'రగులుతున్న అగ్నిపర్వతం బిలంలో పడిపోయాం.. కాళ్ల కింద లావా బుడగలతో రాత్రంతా గడిపాను'

    • రచయిత, అసియా ఫౌక్స్, జాన్ క్రిస్టీ
    • హోదా, బీబీసీ అవుట్‌లుక్
  • ప్రచురణ
  • చదివే సమయం: 6 నిమిషాలు

ఒక రగులుతున్న అగ్నిపర్వతం లోపల హెలికాప్టర్ క్రాష్ ల్యాండింగ్ అవ్వడం కంటే దారుణం ఇంకేమైనా ఉంటుందా?

అవును, ఉంటుంది. అదేంటంటే.. క్రాష్ ల్యాండ్ అయ్యాక పొగలు కక్కుతూ లావా బుడగలు సలసలా మసలుతున్న అదే ప్రదేశంలో రాత్రంతా గడపడం.

అది 1992 నవంబర్. టైటానిక్, టెర్మినేటర్ 2 లాంటి సినిమాలకు విజువల్ ఎఫెక్ట్స్ చేసిన బృందంలోని సభ్యుడైన క్రిస్ డుడ్డీ, హాలీవుడ్ కొత్త సినిమా షూటింగ్ కోసం హవాయిలోని బిగ్ ఐలాండ్ మీదుగా హెలికాప్టర్‌లో ప్రయాణిస్తున్నారు.

ఆయనతో పాటు పైలట్ క్రెగ్ హోస్కింగ్, అసిస్టెంట్ ఫోటోగ్రాఫర్ మైక్ బెన్సన్ కూడా ఉన్నారు.

ఒక్కసారిగా ఆవిరితో కూడిన దట్టమైన పొగ మంచు కమ్మేయడంతో వారు ఒక రాయిని ఢీకొట్టారు.

దాంతో ఇంజన్ ఆగిపోయి, అగ్నిపర్వత బిలంలో హెలికాప్టర్ కూలిపోయింది.

"మేం 'సిల్వర్: ఆన్ ఇన్వేషన్ ఆఫ్ ప్రైవసీ' అనే సినిమా క్లైమాక్స్ కోసం హెలికాప్టర్‌లో తిరుగుతూ షాట్స్ తీసుకుంటున్నాం. అక్కడ మాకొక అద్భుత దృశ్యం కనిపించింది. కిలౌయా అగ్నిపర్వతం నుంచి ప్రవహించే లావా, తీరం దగ్గర సముద్రంలో కలుస్తోంది.

నీటిని లావా తాకగానే పెద్ద తెల్లటి పొగ పైకి లేస్తోంది. ఆ దృశ్యం చాలా అందంగా ఉంది. ఇలాంటివి షూట్ చేయడానికే నాకు డబ్బులు చెల్లిస్తున్నారు. ఆ క్షణంలో నాకు ఇదే ప్రపంచంలోనే బెస్ట్ జాబ్ అనిపించింది'' అని క్రిస్ చెప్పారు.

‘ఊగిపోయిన హెలికాప్టర్’

"అది శనివారం ఉదయం. తుపాను సమీపిస్తుండటంతో షూట్ చేయడానికి మాకు రెండు మూడు గంటల సమయం మాత్రమే మిగిలి ఉంది. సినిమాలో వచ్చే సీన్ ఏంటంటే... మెయిన్ క్యారెక్టర్లు అగ్నిపర్వతం మీదుగా ఎగురుతూ అందులో కనుమరుగవుతాయి. వెంటనే ఆ సీన్ ఫేడ్ అవుతుంది. ఈ సన్నివేశం కోసం మేం ఒక షాట్ తీశాం. అది చూసి 'ఇంతకంటే మరింత బాగా ఆ షాట్ తీయగలమనుకుంటా' అని మైక్ అన్నారు. సరిగ్గా అప్పుడే అంతా అదుపు తప్పింది" అని ఆయన అన్నారు.

ఆ తర్వాత ఏం జరిగిందో క్రిస్ డుడ్డీ మాటల్లోనే..

ఆ షాట్ కోసం మేం మళ్లీ అగ్నిపర్వతం దగ్గరకు వెళ్తుంటే దట్టమైన పొగ కమ్మేసింది. ముందుకెళ్లే కొద్దీ అది ఇంకా ఎక్కువైంది.

హెలికాప్టర్ విపరీతంగా ఊగిపోయింది. 'ఓ మై గాడ్!' అని క్రెగ్ అరిచాడు.

నేను పైకి చూశాను. మబ్బుల్లో ఉన్నట్లు అంతా తెల్లగా ఉంది. మనం కింద పడిపోతున్నామని క్రెగ్ అరిచాడు.

హెలికాప్టర్ రోటర్, ఒక కొండచరియను ఢీకొని ఊడిపోయింది. హెలికాప్టర్ కింద పడిపోయింది.

నేలను తాకగానే ఆ కుదుపులకి క్రెగ్ తలకు పెద్ద గాయమై, కంటి నుంచి రక్తం ధారగా కారిపోయింది.

మేం హెలికాప్టర్ నుంచి బయటకు వచ్చి చూసేసరికి దాని రెక్క లేదు, తోకభాగం విరిగి నేలపై పడిపోయి కనిపించింది.

దట్టమైన పొగ, అందులోని సల్ఫర్ వాయువు కారణంగా మేం సరిగ్గా శ్వాస తీసుకోలేకపోయాం. కళ్లు మండటంతో పాటు విపరీతంగా దగ్గు వచ్చింది.

మనం అగ్నిపర్వతం లోపల పడిపోయామా? అని అడగ్గా, అవునని క్రెగ్ సమాధానమిచ్చారు.

'హెలికాప్టర్ కూలినట్లు ఎవరికైనా తెలుసా?'

అది ఒక ఫుట్‌బాల్ స్టేడియం అంత పెద్ద లోయ. శిఖరం నుంచి దాదాపు 100 మీటర్ల లోతులో పడిపోయామని, ఎలాగోలా అక్కడినుంచి బయటపడాలని అనుకున్నట్లు క్రిస్ చెప్పారు.

"మేం పైకి ఎక్కేందుకు ప్రయత్నించాం. అది చాలా కష్టం. పదునైన లావా రాళ్లను పట్టుకుని పైకి ఎక్కడం మొదలుపెట్టాం. కానీ, వాటిపై నుంచి ఎక్కుతుంటే విరిగిన గాజు పెంకుల మీద పాకినట్లయింది. సగం పైకి ఎక్కాక ఇక నావల్ల కాలేదు. ఇక ముందుకు వెళ్లలేను. ఇది చాలా డేంజర్ అని కింద ఉన్న మైక్, క్రెగ్‌లతో చెప్పాను. ఒక మీటరు వెడల్పున్న చిన్న రాతి అంచు మీద ఆగిపోయాను.

ఇంతకీ మనకు ఈ ప్రమాదం జరిగినట్లు ఎవరికైనా తెలుసా? అని అడిగితే బహుశా తెలిసి ఉండకపోవచ్చు అని క్రెగ్ అన్నారు. వెంటనే హెలికాప్టర్ దగ్గరకు వెళ్లి, హెల్ప్ అడగడం కోసం రేడియోను ఆన్ చేసి 'మేడే, మేడే, మేడే' అని అరిచాడు.

వెంటనే "నేను శ్వాస తీసుకోలేకపోతున్నా, ఊపిరాడట్లేదు" అని అరుస్తూ వాంతులు చేసుకున్నారు. ఆయన పరిస్థితి విషమంగా కనిపించింది. తర్వాత ఆయన నుంచి ఏ మాటా రాలేదు. ఆయన చనిపోయారని మేం అనుకున్నామని క్రిస్ చెప్పారు.

'బతికి ఉంటే ఈల వేయండి'

"ఆ పరిస్థితి వర్ణనాతీతం. దాదాపు మేం చావును చూశాం. కానీ, మేం ఎక్కడ చిక్కుకుపోయామో సమాచారం ఇచ్చాం కాబట్టి ఎవరో ఒకరు రక్షిస్తారని మైక్, నేను అనుకున్నాం" అని క్రిస్ చెప్పారు.

కాసేపటికి ఆ పర్వతం అంచు వద్దకు సహాయక బృందం రావడంతో తమకు కాస్త ఉపశమనంగా అనిపించిందని ఆయన అన్నారు.

"మిమ్మల్ని కాపాడటానికి ప్రయత్నిస్తాం. ఈ తాడు పట్టుకోండని వారు పైనుంచి అరిచారు. కానీ, ఆ తాడు మాకు దగ్గరగా వచ్చి ఆగిపోయింది. కుడివైపుకి 6 మీటర్లు జరపండని అరిచాను. అది దగ్గరకు వస్తోంది కానీ మా చేతులకు అందేంత దగ్గరకు రావట్లేదు. దాన్ని పట్టుకోవాలంటే పైకి ఎగరాలి. కానీ, కింద చూస్తే 100 మీటర్ల లోతైన లోయ ఉంది.

ఇంతలో మబ్బులు కమ్మేసి వర్షం మొదలైంది. అంతలోనే తీవ్రమైంది. తర్వాత అక్కడి నుంచి ఆ తాడును కూడా వాళ్లు లాగేసుకున్నారు. గంటలు గడిచిపోయాయి. కానీ, పైన ఉన్నవాళ్ల నుంచి ఎలాంటి అలికిడి లేదు. అక్కడ అసలు ఏం జరుగుతుందో మాకు అర్థం కాలేదు.

చీకటి పడుతోంది. నాకు చాలా ఆందోళన కలిగింది. ఏదో జరగరానిది జరుగుతున్నట్లుగా అనిపించింది.

అప్పుడే పైనుంచి తొంగి చూసిన రెస్క్యూ టీమ్ సభ్యులు, 'ఉదయం వరకు రెస్క్యూ నిలిపేస్తున్నాం. దయచేసి ప్రశాంతంగా ఉండండి. ఉదయాన్నే వచ్చి మిమ్మల్ని తీసుకెళ్తాం' అని అన్నారు.

ఏంటి? ఉదయం వరకు ఆగాలా? అంటే ఈ రగులుతున్న అగ్నిపర్వతం వద్ద రాత్రంతా మేం ఉండాలా? అని ఆందోళన చెందాను.

పైన క్యాంప్ వేసుకున్న రెస్క్యూ సిబ్బంది, తాము గంటకోసారి ఈల వేస్తామని, బతికే ఉన్నామని చెప్పడానికి తిరిగి ఈల వేయాలని మాకు సూచించారు.

మైక్, నేను అక్కడే కూర్చున్నాం. నేను వేసుకున్న స్వెటర్‌ను తల పైకి లాక్కున్నా. మెల్లిగా శ్వాస తీసుకుంటూ, వీలైనంత వరకు కళ్లు మూసుకున్నా.

మేం కూర్చున్న ఆ రాతి అంచు విరిగిపోకూడదని ప్రార్థించాం.

సల్ఫర్ డయాక్సైడ్ పీలుస్తూ, కళ్లు మండుతుంటే... రాబోయే 12 గంటలు ఇక్కడ ఎలా బతకాలి? అని అనిపించింది.

ఇక అయిపోయింది. ఇక్కడే ఇలాగే చనిపోతానని భయమేసింది.

మైక్ నన్ను ఓదారుస్తూ, 'నేను ఉన్నాను కదా, మాట్లాడుకుంటూ ఒకరికొకరం ధైర్యం చెప్పుకుందాం' అని అన్నాడు'' అని క్రిస్ వివరించారు.

వీడ్కోలు..

"కటిక చీకటి, భారీ వర్షం, విపరీతంగా గాలులు, చలి కారణంగా విపరీతమైన వణుకు వచ్చింది. నిద్రపోతే లోయలో పడిపోతామని రాత్రంతా రెప్ప వాల్చలేదు.

ఆ రాత్రి ఇక బతకననే అనుకున్నా. మనసులోనే నా వాళ్లందరికీ వీడ్కోలు చెప్పాను. లావా వెలుగులు, పొగల మధ్య ఏవో అరుపులు, భయంకరమైన శబ్దాలు వినిపించాయి. చుట్టూ రాళ్లు విరిగిపడుతున్నాయి. చనిపోకూడదనే ఒకే ఒక్క ఆశతో ఆ రాత్రి గడిపాం.

తెల్లవారగానే రెస్క్యూ టీమ్ వచ్చింది. అయితే, భారీ వర్షం కారణంగా వాళ్లకు ఏమీ కనిపించలేదు. మధ్యాహ్నం అయినా పరిస్థితి మారలేదు. అంచున ఉన్న రాళ్లు విరిగిపడతాయని వాళ్లు కిందకు రాలేకపోతున్నారు.

నా గొంతు వాచిపోయింది, కళ్లు మండుతున్నాయి. ఇంకో రాత్రి ఇక్కడ ఉంటే చచ్చిపోతాననిపించి పైకి ఎక్కడానికి దారి వెతుకుతుంటే "వద్దు, వాళ్లే కాపాడతారు" అని మైక్ అరిచాడు.

వర్షం కాస్త తగ్గగానే పైకి ఎక్కేశాను. కానీ, అక్కడ చిన్న గులకరాళ్లు తప్ప ఇంకా పైకి వెళ్లడానికి ఏమీ కనిపించలేదు.

దేవుడా! ఏంటి ఈ పరిస్థితి? నేనేం చేశాను. పైకి వెళ్లలేను, అలాగని కిందకు వెళ్లలేనని నాలో నేను అనుకున్నా."

‘నేను బతికే ఉన్నానా? చనిపోయానా?’

"అప్పుడే నాకొక విషయం స్పష్టంగా అర్థమైంది... నేను పైకి వెళ్లాలంటే నా చేతులను ఆ గులకరాళ్లలోకి బలంగా గుచ్చడం తప్ప వేరే దారి లేదని గ్రహించాను. కానీ, అది పగిలిన గాజు పెంకుల్లో చేతులు పెట్టడం లాంటిది!

నా కుడి చేతిని మోచేతి వరకు ఆ రాళ్లలోకి దూర్చాను, తర్వాత ఎడమ చేతిని కూడా అలాగే దింపి.. మనసులోనే ఒకటి, రెండు, మూడు అని లెక్కబెట్టుతూ పైకి ఎక్కాను.

దాన్ని నేను ఎలా చేయగలిగానో నాకు అర్థం కాలేదు.

'నేను ఇంకా బతికే ఉన్నానా? లేక చనిపోయానా?' అని అనుకున్నా.

శ్వాస ఆడటం లేదు, కళ్లు మండుతూనే ఉన్నాయి. కానీ, మొత్తానికి నేను ఆ పాతాళం నుంచి బయటపడ్డాను.

శంఖంలా ఉన్న ఆ కొండ వెనుక భాగానికి పరిగెత్తి చూస్తే అక్కడ ఒక తాడు కనిపించింది. మైక్‌ను ఆ తాడుతో పైకి లాగేంత బలం నాలో లేదు. అందుకే ఆయన అక్కడ ఉన్నాడని గుర్తుగా ఆ తాడును అక్కడే ఉంచాను.

సహాయక బృందం వేసిన క్యాంప్ కనిపించింది. అక్కడ కొన్ని గుడారాలు, నీళ్ల సీసాలు, ఆక్సిజన్ సిలిండర్లు ఉన్నాయి కానీ ఒక్క మనిషి కూడా లేడు.

'ఎవరైనా కనిపించేంత వరకు లేదా నన్ను ఎవరైనా చూసేంత వరకు నడుస్తూనే ఉంటా' అని నిశ్చయించుకున్నాను.

దాంతో నడక ప్రారంభించాను. అప్పుడే హెలికాప్టర్‌లో వెళ్తున్న వాళ్లు నన్ను చూసి నా దగ్గరకు వచ్చారు. అందులో ఒకరు వచ్చి నా చేయి పట్టుకోగానే.. అప్పటివరకు కూడగట్టుకున్న బలం అంతా పోయి నేను ఒక్కసారిగా నేలపై కూలబడ్డాను.

వాళ్లు నన్ను హెలికాప్టర్‌లో కూర్చోబెట్టి బెల్టులు బిగించారు. మేం బేస్ క్యాంప్‌కు బయలుదేరాం. ఒక వ్యక్తి నా వీపు తట్టాడు. అంతే నేను దు:ఖాన్ని ఆపుకోలేకపోయాను.

'నువ్వు సురక్షితంగా ఉన్నావ్. నీకేం కాలేదు' అని వాళ్లు నన్ను ఊరడించారు.

హెలికాప్టర్ దిగగానే నా వైపు పరిగెత్తుకుంటూ వచ్చిన మొదటి వ్యక్తి... మా పైలట్ క్రెగ్.

'క్రెగ్, నువ్వు బతికే ఉన్నావా, నువ్వు చనిపోయావని మేం అనుకున్నాం' అని నమ్మలేనట్లుగా అతన్ని చూశాను.

క్రెగ్ ఎలాగోలా అక్కడి నుంచి తప్పించుకోగలిగారు. ఆయన తాను ఉన్న ప్రదేశానికి ఒక హెలికాప్టర్‌ను రప్పించి, అందులోకి ఎగిరి దూకి తన ప్రాణాలు రక్షించుకున్నారు.

ఇక మైక్ విషయానికొస్తే.. ఆయనను తర్వాతి రోజు రక్షించారు. సరిగ్గా రెస్క్యూ టీమ్ వచ్చే సమయానికి మైక్ అక్కడ ఉన్న రాతి మీద తన భార్య కోసం 'ఐ లవ్ యూ' అనే చివరి సందేశాన్ని చెక్కుతున్నారు'' అని క్రిస్ వివరించారు.

( బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,  ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)