సముద్ర తీరంలో దొరికిన 47 ఏళ్లనాటి సీసా, అందులోని లేఖలో ఏముంది?

    • రచయిత, కెన్ బ్యాంక్స్
    • హోదా, బీబీసీ స్కాట్లాండ్ న్యూస్
    • నుంచి, కల్లెన్ నుంచి రిపోర్టింగ్
  • ప్రచురణ
  • చదివే సమయం: 5 నిమిషాలు

స్వీడిష్ ద్వీపంలో దొరికిన 47 ఏళ్లనాటి ఒక సీసాలో ఉన్న నార్త్ సీ మెసేజ్‌ను బీబీసీ స్కాట్లాండ్ న్యూస్ ఛేదించింది.

ఎలినార్ రోసెన్ ఎరిక్సన్, అసా నీల్సన్ అనే ఇద్దరు స్నేహితురాళ్లకు ఈ ఏడాది ప్రారంభంలో ఈ బాటిల్ దొరికింది. ఆ బాటిల్‌లో ఒక లెటర్ ఉంది.

తడిగా, మసకబారిపోయినట్లున్న ఈ లేఖను చదవడం మొదట కష్టమైంది. ఆ లేఖలో అడిసన్ రన్సీ అనే పేరు ఉంది. బాన్ఫ్‌షైర్‌లోని కల్లెన్‌‌కు చెందిన ఓ అడ్రస్ కూడా ఉంది. దీన్ని 1978 నాటిదిగా గుర్తించారు.

లోరాలీ అనే చేపల పడవలో ఉన్న మత్స్యకారుడు జేమ్స్ అడీసన్ రన్సీని (జిమ్ రన్సీని) ఉద్దేశిస్తూ ఆయన కొలీగ్ గావిన్ గెడ్డెస్ అనే వ్యక్తి ఈ లేఖను రాశారు. రన్సీ 1995లోనే చనిపోయారు.

సముద్రంలో పడిపోయిన దీన్ని, 47 ఏళ్ల తర్వాత గుర్తించినట్లు తెలుసుకున్న గావిన్ ఆశ్చర్యపోయారు.

ఈ మిస్టరీ బాటిల్ దొరకడం నిజంగా ఒక అద్భుతంలాగా ఉందని దీన్ని గుర్తించిన ఇద్దరు స్నేహితురాళ్లు ఎలినార్, అసా అన్నారు. ఈ వ్యవహారమంతా అద్భుతమైన కథలా ఉందని రన్సీ సోదరి అన్నారు.

ఈ యేడాది ఫిబ్రవరిలో స్వీడన్ పశ్చిమ తీర ప్రాంతంలో ఈ బాటిల్‌ను గుర్తించారు ఎలినార్, అసా.

‘‘బీచ్‌లలో దొరికే వస్తువుల కోసం వెతకడం మా ఇద్దరికీ ఇష్టం. వేడెరోర్నా దీవులలో అన్వేషణ కోసం వెళ్లాం. ఉత్తర ద్వీపం థోర్సోకు వెళ్లి అక్కడి పొదల్లో తిరుగుతున్నప్పుడు మాకు మందపాటి గాజు సీసా దొరికింది. దాని లోపల చదవడానికి అర్ధంకాకుండా ఉన్న ఒక లెటర్ ఉంది'' అని ఎలినార్ చెప్పారు.

ఆ లేఖను ఎండకు ఎండబెట్టారు. ఆ తర్వాత అందులోని రాతను కొంత చదవగలిగారు. 14-9-78 అని ఒక తేదీ కనిపించింది. ఆ తర్వాత అందులోని పేరును, అడ్రస్‌ను కూడా చదవగలిగారు. అడిసన్ రన్సీ, సీటౌన్, కల్లెన్, బాన్ఫ్‌షైర్‌, స్కాట్లాండ్ అనే అడ్రస్‌ ఉంది.

ఈ లేఖ గురించి మరింత తెలుసుకునేందుకు వీరిద్దరూ దాన్ని సోషల్ మీడియాలో పోస్టు చేశారు.

ఆ లేఖను మరింత నిశితంగా చూసినప్పుడు, అడిసన్ రన్సీ ముందు "es" అనే రెండు అక్షరాలు, అడ్రస్‌కు ముందు 115 అనే నంబర్ కనిపించింది.

ఆ సమయంలో కల్లెన్‌లోని సీటౌన్ అడ్రస్‌లో జేమ్స్ అడిసన్ రన్సీ అనే వ్యక్తి నివసించేవారని బీబీసీ స్కాట్లాండ్ న్యూస్ గుర్తించింది.

దానినిబట్టి "es" అనేది జేమ్స్‌ పేరులో చివరి రెండు అక్షరాలు కావచ్చని వెల్లడించింది. దీంతో, ఈ లేఖ గురించి మరింత లోతుగా పరిశీలన మొదలైంది.

ప్రస్తుతం ఆ అడ్రస్‌లోని ఇంట్లో 78 ఏళ్ల జేన్ వార్బే నివసిస్తున్నారు. ఈ విషయం చెప్పినప్పుడు ఆయన కూడా ఆశ్చర్యపోయారు.

స్థానికంగా పీమ్‌ అనే పేరుతో పరిచయమున్న జిమ్ రన్సీ (జేమ్స్ అడిసన్ రన్సీ) 67 ఏళ్ల వయసులో 1995లో మరణించారు.

ఇక ఆ లేఖ రాసిన గావిన్ గెడ్డెస్‌ను గుర్తించారు. లోరాలీలో ప్రయాణించిన జిమ్ రన్సీ సహ సిబ్బందిలో ఒకరే గావిన్ గెడ్డెస్.

''ఈ లేఖ చూసిన వెంటనే, ఇది నేను రాసిందేనని నాకు అనిపించింది'' అని 69 ఏళ్ల గావిన్ అన్నారు.

కల్లెన్‌కు కొన్ని మైళ్ల దూరంలోని రాథ్వెన్‌లో గావిన్ నివసిస్తున్నారు.

తను రాసింది గుర్తుందని అన్నారు. తన చేతిరాతతో ఆ లేఖను పోల్చిచూసి, అది తాను రాసిందేనని ధ్రువీకరించారు.

అప్పట్లో తాము పడవ నుంచి రెండు బాటిళ్లు నీటిలో పడేసినట్లు గావిన్ చెప్పారు.

‘‘అందులో ఒకటి జిమ్ కోసం వేశాం. 47 ఏళ్ల తర్వాత దొరికింది అదే. మొత్తానికి రెండింటిలో ఒకదానికి రిప్లై వచ్చింది’’ అన్నారు గావిన్.

రన్సీ సోదరి 83 ఏళ్ల సాండ్రా టేలర్, కల్లెన్‌కు వచ్చినప్పుడు, స్వీడన్‌లో దొరికిన ఈ బాటిల్ గురించి విని ఆశ్చర్యపోయారు.

''ఇది నిజంగా అద్భుతం. దాదాపు 40 ఏళ్ల పాటు సముద్రంలో తిరుగుతూ, చివరకు తీర ప్రాంతంలోకి రావడం నమ్మశక్యంగా లేదు. అందులోని పేరు, అడ్రస్ కచ్చితంగా అతనిదే'' అని ఆమె అన్నారు.

‘‘మా కుటుంబీకులు చేపలవేట వృత్తిలో ఉండేవారు. జిమ్‌కు సముద్రం తప్ప మరో ధ్యాస ఉండేది కాదు. ఆయన జీవితాంతం మత్స్యకారుడిగానే ఉండిపోయారు'' అని సాండ్రా టేలర్ చెప్పారు.

ఇక స్వీడన్‌లోని ఎలినార్, అసాలు మాత్రం ఈ మెసేజ్ ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసుకోగలిగినందుకు సంతోషంగా ఉందని అన్నారు.

‘‘గడ్డకట్టే ఫిబ్రవరి నెలలో, మీ స్నేహితురాలితో కలిసి ఒక మారుమూల ద్వీపానికి వెళ్లినప్పుడు, ఈ ప్రపంచంలో లేని వ్యక్తికి చెందిన మెసేజ్‌ను బాటిల్‌లో కనుక్కోవడం నిజంగా అద్భుతం'' అన్నారామె.

‘‘ నేను కూడా మత్స్యకార కుటుంబం నుంచే వచ్చాను. నాకూ సముద్రమంటే ఇష్టం. ద్వీపాల్లో తిరగడం, సముద్ర సంపద కోసం వెతకడం చేస్తుంటా'' అని ఎలినార్ తెలిపారు.

‘‘నేను నివసించే దగ్గర దీన్ని వ్రగా అని పిలుస్తారు. అంటే.. ‘పోగొట్టుకున్న లేదా దాచిన దాన్ని వెతికే ప్రయత్నం’ అని అర్థం'' అని చెప్పారు.

‘‘మేం కూడా ఏదో ఒకరోజు కల్లెన్‌కు వెళ్లి ఈ బాటిల్ కథ చెప్పాలని అనుకుంటున్నాం. సముద్రతీరాలలోని కమ్యూనిటీ కథలను అక్కడి వారితో షేర్ చేసుకోవాలనుకుంటున్నాం’’ అన్నారు ఎలినార్.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,  ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)