రజత్ పాటీదార్‌కు టీమిండియాలో చోటు దొరకలేదు ఎందుకు? భారత టీ 20 క్రికెట్ జట్టు ఎంపికపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి ఎందుకు?

భారత క్రికెట్ జట్టు, టీ ట్వంటీ జట్టు ఎంపిక, వైభవ్ సూర్యవంశీ, రజత్ పాటీదార్

ఫొటో సోర్స్, Getty Images

ప్రచురణ
చదివే సమయం: 6 నిమిషాలు

ఇంగ్లండ్, ఐర్లాండ్ టూర్లతో పాటు 2026 ఏషియన్ గేమ్స్ కోసం భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) టీ20 జట్టును ప్రకటించింది.

ఈ జట్టులో వైభవ్ సూర్యవంశీ ఉన్నాడు. సూర్యవంశీ తొలిసారిగా భారత జట్టులోకి ఎంపికయ్యాడు. ఐపీఎల్ ఇటీవలి సీజన్‌లో సూర్యవంశీ అత్యధిక పరుగులు సాధించిన ఆటగాడిగా నిలిచాడు.

టీ ట్వంటీ వరల్డ్ కప్‌లో భారత జట్టును విజేతగా నిలిపిన కెప్టెన్ సూర్య కుమార్ యాదవ్‌కు ఈ జట్టులో చోటు దక్కలేదు. శ్రేయస్ అయ్యర్‌కు ఆ బాధ్యతలు అప్పగించారు.

జట్టు ఎంపికపై అనేక ప్రశ్నలు తలెత్తుతున్నాయి. కొందరు ముఖ్యమైన ఆటగాళ్లకు జట్టులో చోటు దక్కకపోవడంపై సామాజిక మాధ్యమాల్లో చర్చ జరుగుతోంది

"రాబోయే టీ 20 అంతర్జాతీయ సిరీస్ కోసం జట్టును ప్రకటించడంతో వైభవ్ సూర్యవంశీ పురుషుల క్రికెట్‌లో భారత జట్టుకు ఎంపికైన అతి చిన్న వయసున్న ఆటగాడిగా నిలిచాడు" అని ఐసీసీ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఎక్స్‌లో పోస్ట్ చేసింది.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

ఇటీవల ముగిసిన ఐపీఎల్ 19వ సీజన్‌లో వైభవ్ సూర్యవంశీ 16 మ్యాచ్‌లలో 5 హాఫ్ సెంచరీలు, ఒక సెంచరీతో 776 పరుగులు చేశాడు.

ఈ సీజన్‌లో అతని స్ట్రేక్ రేటు 240.

భారత క్రికెట్ జట్టు, టీ ట్వంటీ జట్టు ఎంపిక, వైభవ్ సూర్యవంశీ, రజత్ పాటిదార్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, హర్భజన్ సింగ్

హర్భజన్ సింగ్ ఏమన్నాడు?

సెలక్షన్ కమిటీ ఛైర్మన్ అజిత్ అగార్కర్, బీసీసీఐ కార్యదర్శి దేవ్‌జిత్ సైకియా శనివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో భారత జట్టును ప్రకటించారు.

తిలక్ వర్మ జట్టుకు వైస్ కెప్టెన్‌ బాధ్యతలు అప్పగించారు. టీ 20 వరల్డ్ కప్‌లో వైస్ కెప్టెన్‌గా ఉన్న హార్దిక్ పాండ్యాకి జరగబోయే మూడు టోర్నమెంట్లలోనూ జట్టులో స్థానం లభించలేదు.

మిగతా అంతా ఎలా ఉన్నా... జట్టులో రజత్ పాటీదార్‌కు చోటు లభించకపోవడంపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

"రజత్ పాటీదార్ భారత జట్టులో లేకపోవడం విచారకరం. అతను ఇంకా ఏం చేయాలి? అతను 200 స్ట్రైక్ రేటుతో 501 పరుగులు చేశాడు. ఇది న్యాయం కాదు" అని ఇండియన్ క్రికెట్ టీమ్ మాజీ బౌలర్ హర్భజన్ సింగ్ సోషల్ మీడియాలో రాశారు.

మిడిల్ ఆర్డర్‌లో రజత్ పాటీదార్ నిస్సందేహంగా భారత్‌లోనే అత్యుత్తమ ఆటగాడని హర్భజన్ సింగ్ అభిప్రాయపడ్డాడు.

రజత్ పాటీదార్ ఐపీఎల్ 19వ సీజన్‌లో 15 మ్యాచ్‌లలో 5 హాఫ్ సెంచరీలతో సహా 501 పరుగులు సాధించాడు.

ఈ టోర్నీలో అతను 42 సిక్సర్లు, 30 ఫోర్లు కొట్టాడు.

భారత క్రికెట్ జట్టు, టీ ట్వంటీ జట్టు ఎంపిక, వైభవ్ సూర్యవంశీ, రజత్ పాటిదార్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, వైభవ్ సూర్యవంశీ

క్రికెట్ ఫ్యాన్స్ ఏమంటున్నారు?

రజత్ పాటీదార్ జట్టులోకి ఎంపిక కాకపోవడంపై సోషల్ మీడియాలో చాలా మంది స్పందించారు.

"రజత్ పాటీదార్‌ను టీ20 జట్లలో ఒకదానిలో చేర్చి ఉండాల్సింది. అతని నిలకడైన ప్రదర్శనకు ప్రతిఫలం దక్కాలి. అతను ఐపీఎల్‌లో చాలా బాగా ఆడాడు" అని మోసిన్ కమల్ రాశారు.

"రజత్ పాటీదార్‌కు అవకాశం దక్కాల్సింది. మీరు 15 మంది ఆటగాళ్లను మాత్రమే ఎంపిక చేయగలరని నాకు తెలుసు. కానీ అతన్ని జట్టులో చేర్చుకోవాల్సింది" అని భరత్ రామ్ అనే యూజర్ రాశారు.

స్పోర్ట్స్ జర్నలిస్ట్ జి.ఎస్. వివేక్ కూడా జట్టు ఎంపికపై ఆన్‌లైన్‌లో ప్రశ్నలు సంధించారు.

"శ్రేయస్, వైభవ్ విషయంలో తీసుకున్న నిర్ణయం నాకు అర్థమైంది. కానీ రింకూ సింగ్, కుల్దీప్ యాదవ్‌ను జట్టు నుండి ఎందుకు తొలగించారు" అని ఆయన ఎక్స్ వేదికగా ప్రశ్నించారు.

"రింకూ సింగ్ విషయంలో కోల్‌కతా నైట్ రైడర్స్ వ్యవహరించిన తీరు అతని కెరీర్‌ను దెబ్బ తీసింది. కుల్దీప్ టీ ట్వంటీ కెరీర్ కూడా ముగిసి పోయిందని అనుకుంటున్నాను. ఎందుకంటే సెలెక్టర్లు లెగ్ -బ్రేక్ బౌలింగ్ కోసం బిష్ణోయ్‌ను ఎంచుకున్నారు" అని వివేక్ తన మెసేజ్‌లో పేర్కొన్నారు.

"ఆసియా క్రీడలకు పూర్తిస్థాయి జట్టును ఎంపిక చేశారు. అయితే అందులో హార్దిక్ పాండ్యాకు చోటు దక్కలేదు. బహుశా సెలెక్టర్లు, జట్టు యాజమాన్యం ఒక బ్యాకప్ ఆప్షన్‌ను పరిశీలిస్తూ, నితీష్ రెడ్డికి ఆడేందుకు తగినన్ని అవకాశాలు కల్పించాలని అనుకుంటున్నారేమో" అని స్పోర్ట్స్ జర్నలిస్ట్ రాహుల్ రావత్ అభిప్రాయపడ్డారు.

అయితే హార్దిక్ పాండ్యా బెంగళూరులోని సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌లో ఉన్నాడని బీసీసీఐ చెబుతోంది. శనివారం జరిగిన విలేకరుల సమావేశంలో బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా ఈ విషయం చెప్పారు.

"పాండ్యా త్వరలో అఖరి టెస్టుకు వెళతాడు. తర్వాత క్లియరెన్స్ ప్రక్రియలో పాల్గొంటాడు. రోహిత్ శర్మ కూడా రాబోయే రెండు మూడు రోజుల్లో సీఓఈకి వెళతాడు. అతని ఫిట్‌నెస్ ఫైనల్ క్లియరెన్స్ కోసం ఎదురు చూస్తున్నాం" అని దేవజిత్ సైకియా చెప్పారు.

భారత క్రికెట్ జట్టు, టీ ట్వంటీ జట్టు ఎంపిక, వైభవ్ సూర్యవంశీ, రజత్ పాటిదార్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, శనివారం జరిగిన విలేకరుల సమావేశంలో టీ ట్వంటీ కోసం భారత జట్టును ప్రకటించారు.

భారత జట్టులో ఎవరెవరు ఉన్నారు

సూర్యకుమార్ యాదవ్ స్థానంలో శ్రేయస్ అయ్యర్‌ను టీ20 కెప్టెన్‌గా నియమించడంపై ప్రధాన సెలెక్టర్ అజిత్ అగార్కర్ విలేకరుల సమావేశంలో మాట్లాడారు.

"కొన్నేళ్లుగా వివిధ ఫ్రాంచైజీలకు నాయకత్వం వహిస్తూ అతను సాధించింది మనం చూశాం. ఐపీఎల్ టోర్నీ గెలిచాడు. ఈ సీజన్‌లో మంచి ఆరంభం తర్వాత కష్టాలు ఎదుర్కొన్నాడు. ఒక కెప్టెన్‌కి ఎదురయ్యే అనుభవాలన్నీ అతను ఎదుర్కొన్నాడు" అని అగార్కర్ చెప్పారు.

"అతని ఆటతీరు చాలా బాగుంది. టీ20 ప్రపంచ కప్ జట్టులో చోటు దక్కించుకోవడానికి చాలా దగ్గరగా వచ్చాడు, కానీ సూర్య జట్టులో ఉండటంతో అతనికి చోటు దక్కలేదు. అనుభవం దృష్ట్యా అతను ప్రముఖ ఆటగాడిగా నిలిచాడనేది నా అభిప్రాయం" అని అగార్కర్ అన్నారు.

ఆసియా క్రీడలకు భారత జట్టు

శ్రేయస్ అయ్యర్ (కెప్టెన్), తిలక్ వర్మ (వైస్ కెప్టెన్), రవి బిష్ణోయ్, అభిషేక్ శర్మ, నితీష్ కుమార్ రెడ్డి, జస్‌ప్రీత్ బుమ్రా, సంజు శాంసన్, అక్షర్ పటేల్, హర్షిత్ రాణా, ఇషాన్ కిషన్, వాషింగ్టన్ సుందర్, అర్ష్‌దీప్ సింగ్, శివమ్ దుబే, వరుణ్ చక్రవర్తి.

ఇంగ్లండ్, ఐర్లాండ్ పర్యటనకు భారత జట్టు

శ్రేయస్ అయ్యర్ (కెప్టెన్), తిలక్ వర్మ (వైస్ కెప్టెన్), రవి బిష్ణోయ్, అభిషేక్ శర్మ, నితీష్ కుమార్ రెడ్డి, మహ్మద్ సిరాజ్, సంజు శాంసన్, అక్షర్ పటేల్, హర్షిత్ రాణా, ఇషాన్ కిషన్, వాషింగ్టన్ సుందర్, అర్ష్‌దీప్ సింగ్, శివమ్ దుబే, వరుణ్ చక్రవర్తి

భారత క్రికెట్ జట్టు, టీ ట్వంటీ జట్టు ఎంపిక, వైభవ్ సూర్యవంశీ, రజత్ పాటిదార్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, సర్ఫరాజ్ ఖాన్

సర్ఫరాజ్ ఖాన్ సంగతేంటి

టీ20 జట్టుతో పాటు 'ఇండియా – ఎ' జట్టులో సర్ఫరాజ్ ఖాన్ పేరు లేకోపవడంపై చాలా మంది ప్రశ్నిస్తున్నారు.

ఈ జట్టు జూన్-జూలైలో శ్రీలంకలో రెండు టెస్ట్ మ్యాచ్‌లు ఆడనుంది.

"శ్రీలంక పర్యటనకు వెళ్లే ఇండియా 'ఎ' జట్టు నుంచి ముంబై బ్యాట్స్‌మెన్, టెస్ట్ జట్టుకు దూరమైన సర్ఫరాజ్ ఖాన్‌ను తొలగించడం ఆశ్చర్యం కలిగించింది. టెస్ట్ జట్టుకు అతని కంటే మెరుగైన బ్యాట్స్‌మెన్ ఎవరైనా ఉన్నారా? ఫస్ట్-క్లాస్ క్రికెట్‌లో అతని రికార్డుకు దరిదాపుల్లో కూడా ఎవరికీ రికార్డు లేదు. సెలెక్టర్లు దీన్ని ఎలా సమర్థించుకోగలరు?" అని కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ ‘ఎక్స్’ వేదికగా ప్రశ్నించారు.

భారత్, అఫ్గానిస్తాన్ మధ్య జరుగుతున్న టెస్ట్ మ్యాచ్ గురించి రచయిత ముకుల్ కేశవన్ సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టారు.

"సర్ఫరాజ్‌ఖాన్‌కు బదులుగా ధ్రువ్ జురెల్‌ను ఆరో స్థానంలో స్పెషలిస్ట్ బ్యాట్స్‌మన్‌గా ఎందుకు ఎంపిక చేశారు? అతని ఎంపికకు అతని గణాంకాలు కారణం కాదు" అని ఆ పోస్ట్‌లో రాశారు.

"సర్ఫరాజ్‌కు ఫస్ట్-క్లాస్, టెస్ట్ మ్యాచ్‌లలో మెరుగైన సగటు ఉంది. అది ఖాన్ సాధారణంగా బ్యాటింగ్ చేసే మిడిల్ ఆర్డర్‌లో ఉంది. మరి దానికి కారణం ఏమిటి?" అనేది ముకుల్ కేశవన్ ప్రశ్న.

"భారత్ ఓడిపోయిన న్యూజీలాండ్‌తో జరిగిన కఠినమైన సిరీస్‌లో సర్ఫరాజ్ సెంచరీ సాధించాడు. కానీ బలహీనమైన అఫ్గానిస్తాన్ జట్టుపై బ్యాటింగ్ సగటును పెంచే విషయానికి వస్తే, సాయి సుదర్శన్ (అతని టెస్ట్ సగటు 30 కంటే తక్కువ) జురెల్ అగ్రస్థానంలో ఉన్నారు. ఇది వింతగా ఉంది" అని ముకుల్ కేశవన్ మరో పోస్టులో రాశారు.

భారత్- అఫ్గానిస్తాన్ మధ్య జరుగుతున్న ఏకైక టెస్ట్ మ్యాచ్‌లో సర్ఫరాజ్ ఖాన్‌కు చోటు దక్కలేదు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,  ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)