ఆ దేశంలో రోజుకి 30 నిమిషాలు నడిస్తే బహుమతులు, డిస్కౌంట్లు.. సిద్ధమవుతున్న కొత్త కార్యక్రమం

- రచయిత, క్లోయీ హేవర్డ్, హ్యూ పిమ్
- ప్రచురణ
- చదివే సమయం: 4 నిమిషాలు
నడక ఆరోగ్యానికి మేలు చేస్తుందనేది ఎంతోకాలంగా మనం వింటూ వస్తున్న విషయమే.
అయితే మొదటిసారి, బ్రిటన్ జాతీయ ఆరోగ్య సంస్థ(ఎన్‌హెచ్‌ఎస్), వ్యాయామం చేసే వారికి బహుమతులు ఇచ్చే కార్యక్రమాన్ని ప్రారంభించనుంది.
వచ్చే ఏడాది ప్రారంభంలో ఎన్‌హెచ్‌ఎస్ ఇంగ్లండ్ "మారథాన్ ఎ మంత్" అనే చాలెంజ్‌ను ప్రారంభించనుంది. ఇందులో భాగంగా ప్రజలు రోజుకు సుమారు 30 నిమిషాలు నడవాలని కోరనుంది.
ప్రతిరోజూ ఈ లక్ష్యాన్ని పూర్తి చేసిన వారు నెలకు సుమారు 26 మైళ్లు(సుమారు 42 కిలోమీటర్లు) నడిచినట్లవుతుంది. ఇది ఒక మారథాన్‌లో నడిచినంత/పరుగెత్తినంత దూరానికి సమానం.
ఈ చాలెంజ్‌లో పాల్గొనేవారు తమ నడక వివరాలను మొబైల్ ఫోన్ లేదా స్మార్ట్‌వాచ్ ద్వారా ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవచ్చు.
ఈ చాలెంజ్‌ను పూర్తి చేసిన వారు బహుమతులకు అర్హులు అవుతారని, అందులో ప్రోత్సాహకాలు, డిస్కౌంట్లు ఉండొచ్చని ఎన్‌హెచ్‌ఎస్ తెలిపింది.

"ఇది ఒక మంచి పథకంలానే ఉంది" అని లారెన్ ఆండ్రూ అన్నారు.
"నేను ఇందులో పాల్గొంటాను. రోజులో కొద్దికొద్దిగా సమయాన్ని కేటాయించడం సులభమే" అని ఆమె చెప్పారు. "నాకు జిమ్ సభ్యత్వం లేదు. కానీ కొద్దిసేపు నడవగలను. దానికి ఎలాంటి ఖర్చు ఉండదు" అన్నారు లారెన్.
అయితే ప్రోత్సాహకాల విషయానికి వస్తే డిస్కౌంట్లు ఒక్కటే సరిపోవని ఆమె అన్నారు.
"నేను నడిచినందుకు ఉచితంగా డ్రింక్ కానీ, ఆహారం కానీ ఉంటే అది నన్ను మరింతగా ప్రోత్సహిస్తుంది" అని చెప్పారు.

ఫొటో సోర్స్, Getty Images
25 ఏళ్లలోపు యువతతో బీబీసీ ఈ పథకంపై మాట్లాడినప్పుడు వారు సానుకూలంగా స్పందించారు. "ఆట మాదిరిగా రూపొందించిన ఈ సవాల్ తనను మరింత చురుకుగా ఉండేలా ప్రోత్సహిస్తుందని" వారిలో ఒకరు చెప్పారు. వరుసగా ప్రతి రోజూ లక్ష్యాన్ని కొనసాగించే 'స్ట్రీక్'ను కోల్పోకూడదనే భావన తనకు, తన స్నేహితులకూ మంచి ప్రేరణగా ఉంటుందని తెలిపారు.
మరో యువకుడు ఇప్పటికే ప్రతి నెలా ఒక మారథాన్‌కు సమానమైన దూరం నడుస్తున్నానని, ఇప్పటికే చేస్తున్న పనికి ఉచిత బహుమతి ఇస్తే సంతోషంగా స్వీకరిస్తానని అన్నారు.
ఈ పథకం ఏర్పాట్ల ఖర్చును ఎన్‌హెచ్‌ఎస్ భరిస్తోంది. అయితే కార్యక్రమం విస్తరించే కొద్దీ పెద్ద కార్పొరేట్ సంస్థల నుంచి డొనేషన్లను సమీకరించాలని భావిస్తోంది.
ఈ పథకాన్ని గ్రేట్ నార్త్ రన్ వ్యవస్థాపకుడు, మాజీ ఒలింపిక్ విజేత సర్ బ్రెండన్ ఫోస్టర్‌తో కలిసి ఎన్‌హెచ్‌ఎస్ ఇంగ్లండ్ రూపొందిస్తోంది. ప్రజలను నడకకు అలవాటు చేసేందుకు ఒక కార్యక్రమాన్ని రూపొందించాలని ఎన్‌హెచ్‌ఎస్ ఆయనను కోరింది.
"నేను పరుగు వల్ల పేరు పొందాను. కానీ ఇక్కడ మా లక్ష్యం చాలా సులభమైంది. ప్రజలు నడవాలి.. అంతే" అని ఆయన చెప్పారు.
ఈ కార్యక్రమం ఇంగ్లండ్‌కు సంబంధించిన 10 ఏళ్ల ఆరోగ్య ప్రణాళికలో భాగం. ఎక్కువ మందిని శారీరకంగా చురుకుగా మార్చడమే తన లక్ష్యమని సర్ బ్రెండన్ ఫోస్టర్ బీబీసీకి తెలిపారు.

ఎన్హెచ్ఎస్ ఇంగ్లండ్ గణాంకాల ప్రకారం.. ఆ దేశంలో ప్రతి ఆరు మరణాల్లో ఒక మరణానికి శారీరక శ్రమ లేకపోవడం కారణమవుతోంది. వారానికి 30 నిమిషాల కంటే తక్కువ మోస్తరు శారీరక వ్యాయామం చేసేవారిని శారీరకంగా యాక్టివ్‌గా లేనివారిగా పరిగణిస్తారు.
స్పోర్ట్ ఇంగ్లండ్ నిర్వహించిన ఓ సర్వే ప్రకారం.. అక్కడ 2025లో నవంబర్ నాటికి సుమారు 1.2 కోట్ల మంది ఈ కోవలోకి వస్తారు.
ఈ కార్యక్రమంలో లక్ష మందికిపైగా చేరాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. వారి రోజువారీ నడక గణాంకాలు డిజిటల్ పద్ధతిలో నమోదు చేస్తారు.
ఈ లక్ష్యం నెరవేరితే చరిత్రలోనే అతిపెద్ద మారథాన్‌గా ఇది నిలుస్తుందని సర్ బ్రెండన్ తెలిపారు.
స్నాప్‌చాట్, డ్యూలింగో వంటి యాప్‌ల ద్వారా ప్రాచుర్యం పొందిన 'స్ట్రీక్ కల్చర్' ఈ సవాల్‌ను నిరంతరం కొనసాగించేందుకు తోడ్పడుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
దీని వల్ల ఆరోగ్య ప్రయోజనాలతో పాటు ఎన్‌హెచ్‌ఎస్‌కు అయ్యే ఖర్చు కూడా గణనీయంగా తగ్గే అవకాశం ఉందన్నారు.
"ఎవరైనా రోజుకు 30 నిమిషాలు చొప్పున వారానికి ఐదు రోజులు నడిస్తే, వారికి అదనంగా నాలుగు సంవత్సరాల ఆరోగ్యకరమైన జీవితం లభించే అవకాశం ఉంది" అని ఆయన తెలిపారు.
"ప్రజలు తమ రోజువారీ జీవితంలో క్రమం తప్పకుండా శారీరక కదలికలను అలవాటు చేసుకుంటే అది మెరుగైన ఆరోగ్యానికి దోహదపడుతుంది. దాన్ని సులభంగా, సాధ్యమైనదిగా, బహుమతులతో కూడినదిగా చేస్తే మరింత మంది దీన్ని ప్రారంభించే అవకాశం ఉంటుంది" అని యాక్షన్ ఆన్ సాల్ట్ అండ్ షుగర్ సంస్థలో పనిచేసే సోనియా పోంబో అన్నారు.
"అయితే వ్యక్తిగత ప్రవర్తనలో మార్పుపైనే పూర్తిగా ఆధారపడలేం. ముఖ్యంగా పిల్లల ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి ప్రభుత్వం నిజంగా కట్టుబడి ఉంటే, ఇలాంటి కార్యక్రమాలతో పాటు మరిన్ని నివారణ చర్యలను కూడా అమలు చేయాలి" అని ఆమె అన్నారు.
కూపన్ల పథకానికి సంబంధించిన పూర్తి వివరాలతో పాటు ఇందులో పేర్లు ఎలా నమోదు చేసుకోవాలనే సమాచారాన్ని రానున్న నెలల్లో వెల్లడించనున్నారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్, ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)




























