You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
భక్తుల ఇళ్లకే భద్రాద్రి రామయ్య తలంబ్రాలు: ప్రెస్ రివ్యూ
ఆన్లైన్లో నమోదు చేసుకున్నవారికి భద్రచలం రామయ్య తలంబ్రాలను పంపిస్తామని తెలంగాణ దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి చెప్పినట్లు నమస్తే తెలంగాణ కథనం ప్రచురించింది.
ప్రాణాంతక కరోనావైరస్ విస్తరిస్తున్న నేపథ్యంలో ముందు జాగ్రత్త చర్యగా ప్రభుత్వ ఆదేశాలతో రాష్ట్రంలోని ప్రముఖ పుణ్యక్షేత్రాలు, ఆలయాలను మూసివేస్తున్నారు.
దీంతో ఉగాదివేడుకలు, పంచాగ శ్రవణం ఏర్పాట్లు, నిర్వహణపై మంత్రి సమీక్ష నిర్వహించారు.
'రాష్ట్రంలోని ప్రధాన దేవాలయాల్లో భక్తుల రద్దీ తగ్గింది. దేవాదాయశాఖ కార్యాలయంలో ఉదయం 10 గంటల నుంచి ఉగాది పంచాంగ పఠనం ఉంటుంది. అందరూ తమ ఇళ్లలోనే ఉండి ఉగాది పంచాంగ పఠనం వీక్షించాలని కోరుతున్నాం. బహిరంగ వేడుకలు నిర్వహించొద్దని అధికారులను ఆదేశించాం. కరోనా వ్యాప్తి దృష్ట్యా భక్తులంతా సహకరించాలని కోరుతున్నాం.
భద్రాద్రిలో యథావిధిగా శ్రీరామనవమి వేడుకలు నిర్వహిస్తాం. కేవలం ఆలయ ప్రాంగణంలో మాత్రమే శ్రీరామనవమి వేడుకలు నిర్వహిస్తాం. కల్యాణ ఆహ్వాన పత్రికలు కూడా ముద్రించలేదు. ఆన్‌లైన్‌లో నమోదు చేసుకున్న వాళ్లకు తలంబ్రాలు పంపిస్తాం' అని మంత్రి చెప్పారని నమస్తే తెలంగాణ రాసింది.
"200 మిల్లీ లీటర్ల శానిటైజర్ రూ.100కే అమ్మాలి"
200 మిల్లీ లీటర్ల శానిటైజర్ రూ.100కే అమ్మాలని కేంద్రం పరిమితి విధించిందని ఈనాడు సహా ప్రధాన పత్రికలన్నీ ప్రచురించాయి.
కోవిడ్-19 భయాల నేపథ్యంలో దేశవ్యాప్తంగా హ్యాండ్ శానిటైజర్లకు (చేతులు శుభ్రం చేసుకునే ద్రావణాలకు) విపరీతంగా గిరాకీ నెలకొంది. ఈ నేపథ్యంలో ధరల కట్టడికి కేంద్రం రంగంలోకి దిగింది. 200 మిల్లీ లీటర్ల ద్రావణం గరిష్ఠ ధరను రూ.100కు పరిమితం చేసింది. ఈ ధర జూన్ 30వరకు అమల్లో ఉంటుందని ఈనాడు రాసింది.
రెండు పొరల (సర్జికల్) మాస్కు గరిష్ఠ ధర రూ.8, మూడు పొరల (సర్జికల్) మాస్కు గరిష్ఠ ధర రూ.10గా కేంద్రం నిర్ణయించింది. ఈ ధరలు కూడా జూన్ 30 వరకు అమల్లో ఉంటాయని కేంద్ర వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి రాంవిలాస్ పాసవాన్ శనివారం ఓ ప్రకటనలో పేర్కొన్నట్లు ఈనాడు వివరించింది.
బాధ్యత మరిచిన మేరీ కోమ్
ఒలింపిక్ పతక విజేత, ఆరుసార్లు ప్రపంచ చాంపియన్, పద్మభూషణ్ గ్రహీత మేరీ కోమ్ కరోనావైరస్ వ్యాపిస్తున్న వేళ తన బాధ్యత మరిచిందని సాక్షి కథనం ప్రచురించింది.
"విదేశాల నుంచి తిరిగి వచ్చిన తర్వాత కనీసం 14 రోజుల పాటు స్వీయ నిర్బంధంలో ఉండాలనే నిబంధనను మేరీ కోమ్ ఉల్లంఘించారు.
జోర్డాన్‌లో ఈ నెల 3 నుంచి 11 వరకు జరిగిన ఆసియా క్వాలిఫయింగ్ బాక్సింగ్ టోర్నీలో మేరీ కోమ్ పాల్గొన్నారు. ఆ టోర్నీ నుంచి తిరిగి వచ్చిన భారత బాక్సర్లంతా రెండు వారాల పాటు బయటకు వెళ్లకుండా స్వీయ నిర్బంధంలో ఉండాలని బాక్సింగ్ సమాఖ్య ముందే చెప్పింది. దీనిని జట్టు సభ్యులంతా కచ్చితంగా పాటించాలని కోచ్ శాంటియాగో నీవా కూడా బాక్సర్లకు ముందే స్పష్టం చేసి దానికి తగినట్లుగా వారు ఇంట్లో చేసుకునేందుకు ఫిట్‌నెస్ షెడ్యూల్‌ను కూడా సూచించారు.
ఈ బాక్సర్లంతా ఈ నెల 13న భారత్‌కు చేరుకున్నారు. కానీ మేరీకోమ్ మాత్రం దీనిని పట్టించుకోకుండా ఈ నెల 18న రాష్ట్రపతి భవన్‌లో జరిగిన అల్పాహార విందులో పాల్గొన్నారని కథనంలో చెప్పారు.
రాష్ట్రపతి అధికారిక ట్విట్టర్ అకౌంట్ ద్వారా పోస్ట్ చేసిన చిత్రాల్లో ఇతర పార్లమెంట్ సభ్యులతో పాటు మేరీకోమ్ కూడా ఉన్నారు. ఈ విందులో తాను పాల్గొన్న విషయాన్ని మేరీకోమ్ కూడా నిర్ధరించింది. అయితే తాను ఎలాంటి నిబంధనలు ఉల్లంఘించలేదని ఆమె స్పష్టం చేశారు.
జోర్డాన్ పర్యటన తర్వాత నిర్దేశించిన నా స్వీయ నిర్బంధం ముగిసింది. అయినా సరే రాబోయే 3-4 రోజులు ఇంట్లోనే ఉంటాను" అని ఆమె స్పష్టం చేశారని సాక్షి రాసింది.
స్వయం సహాయక సంఘాల చేతికి పవర్
రాష్ట్రంలోని స్వయం సహాయక సంఘాలకు సోలార్, పవన విద్యుత్ ప్రాజెక్టులు అప్పగించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భావిస్తున్నట్లు ఆంధ్రజ్యోతి కథనం ప్రచురించింది.
రాష్ట్రంలోని స్వయం సహాయక సంఘాల (ఎస్‌హెచ్‌జీ) ఆదాయ వనరులను మరింతగా పెంచాలని సర్కారు భావిస్తోంది. గ్రామీణ ప్రాంతాల్లో వారి శక్తిని మరింత పెంచే ఉద్దేశంతో పవర్ ప్రాజెక్టులు ఇవ్వాలనుకుంటోంది. సోలార్, పవన విద్యుత్ ప్రాజెక్టులను వారికి అప్పగించి నెలసరి ఆదాయమే భారీగా ఉండేలా కార్యాచరణ రూపొందిస్తోంది అని పత్రిక చెప్పింది.
ఈ మేరకు భూములను అన్వేషించాలంటూ జిల్లా కలెక్టర్లను ఆదేశించింది.
ఇప్పటికే రాష్ట్రంలో భారీగా సోలార్, విండ్ ప్రాజెక్టులు పనిచేస్తున్నాయి. పెద్ద కంపెనీలు ప్రభుత్వం నుంచి భూమితోపాటు అనేక ఆర్థిక రాయితీలు పొంది మరీ ప్రాజెక్టులను ఏర్పాటు చేసుకున్నాయి.ఇప్పుడు ఎస్‌హెచ్‌జీలను ఈ వ్యాపారంలోకి దించి వారికి భారీ ఆదాయ వనరు చూపించాలని జగన్ సర్కారు భావిస్తోంది!
రాష్ట్రంలో లక్షలాది ఎస్‌హెచ్‌జీలున్నాయి. వాటన్నింటికీ ప్రాజెక్టులు ఇవ్వలేరు. కాబట్టి సగటున ఎన్ని గ్రూపులకు ఒక ప్రాజెక్టు ఇవ్వాలి? దాని పరిధిలో ఎంత మంది సభ్యులు ఉండాలో త్వరలో నిర్ణయించనున్నారు.
ఈ మేరకు జిల్లాల వారీగా భూములను గుర్తించాలని ప్రభుత్వం కలెక్టర్లను ఆదేశించిందని ఆంధ్రజ్యోతి వివరించింది.
ఇవి కూడా చదవండి.
- కరోనావైరస్: ఈ మహమ్మారి ఎప్పుడు ఆగుతుంది? జనజీవనం మళ్లీ మామూలుగా ఎప్పుడు మారుతుంది?
- కరోనావైరస్: భారతదేశం కోవిడ్ నిర్థరణ పరీక్షలు తగిన స్థాయిలో ఎందుకు చేయలేకపోతోంది?
- ‘అప్పుడు గంగానది శవాలతో ఉప్పొంగింది...’ మరణమృదంగం మోగించిన 1918 నాటి ఫ్లూ నుంచి భారత్ ఏం నేర్చుకోవాలి?
- అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఎప్పుడు, ఎందుకు, ఎలా మొదలైంది?
- #RIPTwitter: 24 గంటల్లో ఈ మెసేజ్‌లు మాయం.. ట్విటర్ ప్రయోగంపై యూజర్ల నిరసన
- తెలుగు భాష ఎప్పటిది? ద్రవిడ భాషలు ఎన్నాళ్ల నాటివి?
- మానవాకారంలో శివుడు ఎక్కడ ఉన్నాడు?
- హార్ట్ బ్రేక్ గైడ్: లవ్ ఫెయిల్యూర్, బ్రేకప్ బాధ నుంచి బయటపడండి ఇలా..
- చాలా మతాలు అంతరించినా క్రైస్తవం ఎలా విస్తరించింది?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)