ఆస్ట్రేలియా బీచ్‌‌కు కొట్టుకొచ్చిన అంతుపట్టని అంతరిక్ష గోళాలు.. ఇంతకీ ఏమిటవి?

ఆస్ట్రేలియా, ఖగోళ వస్తువు, పరిశోధన

ఫొటో సోర్స్, Queensland Fire Department

ఫొటో క్యాప్షన్, ఈ గోళాలు ప్రమాదకరమైన వస్తువులు కావచ్చునని క్వీన్స్‌లాండ్ అధికారులు స్థానిక ప్రజలను హెచ్చరించారు.
    • రచయిత, జరోస్లావ్ లుకివ్
    • హోదా, బీబీసీ ప్రతినిధి
  • ప్రచురణ
  • చదివే సమయం: 3 నిమిషాలు

ఆస్ట్రేలియాలోని ఉత్తర క్వీన్స్‌లాండ్ బీచ్‌లో ఈ వారాంతంలో ఒడ్డుకు కొట్టుకొచ్చిన అంతుపట్టని వెండి గోళాలు ఎక్కడి నుంచి వచ్చాయనే విషయంపై అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.

టౌన్స్‌విల్లేకు ఉత్తరంగా ఉన్న ఫారెస్ట్ బీచ్‌లో కనిపించిన ఈ ఆరు గోళాలు అంతరిక్ష వ్యర్థాలు కావచ్చని భావిస్తున్నారు. ఇవి ఎక్కడి నుంచి వచ్చాయో తెలుసుకోవడానికి ఆస్ట్రేలియా స్పేస్ ఏజెన్సీ ప్రయత్నిస్తోంది. ఈ విషయంపై వ్యాఖ్యానించాల్సిందిగా బీబీసీ ఆ సంస్థను సంప్రదించింది.

ఈ గోళాలలో ప్రమాదకరమైన పదార్థాలు ఉండవచ్చనే ఆందోళనల నేపథ్యంలో, ప్రత్యేక రక్షణ దుస్తులు ధరించిన సిబ్బంది పోలీసుల పర్యవేక్షణలో వాటిని ప్రత్యేక పీపాలలోకి తరలించినట్టు వార్తలు వచ్చాయి.

క్వీన్స్‌లాండ్ అగ్నిమాపక విభాగం ఆ ప్రాంతంలో 50 మీటర్ల పరిధిని నిషేధిత ప్రాంతంగా ఆదివారం ప్రకటించింది. అనుమానాస్పద వస్తువులు కనిపిస్తే ఎవరూ ముట్టుకోవద్దని హెచ్చరించింది.

అలాంటివి కనిపిస్తే ప్రజలు వెంటనే అక్కడి నుంచి దూరంగా వెళ్లి, అత్యవసర సేవల అధికారులకు సమాచారం ఇవ్వాలని సూచించింది.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

ఈ గోళాలు అంతరిక్ష నౌకలకు సంబంధించిన ప్రొపెల్లెంట్ ట్యాంకులు కావొచ్చని, అందువల్ల వీటిలో అత్యంత సులభంగా మంటలు అంటుకునే లేదా తీవ్ర రసాయనిక ప్రతిచర్యకు లోనయ్యే పదార్థాల అవశేషాలు ఉండవచ్చని ఆన్‌లైన్‌లో కొందరు అంచనా వేస్తున్నారు.

అయితే, ఇవి ఏ అంతరిక్ష నౌకకు చెందినవి, వాటి యాజమాని ఎవరనేది ఇంకా స్పష్టంగా తెలియలేదు.

ఆస్ట్రేలియా, ఖగోళ వస్తువు, పరిశోధన

ఫొటో సోర్స్, Queensland Fire Department

ఫొటో క్యాప్షన్, ఈ రహస్య వస్తువుల దరిదాపుల్లోకి వెళ్లవద్దని స్థానిక అధికారులు ప్రజలను కోరారు.

గతంలోనూ ఇలాంటి ఘటనలు..

ఆ గోళాలు ఎక్కడి నుంచి వచ్చాయో తెలుసుకోవడానికి స్థానికులు ఆసక్తిగా ఉన్నారని ఫారెస్ట్ బీచ్ టేక్‌అవే యజమాని లీసా స్కోబీ చెప్పారు.

"ఇక్కడ చాలా ప్రశాంతంగా ఉంటుంది, పెద్దగా ఏమీ జరగదు. కాబట్టి ఈ అదనపు హడావుడి కొంత ఉత్సాహాన్ని కలిగించింది" అని పబ్లిక్ బ్రాడ్‌కాస్టర్ 'ఏబీసీ' తో ఆమె చెప్పారు.

అయితే, ఆస్ట్రేలియా తీరంలో ఇలాంటి రహస్యమైన వస్తువులు కనిపించడం ఇదే మొదటిసారి కాదు.

2023లో పెర్త్ సమీపంలోని పశ్చిమ ఆస్ట్రేలియా బీచ్‌లో కొట్టుకువచ్చిన ఒక మెటల్ డోమ్, తమ రాకెట్‌కు చెందినదేనని భారత్ ధ్రువీకరించింది. అది పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్‌(పీఎస్‌ఎల్‌వీ)లోని భాగమని భారత అంతరిక్ష సంస్థ ప్రతినిధి తర్వాత బీబీసీకి తెలిపారు.

కాగా, ఈ వారాంతంలో దొరికిన వస్తువులను పోలిన గోళాకార వస్తువు 2011లో నమీబియాలోని మారుమూల గడ్డి భూముల్లో కూడా కనిపించింది.

అది మానవరహిత రాకెట్‌కు చెందిన ఇంధన ట్యాంక్ లేదా హైడ్రాజైన్ ఇంధనాన్ని నిల్వ చేసే బ్లాడర్ ట్యాంక్ కావడానికి ఎక్కువ అవకాశం ఉందని అప్పట్లో నిపుణులు అభిప్రాయపడ్డారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,  ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)