జోధ్‌పూర్: మాస్క్ పెట్టుకోలేదని ఓ వ్యక్తి గొంతుపై మోకాలు పెట్టి కూర్చున్న రాజస్థాన్ పోలీసు : ప్రెస్ రివ్యూ

ప్రచురణ
చదివే సమయం: 5 నిమిషాలు

రాజస్థాన్‌లోని జోధ్‌పుర్‌లో మాస్క్‌ పెట్టుకోనందుకు ఓ వ్యక్తి గొంతుపై పోలీసు మోకాలును ఆనించి కూర్చున్నారంటూ ‘ఇండియన్ ఎక్స్‌ప్రెస్’ దినపత్రిక ఓ వార్త ప్రచురించింది.

అమెరికాలో జార్జ్ ఫ్లాయిడ్ మరణంపై ఆందోళనలు రేగుతున్న సమయంలో జోధ్‌పుర్‌లో ఓ వ్యక్తి గొంతుపై ఓ పోలీసు మోకాలు ఆనించి కూర్చున్న ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.

ఆత్మరక్షణ కోసం ఆ పోలీసు అలా చేయాల్సి వచ్చిందని జోధ్‌పుర్ వెస్ట్ డీసీపీ ప్రీతి చంద్ర చెప్పారు.

ఆ వీడియోలో కిందపడి ఉన్న వ్యక్తి పేరు ముకేశ్ కుమార్ ప్రజాపత్.

కరోనావైరస్ వ్యాప్తి నేపథ్యంలో బహిరంగ ప్రదేశాల్లో ప్రజలు మాస్క్ ధరించడాన్ని తప్పనిసరి చేశారు.

అయితే, ప్రజాపత్ ముఖానికి మాస్క్ లేకుండా పోలీసులకు కనిపించారు.

‘‘ఆ వ్యక్తి దగ్గరికి కానిస్టేబుల్ వెళ్లి, మాస్క్ ఏదని ప్రశ్నించారు. వెంటనే ఆయన మాస్క్ బయటకు తీసి, పోలీసులను బెదిరించారు. పోలీసులు జీప్ తెప్పించేందుకు కాల్ చేశారు. అది రాకముందే, ఆ వ్యక్తి వారిని కొట్టడం మొదలుపెట్టారు. ఆయన్ను అరెస్టు చేసి, ఎఫ్ఐఆర్ నమోదు చేశాం’’ అని ప్రీతి చంద్ర చెప్పారు.

'కామ్రేడ్', 'లాల్ సలాం' పదాలతో జాగ్రత్త!

బహిరంగంగా 'కామ్రేడ్', 'లాల్ సలాం' అంటూ మాట్లాడేవాళ్లు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి రావచ్చంటూ 'న్యూ ఇండియన్ ఎక్స్‌ప్రెస్' దినపత్రిక ఓ కథనం ప్రచురించింది.

మావోయిస్టులతో సంబంధాల ఆరోపణలతో అరెస్టైన బిటూ సోనోవాల్ సహా మరో ఇద్దరు కృషక్ ముక్తి సంఘం నేతలు సోషల్ మీడియాలో 'కామ్రేడ్'. 'లాల్ సలాం' అన్న పదాలు వాడారంటూ... అభియోగాలకు సమర్థింపుగా కేసు ఛార్జ్ షీట్‌లో జాతీయ విచారణ సంస్థ (ఎన్ఐఏ) పేర్కొంది.

''బిటూ సోనోవాల్ తన స్నేహితులను 'కామ్రేడ్' అంటూ సంభోదించారు. 'లాల్ సలాం' అన్న పదాలను వాడారు. ఆయన ఫేస్‌బుక్ పోస్టుల్లో ఒకదానిలో లెనిన్ ఫొటో ఉంది. 'పెట్టుబడిదారులు మనకు తాడు అమ్ముతారు. దానికే వాళ్లను మనం ఉరేస్తాం' అన్న వ్యాఖ్య దానితో కలిపి పెట్టారు'' అని ఎన్‌ఐఏ ఛార్జ్ షీట్‌లో పేర్కొంది.

నిందితుల హింసాత్మక కార్యకలాపాలకు సంబంధించిన వీడియోలు, చిత్రాలు ఉన్న డీవీడీల గురించి కూడా ఇందులో ప్రస్తావించింది. వాటిని చండీగఢ్‌లోని ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపినట్లు పేర్కొంది.

పౌరసత్వ సవరణ చట్టంపై అసోంలో హింసాత్మక ఘర్షణలు జరిగిన నేపథ్యంలో గత ఏడాది డిసెంబర్‌లో ఆర్‌టీఐ ఉద్యమకారుడు అఖిల్ గొగోయ్ అరెస్టయ్యారు. ఆ తర్వాత బిటూ సోనోవాల్ సహా ముగ్గురు వ్యక్తులను ఎన్ఐఏ అరెస్టు చేసింది. ప్రస్తుతం వాళ్లు జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నారు.

‘కోవిడ్‌-19 ఆయుష్మాన్ భారత్ కింద ఉచితంగా చికిత్స చేస్తారా?’: ప్రైవేటు ఆసుపత్రులకు సుప్రీం కోర్టు ప్రశ్న

ప్రభుత్వ ఆరోగ్య పథకం ‘ఆయుష్మాన్‌ భారత్‌’కింద కోవిడ్‌ –19 రోగులకు చికిత్స అందించేందుకు సిద్ధంగా ఉన్నారా అంటూ సుప్రీంకోర్టు ప్రైవేటు ఆసుపత్రులను ప్రశ్నించనట్లు ‘సాక్షి’ దినపత్రిక ఓ వార్త ప్రచురించింది.

అన్ని ప్రైవేటు ఆసుపత్రులు కోవిడ్‌–19 రోగులకు ఉచితంగా చికిత్స అందించాలని తాము కోరడం లేదని సుప్రీం కోర్టు పేర్కొంది.

కేవలం ప్రభుత్వ భూముల్లో, లేదా తక్కువ ధరకు ప్రభుత్వం నుంచి కొనుగోలు చేసిన భూముల్లో నడుస్తోన్న ప్రైవేటు ఆసుపత్రుల్లో కొందరు కోవిడ్‌–19 రోగులకు ఉచిత చికిత్స అందించాలని జస్టిస్‌ ఎస్‌.ఎ.బాబ్డే సారథ్యంలోని జస్టిస్‌ ఎ.ఎస్‌.బోపన్న, జస్టిస్‌ రిషికేష్‌ రాయ్‌ల ధర్మాసనం అభిప్రాయపడింది.

ప్రైవేటు ఆసుపత్రులు కోవిడ్‌ రోగుల్లో కొందరికైనా ఉచిత చికిత్సను అందించలేవా అని ధర్మాసనం ప్రశ్నించింది. ప్రైవేటు ఆసుపత్రులు కొంత సేవాభావంతో పనిచేసేలా చూడాలని అభిప్రాయపడింది.

ఆయుష్మాన్‌ భారత్‌ పథకం ప్రకారం ఉండే ధరలను అన్ని ప్రైవేటు ఆసుపత్రులకు వర్తింపజేయాలని పిటిషన్‌దారుడు, న్యాయవాది సచిన్‌ జైన్‌ కోర్టుకి విన్నవించారు. ఈ అంశంపై సుప్రీంకోర్టు తిరిగి రెండు వారాల అనంతరం విచారణ జరపనుంది.

ప్రైవేటు ఆసుపత్రుల్లో కోవిడ్‌–19 రోగుల చికిత్సకు అయ్యే ఖర్చుపై పరిమితి విధించేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలంటూ దాఖలైన మరో పిటిషన్‌ను కూడా సుప్రీంకోర్టు విచారించింది.

దీనిపై వారంలోగా స్పందించాలని జస్టిస్‌ అశోక్‌భూషణ్‌ నేతృత్వంలోని ధర్మాసనం కేంద్రానికి నోటీసులు జారీ చేసింది.

ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స చేసుకోగల స్థోమత ఉన్న వ్యక్తికి బలవంతంగా ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స అందించాల్సిన అవసరమేంటని పిటిషన్‌దారు ప్రశ్నించారు. ప్రైవేట్‌ ఆస్పత్రులతోపాటు క్వారంటైన్‌ కేంద్రాల సంఖ్యను పెంచేలా ఆదేశాలివ్వాలని కోరారు.

ఆరోగ్య బీమా ఉన్నవారికి నగదు రహిత వైద్యం అందించాలన్నారు.

‘నిమ్స్‌ స్పెషాలిటీ బ్లాక్‌‌కు మూత?’

నిజాం ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌(నిమ్స్‌)లోని స్పెషాలిటీ బ్లాక్‌లో సేవలందిస్తున్న వైద్య సిబ్బందిలో పలువురికి కరోనావైరస్ సోకినట్లు ‘ఈనాడు’ దినపత్రిక ఓ కథనం రాసింది.

శుక్రవారం నిమ్స్‌లో ముగ్గురు ప్రొఫెసర్లు, నలుగురు సిబ్బంది కోవిడ్-19 బారిన పడ్డారు. నాలుగు రోజుల వ్యవధిలో ఇప్పటి వరకు మొత్తం నలుగురు ప్రొఫెసర్లు, 8 మంది రెసిడెంట్‌ వైద్యులు 8 మంది పారామెడికల్‌ సిబ్బందికి కరోనావైరస్ సోకిందని ఆసుపత్రి మెడికల్‌ సూపరింటెండెంట్‌ డాక్టర్‌ నిమ్మ సత్యనారాయణ తెలిపారు. దీంతో వీరితో ప్రత్యక్ష సంబంధాలు ఉన్న ఇతర వైద్యులు, స్టాఫ్‌ను క్వారంటైన్‌కు పంపామన్నారు.

తొలుత స్పెషాలిటీ బ్లాక్‌లోని కార్డియాలజీ విభాగంలో కరోనా కలకలం రేగింది. ఇందులో నాలుగు యూనిట్లలో 16 మంది వైద్యులు, ఇతర సిబ్బందితో కలిపి 40 మంది వరకు విధులు నిర్వహిస్తున్నారు. ఇక్కడ ఎక్కువ మంది కరోనా బారిన పడ్డారు. దీంతో ఇప్పటికే కార్డియాలజీ విభాగాన్ని పూర్తిగా మూసి వేశారు. తాజాగా ఇదే బ్లాకులోని యూరాలజీ విభాగానికి సోకింది. ఇక్కడ ముగ్గురు ప్రొఫెసర్లు ఇతర సిబ్బందికి పాజిటివ్‌ వచ్చింది.

గ్యాస్ట్రో ఎంటరాలజీ, సర్జికల్‌ ఆంకాలజీ, సర్జికల్‌ గ్యాస్ట్రో ఎంటరాలజీ విభాగాలు, ఎనిమిది ఆపరేషన్‌ థియేటర్‌లు ఇదే బ్లాకులో ఉన్నాయి. ప్రస్తుతం 50 మంది రోగులు చికిత్స పొందుతున్నారు. ఇలా ఒక్కో విభాగంలో వైద్యులకు కరోనా సోకడంతో అధికారులు అప్రమత్తమయ్యారు.

మొత్తం స్పెషాలిటీ బ్లాక్‌నే కొన్ని రోజులపాటు మూసి వేయాలని భావిస్తున్నారు. రోగులను తరలించడమో, ఇంటికి పంపడమో చేయనున్నారు. త్వరలో దీనిపై ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని డా.సత్యనారాయణ తెలిపారు.

ఒక్క స్పెషాలిటీ బ్లాక్‌కే కాకుండా శుక్రవారం ఆర్థోపెడిక్‌ విభాగంలో ఓ రోగికి పాజిటివ్‌ వచ్చింది. శస్త్ర చికిత్స చేయాలని సిద్ధమవుతుండగా...అతనికి వైరస్‌ ఉన్నట్లు రిపోర్టులో తేలడంతో వెంటనే గాంధీకి తరలించారు.

‘ఎక్కడ చదువుతున్నా, సొంత జిల్లాలో పరీక్ష రాయొచ్చు’

పదో తరగతి విద్యార్థులు ఇతర జిల్లాల్లో చదువుకున్నా.. సొంత జిల్లాల్లోనే పరీక్షలు రాసేలా తెలంగాణ ప్రభుత్వం వెసులుబాటు కల్పించిందంటూ ‘ఆంధ్రజ్యోతి’ దినపత్రిక ఓ కథనం రాసింది.

కరోనా లాక్‌డౌన్‌ కారణంగా వాయిదా పడ్డ 10వ తరగతి పరీక్షలు తిరిగి ఈ నెల 8వ తేదీ నుంచి జరగనున్న నేపథ్యంలో విద్యాశాఖ సంచాలకుల కార్యాలయం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు అన్ని జిల్లాల విద్యాశాఖాధికారులు(డీఈవోలు) శుక్రవారం ప్రకటనలు జారీ చేశారు.

కరోనావైరస్ కారణంగా విధించిన లాక్‌డౌన్‌తో పరీక్షలు వాయిదా పడడంతో చాలా మంది విద్యార్థులు సొంత జిల్లాలకు వెళ్లిపోయారు. ప్రస్తుతం అక్కడి నుంచి.. చదువుకున్న ప్రాంతాలకు వచ్చి పరీక్షలు రాయాలంటే ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొనాల్సి ఉంటుంది.

పైగా ప్రముఖ విద్యాసంస్థలన్నీ హాస్టళ్లను మూసేశాయి. పూర్తి స్థాయిలో రైళ్లు, బస్సులు నడవడం లేదు. ప్రైవేటు హాస్టళ్లు, హోటళ్ల సౌకర్యం కూడా లేదు.

ఈ నేపథ్యంలో సొంత జిల్లాల్లో పరీక్షలు రాయాలనుకుంటున్న విద్యార్థులు ఈ నెల 6 (శనివారం) సాయంత్రం 5 గంటల్లోగా నిర్ణీత ప్రొఫార్మాలో ఆయా జిల్లాల్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.

మరోవైపు హైదరాబాద్‌లో పదో తరగతి చదివి వివిధ జిల్లాల్లోని సొంతూళ్లకు వెళ్లిన విద్యార్థులు నగరానికి వచ్చేందుకు పేర్లు నమోదు చేసుకోవాలని హైదరాబాద్‌ జిల్లా విద్యాశాఖాధికారి వెంకటనర్సమ్మ సూచించారు. విద్యార్థుల అభ్యర్థనలను పరిశీలించి తగిన సాయం చేస్తామన్నారు.

కరోనావైరస్ హెల్ప్‌లైన్ నంబర్లు: కేంద్ర ప్రభుత్వం - 01123978046, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ - 104. మానసిక సమస్యల, ఆందోళనల పరిష్కారానికి హెల్ప్‌లైన్ నంబర్ 08046110007

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)