మనుస్మృతిలో ఉందంటూ రాహుల్ గాంధీ చెబుతున్న విషయాలు నిజంగా అందులో ఉన్నాయా

రాహుల్ గాంధీ

ఫొటో సోర్స్, ANI

ప్రచురణ
చదివే సమయం: 4 నిమిషాలు

మహారాష్ట్రలోని పుణెలో శనివారం జరిగిన 'ఛాత్రోం కీ గూంజ్' కార్యక్రమంలో కాంగ్రెస్ ఎంపీ, లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ మనుస్మృతిలోని పలు శ్లోకాలను ప్రస్తావించారు.

ఆ తర్వాత భారతీయ జనతా పార్టీ (బీజేపీ) ఆయనపై విమర్శలు చేసింది.

మనుస్మృతిలో మహిళలపై రాసిన ఒక వాక్యాన్ని రాహుల్ సిగ్గుచేటుగా అభివర్ణించారు.

"మహిళలను ఎవరి ఆధీనంలోనూ ఉంచకూడదు" అన్నారు రాహుల్.

"ఒక సమస్య ఉంది, అది చాలా పెద్ద సమస్య. నేను పురుషులతో మాట్లాడినప్పుడల్లా మహిళలను మూడు కోణాల్లోనే చూస్తుంటారు. మహిళలను కూతురు, భార్య లేదా తల్లి రూపంలోనే చూస్తారు" అన్నారు.

"తల్లి, భార్య, కూతురుగా చూడటంలో ఎలాంటి తప్పు లేదు. కానీ, మీ గుర్తింపు అదొక్కటే కాకూడదు. మహిళలు ప్రొఫెషనల్స్, క్రీడాకారిణులు, నాయకులు, క్రియేటర్లు, ఆంత్రప్రెన్యూర్లు.. ఇంకా ఎంతో సాధిస్తున్నారు. అయినా పురుషులు వారికి ఈ మూడు గుర్తింపులనే ఇస్తారు. ఈ మూడు గుర్తింపులకు పురుషులతో సంబంధం ఉంది. తల్లి అయినా, భార్య అయినా, కూతురైనా" అని రాహుల్ అన్నారు.

"నేను ఇక్కడ మనుస్మృతిని ఉదహరించాలనుకుంటున్నాను. బాల్యంలో మహిళ తన తండ్రి అధీనంలో ఉండాలని అందులో రాసి ఉంది. యవ్వనంలో భర్త అధీనంలో ఉండాలి, భర్త లేనప్పుడు కొడుకుల అధీనంలో ఉండాలి. ఒక మహిళ ఎప్పటికీ స్వేచ్ఛగా ఉండలేదని అందులో ఉంది" అన్నారు.

"ఈ విషయం మనుస్మృతిలోనే రాసి ఉంది. ఈ పదాలను చూసి సిగ్గుపడాలి. ఇలాంటి మాటలు ఎప్పుడూ చెప్పి ఉండకూడదు" అని రాహుల్ అన్నారు.

అదేసమయంలో, అసలు మనుస్మృతిలో మహిళల గురించి నిజంగా ఏం రాశారనే ప్రశ్న తలెత్తుతోంది.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

మనుస్మృతిలో మహిళల గురించి ఏం రాశారు?

వాస్తవానికి, మనుస్మృతి అయిదో అధ్యాయం 148వ శ్లోకంలో మహిళల రక్షణ, స్వేచ్ఛకు సంబంధించిన అంశం కనిపిస్తుంది.

అందులో "ఒక అమ్మాయి ఎప్పుడూ తన తండ్రి సంరక్షణలో ఉండాలి, పెళ్లి తర్వాత భర్త ఆమె సంరక్షకుడిగా ఉండాలి, భర్త మరణం తర్వాత ఆమె తన పిల్లల దయపై ఆధారపడి జీవించాలి, ఏ పరిస్థితిలోనూ మహిళ స్వేచ్ఛగా ఉండకూడదు" అని రాసి ఉంది.

ఒక పురుషుడికి మేలు జరిగినప్పుడే మహిళకు మేలు జరుగుతుందని మనుస్మృతిలో రాసి ఉందని పంజాబ్ యూనివర్సిటీలో చరిత్ర బోధించిన ప్రొఫెసర్ రాజీవ్ లోచన్ వివరించారు.

"ఏ పరిస్థితిలోనైనా బ్రాహ్మణులను గౌరవించాలని ఈ పుస్తకం చెబుతోంది. పురుషుడికి మేలు జరిగినప్పుడే మహిళకు మేలు జరుగుతుంది. మహిళకు ఎలాంటి ధార్మిక హక్కులు లేవు. ఆమె తన భర్తకు సేవ చేయడం ద్వారా స్వర్గాన్ని పొందవచ్చు. మనుస్మృతిలో ఇవన్నీ రాసి ఉన్నాయి" అన్నారు.

"ఒకరిని తక్కువ చేసి మాట్లాడటం ఒక ఎత్తు, నిజంగా వారు తక్కువ కావడం మరో ఎత్తు. కాబట్టి ఇంటి పరువు అంతా ఇల్లాలు చేతిలోనే ఉంటుందని పురుషులను హెచ్చరించారు. ఆమెకు కోపం వస్తే అతిథికి సరైన మర్యాదలు చేయదు, అప్పుడు ఇంటి యజమాని పరువు పోతుంది. సరిగ్గా చూసుకోకపోతే ఆమె మరొకరితో వెళ్లే అవకాశం కూడా ఉంది" అని రాసి ఉన్నట్లు రాజీవ్ తెలిపారు.

మనుస్మృతి

ఫొటో సోర్స్, Getty Images

మనుస్మృతి అంటే ఏమిటి?

స్మృతి అంటే ధర్మశాస్త్రం అని చరిత్రకారుడు నరహర్ కురుంద్కర్ చెప్పారు.

"మనువు రాసిన ధార్మిక గ్రంథాన్ని మనుస్మృతి అంటారు. మనుస్మృతిలో మొత్తం 12 అధ్యాయాలు ఉన్నాయి, వాటిలో 2,684 శ్లోకాలు ఉన్నాయి. కొన్ని కూర్పుల్లో శ్లోకాల సంఖ్య 2964 గా ఉంది" అన్నారు.

కురుంద్కర్ ఇప్పటివరకు మనుస్మృతిపై మూడు ఉపన్యాసాలు ఇచ్చారు. ఈ మూడు ప్రసంగాలను ఒక పుస్తక రూపంలోకి తెచ్చారు.

"మనుస్మృతిని తగలబెట్టాలని నమ్మేవారిలో నేనూ ఒకడిని" అని కురుంద్కర్ అన్నారు.

"ఈ పుస్తక రచన క్రీస్తు జననానికి రెండు మూడు వందల సంవత్సరాల ముందు ప్రారంభమైంది. మొదటి అధ్యాయంలో ప్రకృతి సృష్టి, నాలుగు యుగాలు, నాలుగు వర్ణాలు, వారి వృత్తులు, బ్రాహ్మణుల గొప్పదనం లాంటి అంశాలున్నాయి" అన్నారాయన.

"రెండో అధ్యాయం బ్రహ్మచర్యం, యజమానికి చేసే సేవపై ఆధారపడి ఉంటుంది. మూడో అధ్యాయంలో పెళ్లిళ్ల రకాలు, వివాహ ఆచారాలు, శ్రాద్ధం అంటే పూర్వీకులను స్మరించుకోవడం గురించి వివరించారు. నాలుగో అధ్యాయంలో గృహస్థ ధర్మ విధులు, తినదగిన, తినకూడని ఆహార నియమాలు, 21 రకాల నరకాల ప్రస్తావన ఉంది" అని కురుంద్కర్ వివరించారు.

"అయిదో అధ్యాయంలో మహిళల విధులు, పవిత్రత, అపవిత్రత తదితర విషయాలను ప్రస్తావించారు.

ఆరో అధ్యాయంలో సన్యాసి విధులను, ఏడో అధ్యాయంలో రాజు విధులను ప్రస్తావించారు.

ఎనిమిదో అధ్యాయం నేరం, న్యాయం, వాగ్దానం, రాజకీయ వ్యవహారాల గురించి మాట్లాడుతుంది.

తొమ్మిదో అధ్యాయంలో పిత్రార్జిత ఆస్తి, పదో అధ్యాయంలో వర్ణాల కలయిక, పదకొండో అధ్యాయంలో పాపకర్మలు, పన్నెండో అధ్యాయంలో మూడు గుణాలు, వేదాల ప్రశంస ఉన్నాయి. మనుస్మృతి సాధారణ రూపురేఖలు ఇవే" అన్నారు.

"మనుస్మృతిలో హక్కులు, నేరం, వాంగ్మూలం, న్యాయం గురించి మాట్లాడారు. ఇది ఐపీసీ, సీఆర్‌పీసీల మాదిరిగా రాశారు" అని కురుంద్కర్ తెలిపారు.

రాహుల్ గాంధీ, మహారాష్ట్ర మహిళలు, మనుస్మృతిలోని శ్లోకాలు

ఫొటో సోర్స్, మహిళలను ఎవరి ఆధీనంలోనూ ఉంచకూడదు

'అంబేడ్కర్ మనుస్మృతిని దహనం చేశారు'

డాక్టర్ బాబాసాహెబ్ అంబేడ్కర్ 1927 జులై 25న మహారాష్ట్రలోని కొలాబా జిల్లా (ప్రస్తుత రాయ్‌గఢ్) మహద్‌లో బహిరంగంగా మనుస్మృతిని దహనం చేశారు.

అంబేడ్కర్ 'ఫిలాసఫీ ఆఫ్ హిందూయిజం' అనే తన పుస్తకంలో "మనువు చతుర్వర్ణ వ్యవస్థను సమర్థించాడు. ఈ నాలుగు వర్ణాలను వేరువేరుగా ఉంచాలని చెప్పడం ద్వారా మనువు కుల వ్యవస్థకు పునాది వేశాడు. అయితే, మనువే కుల వ్యవస్థను సృష్టించాడని చెప్పలేం. కానీ, ఈ వ్యవస్థకు అతను కచ్చితంగా బీజాలు వేశాడు" అని తెలిపారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,  ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)