బలోగన్‌కు రెడ్‌కార్డ్‌ వివాదం: జోక్యం చేసుకున్నానని ఒప్పుకున్న ట్రంప్, ఫిఫా తీరుపై విమర్శల వెల్లువ

ఫిఫా, ఫుట్‌బాల్ ప్రపంచకప్, అమెరికా, బెల్జియం, బలోగన్

ఫొటో సోర్స్, Jamie Squire/Getty Images

    • రచయిత, డేల్ జాన్సన్
    • హోదా, బీబీసీ ప్రతినిధి
  • ప్రచురణ
  • చదివే సమయం: 7 నిమిషాలు

ఫుట్‌బాల్ ప్రపంచకప్‌లో బెల్జియం అమెరికాను 4-1 తేడాతో ఓడించింది. అయితే అమెరికాలో ఇప్పుడీ మ్యాచ్ కంటే ఎక్కువగా బలోగన్‌పై విధించిన ఒక మ్యాచ్ నిషేధాన్ని ఫిఫా ఎత్తివేయడంపై ఎక్కువగా చర్చ జరుగుతోంది.

అమెరికన్ స్ట్రైకర్ ఫోలారిన్ బలోగన్‌పై విధించిన ఒక మ్యాచ్ నిషేధాన్ని సమీక్షించాలని తాను ప్రపంచ ఫుట్‌బాల్ నియంత్రణ సంస్థ ఫిఫాను కోరినట్లు అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ అంగీకరించారు.

బోస్నియా-హెర్జెగోవినా జట్టు డిఫెండర్ తారిక్ ముహారెమోవిచ్‌పై ఫౌల్ చేసినందుకు నేరుగా రెడ్ కార్డ్ చూపించడంతో 25 ఏళ్ల బలోగన్ బెల్జియంతో తన జట్టు తలపడనున్న చివరి మ్యాచ్‌కు దూరమయ్యాడు.

అయితే అనూహ్యంగా ఫిఫా ఈ మ్యాచ్ నిషేధాన్ని 12 నెలల పాటు నిలిపివేసింది. ఈ నిర్ణయాన్ని యూఈఎఫ్‌ఏ, బెల్జియం, ఇంగ్లిష్ ఫుట్‌బాల్ సంఘాలు విమర్శించాయి.

ఫిఫా నిర్ణయంతో, టోర్నీలో ఇప్పటివరకు మూడు గోల్స్ చేసిన అమెరికన్ ఫార్వర్డ్ బలోగన్ సియాటిల్‌లో బెల్జియంతో జరిగే మ్యాచ్‌లో ఆడేందుకు అనుమతి లభించింది. అయితే, ఈ మ్యాచ్‌లో అమెరికా ఓడిపోయింది.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
ఫిఫా, ఫుట్‌బాల్ ప్రపంచకప్, అమెరికా, బెల్జియం, బలోగన్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, రెడ్ కార్డ్‌ను రద్దు చేయాలన్న ఫిఫా నిర్ణయంతో యూఎస్ స్ట్రైకర్ ఫోలారిన్ బలోగన్ బెల్జియంపై ఆడాడు.

నిషేధాన్ని వెనక్కి తీసుకున్న ఫిఫా

ఫిఫా నిర్ణయం పట్ల ఆశ్చర్యం వ్యక్తం చేసిన రాయల్ బెల్జియన్ ఫుట్‌బాల్ అసోసియేషన్.. బలోగన్ అప్పీల్ తిరస్కరించిన తర్వాత మ్యాచ్‌లో అతను ఆడటంపై అమెరికా సాకర్ ఫెడరేషన్‌ను ప్రశ్నించింది.

ఫిఫా "సరైన నిర్ణయం తీసుకుంది" అని ట్రంప్ అన్నారు. ఒకవేళ నిషేధాన్ని అమలు చేసి ఉంటే అది టోర్నమెంట్‌కు "పెద్ద మచ్చ"గా మిగిలిపోయేదని ఆయన అన్నారు.

అది ఫౌల్ అని తాను అనుకోలేదని అందుకే ఆ నిర్ణయాన్ని సమీక్షించాలని ఫిఫాను కోరినట్లు ట్రంప్ సోమవారం చెప్పారు.

ఫిఫా అధ్యక్షుడు గియానీ ఇన్ఫాంటినోతో తాను మాట్లాడినట్లు ఆయన స్పష్టం చేశారు. తాను కేవలం ఆ నిర్ణయాన్ని సమీక్షించాలని మాత్రమే కోరినట్లు చెప్పారు.

"వాళ్లేం చేయాలో నేను చెప్పలేను. అది వాళ్ల నిర్ణయం అని నేననుకోవడం లేదు. అది కమిషన్ నిర్ణయం. అది సరైనదే" అని ట్రంప్ అన్నారు.

అయితే ఇది ఫుట్‌బాల్ సమగ్రతను ప్రమాదంలో పడేస్తుందని యూరోపియన్ ఫుట్‌బాల్ నియంత్రణ సంస్థ యూఈఎఫ్ఏ చెప్పింది.

ప్రపంచకప్‌ చరిత్రలో ఇప్పటి వరకు 189 రెడ్ కార్డులు చూపించారు. కేవలం ఇద్దరు ఆటగాళ్లను మాత్రమే సస్పెండ్ చేయకుండా వదిలేశారు.

ఇందులో మొదటిది 1962లో జరిగింది. చిలీతో జరిగిన సెమీ-ఫైనల్‌లో బ్రెజిల్‌ ఆటగాడు గారిన్చాకు రెడ్ కార్డ్ చూపినప్పటికీ అతను ఫైనల్‌ మ్యాచ్‌లో ఆడాడు. చెకొస్లోవేకియాతో జరిగిన ఆ మ్యాచ్‌లో బ్రెజిల్ విజయం సాధించింది.

ఆ రోజుల్లో ఆటలో పాల్గొనకుండా నిషేధం ఉండేది కాదు. రెడ్ కార్డ్ చూపించాక సాక్ష్యాధారాల ఆధారంగా అధికారులు శిక్షను నిర్ణయించేవారు.

1962లో ఫిఫా క్రమశిక్షణా కమిటీ తీసుకున్న నిర్ణయం వెనుక రాజకీయ జోక్యం ఉందనే ఆరోపణలు వచ్చాయి.

వైట్ హౌస్- ఫిఫా మధ్య సన్నిహిత సంబంధాల దృష్ట్యా ప్రపంచ కప్ ఆతిథ్య దేశానికి అనుకూలంగా తీసుకున్న అసాధారణ నిర్ణయంపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ ఫిఫా అధ్యక్షుడు గియానీ ఇన్ఫాంటినోతో ఫోన్‌లో మాట్లాడిన తర్వాతే బలోగన్‌పై సస్పెన్షన్ గురించి చర్చించారని, వారి చర్చల తర్వాత అతనిని తిరిగి జట్టులోకి తీసుకున్నారని బీబీసీ అమెరికా మీడియా భాగస్వామి సీబీఎస్ న్యూస్ ధృవీకరించింది.

ఈ చర్య ఫుట్‌బాల్ చరిత్రలో కొత్త ఒరవడిని సృష్టించిందా? ఈ ప్రపంచ కప్‌లో 11 మంది ఆటగాళ్లకు రెడ్ కార్డు చూపించి గ్రౌండ్ నుంచి బయటకు పంపించారు. బలోగన్‌కు మాత్రం ఎందుకు ఉపశమనం కల్పించారు?

దీనివల్ల ఫుట్‌బాల్‌లో రెడ్ కార్డ్‌లకు వ్యతిరేకంగా అప్పీళ్ల సంఖ్య పెరుగుతుందా?

ఫిఫా, ఫుట్‌బాల్ ప్రపంచకప్, అమెరికా, బెల్జియం, బలోగన్

ఫొటో సోర్స్, John Todd/ISI Photos/ISI Photos via Getty Images

ఫొటో క్యాప్షన్, రెడ్ కార్డ్ అందుకున్న తర్వాత ఫోలారిన్ బలోగన్‌ను సహచరులు ఓదార్చారు

ఫిఫా ఎటువంటి వివరణ ఇవ్వలేదు

ఇదెలా జరిగిందని ఇప్పుడు ప్రజలు అడుగుతున్నారు.

ఫిఫా నిబంధనల ప్రకారం "తీవ్రమైన ఫౌల్ ప్లేకి బలొగన్‌కు కనీసం రెండు మ్యాచ్‌ల నిషేధం" విధించాలి. రెడ్ కార్డ్‌లపై అప్పీల్ చేయడానికి ప్రపంచ కప్ నిబంధనలు అనుమతించవు.

బలోగన్ నిషేధాన్ని నిలిపివేయడానికి ఫిఫా ప్రకటనలో ఎటువంటి వివరణ ఇవ్వలేదు. కేవలం "ఫిఫా క్రమశిక్షణ నియమావళిలోని ఆర్టికల్ 27"ను ప్రస్తావించింది.

ఆర్టికల్ 27 ఆటగాళ్లకు విధించే "శిక్షను పూర్తిగా లేదా పాక్షికంగా నిలిపివేయడానికి" ఫిఫాకు అధికారం ఇస్తుంది.

ఇదొక సాధారణ నియమం. దీని ప్రకారం ఇతర ప్రమాణాలేవీ పాటించకుండా ఫిఫా తనకు నచ్చిన నిర్ణయం తీసుకోవచ్చు.

ప్రపంచ కప్‌లో ఆర్టికల్ 27ను ఇంతకు ముందెన్నడూ ఉపయోగించలేదు.

క్రమశిక్షణ నియమావళి ప్రకారం రెండు మ్యాచ్‌లకు బదులుగా బలోగన్‌పై విధించిన తాత్కాలిక నిషేధాన్ని కేవలం ఒక మ్యాచ్‌కే పరిమితం చేశారు. ఇలా ఎందుకు చేశారనే దానికి ఫిఫా వివరణ ఇవ్వలేదు.

దీని వెనుక కారణాలు కనుక్కునేందుకు బీబీసీ స్పోర్ట్స్ ప్రయత్నించింది.

కానీ దీనికి ఎలాంటి కారణం చెప్పలేదు. ఈ టోర్నీకి ముందు క్రిస్టియానో రొనాల్డోపై విధించిన సస్పెన్షన్‌ను బీబీసీస్పోర్ట్స్ కి చూపించారు.

ఫిఫా క్రమశిక్షణా నియమావళి ప్రకారం గతేడాది నవంబర్‌లో ఐర్లాండ్‌తో జరిగిన క్వాలిఫైయింగ్ మ్యాచ్‌లో పోర్చుగల్ 2-0 తేడాతో ఓడిపోయినప్పుడు డారా ఓ'షేను మోచేతితో కొట్టినందుకు రొనాల్డోకు మూడు మ్యాచ్‌ల నిషేధం విధించాల్సి ఉండేది.

అతను అర్మేనియాతో జరిగిన ఫైనల్ క్వాలిఫైయర్‌లో ఒక మ్యాచ్ ఆడాడు. కానీ మిగిలిన రెండు మ్యాచ్‌ల నిషేధాన్ని నిలిపివేశారు.

అయితే, రొనాల్డో ఒక క్వాలిఫైయింగ్ మ్యాచ్‌లో రెడ్ కార్డ్ అందుకున్నాడు. కానీ అది ప్రపంచ కప్ రెడ్‌కార్డ్ కాదు.

రొనాల్డోతో పాటు టోర్నమెంట్‌కు ముందు ఆటగాళ్ల పట్ల కొంత ఉదారత చూపిన ఇలాంటి అనేక కేసులు వెలుగులోకి వచ్చాయి.

రొనాల్డో విషయంలో కనీసం సమాధానాలైనా ఉన్నాయి. "అతను (రొనాల్డో) తన మిగతా 225 అంతర్జాతీయ మ్యాచ్‌లలో రెడ్ కార్డ్ అందుకోలేదు" అనే వాస్తవాన్ని తాము పరిగణనలోకి తీసుకున్నామని ఫిఫా తెలిపింది.

ఫిఫా, ఫుట్‌బాల్ ప్రపంచకప్, అమెరికా, బెల్జియం, బలోగన్

ఫొటో సోర్స్, Michael Steele/Getty Images

ఫొటో క్యాప్షన్, బలోగన్‌కు రెడ్ కార్డ్ చూపించడానకిి దారి తీసిన సంఘటన

"ఏప్రిల్ ఫూల్స్‌ను చేశారు"

అయితే బలోగన్ గురించి ఎలాంటి వివరణ ఇవ్వకపోవడం ఊహాగానాలకు దారితీసింది.

ఇది ఎందుకు స్పెషల్ కేసయింది? రెడ్ కార్డ్‌కు శిక్ష విధించకూడదని ఎవరు నిర్ణయం తీసుకున్నారు?

రిఫరీ సస్పెన్షన్‌ను ఎత్తివేయమని కోరినట్లు కానీ లేదా వీడియో అసిస్టెంట్ రిఫరీ ప్రోటోకాల్స్‌ను పాటించనట్లు గానీ ఎటువంటి సూచన లేదని బీబీసీ స్పోర్ట్‌కు తెలిసింది.

శిక్ష ఎందుకు విధించలేదని అమెరికన్లు ఫిఫాను అడగవచ్చు. కానీ బెల్జియం అడగలేదు.

ఈ మొత్తం వ్యవహారాన్ని ఒక జోక్‌లా ఉందని బీబీసీ స్పోర్ట్ విశ్లేషకుడు ఇంగ్లండ్ మాజీ డిఫెండర్ మైకా రిచర్డ్స్ అన్నారు.

"బలొగన్ శిక్షను ఏడాది పాటు నిలిపివేయడం మొత్తం టోర్నీని అపహాస్యం చేయడమే. పెద్ద స్టార్లను పోటీలో నిలబెట్టడమే దీని ఉద్దేశం. ఇది ఎలా సాధ్యం? ఫిఫా నుంచి ఇది ఊహించలేదు" అని ఆయన అన్నారు.

"ఇది ఫుట్‌బాల్ అభిమానులకు చేదు అనుభవాన్ని మిగిల్చింది" అని ఆయన చెప్పారు.

ఈ నిర్ణయంపై బెల్జియం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. బలోగన్‌ను ఆడటానికి అనుమతించడం తమను 'దిగ్భ్రాంతికి' గురిచేసిందని ఆదివారం విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలిపింది.

టోర్నమెంట్‌కు ముందు జరిగిన అనేక నిబంధనలు, సమన్వయ సమావేశాలను బెల్జియన్ ఫుట్‌బాల్ అసోసియేషన్ ఉదహరించింది.

ఫిఫా నిర్ణయం టోర్నమెంట్ నిబంధనను ఉల్లంఘించడమేనని వారు గట్టిగా వాదిస్తున్నారు.

ఆటగాడికి రెడ్ కార్డ్ చూపిస్తే అతను తర్వాతి మ్యాచ్ నుంచి ఆటోమేటిగ్గా సస్పెండ్ అవుతాడని బెల్జియం చెబుతోంది.

నిబంధనలను తప్పించుకోవడానికి ఫిఫా క్రమశిక్షణ నియమావళిని అడ్డుగా పెట్టుకుంటోందని వాళ్లు ఆరోపిస్తున్నారు.

బెల్జియం హెడ్ కోచ్ రూడీ గార్సియా ఒక అడుగు ముందుకేసి తీవ్ర విమర్శలు చేశారు.

"ప్రపంచ కప్ జూలై 5కి బదులు ఏప్రిల్ 1న జరుగుతోందని, అది ఏప్రిల్ ఫూల్స్ డే అని నాకు తెలియదు" అని ఆయన ఓ ప్రెస్ కాన్ఫరెన్స్‌లో చెప్పారు.

"మేము జాతీయ జట్టును గానీ ఫెడరేషన్‌ను గానీ సమర్థించడం లేదు మేము ఫుట్‌బాల్‌ను సమర్థిస్తున్నాము" అని ఆయనన్నారు.

ఈ టోర్నమెంట్ నుండి నిష్క్రమించిన ఇతర ఆటగాళ్లు ఏమని ఆలోచిస్తూ ఉండవచ్చు?

ఖతార్‌ ఆటగాడు అసిమ్ మడిబోనే ఉదాహరణగా తీసుకోండి. ఒక దురదృష్టకరమైన సంఘటనలో కెనడియన్ మిడ్‌ఫీల్డర్ ఇస్మాయిల్ కోనే కాలు విరిగింది. ఇందులో మడిబో ఎలాంటి తప్పు చేయలేదని ప్రమాదం వల్లే అలా జరిగిందని, మడిబో ఇస్మాయిల్ కోనేను అడ్డుకోవడం వల్ల జరిగిందని కాదని స్పష్టమైంది.

అయినప్పటికీ ఫిఫా మడిబోపై ఐదు మ్యాచ్‌ల నిషేధం విధించింది.

ఫిఫా, ఫుట్‌బాల్ ప్రపంచకప్, అమెరికా, బెల్జియం, బలోగన్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ఫుట్‌బాల్ మ్యాచ్‌లో ట్రంప్ జోక్యంపై విమర్శలు వస్తున్నాయి.

ట్రంప్ పాత్ర ఏమిటి?

ఫిఫా ప్రపంచ కప్ క్రమశిక్షణా ప్రక్రియలోని మూలస్తంభాలలో ఒకటేమిటంటే, సస్పెన్షన్‌కు వ్యతిరేకంగా అప్పీలు చేయలేరు. అలాంటప్పుడు ఆతిథ్య దేశపు స్టార్ ప్లేయర్ కోసం ఫిఫా ఎందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేసింది?

ఈ రెడ్ కార్డ్, సస్పెన్షన్ అమెరికాలో పెద్ద దుమారాన్ని రేపింది.

ఆ స్ట్రైకర్‌కు రెండు విధాలుగా శిక్ష విధించారని అమెరికాలో ఆరోపణలు వస్తున్నాయి.

బోస్నియాతో జరిగిన మ్యాచ్‌లో బలోగన్ చివరి 27 నిమిషాలు ఆడలేకపోయాడని ఇప్పుడు తర్వాతి మ్యాచ్‌లోనూ ఆడకుండా ఆయనపై నిషేధం విధిస్తున్నారని వారు అంటున్నారు.

ఇది ఘోరమైన అన్యాయం అనేది అమెరికన్ మీడియా విశ్లేషకుల అభిప్రాయం.

అమెరికా ప్రభుత్వం, మీడియా నుంచి ఒత్తిడి వచ్చింది. అమెరికా 'రెడ్ కార్డ్' వల్ల నష్టపోయిందని, దీనిపై 'అప్పీళ్ల ప్రక్రియ ఉండాలని' విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియో అన్నారు.

అయితే ఆర్సెనల్ మాజీ స్ట్రైకర్‌ను ఆడేందుకు అనుమతించే ప్రత్యేక మినహాయింపును ఫిఫా అకస్మాత్తుగా మంజూరు చేస్తుందని ఎవరూ ఊహించలేదు.

నిజానికి, బోస్నియాతో జరిగిన మ్యాచ్‌లో బలోగన్‌ను పాప విముక్తిడిని చేశారు కాబట్టి అతను మళ్లీ ఆడటానికి స్వేచ్ఛ లభించింది.

ట్రంప్ నేరుగా ఇన్ఫాంటినోతో మాట్లాడారని సీబీఎస్ వర్గాలు తెలిపాయి.

ఫిఫా క్రమశిక్షణ కమిటీ ఈ విషయంపై విచారణ జరుపుతుందని ఇన్ఫాంటినో అధ్యక్షుడు ట్రంప్‌తో చెప్పారు.

వైట్ హౌస్ వరల్డ్ కప్ టాస్క్‌ఫోర్స్ తాత్కాలిక డైరెక్టర్ ఆండ్రూ గిలియాని కూడా ఈ పరిస్థితి గురించి ఇన్ఫాంటినోతో మాట్లాడారు. వాణిజ్య కార్యదర్శి హోవార్డ్ లుట్నిక్ కూడా ఫిఫాతో సంప్రదింపులు జరిపారు.

వైట్ హౌస్ ప్రతినిధులు లుట్నిక్, గియులియాని స్పందన కోసం సీబీఎస్ న్యూస్ ప్రయత్నించింది. అయితే వారి నుంచి ఎలాంటి స్పందన రాలేదు.

"గొప్ప అన్యాయాన్ని సరిదిద్దినందుకు ఫిఫాకు ధన్యవాదాలు" అని ట్రంప్ తన సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లో పోస్ట్ చేశారు.

ట్రంప్‌కు ఫిఫా శాంతి బహుమతిని ప్రదానం చేయడం ద్వారా రాజకీయ తటస్థత నియమాలను ఉల్లంఘించిందని ఆరోపణలు ఎదుర్కొంటున్న ఇన్ఫాంటినోపై విచారణ జరపాలని ఫిఫా నైతిక కమిటీ కోరింది.

ఫుట్‌బాల్‌లో రాజకీయ జోక్యాన్ని ఫిఫా నిబంధనలు నిషేధిస్తాయి.

అమెరికా ప్రభుత్వ జోక్యం మరిన్ని ప్రశ్నలను లేవనెత్తుతోంది.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,  ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)