జపాన్ భూకంపం: షాపింగ్ మాల్‌లో పేలుడు, కూలిన వంతెన, ఎంతటి విధ్వంసం జరిగిందంటే...

    • రచయిత, జార్జ్ రైట్, ఒటిలే మిషెల్
  • ప్రచురణ
  • చదివే సమయం: 4 నిమిషాలు

జపాన్‌లో సంభవించిన భారీ భూకంపం ఆ దేశాన్ని కుదిపేసింది.

భూకంపం కారణంగా ఇప్పటివరకు 13 మంది మరణించినట్లు ఆ దేశ ప్రధాన మంత్రి సనాయో టకయిచి తెలిపారు.

శిథిలాల కింద చిక్కుకున్న వారి కోసం సహాయ బృందాలు రాత్రింబవళ్లు గాలింపు చర్యలు కొనసాగిస్తున్నాయని ఆమె పేర్కొన్నారు.

జపాన్‌లో క్యుషు ద్వీపంలో ఈ భూకంపం సంభవించింది.

భూకంపం వల్ల ఈయాన్ షాపింగ్ మాల్‌తో పాటు ఒక పేపర్ ఫ్యాక్టరీలో 19 మంది గల్లంతైనట్లు అధికారులు మొదట తెలిపారు.

భూకంపం కారణంగా పలుచోట్ల విద్యుత్ సరఫరా నిలిచిపోయింది, రోడ్లు దెబ్బతిన్నాయి.

కాలినడక వంతెన ఒకటి ధ్వంసమైంది. దాదాపు 10 వేల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు స్థానిక అధికారులు తెలిపారు.

అక్కడి పరిస్థితిపై నిరంతర సమాచారం అందుతోంది.

భూకంపం ఎప్పుడు, ఎక్కడ సంభవించింది?

జపాన్‌లోని కుమామోటో ప్రాంతంలో, స్థానిక కాలమానం ప్రకారం సాయంత్రం 4 గంటల 27 నిమిషాల సమయంలో భూకంపం సంభవించింది. వెంటనే ప్రజలు సురక్షిత కేంద్రాలకు తరలివెళ్లాలని అధికారులు సూచించారు.

భూకంప తీవ్రత రిక్టర్ స్కేల్‌‌పై 7.1గా నమోదైనట్లు జపాన్ వాతావరణ శాఖ(జేఎంఏ) ప్రకటించింది. అయితే, యూఎస్ జియోలాజికల్ సర్వే(యూఎస్‌జీఎస్) తీవ్రతను 6.8గా అంచనా వేసింది. భూకంప తీవ్రతను ప్రారంభ సమాచారం ఆధారంగా ప్రకటించి, ఆ తర్వాత సైంటిస్టులు డేటాను విశ్లేషించి సవరిస్తూ ఉంటారు.

భూకంపం ధాటికి దెబ్బతిన్న ఈయాన్ షాపింగ్ మాల్ ప్రాంతం జపాన్‌లోని క్యుషు ద్వీపంలో, కుమామోటో నగరంలో ఉంది.

జపాన్‌లోని నాలుగు ప్రధాన దీవుల్లో మూడో అతిపెద్ద ద్వీపం క్యుషు. జనాభా పరంగా రెండోది.

ఈ ప్రాంతంలో భూకంపాలు కొత్త కాదు. జపాన్ ప్రభుత్వ మీడియా సంస్థ ఎన్‌హెచ్‌కే ప్రకారం, 2016లో కుమామోటోతో పాటు పక్కనే ఉన్న ఒయిటా ప్రాంతంలో సంభవించిన భారీ భూకంపాల కారణంగా 278 మంది ప్రాణాలు కోల్పోయారు.

షాపింగ్ మాల్‌లో ఏం జరిగింది?

ఈయాన్ షాపింగ్ మాల్‌లో ముగ్గురు మరణించినట్లు కుమామోటో విపత్తు నిర్వహణ విభాగం అధికారి తెలిపారు.

షాపింగ్ మాల్ నుంచి 8 మందికిపైగా సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. శిథిలాల కింద ఎంతమంది చిక్కుకుపోయారనే దానిపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది.

భూకంపం సంభవించినప్పుడు షాపింగ్ మాల్‌లో పేలుడు జరిగిందని, దట్టమైన పొగలు కమ్ముకున్నట్లు ప్రత్యక్ష సాక్షి ఒకరు తెలిపారు.

అయితే, మాల్ సిబ్బందిని, వినియోగదారులను సురక్షితంగా బయటకు పంపించిన తర్వాతే పేలుడు జరిగినట్లు మాల్ నిర్వహణ సంస్థ వార్తా సంస్థ ఏఎఫ్‌పీకి తెలిపింది.

భవనం రెండో అంతస్థు కూలిపోయిందని, ఈ ఘటనలో గాయాలపాలైన కొందరు కస్టమర్లను ఆసుపత్రికి తరలించినట్లు ప్రత్యక్ష సాక్షి చెప్పారు.

కుమామోటోలోని ఇతర ప్రాంతాల్లోనూ దీని ప్రభావం కనిపించింది. నిప్పన్ పేపర్ సంస్థకు చెందిన యాత్సుషిరో ప్లాంట్‌లోని ఒక చిమ్నీ కూలిపోయినట్లు పోలీసులను ఉటంకిస్తూ ఎన్‌హెచ్‌కే పేర్కొంది.

ఆ ప్లాంట్‌లోని పొగగొట్టం విరిగి, కూలిపోయినట్లుగా రాయిటర్స్ సేకరించిన ఒక ఫోటోలో స్పష్టంగా కనిపిస్తోంది.

ఈ ప్లాంట్‌లో ఇద్దరు వ్యక్తులు 'కార్డియాక్ అరెస్ట్' స్థితిలో కనిపించారని, మరో తొమ్మిది మంచి ఆచూకీ లేకుండా పోయారని బీబీసీతో విపత్తు నిర్వహణ అధికారి ఒకరు చెప్పారు.

ఈ భూప్రకంపనల ధాటికి 17వ శతాబ్దానికి చెందిన చారిత్రక కుమామోటో కోట ప్రహరీ గోడలు కూలిపోయాయి.

భూకంప ప్రభావానికి ఈ కోట గురికావడం ఇదే మొదటిసారి కాదు. 2016లో ఈ ప్రాంతంలో 7.3 తీవ్రతతో భూకంపం వచ్చినప్పుడు కూడా, 400 ఏళ్ల చరిత్ర ఉన్న ఈ కోటలోని కొన్ని భాగాలు, బురుజులు వంపు తిరిగిన గోడలు దెబ్బతిన్నాయి.

కుమామోటో ప్రాంతంలోని ఒక పాదచారుల వంతెన కూడా కూలిపోయింది.

స్థానిక అధికారులు వెల్లడించిన వివరాల ప్రకారం, దాదాపు 36,700 ఇళ్లకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. అలాగే రోడ్లు కూడా దెబ్బతిన్నాయి.

క్యుషు ద్వీపంలో రైలు సర్వీసులను నిలిపివేసినట్లు జపాన్ రైల్వేస్ ప్రకటించింది.

( బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,  ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)