వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసును సీబీఐకి అప్పగించేందుకు ప్రభుత్వానికి అభ్యంతరమేంటి?: హైకోర్టు - ప్రెస్ రివ్యూ

మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు దర్యాప్తును సీబీఐకి అప్పగించడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఉన్న అభ్యంతరం ఏమిటని రాష్ట్ర హైకోర్టు ప్రశ్నించిందని ఈనాడు తెలిపింది.
ఈనాడు కథనం ప్రకారం- వివేకా హత్యకు సంబంధించి దాఖలైన పిటిషన్లపై హైకోర్టులో విచారణ జరిగింది. దర్యాప్తును సీబీఐకి అప్పగించాలంటూ వివేకా భార్య సౌభాగ్యమ్మ, అప్పటి ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్‌రెడ్డి, టీడీపీ నేత బీటెక్ రవి, బీజేపీ నేత ఆదినారాయణరెడ్డి వేర్వేరుగా ఇప్పటికే పిటిషన్లు వేశారు.
తాజాగా వివేకా కుమార్తె సునీత కూడా దర్యాప్తును సీబీఐకి అప్పగించాలంటూ మరో పిటిషన్ దాఖలు చేశారు. సిట్ బృందంలో మూడు టీంలున్నా దర్యాప్తు సరిగా జరగడంలేదని ఆమె ఆరోపించారు. మళ్లీ అదే పోలీసులతో దర్యాప్తు చేయించడం సరికాదన్నారు.
15 మంది అనుమానితుల పేర్లను సునీత తన పిటిషన్‌లో ప్రస్తావించారు. వారిలో అవినాశ్‌రెడ్డి, భాస్కర్‌రెడ్డి, మనోహర్‌రెడ్డి, ఉదయ్‌కుమార్‌రెడ్డి, ఆదినారాయణరెడ్డి, బీటెక్ రవి, వాచ్‌మెన్ రంగయ్య, ఎర్ర గంగిరెడ్డి, శివశంకర్‌రెడ్డి, పరమేశ్వర్‌రెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి, సీఐ శంకరయ్య, ఏఎస్ఐ రామకృష్ణ, సురేంద్రనాథ్ రెడ్డి, రవీంద్రనాథ్‌రెడ్డి ఉన్నారు.


సునీత వ్యాజ్యాన్నీ మిగతా వాటితో కలిపి విచారిస్తామని ఉన్నత న్యాయస్థానం తెలిపింది. ఈ వ్యాజ్యాలపై కౌంటర్ అఫిడవిట్లు దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది.
మరోవైపు ఈ కేసును సీబీఐకి అప్పగించాలంటూ పిటిషన్లు దాఖలు చేసిన వారిలో ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్ ఒకరని, ఈ నేపథ్యంలో కేసును సీబీఐకి ఇచ్చేందుకు ప్రభుత్వానికి ఉన్న అభ్యంతరమేంటని న్యాయస్థానం ప్రశ్నించింది. సమాధానం ఇచ్చేందుకు అడ్వకేట్ జనరల్ (ఏజీ) అందుబాటులో లేకపోవడంతో తదుపరి విచారణను ఫిబ్రవరి 6కు వాయిదా వేసింది.
రాష్ట్ర ప్రభుత్వం నియమించిన సిట్ విచారణ తుది దశలో ఉందని, ఈ సమయంలో దర్యాప్తును సీబీఐకి ఇవ్వాల్సిన అవసరం లేదని ప్రభుత్వం తరపున ఏజీ గతంలో హైకోర్టుకు తెలిపారు.

రోడ్డు ప్రమాదాల్లో గాయపడితే మూడు రోజులు ఉచిత చికిత్స
తెలంగాణలో రోడ్డు ప్రమాదాల్లో గాయాలపాలైన వారికి అన్ని ఆస్పత్రుల్లో మొదటి మూడు రోజులు ఉచితంగా చికిత్స అందించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిందని ఆంధ్రజ్యోతి తెలిపింది.
'తెలంగాణ స్టేట్ యాక్సిడెంట్ అండ్ ఎమర్జెన్సీ కేర్ ఇనీషియేటివ్ (టీఏఈఐ)' పేరుతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించాలని ప్రభుత్వం భావిస్తోంది. రోడ్లు భవనాలు, పోలీసు, వైద్య ఆరోగ్యశాఖ, భారత జాతీయ రహదారుల సంస్థ(ఎన్‌హెచ్‌ఏఐ) ఉన్నతాధికారులు ఇటీవల సమావేశమై ఈ మేరకు చర్చించారు. తమిళనాడు తరహాలో తెలంగాణలోనూ క్షతగాత్రులకు ఉచితంగా వైద్య సేవలందించాలని నిర్ణయించారు. అయితే తెలంగాణలో మూడు రోజులే ఉచితంగా వైద్య సేవలు అందించనున్నారు.
క్షతగాత్రులను సమీపంలోని అన్ని రకాల ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రులకు తీసుకెళ్తే మొదటి మూడు రోజుల పాటు ఉచితంగా వైద్య సేవలందిస్తారు.
ఇందుకు అవసరమైన నిధుల లభ్యతపైనా చర్చ జరిగింది. అందుకుగాను కొత్త వాహనాల రిజిష్ట్రేషన్ సమయంలోనే సెస్ లేదా ట్యాక్స్ విధించాలనే చర్చ సాగింది. ఇదొక ప్రతిపాదన మాత్రమేనని అధికారులు చెబుతున్నారు.
ఆరోగ్యశ్రీతో ఈ కార్యక్రమాన్ని అనుసంధానం చేయాలన్న ఆలోచన కూడా ఉంది. రోడ్డు ప్రమాద బాధితులు ఆరోగ్యశ్రీ నెట్‌వర్క్‌లో లేని ఆస్పత్రులకు వెళితే ఎలా అన్న ప్రశ్న కూడా తలెత్తింది. ఏ ఆస్పత్రికి వెళ్లినా ఆరోగ్యశ్రీ కింద ఉచితంగా సేవలందించాలనే ప్రతిపాదన సిద్ధం చేస్తున్నారు.
తెలంగాణలో రోడ్డు ప్రమాదాల వల్ల ఏటా 6,600 మంది చనిపోతున్నారు. మరో 23 వేల మంది క్షతగాత్రులవుతున్నారు.

ఫొటో సోర్స్, Twitter/AndhraPradeshCM
కాపు మహిళలకు ఏడాదికి రూ.15 వేలు.. అర్హతలు ఇవీ...
'వైఎస్సార్ కాపు నేస్తం' పథకం మార్గదర్శకాలను ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమశాఖ మంగళవారం విడుదల చేసిందని ఆంధ్రజ్యోతి తెలిపింది. కాపు, బలిజ, తెలగ కులాలు, ఉపకులాల మహిళల జీవనోపాధికి ఏడాదికి రూ.15,000 చొప్పున ఐదేళ్లపాటు మొత్తం రూ.75,000 ప్రభుత్వం ఇవ్వనుందని చెప్పింది. లబ్ధిదారులకు ఉండాల్సిన అర్హతలు...
తల్లిదండ్రులు, తమపైనే ఆధారపడిన పిల్లలను కలిగిన మహిళలను ఒక కుటుంబంగా పరిగణిస్తారు. ఇలాంటి కుటుంబ మొత్తం నెలవారీ ఆదాయం గ్రామీణ ప్రాంతాల్లో రూ.10 వేలు, పట్టణ ప్రాంతాల్లో రూ.12 వేల లోపు ఉండాలి. కుటుంబానికి మూడు ఎకరాల్లోపు మాగాణి లేదా పదెకరాల్లోపు మెట్ట లేదా ఆ రెండూ కలిపి పదెకరాల్లోపు ఉన్నవారు అర్హులు.
లబ్ధిదారు ప్రభుత్వ పింఛనుదారు అయి ఉండరాదు (పారిశుద్ధ్య ఉద్యోగుల కుటుంబాలకు మాత్రం మినహాయింపు ఉంటుంది). కుటుంబం నాలుగు చక్రాల వాహనం(టాక్సీలు, ట్రాక్టర్లు, ఆటోలకు మినహాయింపు ఇచ్చారు) కలిగి ఉండరాదు. కుటుంబ సభ్యుల్లో ఎవరైనా ఆదాయపన్ను చెల్లించేవారుంటే అనర్హులవుతారు. పట్టణ ప్రాంతాల్లో కుటుంబానికి 750 చదరపుటడుగుల లోపు బిల్టప్ ఏరియా (నివాస/వాణిజ్య) కలిగి ఉన్నవారు మాత్రమే అర్హులు.
ఇంటిగ్రేటెడ్ కుల ధ్రువీకరణ పత్రం, జనన ధ్రువీకరణ పత్రం, టెన్త్ మార్కుల జాబితా, ఓటర్ గుర్తింపు కార్డు లేదా రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసిన పెన్షన్ కార్డుల్లో వయసు 45 ఏళ్లు పూర్తయి 60 ఏళ్లలోపు ఉన్నవారు మాత్రమే ఈ పథకం కింద ప్రయోజనం పొందేందుకు అర్హత పొందుతారు.
ఈ పథకం కోసం 2019- 2020 ఆర్థిక సంవత్సరానికి రూ.1,101.69 కోట్లు కేటాయిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది.
వైఎస్సార్ కాపు నేస్తం లబ్ధిదారులను గడపగడపకూ సర్వే ద్వారా గ్రామ, వార్డు వాలంటీర్లు గుర్తిస్తారు. నిబంధనల మేరకు అర్హులను గుర్తించి, ఆయా ఎంపీడీవోలు లేదా మున్సిపల్ కమిషనర్లకు పంపుతారు.
వారు వాటిని పరిశీలించిన తర్వాత సంబంధిత ధ్రువీకరణ పత్రాలతో పాటు లబ్ధిదారుల జాబితాలను బీసీ కార్పొరేషన్ ఈడీకి పంపితే, వారు ఆయా జిల్లాల కలెక్టర్‌కు ఆమోదం కోసం పంపిస్తారు.
పరిశీలనానంతరం కలెక్టర్లు ఆ జాబితాలను నగదు మంజూరు నిమిత్తం ఏపీ రాష్ట్ర కాపు సంక్షేమ, అభివృద్ధి సంస్థ ఎండీకి పంపుతారు. ఖరారైన లబ్ధిదారుల జాబితాలను ఆయా గ్రామ, వార్డు సచివాలయాల్లో ఉంచుతారు. ఈ ప్రక్రియ పూర్తయిన తర్వాత లబ్ధిదారుల ఖాతాలకు నగదు జమవుతుంది.

ఫొటో సోర్స్, FB/TRS PARTY
ఉత్కంఠ నడుమ నేరేడుచర్ల టీఆర్‌ఎస్ వశం
తెలంగాణలో తీవ్ర ఉత్కంఠ నడుమ సూర్యాపేట జిల్లా నేరేడుచర్ల మున్సిపాలిటీని టీఆర్‌ఎస్ కైవసం చేసుకుందని సాక్షి తెలిపింది.
చైర్మన్‌గా చందమల్ల జయబాబు, వైస్ చైర్మన్‌గా చల్లా శ్రీలత ఎన్నికయ్యారు. టీఆర్‌ఎస్‌కు ఎక్స్‌అఫీషియో సభ్యులతో 11 ఓట్ల బలం ఉంటే.. కాంగ్రెస్‌కు 10 ఓట్లు ఉండటంతో మెజార్టీ సభ్యులు ఉన్న టీఆర్‌ఎస్‌కే నేరేడుచర్ల సొంతమైంది. ఎమ్మెల్సీ శేరి సుభాష్‌రెడ్డిని ఎక్స్ అఫీషియో ఓటుగా చేర్చడంపై కాంగ్రెస్ అభ్యంతరం వ్యక్తం చేసింది. కాంగ్రెస్ సమావేశాన్ని వాకౌట్ చేసింది. కోరం ఉండటంతో చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక తంతు పూర్తి చేశారు.
మున్సిపల్ చైర్మన్ ఎన్నిక ప్రక్రియలో కాంగ్రెస్‌కు చెందిన కేవీపీ రామచంద్రరావు ఓటుపై టీఆర్‌ఎస్ అభ్యంతరం వ్యక్తం చేయడంతో ఎన్నిక వాయిదా పడింది. ఆ తర్వాత మంగళవారం ఎన్నిక ఉంటుందని ప్రిసైడింగ్ అధికారి ప్రకటించడంతో టీఆర్‌ఎస్ మరో ఎక్స్ అఫీషియో ఓటును పెట్టుకుని మున్సిపాలిటీని కైవసం చేసుకోవాలన్న ఎత్తు ఫలించింది.
ఎన్నిక వాయిదాకు ముందు కేవీపీ ఓటుతో కాంగ్రెస్‌కు 10 ఓట్లు, టీఆర్‌ఎస్‌కు 10 ఓట్లు ఉన్నాయి. టాస్ వేస్తే ఎవరికి విజయం దక్కుతుందోనని భావించిన టీఆర్‌ఎస్.. తిరస్కరించిన కేవీపీ ఓటును మళ్లీ ఎలా జాబితాలో పెడతారని వేసిన పాచికతో ఎన్నిక వాయిదా పడింది.
ఈ క్రమంలో ఇరుపార్టీలకు సమానంగా ఓట్లు ఉండటంతో శేరి సుభాష్‌రెడ్డి ఓటును నేరేడుచర్ల మున్సిపాలిటీలో టీఆర్‌ఎస్ నమోదు చేయించింది. దీంతో ఆ పార్టీ సభ్యుల బలం 11కు చేరింది. సుభాష్‌రెడ్డి పేరును ఎక్స్ అఫీషియో సభ్యుడిగా ఎన్నిక ప్రారంభానికి ముందు చేర్చారు.
ఎన్నికల ప్రక్రియను ప్రిసైడింగ్ అధికారి ప్రారంభిస్తూ ఓటు హక్కు జాబితాలో ఉన్న వారి పేర్లను సమావేశంలో వెల్లడించారు. సుభాష్‌రెడ్డికి ఇప్పుడెలా ఓటు హక్కు కల్పిస్తారని ఉత్తమ్‌తోపాటు ఆ పార్టీ సభ్యులు పీవోను ప్రశ్నించారు. ఈ నెల 25న అర్ధరాత్రి 12 గంటల్లోపు ఎక్స్ అఫీ షియో సభ్యుడిగా ఓటు హక్కు పొందిన తొలి జాబితాతోనే చైర్మన్ ఎన్నిక చేపట్టాలని, ఆ తర్వాత నమోదు చేసిన సుభాష్‌రెడ్డి పేరును జాబితాలో నుంచి తీసివేయాలని కాంగ్రెస్ సభ్యులు పట్టుబట్టారు.
సభ్యుల ప్రమాణ స్వీకారం ప్రారంభమయ్యే ముందు వరకు ఓటు హక్కు నమోదు చేసుకునేందుకు ఎన్నికల కమిషన్ అవకాశం కల్పించిందని, అందుకే సుభాష్‌రెడ్డి పేరును ఓటు జాబితాలో చేర్చామని పీవో వివరించారు. దీంతో సమావేశంలో గందరగోళం నెలకొంది. ఈసీ ఆదేశాలనే తాము అనుసరిస్తామని పీఓ చెప్పడంతో కాంగ్రెస్ పార్టీ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ సమావేశాన్ని బహిష్కరించారు.
సుభాష్‌రెడ్డికి ఓటు హక్కు కల్పించడాన్ని నిరసిస్తూ ఎంపీలు ఉత్తమ్, కేవీపీ నేరేడుచర్లలో రాస్తారోకో చేశారు. పోలీసులు వారిని అదుపులోకి తీసుకొని తర్వాత విడుదల చేశారు.
ఈ ఎన్నికపై న్యాయ పోరాటం చేస్తామని ఉత్తమ్ తెలిపారు.

ఇవి కూడా చదవండి:
- ఆశిమా ఛిబ్బర్ :మగాడి తోడు లేకుండానే తల్లి అయిన మహిళ కథ
- అమరావతిలో భూముల ధరలు: ఎన్నికలకు ముందు, ఎన్నికల తర్వాత, ఇప్పుడు ఎలా మారాయి?
- కరోనా వైరస్: చైనాలో 106కు చేరిన మరణాలు... ఇతర దేశాల్లో పెరుగుతున్న బాధితులు
- కరోనావైరస్లు ఎక్కడి నుంచి వస్తాయి... ఒక్కసారిగా ఎలా వ్యాపిస్తాయి?
- సముద్రజీవులను, భారీ తిమింగలాలను సైతం చంపేస్తున్న ‘ఘోస్ట్ గేర్’
- బంగారం ధరలకు, అంతర్జాతీయ సంక్షోభాలకు ఏమిటి సంబంధం...
- భారత్‌లో ప్రతి 20 మంది చిన్నారుల్లో ఒకరు అయిదేళ్లలోపే చనిపోతున్నారు...
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)
























