నారా చంద్రబాబు నాయుడు: ‘‘వచ్చే ఎన్నికల్లో మీరు గెలిపిస్తే సరే.. లేదా అదే నా చివరి ఎన్నిక అవుతుంది’’
కర్నూలు జిల్లా పర్యటనలో తెలుగు దేశం పార్టీ (టీడీపీ) జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు.
రానున్న ఎన్నికలే తనకు చివరి ఎన్నికలు అని సూచనప్రాయంగా అన్నారు.
పత్తికొండ సభలో ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
‘‘సీనియర్ నాయకుడిని అయిన నన్ను అసెంబ్లీలో అవమానించారు. నా భార్యను కూడా అవమానించే పరిస్థితికి వచ్చారు.
ఆరోజే ఒక నిర్ణయం తీసుకున్నా. మళ్లీ క్షేత్ర స్థాయిలో గెలిచిన తర్వాతే అసెంబ్లీలో అడుగు పెడతా. లేకపోతే అసెంబ్లీకి రానని ఆరోజే చెప్పాను.
నేను అసెంబ్లీకి వెళ్లాలంటే.. రాజకీయాల్లో ఉండాలంటే... ఈ రాష్ట్రానికి న్యాయం చేయాలంటే వచ్చే ఎన్నికల్లో మీరు గెలిపించాలి. లేదా ఇదే నాకు చివరి ఎన్నిక అవుతుంది’’ అని ఆయన ప్రజలను ఉద్దేశిస్తూ మాట్లాడారు.