భారతీయులు ఏ నూనె ఎక్కువగా వినియోగిస్తున్నారు, నూనె దిగుమతులు పెరగడానికి కారణమేంటి?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, జాస్మిన్ నిహాలని
- హోదా, బీబీసీ ప్రతినిధి
- ప్రచురణ
- చదివే సమయం: 4 నిమిషాలు
వంటనూనెల వినియోగాన్ని 10 శాతం తగ్గించుకోవాలని గత నెలలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ భారతీయులను కోరారు.
పశ్చిమాసియా సంక్షోభం నేపథ్యంలో విదేశీ మారక ద్రవ్యాన్ని ఆదా చేయడంలో భాగంగా ఆయన ఈ పిలుపునిచ్చారు. ఇంధన వినియోగాన్ని తగ్గించుకోవాలని, బంగారం కొనవద్దని, అత్యవసరం కాని విదేశీ ప్రయాణాలను కూడా మానుకోవాలని దేశ పౌరులను మోదీ కోరారు.
మార్చితో ముగిసిన 2026 ఆర్థిక సంవత్సరంలో వంటనూనెల దిగుమతుల కోసం భారత్ 19.5 బిలియన్ డాలర్లను (రూ.1,83,944 కోట్లు) ఖర్చు చేసింది.
2025-26లో ప్రపంచవ్యాప్తంగా వంటనూనె దిగుమతులలో దాదాపు ఐదో వంతు వాటాను భారత్ దిగుమతి చేసుకుంది. దీంతో, ప్రపంచంలోనే అత్యధికంగా వంటనూనెలు దిగుమతి చేసుకున్న దేశంగా భారత్ నిలిచింది.
డేటా ప్రకారం.. యూరోపియన్ యూనియన్, చైనా, అమెరికా భారత్ కంటే చాలా వెనుక ఉన్నాయి.

'దాదాపు స్వయం సమృద్ధ భారత్'
భారత్ 1994-95లో కేవలం 5 శాతమే వంటనూనెల దిగుమతులపై ఆధారపడేది.
వ్యవసాయ శాఖ డేటా ప్రకారం 2024-25 నాటికి భారత్ తన వంటనూనెల అవసరాల్లో 56 శాతం దిగుమతులపైనే ఆధారపడింది.
2024లో నీతి ఆయోగ్ నివేదికలో.. 1990వ దశకం ప్రారంభం నాటికే వంటనూనెల ఉత్పత్తిలో భారత్ దాదాపు 'స్వయం సమృద్ధి'ని సాధించింది.
కానీ, 1990ల మధ్యకాలం నుంచి, చౌకైన దిగుమతులు, వేగవంతమైన ఆర్థికాభివృద్ధి డిమాండ్‌ను మరింత పెంచాయి. తలసరి వంటనూనెల వినియోగం పెరిగింది. దీంతో, దేశీయ డిమాండ్‌ను తీర్చుకోవడానికి భారత్ ఎక్కువగా దిగుమతులపై ఆధారపడింది.
2004-05లో 38 శాతం నుంచి 2015-16లో 63 శాతానికి నూనె దిగుమతులు పెరిగినట్టు కింద చార్ట్ చూపిస్తుంది. ఆ తర్వాత 2024-25లో వంటనూనెల దిగుమతి 56 శాతానికి తగ్గింది.
వంటనూనెల కోసం దిగుమతులపై ఆధారపడటం దేశ విదేశీ మారకద్రవ్యంపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుందని నీతి ఆయోగ్ నివేదిక కూడా పేర్కొంది.
ఏ నూనెలను దిగుమతి చేసుకుంది?
భారత్ మొత్తం సాగుభూమిలో 14.3 శాతం నూనెగింజలను పండిస్తుంది. ఆముదం, సన్‌ఫ్లవర్, నువ్వులు, వేరుశెనగ, ఆవాల పంటలను ప్రధానంగా పండిస్తోంది.
కానీ, భారత్ తన వంటనూనెల దిగుమతుల్లో సోయాబీన్ , పామాయిల్, సన్‌ఫ్లవర్ నూనెలను ప్రధానంగా దిగుమతి చేసుకుంటోంది.
మొత్తం వంటనూనెల దిగుమతుల్లో పామాయిల్ మాత్రమే 57 శాతం ఉంది. అలాగే, సోయాబీన్ , సన్‌ఫ్లవర్ ఆయిల్ దిగుమతులు వరుసగా 29 శాతం, 14 శాతం చొప్పున ఉన్నాయి.
భారత్‌లో వంటనూనెల వినియోగం ఎలా మారింది?
గత రెండు దశాబ్దాలలో భారత్‌లో వంటనూనెల వినియోగ సరళి కూడా గణనీయంగా మారింది.
సాల్వెంట్ ఎక్స్‌ట్రాక్టర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా డేటా ప్రకారం.. 2001-02లో పామాయిల్ అత్యంత విస్తృతంగా వినియోగించిన వంటనూనెగా ఉంది. ఇది మొత్తం వినియోగంలో 29 శాతం వాటా కలిగి ఉంది. 2022-23 నాటికి దాని వాటా 37.6 శాతానికి పెరిగింది.
భారత్‌లో పామాయిల్‌ను ఎక్కువగా వినియోగించే వాటిల్లో హోటళ్లు, రెస్టారెంట్లు, కేటరింగ్ సంస్థలు ఉన్నాయి.
స్నాక్స్, రెడీ-టు-ఈట్ ఉత్పత్తులు, బేకరీ వస్తువులు, స్వీట్లు వంటి ప్యాక్ చేసిన, ప్రాసెస్ చేసిన ఆహారాలకు డిమాండ్ పెరగడంతో, పామాయిల్‌కు కూడా డిమాండ్ పెరిగింది.
అదే సమయంలో, భారత్‌లో ఒకనాడు అత్యంత తక్కువగా వినియోగించిన సన్‌ఫ్లవర్ నూనె వాటా 3.1 శాతం నుంచి 2022-23 నాటికి 11.6 శాతానికి పెరిగింది.
కానీ, వేరుశెనగ నూనె వినియోగం 2001-02లో 12 శాతం ఉంటే, 2022-23 నాటికి 3 శాతానికి పడిపోయింది. అలాగే, ఆవనూనె వినియోగం 17 శాతం నుంచి 13.6 శాతానికి తగ్గింది.

ఫొటో సోర్స్, Science Photo Library
దిగుబడి వ్యత్యాసం..
భారత్‌లో ఆహార ధాన్యాల తర్వాత నూనెగింజలే రెండవ అతిపెద్ద సాగు పంటగా ఉన్నాయి. మొత్తం ప్రపంచ నూనెగింజల సాగు విస్తీర్ణంలో భారత్ వాటా 15 శాతం నుంచి 20 శాతంగా ఉంది. అయితే, ఉత్పాదకతలో ప్రధాన ఉత్పత్తిదారుల కంటే భారత్ చాలా వెనుకబడి ఉంది.
నీతి ఆయోగ్ డేటా ప్రకారం.. భారత్‌లో అత్యంత విస్తృతంగా పండించే నూనెగింజ అయిన సోయాబీన్ దిగుబడి 2020-22లో ఒక్కో హెక్టారుకు ఒక్కో టన్నుగా ఉంది.
ప్రపంచంలో ప్రముఖ సోయాబీన్ ఉత్పత్తిదారుల్లో ఒకటైన అమెరికాలో హెక్టారుకు 3.4 టన్నుల దిగుబడి వస్తుంది.
ఇతర నూనె గింజల విషయంలో కూడా ఈ తేడాను మనం గమనించవచ్చు.
భారత్‌లో ఆవాల దిగుబడి హెక్టారుకు 1.5 టన్నులు కాగా.. జర్మనీలో 3.7 టన్నులు, ఫ్రాన్స్‌లో 3.3 టన్నులుగా ఉంది.
వేరుశెనగ విషయంలో.. భారత్‌లో హెక్టారుకు 1.8 టన్నులు ఉత్పత్తి ఉండగా అమెరికాలో 4.5 టన్నులు, చైనాలో 3.9 టన్నులుగా ఉంది.
( బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్, ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)






























