డెలులూ - క్లాక్డ్ ఇట్ - వాస్తెగుణహూయా: పార్లమెంటులో ఎంపీలు కూడా ఈ జెన్ జెడ్ భాష ఎందుకు మాట్లాడుతున్నారు?

    • రచయిత, జోయా మతీన్
    • హోదా, బీబీసీ న్యూస్
    • నుంచి, దిల్లీ
  • ప్రచురణ
  • చదివే సమయం: 6 నిమిషాలు

దేశంలో నిత్యం ఆన్‌లైన్‌లో ఉండే యువత భాష పార్లమెంటుకూ చేరినట్లు కనిపిస్తోంది.

యువత నేతృత్వంలో సాగిన నిరసన ప్రదర్శన విద్యాశాఖామంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాల్సిన పరిస్థితి తీసుకువచ్చిన కొద్దిరోజులకే భారత పార్లమెంటు కూడా ఇప్పుడు నిరసనకారుల భాష మాట్లాడుతోంది.

'డెలులూ', 'ఫోమో' 'క్లాక్ ఇట్'

ఇటీవలివరకు ఈ పదాలు ఇన్‌స్టాగ్రామ్ కామెంట్ సెక్షన్లలో, గ్రూప్ చాట్‌లలో, మీమ్ పేజీల్లోనే కనిపించేవి. కానీ మంగళవారం ఇవే మాటలు లోక్‌సభలోనూ ప్రతిధ్వనించాయి.

కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) నేతృత్వంలో వారాల తరబడి సాగిన నిరసనల తర్వాత ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త యాంటీ ఎగ్జామ్ లీక్ బిల్లుపై ఎంపీలు చర్చిస్తున్న సమయంలో జెన్ జెడ్ పదజాలం సభలో యథేచ్ఛగా వినిపించింది.

శివసేన ఎంపీ శ్రీకాంత్ శిందే, ప్రతిపక్షం కీలక సమయంలో కనిపించకుండా పోవడం ద్వారా "ఎంఐఏ" (మిస్సింగ్ ఇన్ యాక్షన్) లా వ్యవహరించిందని విమర్శించారు. అలాగే ఏదైనా కోల్పోతామోమో అనే అభద్రతా ఫోమో ( Fear of Missing - FOMO)తో బాధపడుతూ, చివరకు వాస్తవానికి దూరంగా ఊహల్లో జీవించే (డెలులూ) స్థితికి చేరుకుందని ఎద్దేవా చేశారు. డెలులూ అనే పదం జెన్ జెడ్ సృష్టించిన సంక్షిప్త రూపం.

నిరసనల సమయంలో వైరల్ అయిన "వాస్తెగుణహూయా" అనే నినాదాన్ని కాంగ్రెస్ నేత దీపేందర్ సింగ్ హుడా ప్రస్తావిస్తూ ప్రభుత్వాన్ని ఎగతాళి చేశారు. ఆందోళనల సమయంలో ఉద్దేశపూర్వకంగా అర్థంలేని పదాలతో రూపొందించిన ఈ మీమ్ విపరీతంగా ప్రాచుర్యం పొందింది.

ప్రభుత్వ పక్ష ఎంపీలు కూడా ఇంటర్నెట్ పదజాలాన్ని తమ ప్రసంగాల్లో ఉపయోగించారు.

బీజేపీ ఎంపీ బన్సూరి స్వరాజ్ మాట్లాడుతూ, ఈ చట్టాన్ని తీసుకురావడం ద్వారా ప్రధాని నరేంద్ర మోదీ "క్లాక్డ్ ఇట్" చేశారని అన్నారు. జెన్ జెడ్ భాషలో "క్లాక్డ్ ఇట్" అంటే సమస్యను సరిగ్గా గుర్తించడం లేదా సరైన పరిష్కారాన్ని కనిపెట్టడమని అర్థం.

అధికారంలో ఉన్నప్పుడు ఇలాంటి సంస్కరణలు తీసుకురాలేకపోయిన ప్రతిపక్షం ఇప్పుడు బిల్లును విమర్శించడం "డెలులూ" కిందకే వస్తుందని మరో బీజేపీ ఎంపీ తేజస్వీ సూర్య వ్యాఖ్యానించారు.

ప్రతిపక్ష సభ్యురాలు సుప్రియా సూలే మాత్రం కాసేపు చర్చను పక్కనబెట్టి ఈ పరిస్థితిపై ఆశ్చర్యం వ్యక్తం చేశారు.

"మనమంతా ఇప్పుడు జెన్ జెడ్ భాష ఎందుకు మాట్లాడుతున్నాం?" అని ఆమె ప్రశ్నించారు. అయితే కొన్ని క్షణాలకే ఆమె కూడా "డెలులూ" అనే పదాన్ని ఉపయోగించారు.

అది నిజంగా అసాధారణమైన దృశ్యం.

మీమ్స్, ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ ఆధారంగా సోషల్ మీడియాలో మొదలైన ఒక ఉద్యమం... ఒక కేంద్ర మంత్రిని రాజీనామా చేయించడమే కాకుండా, ఆ తర్వాత జరిగిన పార్లమెంటు చర్చ భాషనే మార్చేసినట్లుగా కనిపించింది.

కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) మొదట వ్యంగ్య పోస్టులు చేసే ఓ ఇంటర్నెట్ వేదికలా ప్రారంభమైంది. అయితే పరీక్షల నిర్వహణలో అక్రమాలు జరిగినట్టు వచ్చిన ఆరోపణలపై పెరిగిన ఆగ్రహం... నిరుద్యోగం, వ్యవస్థల వైఫల్యం, రాజకీయ నిర్లక్ష్యం వంటి విస్తృత అసంతృప్తికి ఈ వేదిక కేంద్రబిందువుగా మారింది. అంతేకాదు, ఈ ఉద్యమం తనకంటూ ఒక ప్రత్యేక భాషను కూడా సృష్టించుకుంది.

వాట్సాప్‌లో పుట్టి, ఇన్‌స్టాలో విస్తరించి..

ఈ ఉద్యమానికి వాట్సాపే వేదిక. టెలిగ్రామ్ ద్వారా సమన్వయం జరిగింది. ఇన్‌స్టాగ్రామ్‌లో విస్తరించింది.

"ఫిట్ చెక్స్" (ధరించిన దుస్తులను చూపించే వీడియోలు), "గెట్ రెడీ విత్ మీ" వీడియోలు, వ్యక్తిగత వ్లాగ్స్, మీమ్స్, హేళన కూడిన ఎడిటింగ్‌ల ద్వారా ఈ ఉద్యమం సాగింది. నిరసన కార్యక్రమాలు జరిగిన కొద్ది గంటల్లోనే అవి రీల్స్‌గా మారి లక్షలాది మందిని ఆకర్షించాయి. మరింత మంది యువతను వీధుల్లోకి తీసుకొచ్చాయి.

ప్రభుత్వం కూడా క్రమంగా ఇదే డిజిటల్ వేదికలపై స్పందించడం ప్రారంభించింది.

సోషల్ మీడియాను సమర్థంగా వినియోగిస్తూ రాజకీయంగా ఎదిగిన ప్రధాని నరేంద్ర మోదీ... నిరసనలు ఊపందుకున్న సమయంలో సెల్ఫీ శైలిలో వీడియోలు విడుదల చేస్తూ, యువతకు నేరుగా పిలుపునిచ్చారు.

తర్వాత పార్లమెంటులో ప్రతిపక్ష ఎంపీలు ప్రధానమంత్రి చేసిన ఈ ప్రయత్నాలను కూడా ఎద్దేవా చేశారు. విద్యార్థుల ఆందోళనలకు సమాధానం చెప్పడం కంటే కెమెరా యాంగిల్స్ మార్చడం సులభమని విమర్శించారు.

ఇవన్నీ చూసి భారత రాజకీయాలు ఒక్కసారిగా జెన్ జెడ్‌ను గుర్తించాయని అనిపించవచ్చు.

కానీ సెంటర్ ఫర్ పాలసీ రీసెర్చ్‌కు చెందిన రాజకీయ శాస్త్రవేత్త రాహుల్ వర్మ మాత్రం ఒకే పార్లమెంటు చర్చను చూసి అలాంటి నిర్ణయానికి రావద్దని హెచ్చరిస్తున్నారు.

"రాజకీయ నాయకులు ఎప్పుడూ ప్రజాదరణ పొందిన సంస్కృతిలోని భాషను స్వీకరిస్తూనే ఉంటారు. తమ ఓటర్లు ఎక్కడ ఉన్నారో, ఎలా ఆలోచిస్తున్నారో వారికి తెలుసు. అదే వారి పని" అని ఆయన అంటున్నారు.

గతంలోనూ..

ఇలాంటి ఉదాహరణలు గతంలో కూడా ఉన్నాయి.

పార్లమెంటు ప్రసంగాల్లో క్రికెట్, ప్రకటనలు, ప్రజాదరణ పొందిన సినిమాల్లోని పదాలు చాలాకాలంగా వినిపిస్తూనే ఉన్నాయి. 2019లో "హౌజ్ ద జోష్?" అనే డైలాగ్ 'ఉరీ: ది సర్జికల్ స్ట్రైక్' సినిమా నుంచి రాజకీయ వేదికలపైకి వచ్చింది. మొదట సినిమాలో సైనికుల నినాదంగా వినిపించిన ఈ డైలాగ్, తర్వాత ఎన్నికల సభల్లోనూ, పార్లమెంటులోనూ మార్మోగింది.

అందువల్ల భాష కొత్తదైనా, దాని వెనుక ఉన్న రాజకీయ ధోరణి మాత్రం కొత్తది కాదని రాహుల్ వర్మ అభిప్రాయపడుతున్నారు.

ఇది భారత రాజకీయాల్లో పెద్ద మార్పుకు సంకేతం కాదని, ఓటర్లకు దగ్గర కావడానికి రాజకీయ నాయకులు ఎప్పటిలాగే వారి భాషనే మాట్లాడేందుకు ప్రయత్నిస్తున్నారనే విషయాన్ని మాత్రమే ఇది చూపిస్తోందని ఆయన చెబుతున్నారు.

కానీ, ఇంటర్నెట్ స్లాంగ్ భిన్నమైనది. సినిమా డైలాగ్‌లు లేదా క్రికెట్ వ్యాఖ్యానాల్లా దీన్ని రచయితలు లేదా క్రీడాకారులు సృష్టించరు. లక్షలాది మంది ఇంటర్నెట్ వినియోగదారుల మధ్య ఇది సహజంగా పుడుతుంది. వేగంగా రూపం మార్చుకుంటుంది. ఎంత వేగంగా పుట్టుకొస్తుందో, అంతే వేగంగా కనుమరుగైపోతుంది.

అందుకే ఈ భాష పార్లమెంటులోకి చేరడం ప్రత్యేకమైన విషయమని డిజిటల్ సంస్కృతిని అధ్యయనం చేసే ఆంత్రోపాలజిస్ట్ పాయల్ అరోరా అంటున్నారు.

"కొత్త వర్గాల ప్రజలతో అనుసంధానం కావాలనుకున్నప్పుడు రాజకీయాలు ముందుగా అరువు తెచ్చుకునేది వారి భాషనే" అని ఆమె చెప్పారు.

అయితే ఒక తరం ఉపయోగించే పదజాలాన్ని స్వీకరించడం సులభమే కానీ, ఆ పదజాలాన్ని పుట్టించిన అసంతృప్తిని అర్థం చేసుకుని పరిష్కరించడం అంత సులభం కాదని ఆమె అభిప్రాయపడుతున్నారు.

"జెన్ జెడ్ స్లాంగ్ ఉపయోగించడం సాంస్కృతిక అవగాహనను చూపిస్తుంది. కానీ అది రాజకీయ మార్పుకు నిదర్శనం అనాల్సిన అవసరం లేదు" అని ఆమె అన్నారు.

‘మా భాష మాట్లాడితే సరిపోదు’

నిరసనలు ముగిసిన తర్వాత కూడా వాటి డిజిటల్ ప్రభావంపై ప్రభుత్వం అసౌకర్యంగా ఉన్నట్లు కనిపిస్తోంది.

నిరసనలకు సంబంధించిన కొన్ని పోస్టులను తొలగించాలని అధికారులు ప్రయత్నించారు. ఆందోళనలతో సంబంధం ఉన్న పలువురు విద్యార్థులు, కార్యకర్తలపై పోలీసులు చట్టపరమైన చర్యలు కూడా మొదలుపెట్టారు.

ప్రధాన్ రాజీనామా తర్వాత కూడా ఈ కేసులను ఉపసంహరించుకోవాలన్న డిమాండ్‌ను సీజేపీ నేతలు వినిపిస్తున్నారు. కేసులు ఎత్తివేయకపోతే మళ్లీ వీధుల్లోకి వస్తామని హెచ్చరిస్తున్నారు.

ఈ ఉద్యమంలో భాగమైన ఇంటర్నెట్ హాస్యం కూడా పెద్ద చర్చకు దారితీసింది.

మీమ్స్, అసభ్య పదాలు, వ్యంగ్య జోకులు... భారత విద్యా వ్యవస్థను బలోపేతం చేయాలనే లక్ష్యంతో సాగిన ఉద్యమం తీవ్రతను తగ్గించాయని విమర్శకులు అభిప్రాయపడ్డారు.

అయితే ఉద్యమానికి మద్దతు ఇచ్చినవారు మాత్రం, ఆన్‌లైన్ ప్రపంచంలో పెరిగిన తరం మాట్లాడే భాష అదే అని వాదిస్తున్నారు. హాస్యం, ప్రభుత్వాన్ని జవాబుదారీగా నిలదీయడం... రెండూ ఒకేసారి కలిసి నడవగలవని వారు చెబుతున్నారు.

పార్లమెంటు ఈ కొత్త పదజాలాన్ని ఎంతకాలం కొనసాగిస్తుందో ఇప్పుడే చెప్పలేం. ఎందుకంటే ఇంటర్నెట్ స్లాంగ్ చాలా వేగంగా మారిపోతుంది. ట్రెండ్‌లు వచ్చినంత వేగంగా మాయమవుతాయి.

పేరు వెల్లడించేందుకు ఇష్టపడని ఓ సీజేపీ నిరసనకారిణి మాత్రం రాజకీయ నాయకులు జెన్ జెడ్ భాష మాట్లాడడం తనను ఏమాత్రం ఆకట్టుకోలేదని చెప్పారు.

"మా భాష మాట్లాడినంత మాత్రాన మేం ప్రభావితం కాబోం. అర్థవంతమైన మార్పు జరగాలి. మాకు కావాల్సింది జవాబుదారీతనం. మమ్మల్ని అనుకరించే రాజకీయ నాయకులు కాదు. అదంతా చాలా 'క్రింజ్'" అని ఆమె అన్నారు.

"మాలాగా మాట్లాడమని మేం వారిని అడగలేదు. మా మాట వినాలని మాత్రమే కోరాం" అని ఆమె స్పష్టం చేశారు.

( బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,  ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)