శ్రీనివాస మంగాపురం రివ్యూ: కృష్ణ మనవడికి పాత కథ కలిసి వచ్చిందా?

    • రచయిత, జీఆర్ మ‌హ‌ర్షి
    • హోదా, బీబీసీ కోసం
  • ప్రచురణ
  • చదివే సమయం: 4 నిమిషాలు

'సూప‌ర్‌స్టార్' కృష్ణ మ‌నవడు, మ‌హేశ్‌బాబు అన్న కొడుకు జై కృష్ణ హీరోగా, ర‌వీనాటాండ‌న్ కూతురు రాషా హీరోయిన్‌గా ఆర్ఎక్స్ 100 ద‌ర్శ‌కుడు అజ‌య్ భూప‌తి దర్శకత్వం వహించిన శ్రీ‌నివాస మంగాపురం శుక్రవారం ప్రేక్షకుల మందుకు వచ్చింది.

క్రేజీ కాంబినేష‌న్ కావడంతో ఈ సినిమాపై కొంత అంచ‌నాలు ఏర్ప‌డ్డాయి. మ‌రి జై కృష్ణ క‌రెక్ట్‌గా లాంచ్ అయ్యాడా, రాషా నటన ప్రేక్షకులను ఆకట్టుకుందా లేదా చూద్దాం.

క‌థ‌లోకి వెళితే తిరుప‌తిలో పెద్దిరెడ్డి (కిక్ శ్యాం) అంటే అంద‌రికీ భ‌యం. త‌న అనుచ‌రుడి కూతుర్ని ఎవ‌డో ప్రేమించాడని తెలిసి వాడి చేతికి మేకు కొడతాడు. ఇది ఫ‌స్ట్ సీన్‌. స‌రిగ్గా ఇదే టైమ్‌కి శీను (జై కృష్ణ‌) బ‌స్సులో వ‌స్తూ ఇది చూస్తాడు. పెద్దిరెడ్డి అంటే ఆ ఊళ్లో టెర్ర‌ర్ అని అర్థ‌మ‌వుతుంది.

త‌ర్వాత అదే పెద్దిరెడ్డి కూతురు మంగ (రాషా) వెంట ప‌డుతాడు హీరో. అయితే ఆమెకి వేరే వ్య‌క్తితో ఎంగేజ్‌మెంట్ అవుతుంది. అయినా వ‌ద‌ల‌కుండా త‌న ప్రేమ‌ని చెబుతాడు. ఆమె తిర‌స్క‌రించి వెళ్లిపోతుంది. మంగ మేన‌త్త (వాసుకి) శీను ఫోటోని మంగ ఫోన్‌లో చూసి ఆశ్చ‌ర్య‌పోయి, శీనుని వాసుబాబు అని పిలుస్తుంది. మంగ నీకు ద‌క్క‌దు, వెళ్లిపో అని చెబుతుంది. 'మంగ ఎప్ప‌టికైనా నాదే' అంటాడు శీను.

అస‌లు ఈ వాసుబాబు తిరుప‌తికి ఎందుకు వచ్చాడు? పెద్దిరెడ్డి గురించి తెలిసి కూడా, ఆ అమ్మాయి వెంట ఎందుకు ప‌డుతాడు? బ‌ళ్లారిలో ఉన్న వెంక‌ట‌ప్ప‌నాయుడికి (మోహ‌న్‌బాబు), హీరోకి ఏంటి రిలేష‌న్‌? ఇదీ మిగ‌తా క‌థ‌.

అదే పాత కథ..

హీరోయిన్ బాగా రిచ్‌, లేదా విల‌న్ కూతురు. హీరో మామూలు కుర్రాడు, వాళ్లిద్ద‌రికీ ప్రేమ పుడితే జ‌రిగే డ్రామా ఏంటి? ఇది సినిమా క‌థ‌ల్లో హిట్ ఫార్ములా. సేఫ్ లాంచింగ్‌ ప్రాజెక్ట్‌. అనేక మంది హీరోల తొలి సినిమా క‌థ‌లు ఇవే.

హిందీలో బేతాబ్‌, హీరో, తెలుగులో గంగోత్రి.. ఇలా చాలా సినిమాలు చెప్పొచ్చు. హీరో ఎక్క‌డి నుంచో వ‌స్తాడు. అత‌నికో బ్యాగ్రౌండ్ వుంటుంది. ఇది కూడా అరిగిపోయిన క‌థాంశమే. మ‌హేశ్‌బాబు తొలి సినిమా రాజ‌కుమారుడు కూడా ఇలాంటి క‌థే.

జైకృష్ణ‌కి కూడా రిస్క్ తీసుకోకుండా దర్శకుడు అజ‌య్ భూప‌తి ఆ పాత క‌థ‌నే ఎంచుకున్నాడు. ఇంట‌ర్వెల్ త‌ర్వాత వ‌చ్చే ట్విస్ట్ కూడా 'ప‌డిప‌డిలేచే మ‌న‌సు'లో చూసిందే. బ‌ల‌హీన‌మైన క‌థ‌నంతో, రెండు గంట‌ల 40 నిమిషాల నిడివితో ద‌ర్శ‌కుడు ప్రేక్షకుడికి ప‌రీక్ష పెట్టాడు.

ఎవరెలా నటించారు?

తెరపై జైకృష్ణ చూడ‌టానికి బాగున్నాడు. డ్యాన్స్‌లు, ఫైట్స్ ఓకే. న‌ట‌న చాలా మెరుగుప‌డాలి. మంచి క‌థ‌లు దొరికితే రెండుమూడు సినిమాల త‌ర్వాత నిల‌దొక్కుకునే అవకాశం వుంది.

హీరోయిన్ రాషా గురించి చెప్ప‌డానికి ఏమీ లేదు. జ‌స్ట్ ఓకే. మోహ‌న్‌బాబు ఒక ర‌కంగా అతిథి పాత్ర‌కి ఎక్కువ‌. ఇలాంటి క్యారెక్ట‌ర్లు అవ‌లీల‌గా చేస్తారు కానీ, క‌థ‌లోనే ప్రాధాన్య‌త లేదు. సెకెండాఫ్‌లో అప్పుడ‌ప్పుడు కాసిన్ని డైలాగ్‌లు చెప్పి వెళ్లిపోతాడు. వ‌య‌సు వ‌ల్ల‌నో, ఏమో ఆయ‌న గొంతులో మునుప‌టి గాంభీర్యం త‌గ్గింది.

ఇక న‌రేశ్‌ని చూస్తే జాలి క‌లిగింది. ఆ క్యారెక్ట‌ర్ ఎందుకు ఉందో, ఆ పాత్ర‌ని న‌రేశ్ ఎందుకు చేశాడో అర్థం కాదు. బ్ర‌హ్మాజీది కూడా అదే స్థితి. వ‌డ్లమాని శ్రీ‌నివాస్ విల‌న్‌గా భారీ బిల్డ‌ప్ ఇచ్చి త‌ర్వాత తుస్సుమ‌న్నాడు

సాంకేతికంగా ఎలా ఉంది?

వీక్ రైటింగ్‌కి ఈ సినిమా ఒక ఉదాహరణ. అనుచ‌రుడి కూతుర్ని ప్రేమించిన వాడిని శిక్షించిన పెద్దిరెడ్డి త‌న కూతుర్ని ప్రేమించిన వాడిని ఎందుకు వ‌దిలేసిన‌ట్టో తెలియ‌దు. దీనికి తోడు పాట‌లు, మ్యూజిక‌ల్ హిట్ అయితే లెక్క మారేది. కానీ అది కూడా వీక్‌.

ఈ సినిమాలో ప్ర‌త్యేకంగా ఏదైనా చెప్పాల్సింది ఉందంటే అది కెమెరా గురించే, తిరుప‌తిని చాలా కొత్త‌గా చూపించారు.

ప్లస్ పాయింట్స్:

1.కెమెరా

మైన‌స్ పాయింట్స్:

1.వీక్ రైటింగ్‌

2.నిడివి

ఫైన‌ల్‌గా కృష్ణ మ‌నుమ‌డికి క‌థ కుద‌ర‌లేదు.

(అభిపాయాలు సమీక్షకుడి వ్యక్తిగతం)

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,  ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)