You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
న్యూటన్స్ థర్డ్ లా: వినయ్‌ను చంపిందెవరు? ఆయన ఫోన్‌లో ‘క్రిమినల్ మెర్క్యురీ’ నంబర్ ఎందుకు ఉంది?
- రచయిత, జీఆర్ మహర్షి
- హోదా, బీబీసీ కోసం
- ప్రచురణ
- చదివే సమయం: 4 నిమిషాలు
సుమంత్, జగపతిబాబు నటించిన న్యూటన్స్ థర్డ్ లా థియేటర్లల్లోకి వచ్చింది.
రాజేశ్ కర్ణ దర్శకుడు. ఈ సినిమాపై ఎలాంటి అంచనాలు లేవు. తక్కువ థియేటర్లు, తక్కువ షోలతో విడుదలైంది.
కథ ఏమంటే సిక్కింలో ఉండే అవసరాల శ్రీనివాస్‌కి కొరియర్‌లో ఒక పుస్తకం వస్తుంది.
దానిపేరు న్యూటన్స్ థర్డ్ లా. రచయిత పేరు వినయ్. కంగారుపడి చదవడం మొదలు పెడతాడు.
1999లో రాత్రిపూట రోడ్డుపై తల్లీకూతుళ్లు వెళ్తూఉంటే ఒక కారు వచ్చి ఢీకొంటుంది. తల్లి (నేహా పఠాన్) చనిపోతుంది. తర్వాత ఒక ఇంట్లో వినయ్ అనే యువకుడు పై ఫ్లోర్ నుంచి పడి చనిపోతాడు.
కేసు విచారణకు వాసుదేవ్ (సుమంత్) రంగంలోకి దిగుతాడు. ఆ కుర్రాడి తలలో బుల్లెట్ ఉందని పోస్టుమార్టం రిపోర్ట్‌లో తేలుతుంది.
అతని తల్లి, తండ్రిని విచారిస్తారు. వినయ్ ఫోన్‌కాల్ లిస్ట్ చూస్తే సిటీలో ఫేమస్ క్రిమినల్ మెర్క్యూరీ (జగపతిబాబు) నంబర్ ఉంటుంది. విచారణలో చాలా కొత్త విషయాలు తెలుస్తూ వుంటాయి.
అయితే వినయ్‌ని కాల్చింది ఎవరు? పుస్తకం చదువుతున్న అవసరాల శ్రీనివాస్‌కి ఈ కథతో ఏం సంబంధం? క్రిమినల్ జగపతిబాబు ఈ కథలోకి ఎలా వచ్చాడు? ఇవన్నీ తెర మీద చూడాల్సిందే.
ఈ సినిమా సారాంశం ఏమంటే మనం చేసిన కర్మ మంచైనా, చెడైనా మళ్లీ మనకి తిరిగి వస్తుంది.
న్యూటన్స్ థర్డ్ లా జీవితానికి అన్వయిస్తుంది. నిజానికి ఇది ఫిలాసఫికల్ పాయింట్. దీన్ని క్రైమ్ కథతో ముడిపెట్టి రాసుకోవడం బాగుంది.
అయితే కథనంలో వేగం మందగించింది. దానికి తోడు క్యారెక్టర్‌ని రాసుకోవడంలోనూ , లాజికల్ ట్విస్ట్‌లు లేకపోవడంతోనూ కథ అక్కడక్కడే వినయ్ ఇంట్లోనే తిరుగుతూ విసుగు తెప్పిస్తుంది.
ఇలాంటి సినిమాలంటే ముందు హిచ్‌కాక్ గురించే మాట్లాడుకుంటారు. హిచ్‌కాక్ మన తెలివికి పరీక్ష పెడతాడు. క్యారెక్టర్లు చాలా సహజంగా వుంటాయి. చివరికి మనం ఆశ్చర్యపోయే సంఘటన ఏదో జరుగుతుంది. దాదాపు 70 ఏళ్లుగా క్రైమ్ ఇన్వెస్టిగేషన్, సస్పెన్స్ సినిమాల ఫార్ములా ఇదే.
ఈ సినిమాలో ప్రేక్షకున్ని ఆశ్చర్యపరిచే ట్విస్టులు పెద్దగా లేకపోగా, దర్శకుడికి అనుగుణంగా సంఘటనలు జరుగుతూ వుంటాయి. చివర్లో ఇచ్చిన ట్విస్ట్ కూడా గందరగోళంగా వుంది.
ప్రతి దర్శకుడికి సెకెండాఫ్ కష్టం. క్రైమ్ కథల్లో మరీ కష్టం. ఇంటర్వెల్ వరకు ఎన్ని చిక్కుముడులైనా వేసి ఆశ్చర్యపరచవచ్చు. సెకెండాఫ్‌లో అవన్నీ ఎందుకు జరిగాయో ప్రేక్షకుణ్ని కన్విన్స్ చేసే విధంగా చెప్పాలి. తప్పదోవ పట్టించకూడదు.
కథలోని కీలకమైన పాయింట్ కర్మ ని, న్యూటన్ థర్డ్ లాతో పోలుస్తూ చెప్పడం బాగుంది కానీ, దానికి అనుగుణంగా కథలోని సంఘటనలు లేవు.
ప్రముఖ ఇటలీ డైరెక్టర్ సెర్జియో లియోని సినిమాల్లోని విలన్ల స్థాయిలో బీజీఎం తో జగపతిబాబుకి బిల్డప్ ఇచ్చారు కానీ, సినిమాలో ఆయనకి అంత ప్రాధాన్యం లేదు. ఒక్క బలమైన సీన్ కూడా లేకపోవడం అన్యాయం.
అయితే మంచి థ్రిల్లర్ తీయాలనే ప్రయత్నం మాత్రం జరిగింది. సినిమాలో ఎక్కడా అతిలేదు. సన్నివేశాల్లో బలం లేకపోయినా కొంత సహజంగానే ఉన్నాయి. సుమంత్ బాగా నటించాడు. వినయ్‌గా త్రినాథ్ వర్మ , అతని తల్లిగా షెర్లి , తండ్రిగా రవి వర్మ మెప్పించారు.
నిడివి పెంచడానికి తప్ప, పాటలు పూర్తిగా అనవసరం. క్రైమ్ కథలు ఇష్టపడేవాళ్లు కొంచెం ఓపికతో చూడొచ్చు.
ప్లస్ పాయింట్స్:
1. సుమంత్ నటన
మైనస్ పాయింట్స్:
1. స్లో స్క్రీన్ ప్లే
2. లాజిక్ లేని మలుపులు
ఫైనల్‌గా యాక్షన్, రియాక్షన్ రెండూ మిస్సయ్యాయి.
( బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్, ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)