‘అవసరమైతే యుద్ధమైనా చేస్తాం’ - సింధు జలాలపై మరోసారి పాకిస్తాన్ వ్యాఖ్యలు

ప్రచురణ
చదివే సమయం: 5 నిమిషాలు

సింధు జలాల ఒప్పందంలోని నిబంధనలను అమలు చేయాలంటూ పాకిస్తాన్ మరోసారి డిమాండ్ చేసింది.

పాకిస్తాన్ విదేశాంగ మంత్రి ఈ వ్యవహారంపై తీవ్ర వ్యాఖ్యలు చేసిన తర్వాత, పాకిస్తాన్ సైన్యం, పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ నాయకుడు బిలావల్ భుట్టో జర్దారీ కూడా ఇదే తరహా సీరియస్ వ్యాఖ్యలు చేశారు.

సింధు జలాల ఒప్పందం కింద పాకిస్తాన్‌కు లభించిన నీటి హక్కులను కాపాడుకునేందుకు 'అవసరమైన అన్ని చర్యలు' తీసుకుంటామని పాకిస్తాన్ సైన్యం తన ప్రకటనలో తెలిపింది.

సింధు జలాల ఒప్పందాన్ని పరిరక్షిస్తామని, దీనిపై తగిన చర్య తీసుకుంటామని బిలావల్ భుట్టో జర్దారీ అన్నారు.

సింధు జలాల విషయంలో పాకిస్తాన్ ఎలాంటి రాజీకి సిద్ధంగా లేదని, అవసరమైతే యుద్ధం చేయడానికైనా సిద్ధమేనని ఆయన అన్నారు.

పాకిస్తాన్ సైన్యం ప్రకటనలో ఏముంది?

"పాకిస్తాన్ సీమాంతర ఉగ్రవాదానికి మద్దతు ఇవ్వడం ఆపేంత వరకు సింధు జలాల ఒప్పందం అమలుకాదు" అని భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ ఈ నెల 3న తెలిపింది .

జమ్మూకశ్మీర్‌లోని పహల్గామ్‌లో జరిగిన ఉగ్రవాద దాడి తర్వాత పాకిస్తాన్‌తో ఉన్న సింధు జలాల ఒప్పందాన్ని భారత్ నిలిపివేసింది. దీంతో ఈ ఒప్పందం ప్రకారం భారత్ ఇకపై పాకిస్తాన్‌తో ఎలాంటి సమాచారాన్ని పంచుకోదు. అలాగే ఈ ఒప్పందానికి సంబంధించిన ఏ సమావేశాల్లోనూ భారత్ పాల్గొనబోదు.

గత ఏడాది ఏప్రిల్ 23న దిల్లీలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన భద్రతావ్యవహారాల క్యాబినెట్ కమిటీ (సీసీఎస్) సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.

ఈ నెల 6న రావల్పిండిలోని జనరల్ హెడ్ క్వార్టర్స్‌లో జరిగిన 276వ కోర్ కమాండర్ల సమావేశానికి పాకిస్తాన్ ఫీల్డ్ మార్షల్ సయ్యద్ అసిమ్ మునీర్ అధ్యక్షత వహించారు.

సింధు జలాల ఒప్పందం నుంచి ప్రేరేపిత ఉగ్రవాదంపై భారత్ ఆరోపణల వరకు పలు అంశాలపై చర్చించిన ఈ సమావేశంపై పాకిస్తాన్ సైన్యానికి చెందిన ఇంటర్-సర్వీసెస్ పబ్లిక్ రిలేషన్స్(ఐఎస్‌పీఆర్)ఒక ప్రకటనను జారీ చేసింది.

సింధు జలాల ఒప్పందానికి సంబంధించి భారత్ చేసిన ప్రకటనలను గమనించామని, ఏప్రిల్ 24, 2025 నాటి జాతీయ భద్రతా కమిటీ ఆదేశాలకు మద్దతు తెలుపుతున్నామని పేర్కొంది. పాకిస్తాన్ తన నీటి హక్కులను పరిరక్షించుకోవడానికి అవసరమైన అన్ని చర్యలను తీసుకోవాలని సమావేశంలో నిర్ణయించుకున్నట్టు తెలిపింది.

సింధు జలాల ఒప్పందంతో పాటు భారత్‌పై పాకిస్తాన్ సైన్యం మరికొన్ని ఆరోపణలు చేసింది.

"భారత్ మద్దతుగల ఉగ్రవాద సంస్థలు అఫ్గాన్ తాలిబాన్ ప్రభుత్వం నియంత్రణలో ఉన్న ప్రాంతాలను ఉపయోగించుకుని పాకిస్తాన్‌లో దాడులు చేస్తున్నాయి" అని పాకిస్తాన్ సైన్యం తన ప్రకటనలో ఆరోపించింది.

ఈ ప్రాంతంలో శాశ్వత శాంతి, స్థిరత్వం రావాలంటే అలాంటి శక్తులు అఫ్గాన్ భూభాగాన్ని ఉపయోగించుకోకుండా తాలిబాన్ ప్రభుత్వం అడ్డుకోవాలని కోరింది.

దీంతో పాటు కశ్మీర్ అంశాన్ని కూడా పాకిస్తాన్ సైన్యం మరోసారి ప్రస్తావించింది.

"కశ్మీరీ ప్రజల స్వయంనిర్ణయాధికారానికి మద్దతు కొనసాగిస్తామని ఈ సమావేశం పునరుద్ఘాటించింది. అలాగే ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి తీర్మానాల్లో పొందుపరిచిన విధంగా కశ్మీర్ సమస్య పరిష్కారంపైనే ఈ ప్రాంతంలో శాంతి కొనసాగడం ఆధారపడి ఉందని కూడా స్పష్టం చేసింది" అని పాకిస్తాన్ సైన్యం తెలిపింది.

బిలావల్ భుట్టో ఏం చెప్పారు?

గిల్గిట్‌లో జరిగిన ఒక బహిరంగ సభలో పీపీపీ నాయకుడు బిలావల్ భుట్టో జర్దారీ " సింధు నదిని పాకిస్తాన్‌పై ఒత్తిడి తీసుకొచ్చే ఒక ఆయుధంగా ఉపయోగించుకోవాలని భారత్ చూస్తోంది" అని ఆరోపించారు.

"ఈ ఒప్పందాన్ని కాపాడుకుంటామని మేం భారత్‌కు చెప్పాలనుకుంటున్నాం. మేం తగిన సమాధానం ఇస్తాం. సింధు జలాల విషయంలో రాజీ పడటానికి మేం సిద్ధంగా లేము. ఒకవేళ యుద్ధం చేయాల్సి వస్తే, యుద్ధానికీ సిద్ధంగా ఉన్నాం" అని ఆయన అన్నారు .

"సింధు జలాల ఒప్పందం విషయంలో కూడా మేం మోదీ ప్రభుత్వాన్ని విఫలం చేస్తాం" అని మోదీ ప్రభుత్వం పేరు ప్రస్తావిస్తూ బిలావల్ భుట్టో జర్దారీ అన్నారు.

ఇషాక్ దార్ ఏం చెప్పారు?

గత వారం జూన్ 30న పాకిస్తాన్ ఉప ప్రధాని, విదేశాంగ మంత్రి ఇషాక్ దార్ భారత్‌తో తమకు ఎలాంటి 'సంఘర్షణ' లేదా 'వివాదం' వద్దని అయితే సింధు జలాల ఒప్పందం కింద దేశ జలవనరులను అడ్డుకునే ఏ ప్రయత్నాన్నైనా 'యుద్ధ తరహా చర్య'గా పరిగణిస్తామని హెచ్చరించారు.

సింధు జలాల ఒప్పందాన్ని ఏకపక్షంగా నిలిపివేయడానికి భారత్‌కు ఎలాంటి హక్కూలేదని, అలాగే అంతర్జాతీయ చట్టంలో కూడా దీనికి అవకాశం లేదని సింధు జలాల ఒప్పందంపై ఇస్లామాబాద్‌లో జరిగిన అంతర్జాతీయ సదస్సులో ఇషాక్ దార్ వ్యాఖ్యానించారు.

"సింధు జలాల ఒప్పందంపై భారత్ వైఖరి మారలేదు. సీమాంతర ఉగ్రవాదానికి పాకిస్తాన్ నిరంతరం మద్దతు ఇస్తున్నందుకే సింధు జలాల ఒప్పందాన్ని నిలిపివేశాం. పాకిస్తాన్ నిజాయితీగా, శాశ్వతంగా సీమాంతర ఉగ్రవాదానికి మద్దతు నిలిపివేయాలి" అని ఇషాక్ దార్ ప్రకటన అనంతరం గత శుక్రవారం(ఈ నెల 3న) జరిగిన మీడియా సమావేశంలో భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ పేర్కొంది.

పహల్గామ్ దాడికి పాకిస్తాన్‌ కారణమని ఆరోపిస్తూ ప్రతీకార చర్యగా 2025 ఏప్రిల్‌లో భారత ప్రభుత్వం సింధు జలాల ఒప్పందాన్ని రద్దు చేసింది.

భారత్ చర్యపై అభ్యంతరం వ్యక్తంచేసిన పాకిస్తాన్ అంతర్జాతీయ మధ్యవర్తిత్వ న్యాయస్థానాన్ని ఆశ్రయించింది.

భారత్ ఈ ఒప్పందాన్ని ఏకపక్షంగా నిలిపివేయడం కుదరదని నెదర్లాండ్స్‌లోని హేగ్‌లో ఉన్న మధ్యవర్తిత్వ న్యాయస్థానం స్పష్టం చేసింది.

అయితే ఈ నిర్ణయాన్ని తిరస్కరించిన భారత్, సింధు జలాల ఒప్పందం నిలిపివేత కొనసాగిస్తున్నట్టు ప్రకటించింది.

పహల్గామ్ దాడి, సింధు జలాల ఒప్పందాన్ని భారత్ నిలిపివేసిన నేపథ్యంలో పాకిస్తాన్‌కు రావాల్సిన నీటిని ఆపడానికి లేదా మళ్లించడానికి భారత్ చేసే ఏ ప్రయత్నాన్నైనా 'యుద్ధ తరహా చర్య'గా పరిగణిస్తామని గత ఏడాది ఏప్రిల్‌లో పాకిస్తాన్ జాతీయ భద్రతా కమిటీ హెచ్చరించింది.

సింధు జలాల ఒప్పందం అంటే ఏంటి?

ఒప్పందం ప్రకారం సింధు, జీలం, చీనాబ్ నదులను పశ్చిమ నదులుగా గుర్తించి వాటి నీటి వినియోగ హక్కును ప్రధానంగా పాకిస్తాన్‌కు కేటాయించారు. రావి, బియాస్, సట్లెజ్ నదులను తూర్పు నదులుగా గుర్తించి వాటి నీటి హక్కును భారత్‌కు కేటాయించారు.

దీని ప్రకారం కొన్ని మినహాయింపులు తప్ప తూర్పు నదుల నీటిని ఎలాంటి ఆటంకం లేకుండా భారత్ పూర్తి స్థాయిలో ఉపయోగించుకోవచ్చు.

అదే సమయంలో విద్యుత్ ఉత్పత్తి వంటి అవసరాలకు, అలాగే వ్యవసాయానికి పరిమిత నీటి వినియోగానికి పశ్చిమ నదుల నీటిని ఉపయోగించుకునేందుకు కూడా భారత్‌కు పరిమిత హక్కులు ఉన్నాయి.

రెండు దేశాలు పరస్పరం చర్చలు జరపడం, ప్రాజెక్టులను పరిశీలించడం వంటి నిబంధనలు కూడా ఈ ఒప్పందంలో ఉన్నాయి.

ఈ ఒప్పందం కింద సింధు కమిషన్ కూడా ఏర్పాటుచేశారు. ఇరు దేశాల కమిషనర్లు సమావేశమవుతుండాలి.

ఏదైనా వివాదాస్పద అంశంపై ఇద్దరు కమిషనర్ల మధ్య చర్చలకు ఈ ఒప్పందం వీలు కల్పిస్తుంది.

ఒక దేశం చేపట్టిన ప్రాజెక్టుపై మరో దేశానికి అభ్యంతరాలుంటే మొదటి దేశం వివరణ ఇవ్వాలని కూడా ఇది నిర్దేశించింది. దీని కోసం ఇరు పక్షాల మధ్య సమావేశాలు జరుగుతాయి.

సమావేశాల్లో కూడా పరిష్కారం లభించకపోతే రెండు దేశాల ప్రభుత్వాలు కలిసి దాన్ని పరిష్కరించుకోవాల్సి ఉంటుంది.

అంతేకాకుండా ఏదైనా వివాదాస్పద అంశంపై తటస్థ నిపుణుడి సహాయం తీసుకోవడానికి లేదా మధ్యవర్తిత్వ న్యాయస్థానానికి వెళ్లడానికి కూడా ఒక నిబంధన ఉంది.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,  ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)