భారత్‌కు ఫుట్‌బాల్ ప్రపంచకప్‌లో ఆడే అవకాశం వచ్చినా, ఎందుకు ఆడలేదు?

భారత్, ఫిఫా ఫుట్ బాల్ ప్రపంచకప్; బ్రెజిల్

ఫొటో సోర్స్, ullstein bild Dtl./Getty Images

ఫొటో క్యాప్షన్, మూడు దేశాలలోని 16 నగరాల్లో 104 మ్యాచ్‌లు జరిగిన తర్వాత వరల్డ్ కప్ విజేత ఎవరో ప్రపంచానికి తెలుస్తుంది. (ఫైల్ ఫొటో)
    • రచయిత, ప్రదీప్ కుమార్
    • హోదా, బీబీసీ ప్రతినిధి
  • ప్రచురణ
  • చదివే సమయం: 6 నిమిషాలు

ఫిఫా వరల్డ్ కప్ టోర్నీ జూన్ 11న ప్రారంభమైంది తొలిసారి మూడు దేశాలు ఫుట్‌బాల్‌ వరల్డ్ కప్‌కు సంయుక్తంగా ఆతిథ్యమిస్తున్నాయి. జూన్ 11 నుంచి జూలై 19 వరకు జరిగే ఈ పోటీలను అమెరికా, మెక్సికో, కెనడా నిర్వహిస్తున్నాయి.

మూడు దేశాలలోని 16 నగరాల్లో 104 మ్యాచ్‌లు జరిగిన తర్వాత ప్రపంచకప్ విజేత ఎవరో ప్రపంచానికి తెలియనుంది. అమెరికాలోని 13, మెక్సికోలోని 3, కెనడాలోని 2 నగరాల్లో ఈ పోటీలు జరుగుతాయి.

ఈ నిర్వహణతో మెక్సికో వరల్డ్ కప్‌కు మూడుసార్లు ఆతిథ్యమిచ్చిన తొలి దేశంగా నిలవనుంది. గతంలో 1970, 1986 వరల్డ్ కప్ పోటీలను మెక్సికో నిర్వహించింది.

ఫుట్‌బాల్ ప్రపంచంలో అగ్రస్థానం కోసం జరిగే ఈ పోరులో ప్రపంచవ్యాప్తంగా 48 జట్లు తలపడటం ఇదే మొదటిసారి. అంతకుముందు జరిగిన 7 వరల్డ్ కప్ టోర్నమెంట్‌లలో ప్రపంచ అత్యుత్తమ 32 జట్ల మధ్యే పోటీ జరిగేది.

అంటే ఈసారి ప్రపంచవ్యాప్తంగా మరో 16 దేశాలకు వరల్డ్ కప్‌లో పాల్గొనే అవకాశం లభించింది. గత వరల్డ్ కప్ 64 మ్యాచ్‌ల కంటే ఈసారి ఎక్కువ మ్యాచ్‌లు కూడా జరుగుతున్నాయి.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

ఈసారి కనీసం ఆరు వందల కోట్ల మంది ప్రేక్షకులు ఈ పోటీలను వీక్షిస్తారని ఫిఫా అంచనా వేస్తోంది. అంటే నాలుగేళ్ల కిందట ఖతార్‌లో జరిగిన వరల్డ్ కప్ కంటే వంద కోట్ల మంది ఎక్కువ ప్రేక్షకులు ఈ మ్యాచ్‌లను ఆస్వాదిస్తారనేది అంచనా.

వరల్డ్ కప్ 23వ ఎడిషన్‌లో కేప్ వెర్డే, కురాకో, జోర్డాన్, ఉజ్బెకిస్తాన్ అనే నాలుగు దేశాల ఫుట్‌బాల్ జట్లు మొదటిసారి అరంగేట్రం చేయనున్నాయి.

కానీ, భారత క్రీడాభిమానులకు ఇందులో ఎలాంటి ఉత్సాహం లేదు. ఎందుకంటే భారత్ ఇప్పటివరకు ఈ టోర్నమెంట్‌లో ఒక్కసారి కూడా పాల్గొనలేకపోయింది.

భారత్, ఫుట్‌బాల్, బ్రెజిల్, ప్రపంచకప్

ఫొటో సోర్స్, PABLO PORCIUNCULA/Getty Images

ఫొటో క్యాప్షన్, భారత ఫుట్‌బాల్ జట్టుకు 1950లో బ్రెజిల్‌లో జరిగే వరల్డ్ కప్‌‌లో పాల్గొనే అవకాశం వచ్చింది.

ఫిఫా-భారత్ - 1950 వ సంవత్సరం..

భారత్ ఫుట్‌బాల్ వరల్డ్ కప్‌లో ఎప్పుడూ పాల్గొనకపోయి ఉండవచ్చు. కానీ భారత్‌కు కూడా ఒకనాడు ఫుట్‌బాల్ ప్రపంచకప్‌లో పాల్గొనే అవకాశం వచ్చిందనే విషయం నేటితరం క్రీడాభిమానులలో కొద్దిమందికి మాత్రమే తెలిసి ఉండొచ్చు. నమ్మడం కష్టమే అయినా ఇది నిజం. భారత ఫుట్‌బాల్ జట్టు 76 ఏళ్ల కిందట, అంటే 1950లో బ్రెజిల్‌లో జరిగిన వరల్డ్ కప్‌లో ఆడాల్సి ఉంది. కానీ ఆ పని జరగలేదు.

నిజానికి రెండో ప్రపంచ యుద్ధం కారణంగా 1942, 1946లలో ఫుట్‌బాల్ వరల్డ్ కప్ జరగలేదు. 12 ఏళ్ల నిరీక్షణ తర్వాత 1950లో వరల్డ్ కప్ జరిగింది. బ్రెజిల్‌లో జరిగే వరల్డ్ కప్ కోసం కేవలం 33 దేశాలు మాత్రమే క్వాలిఫైయింగ్ రౌండ్‌లో ఆడటానికి ఒప్పుకున్నాయి.

క్వాలిఫైయింగ్ గ్రూప్ 10లో బర్మా (మియన్మార్), ఫిలిప్పీన్స్‌తో పాటు భారత్‌కు చోటు దక్కింది. కానీ బర్మా, ఫిలిప్పీన్స్ క్వాలిఫైయింగ్ రౌండ్ నుంచి తప్పుకున్నాయి. దీంతో భారత్ ఆడకుండానే ప్రపంచ కప్‌‌కు అర్హత సాధించే చారిత్రక క్షణం చాలాదగ్గరగా వచ్చింది.

భారత్, ఫుట్‌బాల్, బ్రెజిల్, ప్రపంచకప్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, 1948 లండన్ ఒలింపిక్స్‌లో పాల్గొన్న భారత ఫుట్‌బాల్ఆటగాళ్లు ఎస్. మేవాలాల్, ఎస్. నంది షూ లేకుండా ప్రాక్టీస్ చేస్తున్న దృశ్యం. (ఫైల్ ఫొటో)

భారత్ ఈ టోర్నీలో పాల్గొంటే ఎలా ఉండేది?

1950 వరల్డ్ కప్ ఫుట్‌బాల్ ఫైనల్ రౌండ్ డ్రా సిద్ధమైనప్పుడు, పూల్-3లో స్వీడన్, ఇటలీ, పరాగ్వే దేశాలతో పాటు భారత్‌కు చోటు లభించింది.

ఒకవేళ, భారత్ ఈ టోర్నీలో పాల్గొని ఉంటే ఎలా ఆడి ఉండేది?

ఈ విషయం గురించి ఫుట్‌బాల్ జర్నలిస్ట్ నోవీ కపాడియా తన 'వరల్డ్ కప్ ఫుట్‌బాల్ గైడ్' పుస్తకంలో "ఆ సమయంలో పరాగ్వే జట్టు అంత బలంగా ఏమీ లేదు. క్రమశిక్షణా రాహిత్యం కారణంగా ఇటలీ తన ఎనిమిది మంది ప్రధాన ఆటగాళ్లను జట్టులోకి తీసుకోలేదు. ఇటలీ జట్టు ఎంత బలహీనంగా ఉందంటే.. బ్రెజిల్‌ చేరిన తరువాత వాళ్ల కోచ్ విట్టోరియో పోజో రాజీనామా చేశారు. స్వీడన్ జట్టు భారత్‌తో పోలిస్తే బలంగానే ఉంది. అంటే, ఈ గ్రూపులో భారత్ రెండో బలమైన జట్టు కింద లెక్క. ఇందులో ఆడి ఉంటే భారత జట్టుకు మంచి అనుభవం వచ్చేది" అని రాశారు.

భారత్, ఫుట్‌బాల్, బ్రెజిల్, ప్రపంచకప్

ఫొటో సోర్స్, STRDEL/Getty Images

ఫొటో క్యాప్షన్, 1948 లండన్ ఒలింపిక్స్‌లో ఫ్రాన్స్ వంటి బలమైన జట్టు చేతిలో భారత్ కేవలం 1-2 తేడాతో మాత్రమే ఓడిపోయింది. (ప్రతీకాత్మక చిత్రం)

భారత్‌ ఫుట్‌బాల్‌కు ఎలాంటి పేరుండేది?

భారత ఫుట్‌బాల్ జట్టుకు 1950లలో అంతర్జాతీయంగా ఆడిన అనుభవం పెద్దగా లేకపోయినా, బాగా ఆడే దేశంగా గుర్తింపు ఉండేది. 1948 లండన్ ఒలింపిక్ క్రీడలలో భారత జట్టు సత్తా చాటింది. ఫ్రాన్స్ లాంటి బలమైన జట్టుతో దీటుగా పోరాడింది. 1-2 తేడాతో ఓడిపోయినప్పటికీ, భారత్, తన సత్తాను ప్రదర్శించింది.

అహ్మద్ ఖాన్, ఎస్ రామన్, ఎంఏ సత్తార్, ఎస్ మేవాలాల్ వంటి ఆటగాళ్లకు అభిమానులు ఉండేవారు. వీరంతా లండన్ ఒలింపిక్స్‌లో షూ లేకుండానే ఫుట్‌బాల్ ఆడారు. రైట్ బ్యాక్‌లో ఆడిన తాజ్ మొహమ్మద్ మాత్రమే షూ వేసుకున్నాడు.

భారత్ ఎందుకు ఆడలేదు?

భారత ఫుట్‌బాల్ జట్టు 1950 ప్రపంచ కప్‌ ఎందుకు ఆడలేదనే ప్రశ్నకు స్పష్టమైన సమాధానం దొరకలేదు.

జట్టు ఎంపికపై విభేదాలు, ప్రాక్టీస్‌కు సమయం సరిపోకపోవడంతో ఆ టోర్నమెంట్ నుంచి జట్టు వైదొలిగిందని ఆలిండియా ఫుట్‌బాల్ ఫెడరేషన్ (ఏఐఎఫ్ఎఫ్) అప్పట్లో చెప్పింది.

దీని గురించి చాలా ఏళ్లుగా రకరకాల చర్చలు జరిగాయి. భారత ఆటగాళ్లు షూ లేకుండా ఉత్త కాళ్లతో ఆడాలనుకున్నారు గానీ ఫిఫా అందుకు అంగీకరించలేదన్న కథనంపై ఎక్కువ చర్చ జరిగింది.

కానీ, నోవి కపాడియాతో పాటు సీనియర్ స్పోర్ట్స్ జర్నలిస్ట్ జయదీప్ బసు ఇటీవల రాసిన పుస్తకం కూడా ఈ కారణాన్ని అంత నమ్మదగినదిగా భావించట్లేదు.

జైదీప్ బసు సంపాదకత్వం వహించిన 'బాక్స్ టు బాక్స్: 75 ఇయర్స్ ఆఫ్ ది ఇండియన్ ఫుట్‌బాల్ టీమ్' అనే పుస్తకంలో, "భారత ఆటగాళ్లు షూ లేకుండా ఆడతామంటే ఫిఫా అభ్యంతరం వ్యక్తం చేసిందనే ప్రశ్నే లేదు" అని రాశారు.

"ఆ జట్టులోని ఏడెనిమిది మంది ఆటగాళ్ల ట్రావెల్ బ్యాగ్‌లలో స్పైక్ షూ ఉన్నాయి. బూట్లు వేసుకోవాలా వద్దా అనేది పూర్తిగా ఆటగాళ్ల వ్యక్తిగత ఇష్టం" అని జైదీప్ బసు రాశారు.

ఆ కాలంలో ఫుట్‌బాల్ ఆటగాళ్లు తమ పాదాలకు మందపాటి పట్టీ(బ్యాండేజీలు) కట్టుకుని ఆడటానికి ఇష్టపడేవారు. 1954 వరకు చాలా దేశాల్లో ఈ పద్దతి పాటించేవారు.

భారత్, ఫుట్‌బాల్, బ్రెజిల్, ప్రపంచకప్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, భారత ఆటగాళ్లు షూ లేకుండా ఫుట్‌బాల్ ఆడాలనుకున్నారని, ఫిఫా అందుకు అంగీకరించలేదనే విషయంపైనే అన్నిటికంటే ఎక్కువగా చర్చ జరిగింది. (ఫైల్ ఫొటో)

నిధుల కొరత కారణమా?

భారత జట్టు వద్ద తగినంత డబ్బు లేకపోవడం ఒక కారణమన్న కథనాలు కూడా వచ్చాయి. కానీ, ఆ వాదన కూడా నమ్మదగినదిగా కనిపించడంలేదు.

భారత జట్టుకు బ్రెజిల్‌లో ఆడటానికి వెళ్లే ముందు డబ్బు సమస్య ఉత్పన్నమయింది కానీ, అది వెంటనే పరిష్కారమయిందని జైదీప్ బసు తన పుస్తకంలో రాశారు.

ఆ సమయంలో భారత్‌లోని మూడు రాష్ట్ర స్థాయి ఫుట్‌బాల్ అసోసియేషన్లు ఖర్చులో భాగం పంచుకుంటామని హామీ ఇచ్చాయని ఆయన తెలిపారు.

బ్రెజిల్‌కూడా ఇండియన్ ఫుట్‌బాల్ అసోసియేషన్‌ను సంప్రదించి, జట్టు ఖర్చులలో ఎక్కువ భాగం భరిస్తామని హామీ ఇచ్చినట్టు నోవీ కపాడియా తన పుస్తకంలో రాశారు.

బ్రెజిల్ ఈ హామీ ఇవ్వడానికి రెండు కారణాలు ఉన్నాయని ఒకటి, స్కాట్లాండ్, ఫ్రాన్స్, తుర్కియే, చెకోస్లోవేకియా జట్లు ఫుట్‌బాల్ ప్రపంచ కప్ నుంచి తమ పేర్లను ఉపసంహరించుకోవడం, రెండోది, మహాత్మా గాంధీ, జవహర్‌లాల్ నెహ్రూ లాంటి నేతలున్న దేశం తమ దేశంలో ఫుట్‌బాల్ ఆడాలని కోరుకోవడమని నోవీ కపాడియా పుస్తకం పేర్కొంది.

జైదీప్ బసు రాసిన పుస్తకం ప్రకారం, 1950 మే 16న భారత్ ఫుట్‌బాల్ ప్రపంచ కప్‌కు వెళ్లే జట్టును ప్రకటించింది. షెడ్యూల్ ప్రకారం, భారత జట్టు జూన్ 15న బ్రెజిల్‌కు బయలుదేరుతుంది. మొదటి మ్యాచ్ జూన్ 25న పరాగ్వేతో జరగాల్సి ఉంది.

కానీ, ఆ తర్వాత ఏం జరిగిందనేది భారత ఫుట్‌బాల్ చరిత్రలోనే అతి పెద్ద రహస్యమని, దీనికి ఇప్పటివరకు ఎలాంటి సమాధానం దొరకలేదని జయదీప్ బసు తెలిపారు.

అయితే, భారత జట్టు ఎంత మంచి అవకాశం కోల్పోయిందో భారత ఫుట్‌బాల్ ఆటగాళ్లు లేదా ఆ కాలంలోని ఫుట్‌బాల్ అధికారులు గ్రహించలేదని నోవీ కపాడియా, జైదీప్ బసు పుస్తకాల బట్టి అర్థమవుతోంది.

మరోవైపు, అదే సమయంలో భారత హాకీ జట్టు ఒలింపిక్ క్రీడలలో చాంపియన్‌గా నిలిచి ప్రపంచం దృష్టిని ఆకర్షించింది. ఒలపింక్ గేమ్స్‌లో రాణించడం ప్రతి ఆటగాడికి ఓ సంతృప్తిని ఇస్తుంది.

అందుకే, భారత ఫుట్‌బాల్ జట్టులో ఆటగాళ్లు, అధికారులు కూడా ఒలింపిక్ క్రీడలపై ఎక్కువ దృష్టి సారించారు.

1951 ఆసియా క్రీడలు దిల్లీలో జరగాల్సి ఉంది. ఆతిథ్య జట్టుగా ఇందులో మెరుగ్గా రాణించడమే భారత్ లక్ష్యం. పైగా 1950కి ముందు ఫుట్‌బాల్ వరల్డ్ కప్‌కు ప్రపంచవ్యాప్త ఆదరణ లేదు. అప్పటివరకు, ఇదొక గ్లామర్ లేని క్రీడా టోర్నమెంట్. ఆ తరువాతి సంవత్సరాలలో దీనికి అభిమానులు పెరిగారు, ఆదరణ పెరిగింది.

నియమాలపై అవగాహన లేకపోవడమేనా?

నియమ నిబంధనలపై సరైన అవగాహన లేకపోవడం వల్ల కూడా భారత ఫుట్‌బాల్ అధికారులు ఇలాంటి నిర్ణయం తీసుకున్నారనే వాదనలు ఉన్నాయి.

వాస్తవానికి, అప్పట్లో ప్రపంచ కప్ ఫుట్‌బాల్‌లో పాల్గొనే ఆటగాళ్లకు 'ప్రొఫెషనల్ ప్లేయర్‌' అనే ట్యాగ్ వచ్చేది. దీనివల్ల ఒలింపిక్స్, ఆసియా క్రీడలలో పాల్గొనే అనుమతి లభించదు. ఎందుకంటే, ఈ టోర్నమెంట్ ఔత్సాహికులకు మాత్రమే, ప్రొఫెషనల్స్‌కు కాదు.

అయితే, ఈ నిబంధన నుంచి తప్పించుకోడానికి కూడా ఓ మార్గం ఉండేది. ఉదాహరణకు హంగేరి, రష్యా, ఇతర సోషలిస్ట్ దేశాలు వరల్డ్ కప్‌లో పాల్గొనే తమ ఆటగాళ్లను ఆర్మీ సభ్యులుగా చూపిస్తూ, సైన్యంలో ఉండేవారు ప్రొఫెషనల్స్ కాదనే వాదన వినిపించేవి.

ఆ సమయంలో భారత ఫుట్‌బాల్ సంఘం అధికారులకు ఈ విషయం తెలియకపోవచ్చు.

1950 ప్రపంచకప్‌లో పాల్గొంటే ఆసియా క్రీడలు, ఒలింపిక్ క్రీడలలో పాల్గొనే అవకాశం కోల్పోతామనే భయంతో ఆ టోర్నమెంటులో పాల్గొనకూడదన్న నిర్ణయం తీసుకుని ఉండవచ్చు. కానీ, ఈ నిర్ణయం 76 ఏళ్లుగా భారత్ ఫుట్‌బాల్ క్రీడాభిమానులను గుచ్చుతూనే ఉంది. ప్రతీ నాలుగేళ్లకోసారి వచ్చే ఫుట్‌బాల్ ప్రపంచకప్ ఆ బాధను మరింతగా పెంచుతూనే ఉంది.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,  ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)