You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
మూవీ రివ్యూ: 'ఓ సుకుమారి' ఎలా ఉంది.. తిరువీర్, ఐశ్వర్య రాజేష్ నటన ఆకట్టుకుందా?
- రచయిత, జీఆర్ మహర్షి
- హోదా, బీబీసీ కోసం
- ప్రచురణ
- చదివే సమయం: 4 నిమిషాలు
ఐశ్వర్య రాజేష్, తిరువీర్ కలిసి నటించిన 'ఓ సుకుమారి' ఈ శుక్రవారం విడుదలైంది. ఇంతకీ ఈ సినిమా ఎలా ఉంది? ఈ జోడీ ప్రేక్షకులను మెప్పించిందా లేదా అనేది సమీక్షలో చూద్దాం.
తెలంగాణలోని ఒక పల్లెటూరిలో దామిని (ఐశ్వర్యా రాజేష్) బాల్యంతో సినిమా ప్రారంభమవుతుంది. పిల్లల్ని ఎత్తుకెళ్లే ముఠా దామినిని పట్టుకుంటే కరెంట్ షాక్ కొడుతుంది. ఆమెకు అలాంటి విచిత్రమైన సమస్య ఉంటుంది.
దామిని తండ్రి (ఆనంద్) ఆమెను తీసుకొని వేరే ఊరికి వెళతాడు. అక్కడే పెరిగి పెద్దదైన దామిని అంటే ఊళ్లో అందరికీ భయమే. ప్రతి ఒక్కరూ ఏదో ఒక సమయంలో ఆమె వల్ల షాక్‌కి గురైన వాళ్లే.
పక్క ఊరిలో ఉన్న యాదగిరి (తిరువీర్)ది ఉమ్మడి కుటుంబం. ఆయన సర్పంచ్‌గా పోటీ చేసి ఓడిపోయాడు. ఆ ఇంట్లో ఉన్న ఇద్దరు అన్నదమ్ములలో మొదట ఎవరు మగపిల్లవాడిని కంటారో అతనికి రూ. 80 కోట్ల ఆస్తి దక్కుతుందని యాదగిరి తాత వీలునామా రాసి చనిపోతాడు. ఇది లాయర్ ద్వారా తెలుసుకున్న యాదగిరి, అర్జెంట్‌గా పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుంటాడు.
పక్క ఊరిలో ఉన్న దామినిని చూసి యాదగిరి ఇష్టపడతాడు. అయితే, ఆమెకు షాక్ కొట్టే విషయం తెలియకుండా ఊళ్లో వాళ్లు దాచిపెట్టి ఆమెతో అతనికి పెళ్లి జరిపిస్తారు. ఇలాంటి విచిత్రమైన భార్యతో ఆ తర్వాత ఆయనకు ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయనేదే మిగతా కథ.
ఫస్టాఫ్ నడిపించారు కానీ..
హీరోయిన్‌ని ముట్టుకుంటే షాక్ కొడుతుంది - ఈ లైన్ వినడానికి చాలా బావుంది. అయితే ఈ పాయింట్ మీద 2.17 గంటల సినిమా నడపాలంటే దర్శకుడికి చాలా సృజనాత్మకత కావాలి. ఫస్టాఫ్‌లో కామెడీ పండించడంలో కొంత సక్సెస్ అయిన డైరెక్టర్, సెకండాఫ్‌లో మాత్రం పూర్తిగా ట్రాక్ తప్పాడు. ఉమ్మడి కుటుంబాలు, భార్యాభర్తల మనస్పర్థలు, గొడవల్లో ఇరుక్కుపోయాడు.
ఐశ్యర్య, తిరువీర్ తమ నటనతో సినిమాను గట్టెక్కించడానికి ప్రయత్నించినప్పటికీ, స్క్రీన్‌ప్లేలో బలం, కథలో లాజిక్ లోపించడంతో ఆ ప్రయత్నం ఫలించలేదు. హీరోయిన్ కొన్నిసార్లు ఎందుకు షాక్ కొట్టడం లేదనే విషయాన్ని దర్శకుడు ఆకట్టుకునేలా చెప్పలేకపోయాడు.
కామెడీలో లాజిక్ అడగకూడదు, నిజమే! అయితే సన్నివేశాలు మరీ ఇష్టం వచ్చినట్లు సాగితే ప్రేక్షకులు అన్నీ ప్రశ్నిస్తారు. అయినా, చీమ చిటుక్కుమంటే మీడియా వాలిపోయే ఈ రోజుల్లో.. కరెంట్ షాక్ కొట్టే అమ్మాయి గురించి పక్క ఊరి వాళ్లకు కూడా తెలియకపోవడం చాలా విచిత్రంగా అనిపిస్తుంది.
ఎవరెలా నటించారు?
హీరోయిన్ కరెంట్ షాక్ ఇవ్వడం అనేది రెండు మూడు సార్లు ప్రేక్షకులను థ్రిల్ చేస్తుంది కానీ, పదే పదే అవే సీన్లు రిపీట్ అవుతుంటే ప్రేక్షకుడికి బోర్ కొడుతుంది. కథనంపై కొంత శ్రద్ధ తీసుకుని ఉంటే ఈ రూరల్ కామెడీ బాగా వర్కౌట్ అయ్యేది.
ఇంటర్వెల్ వరకూ కరెంట్ షాక్ పాయింట్ మీద నడిచిన కథ, సెకండాఫ్‌కి వచ్చేసరికి గ్రామ ఎన్నికలు, గుడిలో ఫైట్, ఉమ్మడి కుటుంబం, మొగుడు పెళ్లాం విడిపోవడం.. ఇలా అనేక ట్రాక్‌లుగా చీలిపోయి ప్రేక్షకులకే షాక్ ఇస్తుంది.
అమాయకపు యువకుడిగా తిరువీర్, గడుసరి అమ్మాయిగా ఐశ్వర్య బాగా నవ్వించారు. విష్ణు ఓయి కనిపించే సన్నివేశాలు చాలా రిలీఫ్ ఇస్తాయి.
ప్లస్ పాయింట్స్:
1. ఐశ్వర్య, తిరువీర్ నటన
2. ఫస్టాప్‌లో కొన్ని కామెడీ సన్నివేశాలు
మైనస్ పాయింట్స్:
1. పాటలు
2. ద్వితీయార్థం
(అభిపాయాలు సమీక్షకుడి వ్యక్తిగతం)
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్, ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)