దోమలు కొంతమందిని మాత్రమే ఎక్కువగా ఎందుకు కుడతాయి?

ఫొటో సోర్స్, NurPhoto via Getty Images
- రచయిత, క్యాథరిన్ వాంగ్
- హోదా, బీబీసీ డాట్ కామ్
- ప్రచురణ
- చదివే సమయం: 5 నిమిషాలు
దోమలకు నేనో అయస్కాంతాన్ని..
వేసవి సెలవుల్లో నేను ఎక్కడికి వెళ్లినా దోమలు కుట్టడం పక్కా. వాటి వల్ల దురద పుట్టించే పెద్ద దద్దుర్లు కొన్ని వారాల తరబడి నన్ను వేధిస్తాయి.
అదే సమయంలో నాతో ఉన్న ఇతరులకు మాత్రం ఈ బాధ ఉండదు. వారిని ఒక్క దోమ కూడా కుట్టదు. ఒకవేళ ఎవరికైనా కుట్టినా చిన్నగా ఒక్క ఎర్ర దద్దురు మాత్రమే కనిపిస్తుంది. 'నా రక్తం తియ్యగా' ఉంటుందేమోనని నా స్నేహితులు ఆట పట్టిస్తుంటారు.
వారు చెప్పింది నిజమే కావొచ్చు. మన శరీరాలు శ్వాస, దుర్వాసన సహా అనేక రకాల జీవసంబంధిత గుర్తులను బయటికు విడుదల చేస్తాయి. ఇవే ఒక వ్యక్తి దోమ కాటుకు గురయ్యే అవకాశాన్ని నిర్ణయిస్తాయి. కొంతమందికి, ఈ గుర్తులు దోమలను అయస్కాంతంలా ఆకర్షించేంత బలంగా ఉంటాయి.
రక్తం పీల్చే ఈ జీవులకు మీరు ఆకర్షణీయంగా కనిపించడానికి గల మూడు మార్గాలు ఏంటో ఇక్కడ చూద్దాం..

ఉప్పందించే సీఓ2
కేవలం ఆడ దోమలే మనుషులను కుడతాయి. వాటి గుడ్ల అభివృద్ధికి అవసరమైన ప్రొటీన్ కోసం అవి మన రక్తాన్ని పీల్చుతాయి. అవి సుమారు 10 మీట్ల దూరం నుంచే అవి చూపు, వాసన ద్వారా తమ లక్ష్యాన్ని గుర్తిస్తాయి. మనం శ్వాస ద్వారా విడిచే కార్బన్ డైఆక్సైడ్, (CO₂),చర్మం నుంచి వెలువడే వాసనలు వాటికి ముఖ్యమైన సంకేతాలు.
మనుషుల శ్వాస ద్వారా విడుదలయ్యే సీఓ2 దోమలలో ఆహారాన్వేషణ ప్రవర్తనను ప్రేరేపిస్తుంది. పిల్లల కంటే పెద్దవారు ఎక్కువగా సీఓ2ను ఉత్పత్తి చేస్తారు. అందుకే, పెద్దవారే దోమలకు ఆకర్షణీయంగా ఉంటారు.

ఫొటో సోర్స్, FreshSplash via Getty Images
శరీర వేడి కూడా...
దోమలు వేడి, తేమ వైపు ఎక్కువగా ఆకర్షితమవుతాయని అధ్యయనాలు చెబుతున్నాయి. అంతే కాకుండా కార్బన్ డైఆక్సైడ్ ఉండటం ఈ వెచ్చదనపు ఆకర్షణను మరింత పెంచుతుంది.
అందుకే సాధారణ మహిళలతో పోలిస్తే గర్భిణులపై దోమల ఆకర్షణ రెండు రెట్లు ఎక్కువగా ఉంటుంది. గర్భధారణ సమయంలో జీవక్రియలు వేగంగా జరుగుతాయి, శ్వాస తీసుకునే స్థాయి పెరుగుతుంది. దీంతో శరీరం ఎక్కువ వేడిని ఉత్పత్తి చేస్తుంది. ఎక్కువ కార్బన్ డైఆక్సైడ్ బయటకు విడుదల అవుతుంది.
''గర్భిణి శరీరం లోపల చిన్న పొయ్యి ఉన్నటే ఉంటుంది'' అని యూకేలోని డర్హామ్ విశ్వవిద్యాలయానికి చెందిన ప్రజారోగ్య కీటకశాస్త్ర ప్రొఫెసర్ స్టీవ్ లిండ్సే చెప్పారు.
వ్యాయామం చేసే సమయంలో ఆయా వ్యక్తులు దోమలకు కొంతసేపు ఆకర్షణీయంగా ఉంటారు. ఎందుకంటే ఆ సమయంలో శరీరం ఎక్కువ సీఓ2ను విడుదల చేస్తుంది. శరీరం వేడిగా మారుతుంది, చెమట కూడా ఎక్కువగా వస్తుంది.
అదేవిధంగా ఎక్కువ బరువు, స్థూలకాయులు కూడా ఎక్కువ సీఓ2ను విడుదల చేయడం వల్ల దోమలకు ఆకర్షణగా మారతారు.

ఫొటో సోర్స్, boonchai wedmakawand via Getty Images
చర్మం వాసనే అసలు కారణం
దోమలు మనకు దగ్గరగా అంటే 10 మీటర్లు లేదా 33 అడుగుల కంటే తక్కువ దూరంలోకి వచ్చినప్పుడు, శ్వాస, చర్మం నుంచి వెలువడే వాసన సంకేతాల ద్వారా అవి ఎవరిని కుట్టాలో నిర్ణయించుకుంటాయి.
‘‘చివరకు నిర్ణయించేది వాసనే. మన చర్మం నుంచి వెలువడే సూక్ష్మ రసాయనాలే దోమలను ఆకర్షిస్తాయి. దోమలు పూర్తిగా రసాయన సంకేతాల ప్రపంచంలో జీవిస్తాయి’’ అని లిండ్సే చెప్పారు.
'తీపి రక్తం' ఉన్నవారికే దోమలు ఎక్కువగా కుడతాయనే అపోహను లిండ్సే, ఇతర శాస్త్ర వేత్తలతో కలిసి కొట్టిపారేశారు. నిజానికి, ప్రతి మనిషికి ఉండే ప్రత్యేకమైన చర్మ వాసనే దోమలను ఆకర్షిస్తుంది.
మన చర్మంపై ఉండే సూక్ష్మజీవులు చర్మంలోని కార్బోహైడ్రేట్లను, కొవ్వు ఆమ్లాలు, పెప్టైడ్లను విచ్ఛిన్నం చేసి 'వొలటైల్ ఆర్గానిక్ కాంపౌండ్స్ అనే వాసనగల రసాయనాలను ఉత్పత్తి చేస్తాయి. ఇవి గాల్లో తేలికగా కలిసిపోతాయి. మన చర్మంపై 500 కంటే ఎక్కువ వొలటైల్ ఆర్గానిక్ కాంపౌండ్లు ఉంటాయి.
మన శరీరంపై ఉండే అమ్మోనియా, లాక్టిక్ యాసిడ్‌ల వైపు దోమలు ఇప్పటికే ఆకర్షణకు గురవుతుంటాయి. వీటితోపాటు కార్బాక్సిలిక్ ఆమ్లాలు ఎక్కువగా ఉంటే వాటి ఆకర్షణ మరింత పెరుగుతుంది.
అమెరికాలోని రాక్‌ఫెల్లర్ విశ్వవిద్యాలయానికి చెందిన పరిశోధకులు 64 మంది వ్యక్తులకు ఆరు గంటల పాటు నైలాన్ స్లీవ్స్ ధరింపజేసి, వాటిపై ఉన్న శరీర వాసనను దోమలకు చూపించారు. ఈ నైలాన్ శాంపుల్స్ 'సెంట్ కలెక్షన్ డివైజ్' లాగా పనిచేశాయి. ఈ ప్రయోగంలో ఎక్కువ కార్బాక్సిలిక్ యాసిడ్‌లు ఉన్న వ్యక్తుల వైపుకే దోమలు వెళ్లాయి.
పరిశోధకులు ప్రతి వ్యక్తికి ఒక ఆకర్షణ స్కోరును లెక్కించారు. అత్యల్ప స్కోరు వచ్చిన వ్యక్తి కంటే అత్యధిక స్కోరు వచ్చిన వ్యక్తి వంద రెట్లు ఎక్కువగా దోమలను ఆకర్షించినట్లు కనుగొన్నారు. వ్యక్తుల జీవనశైలిలో మార్పులతో సంబంధం లేకుండా.. ఏళ్ల కొద్ది ఈ వ్యత్యాసాలు స్థిరంగానే ఉన్నాయి. దోమలకు మీరు ఎంత ఆకర్షణీయంగా ఉంటారనేది చాలావరకు జన్యుపరంగానే నిర్ణయమవుతుంది'' అని పరిశోధకురాలు లిండ్సే చెప్పారు.
మన చర్మంపై ఉండే సూక్ష్మజీవులు కూడా మనం దోమలను ఎంతగా ఆకర్షిస్తామనే దానిపై ప్రభావం చూపుతుంది.
మలేరియా దోమలు ఎక్కువగా ఆకర్షితమయ్యే వ్యక్తుల చర్మంపై భిన్నమైన బ్యాక్టీరియా సముదాయం ఉన్నట్లు నెదర్లాండ్స్‌లోని వాగెనింగన్ విశ్వవిద్యాలయ పరిశోధకులు కనుగొన్నారు.
దోమలను తక్కువగా ఆకర్షించే వారితో పోలిస్తే, వీరి చర్మంపై బ్యాక్టీరియా సంఖ్య ఎక్కువగా ఉంది, కానీ వైవిధ్యం తక్కువగా ఉంది. శరీర వాసన ఏర్పడటంతో ఈ బ్యాక్టీరియా కీలక పాత్ర పోషిస్తుంది. నిజానికి బ్యాక్టీరియా లేకపోతే, మనుషుల చెమటకు ఎలాంటి వాసన ఉండదు.
కవలలపై చేసిన అధ్యయనంలో.. ఒకే జన్యువులు కలిగిన కవలలు సమానంగా దోమలను ఆకర్షించగా.. వేర్వేరు జన్యవులు కలిగిన కవలల్లో తేడా కనిపించింది. దీనిని బట్టి, దోమలను ఆకర్షించేలా చేసే శరీర వాసన జన్యుపరంగా వస్తుందని ఈ అధ్యయనం సూచిస్తోంది.

ఫొటో సోర్స్, Paula Bronstein via Getty Images
అన్ని కాట్లు సమానమైనవి కావు
దోమ కుట్టిన తర్వాత ప్రతి ఒక్కరి శరీరం ఒకే విధంగా స్పందించదు. ఒక జెనోమ్-వైడ్ అసోసియేషన్ స్టడీ ప్రకారం.. మన రోగనిరోధక వ్యవస్థకు చెందిన జన్యువులకు, దోమ కాట్లకు మన శరీరాలు స్పందించే విధానానికి మధ్య బలమైన జన్యుపరమైన సంబంధం ఉన్నట్లు కనుగొన్నారు. ఆసక్తికరంగా.. ఈ జన్యువులు అలెర్జీలకు సంబంధించిన జన్యువులతో కూడా సంబంధం కలిగి ఉన్నాయి.
అందువల్ల కొందరికి దోమ కుట్టిన చోట పెద్దవాపు, తీవ్రమైన దురద వస్తుంది. అలాంటివారు ‘‘నన్నే దోమలు ఎక్కువగా కుడుతున్నాయి’’ అనుకుంటూ ఉంటారు. కానీ మరికొందరిని దోమలు తరచూ కుట్టినా వారి శరీరంలో పెద్దగా స్పందన కనిపించదు అంటారు ఫెర్గ్యూసన్
జీవసంబంధమైన కారణాల వల్ల మనలో కొందరు దోమలకు సులభమైన లక్ష్యంగా మారినప్పటికీ, దోమల నుంచి పూర్తిగా తప్పించుకునే వ్యక్తి ఎవరూ లేరు. అందుకే ఫెర్గ్యుసన్ చెప్పినట్టు మిమ్మల్ని దోమలు అస్సలు కుట్టవని మీరు నమ్మినప్పటికీ, మీ రక్షణ కోసం మీరు కచ్చితంగా జాగ్రత్తలు తీసుకోవాలని పరిశోధకులు సూచిస్తున్నారు.
( బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్, ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)





























