నిర్మల్ పుర్జా: ఆర్నెల్లలో అత్యంత ఎత్తైన 14 శిఖరాలను అధిరోహించిన పర్వతారోహకుడు, హిమపాతంలో గల్లంతు

ప్రచురణ
చదివే సమయం: 5 నిమిషాలు

ప్రపంచ ప్రఖ్యాత పర్వతారోహకుడు నిర్మల్ పుర్జా హిమపాతం కారణంగా గల్లంతైనట్లు పాకిస్తాన్ ఆల్పైన్ క్లబ్ ఒక ప్రకటనలో తెలిపింది. ఆయన సహా పదిమంది పర్వాతారోహకుల బృందం ఆచూకి తెలియరావడం లేదని క్లబ్ వెల్లడించింది.

బ్రాడ్‌‌పీక్ శిఖరం నుంచి ఇప్పటి వరకు నాలుగు మృతదేహాలను వెలికితీసినట్లు ప్రాథమిక నివేదికలు సూచిస్తున్నాయని, అయితే వారిని ఇంకా గుర్తించలేదని గిల్గిత్-బాల్టిస్తాన్ పోలీసులు ఫేస్‌బుక్‌ ప్రకటనలో తెలిపారు.

ఇతర పర్వతారోహకుల గురించి అధికారులు ఇంకా సమాచారం సేకరిస్తున్నారని పోలీసులు తెలిపారు.

నేపాల్ పర్వతారోహకుడు నిర్మల్ పుర్జా 2019లో కేవలం ఆరు నెలల వ్యవధిలోనే ప్రపంచంలోని 8,000 మీటర్ల (26,300 అడుగులు) కంటే ఎత్తైన 14 శిఖరాలను అధిరోహించి చరిత్ర సృష్టించారు.

ఈ విజయం ఆధారంగా, నెట్‌ఫ్లిక్స్‌ "14 పీక్స్: నథింగ్ ఈజ్ ఇంపాజిబుల్" అనే డాక్యుమెంటరీ కూడా రూపొందించింది.

గురువారం మధ్యాహ్నం బ్రాడ్‌పీక్‌‌పైకి వెళ్లిన పర్వతారోహకుల బృందంపై హిమపాతం విరుచుకుపడినట్లు, అత్యంత తీవ్రమైన ప్రమాదాన్ని సూచించే సమాచారం అందినట్లు పాకిస్తాన్‌కు చెందిన ఆల్పైన్ క్లబ్ తెలిపింది.

కారాకోరం పర్వత శ్రేణిలో ఉన్న బ్రాడ్‌పీక్ సముద్ర మట్టానికి 8,047 మీటర్ల ఎత్తులో ఉంటుంది.

క్లబ్ చేసిన ప్రకటన ప్రకారం, ఈ యాత్రా బృందంలో 10 మంది పర్వతారోహకులు ఉన్నారు. వీరిలో నిర్మల్ పుర్జా నేతృత్వంలోని ఐదుగురు నేపాలీ పర్వతారోహకులు, పాకిస్తాన్‌కు చెందిన సోహైల్ సఖి, ఒమన్‌కు చెందిన ఒక పర్వతారోహకుడు, ఒక అమెరికన్, వాంగ్ అనే చైనా జాతీయుడు, మరో విదేశీ పర్వతారోహకుడు ఉన్నారు.

రికార్డులు సృష్టించిన పుర్జా

అమెరికన్ పర్వతారోహకురాలు మల్లోరీ గీస్, సోహైల్ సఖీతో కలిసి బ్రాడ్ పీక్ యాత్రలో భాగమయ్యారని మూవింగ్ మౌంటెన్స్ అనే ట్రెకింగ్ కంపెనీ ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక పోస్ట్‌లో తెలిపింది.

"హిమపాతం జరిగినప్పటి నుంచి మొత్తం బృందం ఆచూకీ దొరకడం లేదు" అని ఆల్పైన్ క్లబ్ ఒక ప్రకటనలో తెలిపింది.

జూలై 27న ఎక్స్‌లో పెట్టిన ఒక పోస్ట్‌లో, ఈ శిఖరం మీదకు వెళ్లడం తమ షెడ్యూల్‌లో లేదని నిర్మల్ పుర్జా రాశారు.

జనవరి 17న, నిర్మల్ పుర్జా 10 మంది నేపాలీయుల బృందానికి నాయకత్వం వహిస్తూ, శీతాకాలంలో 28,251 అడుగుల ఎత్తైన కే2 శిఖరాన్ని మొదటిసారిగా అధిరోహించారు. కే2 శిఖరం కారకోరం పర్వత శ్రేణిలో రెండో ఎత్తైన పర్వతం. కానీ దీన్ని అత్యంత ప్రమాదకరమైనదిగా చెబుతారు.

నిర్మల్ పుర్జా బృందం శీతాకాలంలో ఆ శిఖరాన్ని ఎన్నడూ అధిరోహించలేదు. ఆ బృందంలో షెర్పా వర్గానికి చెందని ఏకైక వ్యక్తి పుర్జాయే. ఆయన నిర్మల్ ఒక మగర్ అనే తెగకు చెందిన వ్యక్తి. బ్రిటిష్ గూర్ఖా బ్రిగేడ్‌లో పనిచేశారు.

ఐదు అడుగుల ఎత్తు మాత్రమే ఉన్నప్పటికీ, ప్రపంచంలోని ఎత్తైన పర్వతాలను అధిరోహించిన ఘనతను దక్కించుకున్నారు పుర్జా.

ఆయన పేరిట అనేక రికార్డులు ఉన్నాయి. వర్షాకాలం, వేసవి కాలాల్లో కూడా కే2 శిఖరాన్ని అధిరోహించడం కష్టం. అలాంటిది పుర్జా బృందం దాన్ని శీతాకాలంలోనే అధిరోహించింది.

కే2 పర్వతాన్ని అధిరోహించడానికి ప్రయత్నించే ప్రతి ఆరుగురిలో ఒకరు మరణిస్తుండగా, ఎవరెస్ట్ పర్వతంపై మరణాల రేటు ప్రతి 34 మందిలో ఒకటని గణాంకాలు చెబుతున్నాయి.

ఈ గణాంకాల ప్రకారం కే2 శిఖరాన్ని అధిరోహించడం ఎంత ప్రమాదకరమో అర్థం చేసుకోవచ్చు. నిర్మల్ బృందం కే2 శిఖరాన్ని అధిరోహించిన రోజున, సెర్గి మింగోటే అనే స్పానిష్ పర్వతారోహకుడు కే2 శిఖరాన్ని చేరడానికి కొద్ది క్షణాల ముందే మృత్యువాత పడ్డారు.

సెర్గి మింగోటే గతంలో ఆక్సిజన్ సహాయం లేకుండా ప్రపంచంలోని 10 ఎత్తైన పర్వతాలను అధిరోహించారు. మధ్య ఆసియాలో 8,000 మీటర్ల కంటే ఎక్కువ ఎత్తున్న పర్వతాలు 14 ఉన్నాయి.

నిర్మల్ పుర్జా నేపథ్యం ఏంటి?

ప్రపంచంలో ఏడో ఎత్తైన పర్వతంగా చెప్పే ధౌలగిరి సమీపంలో నిర్మల్ జన్మించారు. అయితే, నేపాల్‌లోని చిత్వాన్ జిల్లా మైదాన ప్రాంతాలలో ఆయన పెరిగారు. 18 ఏళ్ల వయసులో బ్రిటిష్ సైన్యంలోని గూర్ఖా బ్రిగేడ్‌లో చేరారు.

2018లో సైన్యం నుంచి బయటకు వచ్చిన నిర్మల్, మరుసటి సంవత్సరమే అనేక రికార్డులను సాధించారు. 8,000 మీటర్ల కంటే ఎత్తైన పర్వతాలన్నింటినీ ఆరు నెలల ఆరు రోజుల్లో అధిరోహించారు. అంతకు ముందున్న రికార్డు దాదాపు ఎనిమిదేళ్లు.

ఈ రికార్డు దక్షిణ కొరియాకు చెందిన కిమ్ చాంగ్-హో పేరిట ఉండేది.

ఆ తర్వాత నిర్మల్ షెర్పాల బృందాన్ని సమీకరించి కే2 కోసం సన్నాహాలు ప్రారంభించారు. ప్రపంచం కరోనావైరస్‌తో పోరాడుతున్న సమయంలో, నిర్మల్, ఆయన బృందం భారీ లక్ష్యాన్ని పెట్టుకున్నారు.

ఈ నేపాలీ జట్టు 2021 ప్రారంభంలో చరిత్ర సృష్టించింది. నిర్మల్ తండ్రి భారత సైన్యంలోని గూర్ఖా రెజిమెంట్‌లో పనిచేశారు. తన తండ్రి భారత గూర్ఖా రెజిమెంట్‌లో 22 సంవత్సరాలు పనిచేశారని నిర్మల్ చెప్పేవారు. ఆ సమయంలోనే, ఆరేళ్ల వయసులో నిర్మల్ మొదటిసారి భారతదేశాన్ని సందర్శించారు.

కే2 శిఖరం కశ్మీర్‌లోని గిల్గిత్-బాల్టిస్తాన్‌లో ఉంది. నిర్మల్, ఆయన బృందం పాకిస్తాన్ పాలిత కశ్మీర్‌ నుంచి పర్వతారోహణను ప్రారంభించారు. మొదట్లో, నిర్మల్ బృందంలో కేవలం ముగ్గురే ఉన్నారు.

నేపాల్‌కు చెందిన మింగ్మాకు ఆరుగురితో కూడిన ఒక ప్రత్యేక బృందం ఉండేది. 7,000 మీటర్లు ఎక్కిన తర్వాత, మింగ్మా, నిర్మల్ బృందాలు కలుసుకున్నాయి. ఈ సమయంలో, వారు మరో నేపాలీని తమ బృందంలో చేర్చుకున్నారు.

షెర్పాలను పట్టించుకోవడం లేదా?

1953లో నేపాల్‌కు చెందిన షెర్పా టెన్జింగ్ నార్గే న్యూజీలాండ్‌కు చెందిన పర్వతారోహకుడు ఎడ్మండ్ హిల్లరీ‌తో కలిసి మొదటిసారిగా మౌంట్ ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించారు. అప్పటి నుంచి షెర్పాలు విదేశీయులకు పర్వతారోహణలో విస్తృతంగా శిక్షణ ఇస్తున్నారు.

అయినప్పటికీ, షెర్పాలకు వారు అర్హులైన గుర్తింపు లభించలేదు. ఎవరెస్ట్ అధిరోహించిన తర్వాత, ఎడ్మండ్ హిల్లరీని క్వీన్ ఎలిజబెత్ సత్కరించారు, కానీ టెన్జింగ్‌ను మాత్రం సత్కరించలేదు. టెన్జింగ్ లేకుండా ఎవరెస్ట్ పర్వతాన్ని అధిరోహించడం ఎడ్మండ్‌కు అంత సులభం కాకపోయినప్పటికీ ఈ సత్కారం జరగలేదు.

షెర్పాలు ఇప్పటికీ ఈ సమస్యతో సతమతమవుతున్నారా? మింగ్మా నిర్మల్ కే2 బృందంలోని ఒక షెర్పా. అయితే ఇప్పుడు పరిస్థితులు ఇంతకు ముందులా లేవని మింగ్మా అంటున్నారు. "ఒకప్పుడు మాకు లభించిన గుర్తింపు, కీర్తి ఇప్పుడు మాకు లభిస్తున్నాయి. ప్రపంచం ఒకప్పటిలా లేదు. చరిత్రలో కూరుకుపోకూడదు.భవిష్యత్తు వైపు చూడాలి" అన్నారు మింగ్మా.

షెర్పాలు నేపాల్ పర్వతారోహణ వర్గమని, వారు ప్రపంచవ్యాప్తంగా పర్వతారోహకులకు శిక్షణ ఇచ్చారని నిర్మల్ చెప్పారు. పరిస్థితి మునుపటిలా లేదని కూడా నిర్మల్ అంగీకరించారు.

నిర్మల్ బృందం కేవలం 21 రోజుల్లోనే కే2 శిఖరాన్ని అధిరోహించింది. 37 ఏళ్ల నిర్మల్‌కు ఇంత స్ఫూర్తి ఎక్కడి నుంచి లభిస్తుంది?

2021లో బీబీసీ విలేఖరి రజనీష్ కుమార్‌తో నిర్మల్ మాట్లాడారు.

"ఇది నేరుగా మా పెంపకానికి సంబంధించినది. మా నాన్నగారు భారత సైన్యంలోని గూర్ఖా రెజిమెంట్‌లో పనిచేశారు. నా ఇద్దరు సోదరులు బ్రిటిష్ గూర్ఖా రెజిమెంట్‌లో పనిచేశారు. నేను 2002లో నేపాల్‌కు వచ్చి మౌంట్ ఎవరెస్ట్ ఎక్కాను. అప్పటి నుంచి నాకు హిమాలయాలంటే ప్రాణంగా మారింది. అప్పటి నుంచి నేను పర్వతాలు ఎక్కడం ఎప్పుడూ ఆపలేదు" అని చెప్పారు.

2021లో మింగ్మా బీబీసీ హిందీతో మాట్లాడుతూ, నిర్మల్ పుర్జా తమతో ఉండటం చాలా కీలకమైన అంశమని చెప్పారు. "మేము నేపాల్ నుంచి బయలుదేరినప్పుడు, రెండు బృందాలుగా ఉన్నాం. నిర్మల్ బృందం వేరుగా ఉండేది. మేం 7,000 మీటర్లు ఎక్కిన తర్వాత కలుసుకున్నాం. ఇంకా 1,000 మీటర్లు మాత్రమే ఎక్కాల్సి ఉంది. మాలో మేం చర్చించుకుని నిమ్స్ దాయ్ (నిర్మల్ పుర్జా‌కు మరోపేరు )ను మా నాయకుడిగా చేసుకున్నాము. ఇంత తక్కువ సమయంలో నిమ్స్ దాయ్ నేపాలీలకు గర్వకారణంగా నిలిచారు, ఆయన తప్ప మరెవరూ మా నాయకుడిగా ఉండలేకపోయేవారు" అని మింగ్మా అన్నారు.

మింగ్మా తాను ఆక్సిజన్ తీసుకువెళ్లినట్లు చెప్పారు. కానీ పుర్జా దగ్గర ఆక్సిజన్ లేదు.

K2 ఎందుకు ప్రమాదకరం?

మౌంట్ ఎవరెస్ట్ ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన శిఖరం కాగా, కే2 రెండో స్థానంలో ఉంది. అయితే కే2ను ఎందుకు మరింత ప్రమాదకరమైనదిగా పరిగణిస్తారు?

"కే2పై వాతావరణం చాలా అనూహ్యంగా ఉంటుంది. కే2కు కేవలం పర్వతారోహణ వృత్తిగా చేసుకున్నవారు మాత్రమే వెళ్లగలరు" అని నిర్మల్ అన్నారు.

ఒకే సీజన్‌లో మౌంట్ ఎవరెస్ట్‌ను 2,000 మంది అధిరోహిస్తుండగా, కే2ను కేవలం 50 మంది మాత్రమే అధిరోహిస్తారని మింగ్మా చెప్పారు. ఇది కే2 శిఖరం అధిరోహణ ఎంత కష్టమో తెలియజేస్తుందని మింగ్మా అన్నారు.

ఎవరెస్ట్, కే2 పర్వతాలు రెండింటినీ నిర్మల్ అధిరోహించారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,  ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)