ఆర్జ్‌మోన్ మెక్సికానా: ‘ఆరుగురి మరణానికి కారణమైన’ ఈ మొక్క ఏమిటి? 200 లీటర్ల వంట నూనెలో ఈ గింజల నూనె రెండు చుక్కలు కలిసినా ప్రాణాలు పోతాయా?

    • రచయిత, మొహమ్మద్ సర్తాజ్ ఆలమ్
    • హోదా, బీబీసీ కోసం
  • ప్రచురణ
  • చదివే సమయం: 7 నిమిషాలు

''రెండు వారాల్లో నా తల్లిదండ్రులు సహా మా కుటుంబంలోని ఆరుగురికి అంత్యక్రియలు చేశాను. ఇంక నాకు ధైర్యం లేదు''

తండ్రి, తల్లి, భార్య, ఇద్దరు అక్కచెల్లెళ్లు, సోదరుడిని కోల్పోయిన దుఃఖం అనుజ్ మహతో ముఖంలో స్పష్టంగా కనిపిస్తోంది.

ఝార్ఖండ్‌లోని పలామూ జిల్లా సిక్కా గ్రామంలో ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు ‘ఎపిడమిక్ డ్రాప్సీ’ అనే అనారోగ్య పరిస్థితి కారణంగా మరణించారు.

పలామూ జిల్లా సివిల్ సర్జన్ డాక్టర్ అనిల్ కుమార్ శ్రీవాస్తవ ఈ మరణాలకు కారణాన్ని వివరించారు.

‘ఆర్జ్‌మోన్ మెక్సికానా' కలిసిన ఆవనూనె వాడడం వల్ల ఎపిడమిక్ డ్రాప్సీతో వారంతా మరణించారు" అని ఆయన అన్నారు.

రోజుల వ్యవధిలో తండ్రి, అక్క, తమ్ముడు, చెల్లి, భార్య మృతి

జూన్ 19న కుటుంబంలో మొదట కుటుంబ పెద్ద కుల్దీప్ మహతో మరణించారు. ఆ మరుసటి రోజే అనుజ్ సోదరి, కుల్దీప్ మహతో పెద్ద కుమార్తె బబితా కుమారి మరణించారు.

తన తండ్రి, సోదరి మరణవార్త విన్న వెంటనే బెంగళూరులో పనిచేస్తున్న అనుజ్ మహతో స్వగ్రామానికి తిరిగి వచ్చారు.

"మా నాన్న, అక్కను చివరిచూపు చూడలేకపోయానన్న బాధ జీవితాంతం నన్ను వెంటాడుతుంది. నేను కేవలం వారి అంత్యక్రియలు నిర్వహించగలిగాను. కానీ వాళ్ల తర్వాత నా భార్య, చెల్లి, తమ్ముడు, అమ్మ చనిపోతారని నేను ఊహించలేదు" అని అనుజ్ మహతో అన్నారు.

అనుజ్ మహతో 18 ఏళ్ల చెల్లి ఇందు కుమారి జూన్ 26న, అనుజ్ భార్య శ్వేతా దేవి జూన్ 28న రాంచీలోని రాజేంద్ర ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (రిమ్స్)లో మరణించారు.

తన సోదరి, భార్య మరణాలతో కుంగిపోయిన అనుజ్ తన ఏడాది కుమారుడితో ఇంట్లోనే ఉండిపోయారు.

ఆయన అక్క మనీతా దేవి... తల్లి, సోదరుడు చికిత్స పొందుతున్న రిమ్స్‌ ఆసుపత్రిలో ఉండిపోయారు.

జూన్ 29న అనుజ్ సోదరుడు నకుల్ మహతో మరణించగా, జూలై 8 ఉదయం ఆయన తల్లి లాఖో దేవి కూడా చనిపోయారు.

కోలుకుంది ఒక్కరే

ఈ కుటుంబంలో అనారోగ్యానికి గురైనవారిలో సునీల్ మహతో ఒక్కరే కోలుకున్నారు. తల్లి అంత్యక్రియలకు హాజరైనప్పుడు ఆయన కాలు ఇంకా వాచి ఉండడం అందరికీ కనిపించింది. ఆయన కళ్ళు పసుపు రంగులో ఉన్నాయి.

నేను ఇప్పుడు బాగున్నాను. జూన్ మూడో వారంలో కొన్ని రోజుల పాటు వికారంగా అనిపించింది. వాంతులయ్యాయి. ఆ తర్వాత నీరసంగా అనిపించడం మొదలైంది. తర్వాత నా కాళ్లు వాచిపోయాయి. మలంలో రక్తం పడటం మొదలయింది. అప్పుడు మా బావ నన్ను పలామూ సదర్ ఆసుపత్రిలో చేర్పించారు"

తమ కుటుంబ సభ్యులకు మొదట్లో వికారంగా అనిపించిందని, అది వేడి వల్ల అనుకుని నిమ్మకాయ, చల్లని పదార్థాలు తినడం మొదలుపెట్టారని, కానీ ఆ తర్వాత అందరి కాళ్లు వాచిపోయాయని సునీల్ బావ దీపక్ దేవ్ వర్మ చెప్పారు.

ప్రైవేట్, ప్రభుత్వ ఆసుపత్రుల్లో అందరికీ చికిత్స అందించినా అసలు వ్యాధేమిటో ఎవరూ గుర్తించలేకపోయారని అన్నారు.

ఆవ నూనెలో ఆర్జ్‌మోన్ మెక్సికానా ఉన్నట్టు నిర్ధరణ

ఆహార భద్రతా అధికారి జూన్ 29న అనుజ్ ఇంటి నుంచి ఆవనూనెతో పాటు పిండి, పప్పులు, బియ్యం, నీళ్లు వంటి వాటి నమూనాలను టెస్ట్ చేయడానికి తీసుకెళ్లినట్లు సివిల్ సర్జన్ అనిల్ కుమార్ శ్రీవాస్తవ చెప్పారు.

"రోగులందరిలో మొదట వాంతులు, మలంలో రక్తం, కాళ్ల వాపు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది వంటి లక్షణాలు కనిపించాయి. ఇది చూసి నాకు ఆహార పదార్థాలపై, ముఖ్యంగా ఆవనూనెపై అనుమానం కలిగింది. ఇంటిలోని మరో భాగంలో ఆర్జ్‌మోన్ నూనె దొరకడంతో నా అనుమానాలు మరింత బలపడ్డాయి" అని శ్రీవాస్తవ చెప్పారు.

"నేను ఆవాలు సహా అన్నింటినీ పరీక్ష చేయించాను. ఆవాలలో ఆర్జ్‌మోన్‌ కలిసినట్టు తేలింది. నమూనాలను సేకరిస్తున్నప్పుడు ఈ ప్రాంతంలోని ప్రతి ఇంట్లో ఆవులు, ఎద్దుల వ్యాధులకు చికిత్స చేయడానికి ఆర్జ్‌మోన్ నూనెను ఉపయోగిస్తారని తెలిసింది" అని అనిల్ కుమార్ చెప్పారు.

ఇంట్లోని ఆహార పదార్థాలను రెండు చోట్ల పరీక్షించారు. మొదట మెడికల్ కాలేజీలోని బయోకెమిస్ట్రీ ల్యాబ్‌లో సివిల్ సర్జన్ ద్వారా, రెండో పరీక్షను స్టేట్ ఫుడ్ టెస్టింగ్ ల్యాబ్‌లో నిర్వహించారు.

"ఆహార భద్రత ప్రమాణాల చట్టం 2006 ప్రకారం ప్రాణానికి అత్యంత ప్రమాదకరమైనదిగా పరిగణించే ఆర్జ్‌మోన్ నూనె ఈ ఆహారపదార్థాల్లో ఉన్నట్టు పరీక్షలో వెల్లడైంది.

ఇది ఎపిడమిక్ డ్రాప్సీ కేసు అని నేను ముందే అనుమానించాను. ఆవనూనెలో ఆర్జ్‌మోన్ ఉండడం వల్లే ఆ కుటుంబంలోని ఆరుగురు మరణించారని రెండు నివేదికలూ నిర్ధరించాయి'' అని ఆయన తెలిపారు.

ఆ తర్వాత గ్రామస్థుల ఆరోగ్య సంబంధిత సమాచారాన్ని సేకరించడానికి సిక్కా గ్రామానికి ఒక ఆహార భద్రత బృందాన్ని పంపారు.

అక్కడున్న 195 కుటుంబాలల్లో1,378 మంది నుంచి ఆరోగ్య సమాచారాన్ని సేకరించినట్టు ఆయన వివరించారు. వీరిలో 56 మంది నుంచి రక్త నమూనాలను తీసుకోగా వారిలో ఎవరికీ డ్రాప్సీ లక్షణాలు కనిపించలేదన్నారు.

‘అంటువ్యాధి కాదు’

"ఎపిడమిక్ డ్రాప్సీ అనేది అంటువ్యాధి కాదు.. ఆర్జ్‌మోన్‌ కలిసిన ఆవ నూనెను తీసుకోవడం వల్ల ఇది వస్తుంది" అని అనిల్ కుమార్ శ్రీవాస్తవ చెప్పారు.

తాము ఆవ నూనెను మార్కెట్ నుంచి కొనలేదని, తాము పండించిన ఆవాలతోనే నూనెను ఇంట్లో తయారుచేసుకున్నట్లు ఆ కుటుంబం చెబుతోంది.

"ఆర్జ్‌మోన్ గింజలు ఆవాల గింజల కంటే కొంచెం పెద్దవిగా ఉంటాయి. అవి ఆవాలలో ఎలా కలిశాయనేది ఆశ్చర్యంగా ఉంది" అని అపోలో ఆసుపత్రి మాజీ డైటీషియన్, ఆహార భద్రత నిపుణురాలైన నివేదిత శర్మ అంటున్నారు.

"ఆవ నూనెలో కటైలా (ఆర్జ్‌మోన్ మెక్సికానా) విత్తనాల నూనె కలిసిందని అందరూ అంటున్నారు. నేను కూడా ఆ నూనె ఉపయోగించాను. మరి.. నాకెందుకు ఏమీ కాలేదు?" అని మనీతాదేవి అడిగారు.

"దీనికి అనేక కారణాలు ఉండవచ్చు. ఉదాహరణకు ఆమె శరీరంలో చేరిన చేరే ఆర్జ్‌మోన్ మెక్సికానా పరిమాణం తక్కువగా ఉండవచ్చు. జీర్ణశక్తి మెరుగ్గా ఉంటే శరీరం దాన్ని తట్టుకుని ఉండొచ్చు. అలాంటి పరిస్థితిలో ప్రభావం చూపే అవకాశాలు తక్కువగా ఉంటాయి" అని నివేదిత శర్మ అన్నారు.

"అనారోగ్యం వార్త విన్న తర్వాత మనీతా అక్క ఇక్కడికి వచ్చి, కుటుంబ సభ్యులందరినీ చికిత్స కోసం తన గ్రామానికి తీసుకువెళ్లారు. ఆ తర్వాత ఆమె చాలా కాలం పాటు రిమ్స్ ఆసుపత్రిలో ఉన్నారు. అందువల్ల ఆమె ఆ నూనెను తక్కువగా తీసుకుని ఉంటారు" అని మనీతాదేవి ఇంటి పొరుగున నివసించే దీపక్ మెహతా అన్నారు.

ఆర్జ్‌మోన్ మెక్సికానా అంటే ఏంటి?

కటైలా అని కూడా పిలిచే ఆర్జ్‌మోన్ మెక్సికానా ముదురు ఆకుపచ్చలో ఉంటుంది. ముళ్ల ఆకులు, పసుపు పువ్వులు ఉండే ఒక అడవి మొక్క.

ఈ గింజల నుంచి వచ్చే నూనెలో సాంగ్వినరిన్ అనే విషపదార్థం ఉంటుంది.

ఆర్జ్‌మోన్ నూనె ఆవనూనెతో కలిసినప్పుడు దాన్ని తీసుకున్నవారి రక్తనాళాలలోకి సాంగ్వినరిన్ చేరి శరీరంలోని వివిధ అవయవాలకు తీవ్ర నష్టం కలిగిస్తుందని వైద్యులు చెబుతున్నారు.

ఈ దుష్ప్రభావాన్ని ఎపిడమిక్ డ్రాప్సీ అని పిలుస్తారని ఆహార భద్రతా నిపుణురాలు నివేదిత శర్మ చెప్పారు.

"200 లీటర్ల ఆవనూనెలో రెండు చుక్కల ఆర్జ్‌మోన్ నూనె ఉన్నా, దానిని తీసుకున్న వ్యక్తి శరీరంలో వెంటనే ఎపిడమిక్ డ్రాప్సీ లక్షణాలు కనిపిస్తాయి" అని తెలిపారు.

ఈ పరిస్థితుల్లో ఊపిరితిత్తుల కణజాలం వాపునకు గురై రక్తనాళాలు సంకోచిస్తాయని ఆమె వివరించారు.

" గుండెకు రక్తం సరిగ్గా చేరనప్పుడు గుండెపోటు వచ్చే ప్రమాదం ఉంది. అంతేకాకుండా ఈ ప్రభావాల వల్ల మూత్రపిండాలు రక్తాన్ని శుభ్రపరచడం ఆపేయడంతో అవి కూడా విఫలమవుతాయి" అని నివేదిత శర్మ చెప్పారు.

"2011 తర్వాత భారత్‌లో నమోదైన తొలి ఎపిడమిక్ డ్రాప్సీ కేసు ఇదే. 2011 ప్రారంభంలో పంజాబ్‌లోని ఫతేగఢ్ ప్రాంతంలో ఒక కుటుంబం ఎపిడమిక్ డ్రాప్సీ బారిన పడింది" అని సివిల్ సర్జన్ డాక్టర్ అనిల్ కుమార్ తెలిపారు.

ఈ అనారోగ్య సమస్యతో గతంలో కూడా ప్రజలు మరణించారు. 1998లో దిల్లీలో సుమారు 3,000 మందికి ఎపిడమిక్ డ్రాప్సీ నిర్ధరణ కాగా వారిలో 60 మంది మరణించారు.

తన కుటుంబంలోని ఆరుగురిని కోల్పోయిన తర్వాత అనుజ్ మహతో తన కొడుకు, తమ్ముడితో ఇంట్లో మిగిలిపోయారు. ఆ కుటుంబం ఇటీవలే ఒక కొత్త ఇల్లు కట్టుకుంది కానీ దానికి ఇంకా ప్లాస్టరింగ్ చేయలేదు.

తన ఇంటి ఆవరణలో కూర్చున్న మనీతా దేవి ఆర్థిక సంక్షోభంతో సతమతమవుతున్న తన తల్లిదండ్రుల ఇంటి ప్రస్తుత పరిస్థితి గురించి ఆందోళన చెందుతున్నారు.

తన సోదరుడి పెళ్లి, ఇల్లు కట్టడం కోసం తన తండ్రి ఇప్పటికే అప్పు తీసుకున్నారని, ఇప్పుడు కుటుంబ సభ్యుల చికిత్స కోసం కూడా అప్పు చేయాల్సి వచ్చిందని ఆమె చెప్పారు.

అనుజ్ ముందున్న అతిపెద్ద సవాలు అప్పులు తిరిగి చెల్లించడమే.

అప్పులు, కుటుంబ ఆర్థిక పరిస్థితిపై పలామూ జిల్లా మేజిస్ట్రేట్ దిలీప్ ప్రతాప్ సింగ్ షెఖావత్ స్పందించారు. "ఆ కుటుంబానికి నష్టపరిహారం అందిస్తాం. బాధిత కుటుంబ సభ్యులకు ఉపాధి కూడా కల్పిస్తాం" అని బీబీసీతో చెప్పారు.

భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా నివారించడానికి ఆర్జ్‌మోన్ మెక్సికానా దుష్ప్రభావాలపై గ్రామాల్లో అవగాహన కూడా కల్పిస్తామని షెఖావత్ చెప్పారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,  ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)