద్ద అలలు జెట్ స్కీని ఢీకొనడంతో ఇంజిన్ ఆగిపోయిందని తండ్రి అధికారులకు తెలిపినట్లు బ్యాంకాక్ పోస్ట్ కథనం చెబుతోంది.
రెస్క్యూ ఫుటేజ్‌లో... వాహనంలోని వెనుక భాగం నీట్లో మునిగిపోవడంతో పిల్లల్లో ఒకరు జెట్ స్కీ ముందు భాగం పైన కూర్చుని ఉన్నట్లు కనిపించింది.
పిల్లల తండ్రి నీటిపై తేలుతూ సహాయ సిబ్బందికి చేయి ఊపుతూ కనిపించారు.
ఆ ముగ్గురిని సురక్షితంగా తిరిగి తీసుకువచ్చే సమయానికి తల్లి, అక్క బీచ్‌లో వేచి ఉన్నారని నేషన్ థాయిలాండ్ వెబ్‌సైట్ న్యూస్ తెలిపింది.
ఈ సంఘటన తర్వాత ఆ కుటుంబం థాయిలాండ్‌లోనే ఉండి తమ సెలవును కొనసాగించిందని అధికారులు ఏఎఫ్‌పీకి తెలిపారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్, ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)































