You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
అనుమానాస్పద స్థితిలో 14 ఏనుగులు మృతి, విషప్రయోగం జరిగిందా?
- రచయిత, కాలేబ్ మోగెస్
- హోదా, బీబీసీ ప్రతినిధి
- ప్రచురణ
- చదివే సమయం: 2 నిమిషాలు
దక్షిణ కెన్యాలోని అంబోసెలి నేషనల్ పార్కు సమీపంలో 14 ఏనుగులు అనుమానాస్పదంగా మరణించాయి. దీనిపై అత్యవసర దర్యాప్తు మొదలైంది.
అవి వ్యాధుల వల్ల చనిపోయాయా? లేదా విషప్రయోగం జరిగిందా? లేక ఇతర కారణాలతో చనిపోయాయా? అనే విషయం నిర్ధరించేందుకు నిపుణులు వాటి కళేబరాలను పరిశీలిస్తున్నారని, అవయవ నమూనాలను ప్రయోగశాలలకు పంపినట్లు కెన్యా వైల్డ్‌లైఫ్ సర్వీస్ (కేడబ్ల్యూఎస్) బీబీసీకి తెలిపింది.
ఈ పార్క్, దాని పరిసర ప్రాంతాలను కలిపి అంబోసెలి ఎకో సిస్టమ్‌గా పిలుస్తారు. టాంజానియా బోర్డర్‌కు ఆనుకుని ఉన్న విశాలమైన ప్రాంతమిది. జీవవైవిధ్యానికి ఇది ప్రసిద్ధి.
జంతువుల వేటను విజయవంతంగా అరికట్టిన ఈ ప్రాంతంలో, ఇంత పెద్ద సంఖ్యలో ఏనుగుల మరణాలు నమోదు కావడం దశాబ్దాల తర్వాత ఇదే మొదటిసారని అధికారులు చెబుతున్నారు.
ఈ మరణాలన్నింటికీ ఒకటే కారణమని సూచించే ఎలాంటి ఆధారాలు ప్రస్తుతానికి లభించలేదని కేడబ్ల్యూఎస్ పేర్కొంది.
చనిపోయిన ఏనుగుల్లో వివిధ వయస్సుల్లోని ఆడ, మగ ఏనుగులున్నాయి. కాబట్టి ఈ మరణాలు ఒకే సమూహానికి లేదా ఒకే కుటుంబానికి చెందినవి కాకపోయి ఉండొచ్చని భావిస్తున్నారు.
వైల్డ్‌లైఫ్ ఏజెన్సీ కమ్యూనికేషన్ హెడ్ డంకన్ వన్యమా స్థానిక మీడియాతో మాట్లాడుతూ, ఏనుగుల మృతదేహాలన్నీ అంబోసెలి నేషనల్ పార్క్ బోర్డర్‌కు సుమారు 15 కిలోమీటర్ల నుంచి 30 కిలోమీటర్ల దూరంలో, చుట్టుపక్కల ప్రాంతాల్లో కనిపించినట్లు చెప్పారు.
జంతువుల కదలికలను పర్యవేక్షించే 'అంబోసెలి ట్రస్ట్ ఫర్ ఎలిఫెంట్స్' గణాంకాల ప్రకారం, 2025 నాటికి అంబోసెలి ఎకోసిస్టమ్‌లో 2000కు పైగా ఏనుగులున్నాయి.
( బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్, ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)