Clade A3i: ‘తెలంగాణ, తమిళనాడుల్లో భిన్నమైన కరోనావైరస్‌’ : ప్రెస్ రివ్యూ

కరోనావైరస్

ఫొటో సోర్స్, Reuters

ప్రచురణ

తెలంగాణ, తమిళనాడుల్లో మిగతా దేశంలో పోల్చితే భిన్నమైన కరోనావైరస్ వ్యాప్తిలో ఉందంటూ ‘నమస్తే తెలంగాణ’ దినపత్రిక ఓ వార్త రాసింది.

హైదరాబాద్‌లోని ‘సెంటర్‌ ఫర్‌ సెల్యులార్‌ అండ్‌ మాలిక్యులల్‌ బయాలజీ’ (సీసీఎంబీ)కి చెందిన శాస్త్రవేత్తలు దేశంలో భిన్నమైన కరోనా వైరస్‌ రకాన్ని గుర్తించారు. దీనికి ‘క్లేడ్‌ ఏ3ఐ’ అని పేరుపెట్టారు.

దేశంలో మొత్తం 64 జన్యుక్రమాలను విశ్లేషించగా, 41 శాతం జన్యువుల్లో వీటి ఉనికిని గుర్తించినట్లు శాస్త్రవేత్తలు తెలిపారు.

ముఖ్యంగా దక్షిణాది రాష్ర్టాలైన తెలంగాణ, తమిళనాడులో ఈ రకం వైరస్‌ వ్యాప్తిలో ఉన్నట్లు పేర్కొన్నారు.

‘కౌన్సిల్‌ ఫర్‌ సైంటిఫిక్‌ అండ్‌ ఇండస్ట్రియల్‌ రీసెర్చ్‌' (సీఎస్‌ఐఆర్‌) ఆధ్వర్యంలో సీసీఎంబీ పనిచేస్తుంది. సీసీఎంబీ డైరెక్టర్‌ రాకేశ్‌ మిశ్రా మాట్లాడుతూ.. తెలంగాణ, తమిళనాడు నుంచి సేకరించిన నమూనాల్లో చాలా వరకు క్లేడ్‌ ఏ3ఐ రకం వైరస్‌ ఉన్నట్లు చెప్పారు.

దేశంలో కరోనా ప్రబలిన తొలినాళ్లలోనే ఈ నమూనాలను సేకరించినట్లు తెలిపారు. దిల్లీలో సేకరించిన నమూనాల్లో క్లేడ్‌ ఏ3ఐకి కొన్ని పోలికలు ఉన్నప్పటికీ, గుజరాత్‌, మహారాష్ట్ర నమూనాల్లో ఎలాంటి పోలికలూ లేవని వివరించారు.

సింగపూర్‌, ఫిలిప్పీన్స్‌లలో గుర్తించిన కరోనా వైరస్‌కు క్లేడ్‌ ఏ3ఐకి దగ్గరి పోలికలు ఉన్నట్లు చెప్పారు.

కేసీఆర్

ఫొటో సోర్స్, FACEBOOK/KCR

ఫొటో క్యాప్షన్, కేసీఆర్

ఆహార భద్రత సాధించాం... పోషకాహార భద్రత సాధించలేదు: కేసీఆర్

దేశంలో, రాష్ట్రంలో ఆహార భద్రత సాధించగలిగినా.. పోషకాహార భద్రత సాధించలేదని తెలంగాణ సీఎం కె.చంద్రశేఖర్‌రావు (కేసీఆర్) వ్యాఖ్యానించినట్లు ‘సాక్షి’ దినపత్రిక ఓ వార్త రాసింది.

ప్రజలు ఏది పడితే అది తింటున్నారు తప్ప, బలవర్థకమైన ఆహారం తినడం లేదని, అలాంటి ఆహారాన్ని తినేలా ప్రోత్సహించాలని, అలాంటి పంటలే పండిం చాలని కేసీఆర్ అన్నారు.

ఈసారి వర్షాకాలం పంటతో రాష్ట్రంలో నియంత్రిత పద్ధతిలో పంటల సాగు విధానం అమల్లోకి వస్తున్నదని, ఇది ఏటా ప్రతి సీజన్‌లో కొనసాగాలని కోరారు.

మార్కెట్లో అమ్ముడుపోయే పంటలనే పండించడం వల్ల వ్యవసాయం లాభసాటిగా మారుతుందని, పంటకు ధర రాని దుస్థితి ఉండదన్నారు. అంతిమంగా రైతు లాభం కోసం, వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చడం కోసం జరుగుతున్న ఈ ప్రయత్నాన్ని అధికార యంత్రాంగం రైతుల సహకారంతో విజయవంతం చేయాలని కోరారు.

రాష్ట్రంలో పంటల సాగు పద్ధతిగా జరగడం కోసం అనుసరించాల్సిన వ్యూహాన్ని ఖరారు చేయడానికి సీఎం కేసీఆర్‌ వ్యవసాయశాఖ అధికారులు, వ్యవసాయరంగ నిపుణులతో మూడు రోజుల పాటు విస్తృతంగా చర్చలు జరిపారు. ఈ సందర్భంగా సీఎం వారికి పలు సూచనలు చేశారు.

ఆలుగడ్డలు, అల్లం, ఎల్లిపాయలను ప్రజలు ఎక్కువగా వాడతారు. వీటిని దిగుమతి చేసుకోవాల్సి వస్తున్నది. రాష్ట్రంలోనే వాటిని పండించాలి. ఎక్కడ పండించాలి? మేలైన సాగు పద్ధతులేంటి? తదితర విషయాలపై రైతులకు మార్గదర్శనం చేయాలి.

ఉల్లిగడ్డల లభ్యత, ధరల విషయంలో ఏటా అనిశ్చితి, అస్పష్టత.. ఇలా ఎందుకుండాలి? తెలంగాణ ప్రజల అవసరాలకు తగ్గట్టు ఉల్లి సాగు జరగాలి. ఎప్పుడూ కొరత లేకుండా వ్యూహం అవలంభించాలి.

చిక్కుడు, మునగలో మంచి పోషకాలున్నాయి. వాటిని ఎక్కువగా తినేలా ప్రజలను చైతన్యపరచాలి. వాటి సాగు పెంచాలి.

ప్రభుత్వ కార్యాలయాలకు వేసిన పార్టీ రంగులు తొలగించాలంటూ ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు ఇదివరకు ఇచ్చిన తీర్పులో తమ జోక్యం అవసరం లేదని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది
ఫొటో క్యాప్షన్, ప్రభుత్వ కార్యాలయాలకు వేసిన పార్టీ రంగులు తొలగించాలంటూ ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు ఇదివరకు ఇచ్చిన తీర్పులో తమ జోక్యం అవసరం లేదని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది

నాలుగు వారాల్లో ఆ రంగులు తొలగించాల్సిందే: సుప్రీం కోర్టు

పంచాయతీ కార్యాలయాలకు వేసిన వైఎస్సార్సీపీ పార్టీ రంగులను నాలుగు వారాల్లోపు తొలగించాలని సుప్రీం కోర్టు స్పష్టం చేసినట్లు ‘ఈనాడు’ దినపత్రిక ఓ వార్త ప్రచురించింది.

ప్రభుత్వ కార్యాలయాలకు వేసిన పార్టీ రంగులు తొలగించాలంటూ ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు ఇదివరకు ఇచ్చిన తీర్పులో ఎలాంటి సందిగ్ధతా లేదని.. దానిలో తాము జోక్యం చేసుకోవాల్సిన అవసరం ఏ మాత్రం లేదని సర్వోన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది.

హైకోర్టు తీర్పును బేఖాతరు చేసేందుకు ప్రయత్నిస్తే న్యాయవ్యవస్థపై ప్రజల్లో విశ్వాసం దెబ్బతింటుందని హెచ్చరించింది.

ఆంధ్రప్రదేశ్‌లో పంచాయతీ భవనాలకు ఆకుపచ్చ, నీలం, తెలుపుతోపాటు ఎర్రమట్టి రంగులను వేయడానికి జారీ చేసిన జీవోలను రద్దు చేస్తూ హైకోర్టు తీర్పు ఇచ్చిన విషయం తెలిసిందే.

దీన్ని సవాల్‌ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో పిటిషన్‌ వేసింది. ఈ పిటిషన్‌పై బుధవారం జస్టిస్‌ లావు నాగేశ్వరరావు, జస్టిస్‌ కృష్ణమురారి, జస్టిస్‌ ఎస్‌.రవీంద్రభట్‌లతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టి.. ఏడు పేజీల ఉత్తర్వులు వెలువరించింది.

పంచాయతీ కార్యాలయాలకు వేసిన పార్టీ రంగుల్ని నాలుగు వారాల్లో తొలగించాలని స్పష్టం చేసింది. హైకోర్టు తీర్పు అమలు చేయకూడదన్న ఉద్దేశంతో కొత్త జీవోల్ని తీసుకురావడాన్నీ తప్పుబట్టింది.

టమాటా

ఫొటో సోర్స్, Getty Images

‘ఒకే దేశం... ఒకే వ్యవసాయ మార్కెట్’

దేశంలో ఏ రాష్ట్రంలోనైనా పంట ఉత్పత్తులను అమ్ముకునేందుకు మార్గం సుగమం చేస్తూ కేంద్ర కేబినెట్ నిర్ణయం తీసుకుందని ‘ఆంధ్రజ్యోతి’ దినపత్రిక ఓ వార్త రాసింది.

దేశంలో పంట ఉత్పత్తుల విక్రయాలపై ఆరున్నర దశాబ్దాలుగా ఉన్న ఆంక్షలు తొలగిపోయాయి. నిర్ణీత మార్కెట్లోనే పంటలు అమ్ముకోవాలనే నిబంధనను తొలగించారు.

పంట ఉత్పత్తులను రైతులు ఇక ఏ రాష్ట్రంలోనైనా అమ్ముకోవచ్చు. ఎక్కడ ధర ఎక్కువ ఉంటే అక్కడ పంట ఉత్పత్తులు అమ్ముకునేలా ఆర్డినెన్స్‌ తీసుకురావాలని కేంద్ర కేబినెట్‌ నిర్ణయించింది.

‘ఒకే దేశం.. ఒకే వ్యవసాయ మార్కెట్‌’ లక్ష్యంగా కేంద్రం ఆంక్షలన్నీ ఎత్తివేయడంతో రాష్ట్రాల మధ్య అడ్డుగోడలు తొలగిపోయాయి.

ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం ‘ఈ-నామ్‌’ (ఈ- జాతీయ వ్యవసాయ మార్కెట్‌)ను దేశంలో అమలుచేస్తోంది. అయితే ‘ఈ-నామ్‌’ అనుకున్నంత విజయవంతం కాలేదు.

దేశంలో ఎక్కడి నుంచైనా పంటలు కొనుగోలు చేసే విధానం నేటికీ అందుబాటులోకి రాలేదు. ఎక్కడి మార్కెట్‌ పరిధిలోని వ్యాపారులు అక్కడే ఆన్‌లైన్‌లో కొనుగోలు చేయడమో, సిండికేట్‌గా మారి ధరలు కోట్‌ చేయడమో జరుగుతోంది.

దీంతో అన్నదాతలు పాత పద్ధతిలోనే వ్యవసాయ మార్కెట్‌ యార్డులకు తీసుకెళ్లి పంటలను అమ్ముకుంటున్నారు. దీంతోపాటు ఏ మార్కెట్లో ఏ పంట కొంటారనేది కూడా ప్రభుత్వమే నిర్ణయించింది.

ఈ-నామ్‌ ప్రతిపాదించిన మార్కెట్లలో కూడా ఈ పరిమితులు ఉన్నాయి. తాజాగా కేంద్రం తీసుకున్న నిర్ణయంతో ఇలాంటి పరిమితులు, నియంత్రణలు ఏమీ ఉండవు. దేశంలో ఏ మార్కెట్లోనైనా, ఏ పంటనైనా విక్రయించుకునే స్వేచ్ఛను కల్పించారు.

గతంలో వ్యాపారులు ఎక్కడపడితే అక్కడ కొనుగోలు చేస్తే రైతులను మోసం చేసే అవకాశం ఉంటుందనే ఉద్దేశంతో కేవలం మార్కెట్‌ యార్డుల పరిధిలోనే కొనుగోలు చేయాలనే నిబంధన ఉండేది. దీంతో మార్కెట్‌ యార్డులకు ‘సెస్‌’ రూపంలో ఆదాయం వచ్చేది. ఇప్పుడు అలాంటి పరిమితులేమీ ఉండవు.

నిత్యావసర వస్తువుల చట్ట సవరణకూ మోదీ మంత్రివర్గం నిర్ణయం తీసుకొంది. దీనివల్ల రైతులు పండించే పప్పు ధాన్యాలు, నూనెగింజలు, ఉల్లిగడ్డ, ఆలుగడ్డలను చట్టం నుంచి తొలగించారు. దీంతో ఆయా వస్తువులను వీలైనంత ఎక్కువగా ఉత్పత్తిచేసి, ఎక్కువగా నిల్వ చేసుకునే వెసులుబాటు ఉంటుంది.

ప్రస్తుత వ్యవస్థలో రైతులు విక్రయించిన ఉత్పత్తులు నలుగురైదుగురి చేతులు మారిన తర్వాత వినియోగదారులకు అందుతున్నాయి. రైతులు నేరుగా సూపర్‌ మార్కెట్లకు పంట ఉత్పత్తులు విక్రయించే అవకాశం లేదు.

కొత్త ఆర్డినెన్స్‌ ప్రకారం.. అన్నదాతలే నేరుగా ఎగుమతి దారులు, హోల్‌సేల్‌ వ్యాపారులతో ఒప్పందాలు చేసుకునే వెసులుబాటు కలిగింది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)