జేఎన్‌టీయూ: ఈసారి డిటెన్షన్ లేదు.. పరీక్షల్లో పాస్, ఫెయిల్‌తో సంబంధం లేకుండా విద్యార్థులకు ప్రమోషన్ : ప్రెస్ రివ్యూ

ప్రచురణ

ఇంజనీరింగ్, ఫార్మసీ, ఎంబీఏ, ఎంసీఏ, ఫార్మ్‌–డిలో కోర్సుల్లో డిటెన్షన్‌ విధానాన్ని ఈ విద్యా సంవత్సరానికి (2020-21) జేఎన్‌టీయూ రద్దు చేసిందంటూ ‘సాక్షి’ దినపత్రిక ఓ వార్త రాసింది.

వివిధ సెమిస్టర్‌లలో పరీక్షల్లో పాస్, ఫెయిల్‌తో సంబంధం లేకుండా (గతంలో డిటెయిన్‌ అయిన వారిని కూడా) తర్వాతి సెమిస్టర్‌కు ప్రమోట్‌ చేయాలని జేఎన్‌టీయూ నిర్ణయించింది.

యూనివర్సిటీ గ్రాంట్స్‌ కమిషన్‌ (యూజీసీ), రాష్ట్ర ఉన్నత విద్యామండలి జారీ చేసిన మార్గదర్శకాలకు అనుగుణంగా పరీక్షల నిర్వహణ మార్గదర్శకాలను గురువారం జారీ చేసింది.

లాక్‌డౌన్‌ కాలమంతా విద్యార్థులు కాలేజీలకు హాజరైన ట్లుగానే పరిగణనలోకి తీసుకుంటారు. అయితే హాజరు తక్కువగా ఉన్న వారి వివరాలు వెబ్‌సైట్‌లో నమోదు చేస్తారు.

ఫైనల్‌ సెమిస్టర్‌ పరీక్షలు సంబంధిత కాలేజీలోనే జరుగుతాయి. కాలేజీల మార్పు ఉండదు. కాలేజీల మూసివేతకు దరఖాస్తు చేసిన కాలేజీల విద్యార్థులకు సమీప కాలేజీలో పరీక్షలు నిర్వహిస్తారు.

బీటెక్‌ నాలుగో సంవత్సరం, రెండో సెమిస్టర్, బీపార్మసీ రెండో సెమిస్టర్‌ పరీక్షలు, ఎంబీఏ, ఎంసీఏ ద్వితీయ సంవత్సరం రెండో సెమిస్టర్‌ పరీక్షలు ఈ నెల 20 నుంచి మొదలవుతాయి. రవాణా సదుపాయం లేక పరీక్షలకు హాజరుకాలేని విద్యార్థులు 45 రోజుల్లో నిర్వహించే అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షలకు హాజరుకావచ్చు.

బీటెక్‌ ఫస్టియర్, సెకండియర్, థర్డ్‌ ఇయర్‌ రెండో సెమిస్టర్‌ పరీక్షలు, ఫార్మ్‌–డి రెండో, మూడో, నాలుగో, 5వ సంవత్సరం, పార్మ్‌–డి (పీబీ) సెకండియర్‌ పరీక్షలు జూలై 16 నుంచి ప్రారంభమవుతాయి.

ఆగస్టు 3 నుంచి అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షలు జరుగుతాయి.

బీటెక్, బీఫార్మసీ సెకండ్‌ సెమిస్టర్‌ (రెగ్యులర్‌), ఫస్ట్‌ సెమిస్టర్‌ (సప్లిమెంటరీ) పరీక్షలకు ఆలస్య రుసుము లేకుండా ఫీజు చెల్లింపు (రిజిస్ట్రేషన్‌) ఈనెల 6లోగా పూర్తి చేయాలి.

‘ఇచ్చేది తక్కువ... చెప్పుకొనేది ఎక్కువ’

ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్సార్సీపీ ప్రభుత్వ పథకాల ద్వారా లబ్ధి పొందుతున్నవారి సంఖ్య తక్కువగా, వాటి గురించి ప్రచార మోత ఎక్కువగా ఉంటోందని ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ పొలిట్‌బ్యూరో విమర్శించినట్లు ‘ఆంధ్రజ్యోతి’ దినపత్రిక ఓ కథనం ప్రచురించింది.

అనేక నిబంధనలు, ఆంక్షల కారణంగా సామాన్యులు ప్రభుత్వ పథకాల ద్వారా లబ్ధి అందే అవకాశం ఉండటం లేదని టీడీపీ వ్యాఖ్యానించింది.

‘‘ఇచ్చే రూ.పదివేలకే అనేక నిబంధనలు పెట్టి తమకు పథకాలు అందకుండా చేస్తున్నారని ఆటో డ్రైవర్లు, దర్జీలు, చేనేత కార్మికులు ఆవేదన చెందుతున్నారు. ఆరు లక్షల మంది డ్రైవర్లు ఉంటే, అందులో నాలుగు లక్షల మందికి ప్రభుత్వ సాయం ఎగ్గొట్టారు. ఆటో డ్రైవర్లకు సాయం ఇచ్చినట్లే ఇచ్చి మళ్లీ జరిమానాల కింద రెండింతలు వసూలు చేస్తున్నారు’’ అని ఆరోపించింది.

ఇటీవల విడుదల చేసిన సున్నా వడ్డీ రాయితీ కూడా రెండు మూడు వందల రూపాయలే వచ్చిందని మహిళలు నిందిస్తున్నారు అని పొలిట్‌బ్యూరో వ్యాఖ్యానించింది.

‘‘ఇళ్ల స్థలాలకు భూసేకరణలో అనేక నియోజకవర్గాల్లో పెద్దపెద్ద కుంభకోణాలు చోటుచేసుకొన్నాయి. రూ.ఏడు లక్షల విలువైన భూమికి రూ.70లక్షలు చెల్లిస్తున్న పరిస్థితి నెలకొంది. భూముల రేట్లు పెంచి ప్రభుత్వంతో కొనిపించి వైసీపీ నేతలు వాటాలు వేసుకొని పంచుకొంటున్నారు’’ అని ఆరోపించింది.

ఇసుక విక్రయాల్లో విపరీతమైన అక్రమాలు చోటు చేసుకొంటున్నాయని, కమీషన్లు తీసుకొని నాసిరకం మద్యం అమ్ముతున్నారని విమర్శించింది.

ప్రభుత్వ కార్యాలయాలకు రంగుల ఖర్చును వైసీపీ నుంచి వసూలు చేయాలని డిమాండ్‌ చేసింది.

‘కొత్త ప్రాజెక్టుల డీపీఆర్‌లు ఇవ్వండి’

కృష్ణాబేసిన్‌లో కొత్తగా చేపట్టిన ప్రాజెక్టుల సమగ్ర నివేదిక(డీపీఆర్‌)లు అందజేయాలని కృష్ణా నదీ యాజమాన్యబోర్డు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లకు సూచించిందంటూ ‘ఈనాడు’ దినపత్రిక ఓ వార్త రాసింది.

డీపీఆర్‌లను కృష్ణాబోర్డు, జలసంఘం పరిశీలించి సాంకేతికంగా సిఫార్సు చేయాలని, అపెక్స్‌ కౌన్సిల్‌ మంజూరు చేయాలని కృష్ణా బోర్డు పేర్కొంది.

తమ రాష్ట్ర ప్రభుత్వాల అనుమతితో కొత్త ప్రాజెక్టుల డీపీఆర్‌లు అందజేస్తామని రెండు రాష్ట్రాల అధికారులు హామీ ఇచ్చినట్లు ప్రకటించింది.

గురువారం హైదరాబాద్‌లో కృష్ణా నదీ యాజమాన్యబోర్డు 12వ సమావేశం వాడీవేడిగా సాగింది. రెండు రాష్ట్రాల అధికారుల మధ్య గట్టి వాదనలు జరిగాయి.

గత ఏడాదిలాగానే ఆంధ్రప్రదేశ్‌ 66 శాతం, తెలంగాణ 34 శాతం నీటిని వినియోగించుకునేలా ఈ సమావేశంలో నిర్ణయించారు.

2019-20వ సంవత్సరం కేటాయించి వాడుకోలేని నీటిని 2020-21వ సంవత్సరంలో వినియోగించుకోవడానికి అనుమతించాలన్న తెలంగాణ ప్రతిపాదనకు ఆంధ్రప్రదేశ్‌ అంగీకరించలేదు.

చిన్ననీటి వనరుల వినియోగం, గోదావరి నుంచి మళ్లించే నీటిలో వాటా విషయం తేలేవరకు ఇప్పటివరకు వినియోగించుకుంటున్నట్లు ఆంధ్రప్రదేశ్‌ 66శాతం, తెలంగాణ 34 శాతం వాటాకే అంగీకారం కుదిరింది.

టెలిమెట్రీ రెండో దశను ప్రాధాన్యంగా భావించి పూర్తి చేయాలని నిర్ణయించారు. ఇందుకు అవసరమైన నిధులను బోర్డుకు ఇవ్వడానికి రెండు రాష్ట్రాలు అంగీకరించాయి. తాము కొత్తగా ఎలాంటి ప్రాజెక్టులు చేపట్టలేదని తెలంగాణ పేర్కొంది. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి అన్ని అనుమతులు వచ్చాయని, ఇప్పటికే రూ.12వేల కోట్లు ఖర్చుచేశామని, ప్రధానమంత్రి ప్రసంగంలో కూడా ఈ ప్రాజెక్టును ప్రస్తావించారని సమావేశం దృష్టికి తెలంగాణ తెచ్చింది.

దీనికి అంగీకరించని ఆంధ్రప్రదేశ్‌ ఇవన్నీ కొత్త ప్రాజెక్టులేనని, ఆంధ్రప్రదేశ్‌ పునర్విభజన చట్టంలోని 11వ షెడ్యూలులో కూడా లేవని పేర్కొన్నట్లు తెలిసింది.

ఈ ప్రాజెక్టులపై వాదోపవాదాలు, సుదీర్ఘ చర్చ జరిగిన తర్వాత అన్ని ప్రాజెక్టుల డీపీఆర్‌లు అందజేయాలని, తాము సూచించినట్లుగా ఈ ప్రాజెక్టుల విషయంలో ముందుకెళ్లొద్దని బోర్డు ఛైర్మన్‌ రెండు రాష్ట్రాల అధికారులకు స్పష్టం చేసినట్లు తెలిసింది.

ఆంధ్రప్రదేశ్‌ రాయలసీమ ఎత్తిపోతలతో సహా 15 ప్రాజెక్టులను కొత్తగా చేపట్టినట్లు తెలంగాణ ఫిర్యాదు చేయగా, తెలంగాణ పాలమూరు-రంగారెడ్డితో సహా ఐదు కొత్త పథకాలు చేపట్టిందని, మూడింటి సామర్థ్యాన్ని పెంచినట్లు ఆంధ్రప్రదేశ్‌ ఫిర్యాదు చేసింది. ఈ ప్రాజెక్టులన్నింటిపైనా బోర్డు సమావేశంలో చర్చించారు.

ముచ్చుమర్రి లాంటి ఎత్తిపోతల పథకాలు 2014కు ముందు చేపట్టినవని, అసలు తాము చేపట్డడానికి ఉత్తర్వులివ్వని ప్రాజెక్టులు కూడా ఇందులో ఉన్నాయని, 2014 తర్వాత ఉత్తర్వులిచ్చిన ప్రాజెక్టులకు సంబంధించిన డీపీఆర్‌లను ప్రభుత్వంతో చర్చించి అందజేస్తామని ఆంధ్రప్రదేశ్‌ పేర్కొన్నట్లు తెలిసింది.

‘తెలంగాణలో 55 రకాల కరోనావైరస్‌’

కరోనావైరస్ దేశవ్యాప్తంగా మొత్తం 198 విభిన్న రూపాల్లో ఉందని, ఒక్క తెలంగాణలోనే 55 రకాలుగా పరివర్తనం చెందిందని పేర్కొంటూ ‘నమస్తే తెలంగాణ’ దినపత్రిక ఓ కథనం ప్రచురించింది.

జువాలాజికల్‌ సర్వే ఆఫ్‌ ఇండియా(జెడ్‌ఎస్‌ఐ) శాస్త్రవేత్తలు కరోనావైరస్‌కు చెందిన దాదాపు 400 జన్యువులను పరీక్షించగా విస్తుపోయే నిజాలు బయటపడ్డాయి.

కరోనా అత్యధిక జన్యుమార్పులకు గురైన రాష్ర్టాల జాబితాలో తెలంగాణ రెండో స్థానంలో ఉంది.

తొలి స్థానంలో గుజరాత్‌ ఉంది. ఆ రాష్ట్రంలో 60 రకాల కరోనా వైరస్‌లను శాస్త్రవేత్తలు గుర్తించగా గాంధీనగర్‌లోనే 13 రకాల వైరస్‌లు బయటపడ్డాయి.

దిల్లీ, మహారాష్ట్ర, కర్ణాటక రాష్ర్టాల్లోనూ వైరస్‌ రూపాలను మార్చుకుంది.

మార్చి తొలి వారం, మే చివరి వారంలో వివిధ జన్యువులను పరీక్షించగా దిల్లీలో 39, మహారాష్ట్ర, కర్ణాటకల్లో 15 రకాల విభిన్న రూపాలను శాస్త్రవేత్తలు కనుగొన్నారు.

చైనా, యూరప్‌, గల్ఫ్‌ దేశాల నుంచి కరోనా భారత్‌లోకి వచ్చిందని.. అందులో చైనా, యూరప్‌ నుంచి వచ్చిన వైరస్‌లే ప్రమాదకరమని జెడ్‌ఎస్‌ఐ కోల్‌కతా విభాగం డైరెక్టర్‌ కైలాశ్‌ చంద్ర వెల్లడించారు.

యూరప్‌లో తొలిసారి ఇటలీలో కరోనాను గుర్తించారని, అదే యూరప్‌లో అంత దారుణంగా విజృంభించడానికి కారణమైందని వివరించారు. ఇక, ఇరాన్‌, దుబాయ్‌ నుంచి వచ్చిన కరోనా వైరస్‌ ప్రభావం తక్కువగానే ఉందని తెలిపారు.

కరోనా వైరస్‌ ప్రవర్తనను తెలిపేందుకు ఈ పరిశోధన ఉపయోగపడుతుందని, ప్రభావవంతమైన వ్యాక్సిన్‌ తయారు చేసేందుకు దోహదపడుతుందని పేర్కొన్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)