మూవీ రివ్యూ: ‘మా ఇంటి బంగారం’ సినిమా ఎలా ఉంది?

నందినీ రెడ్డి, సమంత

ఫొటో సోర్స్, Nandini Reddy/FB

    • రచయిత, జీఆర్ మ‌హ‌ర్షి
    • హోదా, బీబీసీ కోసం
  • ప్రచురణ
  • చదివే సమయం: 4 నిమిషాలు

స‌మంత, నందినిరెడ్డి, ఫ్యామిలీ మ్యాన్ సిరీస్‌ క్రియేట‌ర్స్‌లో ఒక‌రైన రాజ్ కాంబినేష‌న్‌లో రూపొందిన మా ఇంటి బంగారం సినిమా థియేట‌ర్‌లోకి వ‌చ్చింది.

క‌థేంటంటే... డాక్ట‌ర్ అనిరుధ్ (దిశ‌నాథ్‌) స్వ‌ర్ణ‌ని (స‌మంత‌) ల‌వ్ మ్యారేజ్ చేసుకుంటాడు. ఇది ఆయ‌న ఇంట్లో వాళ్ల‌కి ఇష్టం లేదు.

చెల్లెలి పెళ్లి కోసం తొలిసారి భార్య‌ని తీసుకుని సొంత ఊరు వ‌స్తాడు డాక్టర్ అనిరుధ్.

భర్త కుటుంబ సభ్యుల‌తో క‌లిసిపోవాల‌ని స్వ‌ర్ణ ప్ర‌య‌త్నిస్తూ వుంటుంది.

అయితే గ‌తంలో అమె పేరు ఝాన్సీ. జైలులో ఉన్న క‌రుణ (గుల్ష‌న్ దేవ‌య్య‌) ఆమె కోసం వెతుకుతూ వుంటాడు.

ఝాన్సీ నేప‌థ్యం ఏమిటి? క‌రుణ నుంచి త‌న‌ను, కుటుంబ స‌భ్యుల‌ను ఎలా కాపాడుకుంటుంది? ఇది మిగ‌తా క‌థ‌.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
 సమంత, నందినీరెడ్డి, సినిమా, రాజ్ నిడిమోరు

ఫొటో సోర్స్, nandureddyy/INSTA

ఫొటో క్యాప్షన్, సినిమాలో సమంత ఫైటింగ్‌‌లు చేశారు.

తొలి అరగంట తర్వాత....

నిజానికి ట్రైల‌ర్‌లోనే ఈ క‌థ చాలా మ‌టుకు అర్థ‌మైపోతుంది. సాధార‌ణ గృహ‌ణిలా క‌నిపించే స‌మంత మామూలు అమ్మాయికాదు... ఫైట్లు చేసి రివాల్వ‌ర్‌తో షూట్ చేస్తుంద‌ని తెలిసిపోతుంది. ట్రైల‌ర్‌తో ఆస‌క్తి పెరిగింది.

సినిమా మొద‌టి 30 నిమిషాలు హాయిగా, కామెడీగా సాగిపోతుంది. మంచి సినిమా చూస్తున్న ఫీల్ క‌లిగిస్తుంది. ఎపుడైతే స్నేహితురాలిని పిలిపించి, ర‌హ‌స్యంగా వంట‌లు చేయించే లాజిక్‌లేని కామెడీ స్టార్ట్ అవుతుందో, అక్క‌డి నుంచి సినిమా డ్రాప్ అవుతుంది...మ‌ళ్లీ లేవ‌దు.

ఇలాంటి క‌థ‌లు మ‌నకి కొత్త‌కాదు. ముత్యాల‌ముగ్గు (1975) సినిమా హీరోయిన్‌కి ఫైట్లు నేర్పించి, రివాల్వ‌ర్ ఇస్తే అదే మా ఇంటి బంగారం. లేదంటే బాషా, మిర్చీ సినిమాలకు లైట్ లేడీ వెర్ష‌న్‌.

టోన్ కూడా తిక‌మ‌క‌గా వుంటుంది. సీరియ‌స్ సీన్‌లో కామెడీ, అక్క‌డి నుంచి థ్రిల్ల‌ర్ టోన్‌లోకి షిఫ్ట్ అవుతూ వుంటుంది. నందినికి అల‌వాటైన హాస్యం, రాజ్ జాన‌ర్ థ్రిల్ల‌ర్ మిక్స్ చేయ‌డంతో ఇది ఎటూ కాకుండా పోయింది.

పైగా సంఘ‌ట‌న‌ల‌న్నీ స‌మంత‌కి అనుకూలంగా జ‌రుగుతూ వుంటాయి. అంత పెద్ద ఇంట్లో, రాజ‌కీయాల్లో ప్ర‌ముఖంగా వున్న వ్య‌క్తి ఇంటికి ఎలాంటి కాప‌లా వుండ‌దు. ఇంట్లో నౌక‌ర్లు కూడా క‌న‌ప‌డ‌రు. స‌మంత అర్ధ‌రాత్రి కూడా బ‌య‌టికి వెళ్లి, ఫైట్స్ చేసి, వ‌చ్చేస్తూ వుంటుంది. ఇంకా కామెడీ ఏంటంటే ఆమె మ‌రిది పోలీస్ ఆఫీస‌ర్‌.

 సమంత, నందినీరెడ్డి, సినిమా, రాజ్ నిడిమోరు

ఫొటో సోర్స్, samantharuthprabhuoffl/INSTA

మొత్తం భారం సమంతపైనే...

క‌థా కాలం 1980 అని మ‌న‌మే ఊహించుకోవాలి. పోస్టాఫీస్‌లో ఫోన్ చేసుకోవ‌డం, శ్రీ‌దేవి, జ‌య‌ప్ర‌ద‌ల ప్ర‌స్తావ‌న ఇదంతా అప్ప‌టిదే కాబ‌ట్టి. స‌మంత‌కి , గుల్ష‌న్ దేవ‌య్య‌కు త‌ప్ప ఇంకెవ‌రికీ ప్రాధాన్య‌త లేదు.

గౌత‌మిలాంటి మంచి న‌టి కూడా ఫ్యామిలీ ఫొటోలో భాగంగా వుంటుంది.

శ్రీ‌ముఖి, శ్రీ‌ల‌క్ష్మి న‌ట‌న బావుంటుంది. వాళ్ల‌కి కూడా పెద్ద స్కోప్ లేదు.

స‌మంత గురించి చెప్పాలంటే వ‌న్ విమెన్ షో. అంతా ఆమె భుజాల మీదే. బాగా న‌టించింది అంటే పొగ‌డ్త కాదు, వాస్త‌వం.

సినిమాలో ప్ర‌ధాన లోపం క‌థ మొత్తం ఆ ఇంట్లో ఇరుక్కుపోవ‌డం. ఎమోష‌న్‌ని ఎస్టాబ్లిష్ చేసే సీన్స్ లేక‌పోవ‌డంతో స‌మంత త‌ప‌న‌ని ఆడియ‌న్స్ ఫీల్‌కారు. పైగా ఆమెకు, విల‌న్‌కు మ‌ధ్య శ‌త్రుత్వం కూడా అర్థంకాదు.

ఫొటోగ్ర‌ఫీ, సంగీతం బావున్నాయి.

డైలాగులు అక్క‌డ‌క్క‌డ సాగ‌దీసిన‌ట్టున్నాయి.

 సమంత, నందినీరెడ్డి, సినిమా, రాజ్ నిడిమోరు

ఫొటో సోర్స్, samantharuthprabhuoffl/INSTA

ఫొటో క్యాప్షన్, మా ఇంటి బంగారం సమంత వ‌న్ విమెన్ షో

ప్ల‌స్ పాయింట్స్ః

1.స‌మంత న‌ట‌న‌

2.ఫ‌స్టాఫ్ 30 నిముషాలు

3.కెమెరా, బీజీఎం

మైన‌స్ పాయింట్స్ః

1.సెకండాఫ్‌

2.చాలాసార్లు చూసిన క‌థ‌

ఫైన‌ల్‌గా బంగారంలో క‌ల్తీ ఎక్కువైంది.

(అభిప్రాయాలు సమీక్షకుల వ్యక్తిగతం)

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,  ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.