ఆర్టీసీ 'ఎస్మా' కిందకు రాదు: తెలంగాణ హైకోర్టు వ్యాఖ్య - ప్రెస్ రివ్యూ

ఫొటో సోర్స్, Getty Images
కార్మిక సంఘాలతో చర్చలు జరపాలని ప్రభుత్వాన్ని, ఆర్టీసీ యాజమాన్యాన్ని బలవంతం చేయలేమని, చర్చల కోసం ఆదేశాలు జారీచేసే అధికారం కూడా తమకు లేదని హైకోర్టు చెప్పిందని నమస్తే తెలంగాణ తెలిపింది.
ప్రభుత్వానికి, ఆర్టీసీ యాజమాన్యానికి, కార్మికసంఘాలకు చర్చలకు సరైన సమయం ఇచ్చినా పరిష్కారం కనుక్కోలేదు కాబట్టి, ఇక తమ ఎదుట ఉన్న పిటిషన్లలోని మెరిట్స్ ప్రకారం విచారణ కొనసాగిస్తామని కోర్టు స్పష్టంచేసింది.
ఆర్టీసీ అత్యవసర సేవల నిర్వహణ చట్టం (ఎస్మా) కిందకు రాదని విచారణ సందర్భంగా న్యాయస్థానం వ్యాఖ్యానించింది.
ఆర్టీసీ సమ్మె, 5,100 రూట్లను ప్రైవేటీకరిస్తూ రాష్ట్ర మంత్రివర్గం తీసుకున్న నిర్ణయం, కొత్త అద్దె బస్సులకోసం టెండర్ల ప్రక్రియ లాంటి అంశాలపై దాఖలైన పిటిషన్లను ప్రధాన న్యాయమూర్తి రాఘవేంద్ర సింగ్ చౌహాన్, జస్టిస్ అభిషేక్‌రెడ్డిలతో కూడిన ధర్మాసనం సోమవారం విచారణకు స్వీకరించింది.
పిటిషనర్ తరఫు న్యాయవాది పీవీ కృష్ణయ్య వాదనలు వినిపిస్తూ- సమ్మెను చట్టవిరుద్ధమని ప్రకటించాలని, ప్రజల ఇబ్బందులు తొలిగించాలని విజ్ఞప్తి చేశారు. ఆర్టీసీ అత్యవసర సేవల కిందకు వస్తుందని, ఈ మేరకు ఎస్మా కింద సమ్మె చట్టవిరుద్ధమని పేర్కొన్నారు.
సమ్మె ఆర్టీసీకి, కార్మికులకు మధ్య తలెత్తిన వివాదమని, పారిశ్రామిక వివాదాల చట్టం(ఐడీ యాక్ట్) ప్రకారం కార్మిక కోర్టుకు లేదా ఇండస్ట్రియల్ ట్రైబ్యునల్‌కు మాత్రమే సమ్మెను చట్టవిరుద్ధమని ప్రకటించే అధికారం ఉంటుందని ధర్మాసనం తెలిపింది.
ఆర్టీసీని అత్యవసర సర్వీస్ అని ప్రభుత్వం నోటిఫై చేస్తూ జారీచేసిన జీవోలున్నాయా అని కోర్టు ప్రశ్నించింది. జీవో జారీచేయాల్సిన అవసరం లేదని, ఎస్మా చట్టంలో ప్రజారవాణా అత్యవసర సేవ కింద ఉందని కృష్ణయ్య తెలిపారు. చట్టంలో ఉన్నప్పటికీ ఆయా సర్వీసులకు సంబంధించి ప్రత్యేకంగా ప్రభుత్వం జీవో జారీచేస్తేనే అవి ఎస్మా కిందకు వస్తాయని ధర్మాసనం పేర్కొంది.
కృష్ణయ్య సమర్పించిన జీవోలో ఆర్టీసీని పబ్లిక్ యుటిలిటీ సర్వీస్‌గా గుర్తించినట్లు మాత్రమే ఉందని, అత్యవసర సేవ అని జీవో జారీచేస్తేనే ఎస్మా కిందకు వస్తుందని పేర్కొంటూ, ఆ జీవో లేనందున ఆర్టీసీ ఎస్మా కిందకు వస్తుందనే వాదనను తోసిపుచ్చుతున్నట్లు కోర్టు స్పష్టంచేసింది.

ఫొటో సోర్స్, FB/Andhra Pradesh CM
వెంకయ్యనాయుడూ! మీ మనవళ్లు చదివేది ఏ మీడియం?: జగన్
ప్రభుత్వ పాఠశాలల్లో తెలుగు మాధ్యమాన్ని తీసేసి, ఆంగ్ల మాధ్యమాన్ని ప్రవేశపెట్టాలన్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్న వారిని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి విమర్శించారని 'ఆంధ్రజ్యోతి' తెలిపింది.
సోమవారం మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతి సందర్భంగా విజయవాడలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జగన్ ప్రసంగించారు.
పాఠశాలలన్నింటినీ వచ్చే సంవత్సరం నుంచి ఇంగ్లిష్ మీడియం చేయనున్నట్లు వారం కిందట ఒక జీవో ఇచ్చామని, ఆ వెంటనే కొన్ని స్వరాలు వినిపించాయని, ఇంగ్లిష్ మీడియం పేదవాడికి ఎందుకు, తెలుగు మీడియం చాలదా అని ప్రశ్నించారని ఆయన చెప్పారు.
"ఇలా అడిగిన వారు చిన్నవాళ్లేం కాదు. ఏకంగా చంద్రబాబు నాయుడు (మాజీ ముఖ్యమంత్రి) వంటి పెద్ద వాళ్లు. వెంకయ్యనాయుడు (ఉపరాష్ట్రపతి) లాంటి ఇంకా ఇంకా పెద్ద పెద్ద వాళ్లు. పవన్ కల్యాణ్ వంటి ఇంకా పెద్ద పెద్ద సినిమా యాక్టర్లు! వీళ్లందరూ సరిపోరన్నట్లు ఈనాడు దినపత్రిక, ఆంధ్రజ్యోతి దినపత్రికలో రోజూ హెడ్‌లైన్స్. ఇదే చంద్రబాబును నేను అడుగుతున్నాను. మీ కొడుకు చదివింది ఏ మీడియం? మీ మనవడు చదవబోతున్నది ఏ మీడియం? ఇదే మాటలు మాట్లాడుతున్న వెంకయ్యనాయుడును అడుగుతున్నాను. అయ్యా వెంకయ్య గారూ, మీ కొడుకు చదివింది ఏ మీడియం? మీ మనవళ్లు చదువుతున్నది ఏ మీడియం?'' అని జగన్ అడిగారు.
"అయ్యా పవన్‌కల్యాణ్ గారూ, మీకు ముగ్గురు భార్యలు! బహుశా నలుగురో ఐదుగురో పిల్లలు. వాళ్లందరినీ ఏ మీడియంలో చదివిస్తున్నారు'' అని ముఖ్యమంత్రి ప్రశ్నించారు.
మన పిల్లలు ఇంగ్లిష్ మీడియంలో చదవకపోతే మన రాష్ట్రం, మన జాతి నష్టపోతుందని జగన్ అభిప్రాయపడ్డారు. ''అందుకే పిల్లలను ఇంగ్లిష్ మీడియంలో చదివించాలనేది నా తపన. ఏ ఉద్యోగం రావాలన్నా... ప్రపంచంతో పోటీ పడాలి. మన వాళ్లు ఆ పోటీలో తట్టుకోవాలంటే ఇంగ్లిష్ మీడియంలో చదవాలి. ముఖ్యంగా పేదరికంలో ఉన్న పిల్లలు చదవాలి. పేదరికం పోవాలంటే మన కుటుంబాల నుంచి డాక్టర్లు రావాలి, కలెక్టర్లుగా ఎదగాలి'' అన్నారు.
వచ్చే ఏడాది నుంచి ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియం ప్రవేశపెడుతున్నామని, తెలుగు లేదా ఉర్దూ భాషను సబ్జెక్టుగా తప్పనిసరి చేస్తామని జగన్ తెలిపారు. మొదట ఒకటో తరగతి నుంచి ఆరో తరగతి వరకు ఇంగ్లిషు మీడియం ప్రారంభిస్తామన్నారు. తర్వాత ఏటా 7, 8, 9, 10 తరగతులకు ఆంగ్ల మాధ్యమాన్ని పొడిగిస్తూ వస్తామని ప్రకటించారు. నాలుగేళ్లలో అన్ని స్కూళ్లు ఇంగ్లిష్ మీడియంలోకి మారతాయని వివరించారు.

ఫొటో సోర్స్, Twitter/@OfficeOfGSS
అద్భుతాల కోసం ప్రాజెక్టులు కట్టొద్దు: కేంద్ర మంత్రి షెకావత్
రాష్ట్రాల తాగు, సాగునీటి అవసరాలకోసం భారీ ప్రాజెక్టులు చేపట్టేకంటే ఉపరితల నీరు, భూగర్భ జలాల సమగ్ర వినియోగంపై దృష్టి పెట్టాలని కేంద్ర జలశక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ దక్షిణాది రాష్ట్రాలకు సూచించారని సాక్షి తెలిపింది.
ఎక్కడి నీటిని అక్కడే వినియోగించేలా ప్రభుత్వాల విధానాలు, కార్యాచరణ ఉండాలని, అంతేతప్ప భారీ ప్రాజెక్టులు చేపట్టి, వాటికి కేంద్రం నిధులు ఇవ్వాలని కోరితే మాత్రం తాము ఇవ్వలేమని షెకావత్ తేల్చిచెప్పారు. గత్యంతరం లేని పరిస్థితుల్లో మాత్రమే భారీ ప్రాజెక్టులు చేపట్టాలని, అద్భుతాల కోసం ప్రాజెక్టులు కట్టొద్దని తెలిపారు.
కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన జల్‌జీవన్ మిషన్ అంశంపై జలశక్తి శాఖ దక్షిణాది రాష్ట్రాలతో హైదరాబాద్‌లో సోమవారం సమావేశం నిర్వహించింది. ఈ సమావేశానికి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్నాటక, తమిళనాడు, కేరళ రాష్ట్రాలు, పుదుచ్చేరి, లక్షదీవుల నీటిపారుదల, పంచాయతీరాజ్, మున్సిపల్ శాఖల అధికారులు హాజరయ్యారు.
తెలంగాణ తరపున మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, ఏపీ నుంచి జలవనరుల మంత్రి అనిల్ కుమార్ యాదవ్ పాల్గొన్నారు.
తెలంగాణ, ఇతర రాష్ట్రాలు తాము చేపడుతున్న ప్రాజెక్టులు, వాటికి ఖర్చు చేస్తున్న నిధులు, వాటి ప్రయోజనాలను సమావేశంలో వివరించి, తమ ప్రాజెక్టులకు కేంద్రం నుంచి ఆర్థిక సాయం అందించాలని ఈ భేటీలో గట్టిగా కోరాయి.
'రోల్స్ రాయిస్‌కు రాష్ట్రాల నిధుల్లోంచి ఇచ్చుకోండి'
ఈ అంశంపై షెకావత్ స్పందిస్తూ- మీ రాష్ట్రాల ప్రజలకు రోల్స్ రాయిస్ కారివ్వాలని అనుకుంటే రాష్ట్రాల నిధుల్లోంచి యథేచ్ఛగా నిధులు ఇచ్చుకోవచ్చని, అయితే కేంద్రం మారుతి-800 కారు మాత్రమే ఇస్తుందని వ్యాఖ్యానించారు. అద్భుతమైన ప్రాజెక్టులు కట్టి మేము ఎక్కువ నిధులు ఖర్చు చేశాం కాబట్టి, కేంద్రం నిధులు ఇవ్వాలంటే మాత్రం తాము ఇవ్వలేమన్నారు.
ఏపీ, తెలంగాణకంటే ఎక్కువ నీటి ఎద్దడి ఉన్న రాష్ట్రాలున్నాయని, నీటి ఎద్దడి ఉందన్న కారణంగా ఎక్కువ నిధులు ఇవ్వలేమని ఆయన చెప్పారు. అన్ని రాష్ట్రాలను సమానంగా చూస్తామన్నారు.

ఫొటో సోర్స్, BSNL
వీఆర్‌ఎస్‌కు 70 వేల మంది బీఎస్‌ఎన్ఎల్ ఉద్యోగుల దరఖాస్తు
ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ బీఎస్‌ఎన్‌ఎల్‌లో దాదాపు 70 వేలమంది ఉద్యోగులు స్వచ్ఛంద ఉద్యోగ విరమణ (వీఆర్‌ఎస్) కోసం ఇప్పటికే అంగీకారాన్ని తెలిపారని సంస్థ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ పీకే పుర్వార్ చెప్పారని ఆంధ్రభూమి రాసింది.
సంస్థలోని మొత్తం లక్షన్నర మంది ఉద్యోగుల్లో సంస్థలో దాదాపు లక్ష మంది వీఆర్‌ఎస్‌కు అర్హులని ఆయన చెప్పారు. 2020 జనవరి 31 నాటికి మొత్తం 77 వేల మంది ఉద్యోగులకు వీఆర్‌ఎస్ పథకాన్ని వర్తింపజేయాలనే లక్ష్యం ఉందని, ఇప్పటికే 70 వేల మంది అంగీకారాన్ని తెలిపారని, ఆ రకంగా చూస్తే మంచి స్పందన వచ్చిందని పీటీఐకి ఇచ్చిన ఇంటర్య్వూలో వివరించారు.
బీఎస్‌ఎన్‌ఎల్ స్వచ్ఛంద ఉద్యోగ విరమణ పథకం-2019' గత వారం ప్రారంభమైందని, ఇందుకు సంబంధించిన వెబ్‌సైట్ డిసెంబర్ 3 వరకు అందుబాటులో ఉంటుందని పుర్వార్ తెలిపారు. ప్రస్తుతమున్న వేతనాల ఖర్చులో ఏడు వేల కోట్ల రూపాయలు ఆదాచేయాలన్న లక్ష్యంతో బీఎస్‌ఎన్‌ఎల్ వీఆర్‌ఎస్‌ను అమల్లోకి తెచ్చిందన్నారు. వీఆర్‌ఎస్‌కు అంగీకారం తెలిపిన 25 ఏళ్ల సర్వీసున్న ప్రతి ఉద్యోగికీ సంవత్సరానికి 35 రోజుల వేతనాన్ని ఎక్స్‌గ్రేషియా కింద అందజేస్తామని చెప్పారు.
ఇవి కూడా చదవండి:
- నల్లమల: సంపర్కం, ఆవాసం కోసం పులుల మధ్య పోరాటం
- మహారాష్ట్ర, హరియాణా అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు: మహారాష్ట్ర బీజేపీకి.. హరియాణాలో హంగ్
- మహారాష్ట్రలో ‘పెద్దన్న’ ఎవరు?
- అయోధ్య తీర్పు: సుప్రీం కోర్టు రాజ్యాంగ ధర్మాసనంలోని న్యాయమూర్తులు వీరే
- అయోధ్య- రామజన్మభూమి - బాబ్రీ మసీదు వివాదం పూర్తి చరిత్ర
- కర్తార్‌పూర్ కారిడార్ ప్రారంభం.. ఇమ్రాన్‌ఖాన్‌కు థ్యాంక్స్ చెప్పిన మోదీ
- ఇరాన్లో 5,300 కోట్ల బ్యారెళ్ల నిల్వలున్న కొత్త చమురు క్షేత్రం కనుగొన్నాం - అధ్యక్షుడు రౌహానీ
- లతా మంగేష్కర్ ఆరోగ్యం విషమం... ఐసీయూలో చికిత్స
- అయోధ్య రామ మందిరం ప్లాన్ ఎలా ఉంటుంది... ఆలయ వాస్తుశిల్పి చంద్రకాంత్ ఏమంటున్నారు?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)
























