You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ఆంధ్రప్రదేశ్: ‘వరిసాగు వద్దు’ అని ముఖ్యమంత్రి ఎందుకన్నారు, ఎల్ నినో ప్రభావమే కారణమా?
- రచయిత, గరికిపాటి ఉమాకాంత్
- హోదా, బీబీసీ కోసం
- ప్రచురణ
- చదివే సమయం: 8 నిమిషాలు
ఎల్ నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు ఏర్పడతాయని వాతావరణశాఖ అధికారులు చెబుతున్నారు. ఇది ఆంధ్రప్రదేశ్‌లోని రైతులను ఆందోళనకు గురి చేస్తోంది.
ఈ నేపథ్యంలో ‘‘అన్ని పంటలకు సరిపడా సాగునీరు అందించలేమని’’ ప్రభుత్వం స్పష్టం చేస్తోంది. ఈ సీజన్‌లో ‘‘వరిసాగు చేయొద్దు’’ అని సీఎం చంద్రబాబునాయుడు కూడా రైతులకు పిలుపునిచ్చారు.
అయితే, ఇప్పటికే వరి నారుమళ్లు వేసిన రైతులు తమ పరిస్థితి ఏమిటని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్‌లో వర్షపాతం వివరాలను విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ బీబీసీకి వెల్లడించారు.
నైరుతి రుతుపవనాల సమయంలో జూన్ 1వ తేదీ నుంచి ఇప్పటివరకు ఏపీ వ్యాప్తంగా వర్షపాతంలో గణనీయమైన లోటు నమోదైందన్నారు. జూన్‌లో మైనస్ 25 శాతం వర్షపాతం లోటు నమోదవగా, జులైలో 69 శాతం లోటు వర్షపాతం నమోదైందని వివరించారు.
వచ్చే మూడు నెలల్లో సరాసరి 35 నుంచి 40 శాతం మేర లోటు వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని అంచనా వేస్తున్నామన్నారు.
జూన్ నుంచి నవంబర్ వరకు కొనసాగే నైరుతి రుతుపవనాల సీజన్ మొత్తంలో 844 మి.మీ వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా, ప్రస్తుత అంచనాల ప్రకారం 551 మి.మీ మాత్రమే నమోదయ్యే అవకాశం ఉందని ప్రఖర్ జైన్ వివరించారు.
అంచనాలకు మించి ఎల్ నినో ప్రభావం ఉండనుందని ఆయన చెప్పారు. ఇప్పటివరకు సాధారణంగా 225.7 మి.మీ. వర్షపాతం నమోదవ్వాల్సి ఉందని, కానీ కేవలం 104.5 మి.మీ. మాత్రమే నమోదైందని ఆయన తెలిపారు.
నెల్లూరు మినహా...
ఏపీలోని 28 జిల్లాల్లో ఒక్క నెల్లూరు జిల్లాలో మాత్రమే సాధారణ వర్షపాతం నమోదైందని ప్రఖర్ జైన్ బీబీసీకి తెలిపారు.
మిగిలిన 27 జిల్లాల్లో 21 జిల్లాలు 'వర్షపాతం లోటు' కేటగిరీలో ఉన్నాయి.
విశాఖ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ప్రకాశం, చిత్తూరు, అన్నమయ్య, జిల్లాలు.. 'తీవ్ర వర్షపాతం లోటు' కేటగిరీలో ఉన్నాయని వెల్లడించారు.
మండలాల వారీగా చూస్తే. రాష్ట్రంలోని 688 మండలాల్లో 249 మండలాలు 'తీవ్ర వర్షపాతం లోటు'లో, 359 మండలాలు 'వర్షపాతం లోటు'లో ఉండగా, 78 మండలాల్లో సాధారణ వర్షపాతం నమోదైంది.
కేవలం రెండు మండలాల్లో మాత్రమే 'అత్యధిక వర్షపాతం' నమోదైందని చెప్పారు.
జులై 25 నాటికి, రాష్ట్రంలోని 12 జిల్లాల్లో సాధారణంగా సాగు కావాల్సిన విస్తీర్ణంలో 50 శాతం కంటే తక్కువ విస్తీర్ణంలోనే పంటలు సాగయ్యాయని వ్యవసాయ శాఖ అధికారులు నివేదించినట్టు రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి కింజరపు అచ్చెన్నాయుడు తెలిపారు. ఎల్ నినో ప్రభావ పరిస్థితులపై ఆయన బీబీసీతో మాట్లాడారు.
"బాపట్ల జిల్లాలో ఇప్పటివరకు కేవలం 5 శాతం విస్తీర్ణంలోనే పంటలు సాగయ్యాయని అధికారుల నివేదికలు చెబుతున్నాయి. అన్నమయ్య జిల్లాలో 9 శాతం, ప్రకాశంలో 15 శాతం, మార్కాపురంలో 15 శాతం పంటల సాగు ఉంది.'' అని ఆయన తెలిపారు.
"మరో 10 జిల్లాల్లో సాధారణ సాగు విస్తీర్ణంతో పోలిస్తే 51 శాతం నుంచి 100 శాతం మధ్య సాగు నమోదైంది. శ్రీకాకుళం, అల్లూరి సీతారామరాజు, ఎస్‌పీఎస్‌ఆర్ నెల్లూరు, కర్నూలు, పశ్చిమ గోదావరి సహా ఆరు జిల్లాల్లో సాధారణ సాగు స్థాయి కంటే ఎక్కువగా సాగు ఉంది. హై రిస్క్‌లో ఉన్న 168 మండలాల్లో, సీజన్ సాధారణ విస్తీర్ణంతో పోలిస్తే 39 శాతం తక్కువగా నమోదైంది."
సీజన్ సాధారణ పంట విస్తీర్ణం 42 లక్షల హెక్టార్లు కాగా, ఇప్పటివరకు మొత్తం 16.35 లక్షల హెక్టార్లలో పంటలు సాగయ్యాయని మంత్రి తెలిపారు.
"జనుము, వరి, సోయాబీన్ , పత్తి పంటల సాగు పురోగతి చూపుతోంది. వేరుశనగ, పొద్దుతిరుగుడు, జొన్న, ఉలవ పంటల సాగు మాత్రం గణనీయంగా వెనుకబడి ఉంది. రాష్ట్రంలో ప్రధాన పంటైన వరి, సీజన్ సాధారణ సాగు విస్తీర్ణంలో 34 శాతం మాత్రమే నమోదైంది" అని చెప్పారు.
వరి వద్దు : సీఎం చంద్రబాబు
కర్నూలు జిల్లా ఆస్పరిలో జులై 25న సంజీవని పథకాన్ని ప్రారంభించిన సందర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడుతూ.. వరి పంట వేయొద్దని రైతులను కోరారు.
ఎల్‌నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు నెలకొన్న వేళ ఈ ఏడాది రైతులెవరూ వరి పంట వేయవద్దని సీఎం విజ్ఞప్తి చేశారు. ఆరుతడి పంటల సాగుతో ఉన్న నీటిని చాలా జాగ్రత్తగా వాడుకుందామని పిలుపునిచ్చారు.
మరోవైపు, ఎల్‌నినో ప్రభావంపై రైతుల్లో అవగాహన కల్పించాలని సీఎం అధికారులను ఆదేశించారు.
ఎల్ నినో పరిస్థితులపై రెండు రోజుల కిందట నిర్వహించిన సమీక్షా సమావేశంలో చంద్రబాబు అధికారులతో మాట్లాడారు. ఈ ఏడాది అంతటా ఎల్ నినో ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుందని అంచనాలు వస్తున్న నేపథ్యంలో ఆ ప్రభావం వల్ల ఉత్పన్నమయ్యే పరిణామాలను రైతులకు వివరించడంతోపాటు.. ప్రత్యామ్నాయ పంటలు వేసుకునేలా రైతులను ప్రొత్సహించాలని సూచించారు.
ఏ ప్రాంతాల్లో ఏయే పంట సాగు చేయాలనేదానిపై రైతులకు వివరించాలన్నారు. అలాగే తాగునీటి సమస్య ఉత్పన్నం కాకుండా చూసుకోవాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు.
'వరి నుంచి రైతులు మారడం లేదు'
వరి పంట నుంచి ఇతర పంటలకు మార్పిడికి నిర్దేశించిన 1.29 లక్షల హెక్టార్ల లక్ష్యానికి గాను, ఇప్పటివరకు 11,422 హెక్టార్లు మాత్రమే సాధించినట్టు వ్యవసాయశాఖ మంత్రి అచ్చెన్నాయుడు సమీక్షా సమావేశంలో సీఎంకు వివరించారు. కంది, ఆముదం, మినుము పంటలను ఇప్పటికే కొందరు ప్రత్యామ్నాయ పంటలుగా వేస్తున్నారని చెప్పారు.
ఎల్ నినో ఉపద్రవాన్ని ఓ సవాల్‌గా తీసుకుని రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తోందని మంత్రి అచ్చెన్నాయుడు బీబీసీకి తెలిపారు.
''ఎల్ నినో ప్రభావాన్ని ఎప్పటికప్పుడు పర్యవేక్షించేందుకు కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేస్తున్నాం. వరదలు, తుపాన్లు వచ్చినప్పుడు ఎలా మానిటర్ చేశారో.. అదే విధంగా ఎల్ నినో అంశాన్ని మానిటర్ చేస్తారు.
పరిస్థితిని ఎప్పటికప్పుడు అంచనా వేసి.. వచ్చిన డేటాను విశ్లేషించి ప్రతివారం నివేదికలు పంపుతారు. ఆ నివేదికల ఆధారంగా ఏయే చర్యలు తీసుకోవాలో నిర్ణయిస్తాం'' అని అచ్చెన్నాయుడు బీబీసీకి తెలిపారు.
‘నారుమడులు వేశాక నీళ్లు లేవంటున్నారు’
''నేను ఆరు ఎకరాల్లో వరి నారు మడులు వేశాను.. ఇప్పుడు నీళ్లు రావడం లేదు, కనీసం ఎప్పుడు వస్తాయి, అసలు వస్తాయో రావో కూడా అధికారులు చెప్పడం లేదు. ముందే నీళ్లు రావని చెబితే పంట వేసేవాళ్లం కాదు కదా" అని ఏలూరు జిల్లా మాదేపల్లికి చెందిన వరి రైతు రామారావు అంటున్నారు.
‘‘ఇప్పుడు వరి వేయొద్దని చెబుతున్నారు. నారుమడులు వేసిన తర్వాత పంట వేయొద్దని చెబితే ఎలా? కనీసం ముందుగానే చెబితే ఇతర పంటలు వేసుకునే వాళ్లం కదా’’ అని రామారావు అన్నారు.
తాను రెండు ఎకరాల్లో నారుమడులు వేశానని, ఇప్పుడు నీళ్లు లేకపోవడంతో పూర్తిగా పొలం బీటలు వారిపోయిందని ఏలూరు రూరల్ మండలానికి చెందిన రైతు నాగప్రసాద్ బీబీసీకి తెలిపారు.
వరిసాగుకు నీళ్లు ఇవ్వలేం: నీటిపారుదల శాఖ
‘‘కృష్ణా డెల్టాకు సరిపడా నీళ్లు ఇవ్వాలంటే 150 టీఎంసీల నీళ్లు కావాలి. కానీ, ప్రస్తుతం శ్రీశైలం, నాగార్జునసాగర్ ప్రాజెక్టుల్లో తగినంత నీటి నిల్వలు లేవు. అక్కడి నుంచి ఈ సీజన్‌లో నీరు వచ్చే పరిస్థితి కనిపించడం లేదు. పులిచింతలలో 29 టీఎంసీలు ఉన్నా.. వాటిని సాగునీటికి ఇచ్చే పరిస్థితి లేదు. కేవలం తాగునీటికి మాత్రమే వినియోగించాల్సి ఉంది. అందువల్లనే ఈ ఏడాది వరిసాగుకి దాదాపుగా నీళ్లు ఇవ్వలేం’’ అని ఈస్ట్రన్ కెనాల్ సూపరింటెండెంట్ ఇంజినీర్ జె.గుణకర్ స్పష్టం చేశారు.
ఆయన బీబీసీతో మాట్లాడుతూ.. ఈ సీజన్‌లో వరి పంటకు నీళ్లు ఇవ్వడం సాధ్యం కాదు, కానీ పట్టిసీమ నుంచి వచ్చే నీళ్లతో కొన్ని ఆరుతడి పంటలకు మాత్రం ఇవ్వగలమని చెప్పారు.
పరిస్థితులను రైతులు అర్ధం చేసుకుని ఈ ఏడాది సహకరించాలని ఎస్‌ఈ గుణకర్ విజ్ఞప్తి చేశారు. నారుమడుల సమయంలో నీళ్లు ఇవ్వడం వల్లనే తాము వరి సాగుకి సిద్ధమయ్యామని రైతులు చెబుతున్న వాదనలను గుణకర్ వద్ద ప్రస్తావించగా.. "ఎక్కడో కొంత సమాచార లోపం జరిగి ఉంటుంది.
వరి సాగు వద్దని జులై నెల మొదటి నుంచి చెబుతున్నాం. కానీ కొంతమంది దైవాధీనం అనుకుని వేశారు. పరిస్థితి చూస్తే నీళ్లు రావడం కష్టమే" అని ఆయన వ్యాఖ్యానించారు.
‘‘ముందు జాగ్రత్తలు ఏవి?’’
ఎల్ నినో ఉపద్రవం ముంచుకొస్తోందని గత మూడు నెలలుగా వాతావరణశాఖ అధికారులు, పర్యావరణ వేత్తలు హెచ్చరిస్తున్నా.. ప్రభుత్వం ఇప్పటివరకు పట్టించుకోకుండా ఇప్పుడు హడావుడిగా సమీక్షలు సమావేశాలు నిర్వహిస్తోందే కానీ.. కార్యాచరణ మాత్రం లేదని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర నేత శ్రీనివాసరావు విమర్శించారు.
ముందస్తు ప్రణాళికలు రూపొందించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆయన బీబీసీతో మాట్లాడుతూ వ్యాఖ్యానించారు.
తాడిపూడికి పట్టిసీమ నీరు మళ్లించాలని డిమాండ్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఆధ్వర్యంలో ఇటీవల గొల్లగూడెంలోని పోలవరం కుడి కాలువ గేట్ల వద్ద రైతులు ఆందోళన చేసినా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని శ్రీనినాస్ ఆరోపించారు.
రాష్ట్రంలో ఏర్పడిన తీవ్ర వర్షాభావ పరిస్థితుల వల్ల రైతాంగం తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయిందని ఆంధ్రప్రదేశ్ కౌలురైతుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి. జమలయ్య ఆందోళన వ్యక్తం చేశారు.
‘‘రాష్ట్రంలోని 80 శాతానికి పైగా మండలాల్లో వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయని ప్రభుత్వ లెక్కలే చెబుతున్నాయి. ఖరీఫ్‌లో అత్యధికంగా వేసే వరి, పత్తి, వేరుశనగ, కంది పంటలు వానలు లేక ఎండిపోతున్నాయి. ప్రభుత్వం ఇప్పటికైనా సమగ్ర కరవు అంచనాలు వేసి, కరవు ప్రాంతాలుగా ప్రకటించాలి’’ అని ఆయన డిమాండ్ చేశారు.
ఎల్ నినో అంటే...
పసిఫిక్ మహాసముద్రంలో వేడి గాలుల కారణంగా ఉపరితల నీటి ఉష్ణోగ్రతలు అసాధారణంగా పెరగడాన్నే ఎల్ నినో అంటారని భారత వాతావరణ శాఖ(ఐఎండీ) విశాఖపట్నం డైరెక్టర్ డాక్టర్ పీఎల్‌ఎన్ మూర్తి బీబీసీతో అన్నారు.
సాధారణంగా పసిఫిక్ మహాసముద్రంలో తూర్పు నుంచి పడమరకు (దక్షిణ అమెరికా నుంచి ఆసియా వైపు) బలమైన గాలులు వీస్తాయనీ, అయితే ఎల్ నినో సమయంలో ఈ గాలులు బాగా బలహీనపడతాయని ఆయన చెప్పారు,.
ఫలితంగా పసిఫిక్ మహాసముద్రం వెంబడి తూర్పు ప్రాంతంలో సముద్రపు నీరు వేడెక్కుతుందని, దీనివల్ల భారత్‌లో కూడా రుతుపవనాలు బలహీనపడి తీవ్రమైన వర్షాభావం, తీవ్రమైన కరువు పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉందని తెలిపారు.
ఇది ప్రతి రెండేళ్ల నుంచి నాలుగు సంవత్సరాలకు ఒకసారి సంభవిస్తుంటుందని చెప్పారు. అయితే, దాని తీవ్రమైన ప్రభావం భారత్‌పై ఒక సంవత్సరం వరకు మాత్రమే ఉంటుందని అంచనా వేస్తున్నామని డాక్టర్ మూర్తి వెల్లడించారు.
వచ్చే ఏడాది ఎల్‌నినో నుంచి లా నినాగా..
'' ప్రస్తుత అంచనాల ప్రకారం భారత్‌పై ఎల్ నినో తీవ్రమైన ప్రభావం వచ్చే ఏడాదికి బాగా తగ్గిపోతుంది. ఎల్ నినో సీజన్‌లో సగటు వర్షపాతం కంటే చాలా తక్కువ నమోదవుతాయి.
వచ్చే ఏడాది ఎల్‌నినో.. లా నినాగా మారుతుంది. అప్పుడు రుతుపవనాలకు అనుకూలంగా ఉంటుంది. వర్షపాతం అధికంగా నమోదవుతుంది. సగటు వర్షపాతం కంటే చాలా ఎక్కువే నమోదు కావొచ్చు. ఎల్‌నినో..లా నినా మధ్య న్యూట్రల్ కండిషన్స్ కూడా ఉంటాయి. అప్పుడు సాధారణంగానే వర్షపాతం నమోదవుతుంది'' అని డాక్టర్ మూర్తి తెలిపారు.
ఎల్ నినో ఉన్నప్పుడు కూడా ఒక్కోసారి అల్పపీడనాలు, అధిక అల్పపీడనాలు ఏర్పడతాయని డాక్టర్ మూర్తి చెప్పారు. ఇప్పుడు కొన్నిచోట్ల భారీ వర్షాలు అల్పపీడనాల వల్లనే పడుతున్నాయని అన్నారు.
''నాలుగు రోజుల కిందట గుజరాత్‌తో పాటు ఇప్పుడు తెలంగాణ రాష్ట్రాల్లో అల్పపీడనం తీవ్ర వాయుగుండంగా మారింది'' అని ఆయన చెప్పారు.
ఉత్తర ఒడిశా, పశ్చిమ బెంగాల్ ప్రాంతాలపై ఏర్పడిన తీవ్ర వాయుగుండం దక్షిణ ఝార్ఖండ్, ఉత్తర ఛత్తీస్‌గఢ్ మీదుగా పశ్చిమ – వాయవ్య దిశగా కదులుతోందని చెప్పారు, ఈ మేరకు తెలంగాణ రాష్ట్రంలోని పది జిల్లాల్లో భారీ వర్షాలు కురిశాయని ఆయన తెలిపారు.
కాగా, ప్రస్తుతం దేశంలోని మిగిలిన రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో వర్షపాతం చాలా తక్కువ నమోదయ్యే అవకాశం ఉందని డాక్టర్ మూర్తి తెలిపారు.
మధ్యలో అప్పుడప్పుడూ వర్షాలు, భారీ వర్షాలు పడినా సీజన్‌కి తగినంత స్థాయిలో మాత్రం ఉండవని ఆయన అంచనా వేశారు.
ఎల్ నినో ప్రభావ పరిస్థితులను ఎదుర్కొనేందుకు పాలకులు సిద్ధంగా ఉండటం తప్ప మరో మార్గం లేదని మూర్తి వ్యాఖ్యానించారు.
( బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్, ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)