బ్రేకింగ్ న్యూస్, తెలంగాణ: బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ ఇంటిపై దాడి
తెలంగాణ బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ నివాసంపై శుక్రవారం దాడి జరిగినట్లు వార్తా సంస్థ ఏఎన్ఐ తెలిపింది.
హైదరాబాద్‌లోని ఆయన నివాసంపై టీఆర్ఎస్ పార్టీ మద్దతుదారులు దాడికి పాల్పడి వస్తువులను ధ్వంసం చేసినట్లు పేర్కొంది.
తన ఇంటిపై దాడి జరిగినట్లు నిజామాబాద్ ఎంపీ అరవింద్ ధర్మపురి ట్వీట్ చేశారు.
కేసీఆర్, కేటీఆర్, కవిత ఆదేశాల మేరకు టీఆర్‌ఎస్ గుండాలు తన ఇంటిపై దాడి చేసినట్లు ట్వీట్‌లో ఆయన ఆరోపించారు.
ఇంట్లో వస్తువులు పగలగొడుతూ బీభత్సం సృష్టించారని.. తన తల్లిని బెదిరించారని ఆయన ఆరోపించారు.
కాగా... ఎమ్మెల్సీ కవిత కాంగ్రెస్‌లో చేరేందుకు ప్రయత్నించారని, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేని ఆమె సంప్రదించారని అరవింద్ గురువారం ఆరోపించారు.
ఆ నేపథ్యంలోనే ఈ దాడి జరిగినట్లు చెబుతున్నారు.
నోరు అదుపులో పెట్టుకోకపోతే చెప్పుతో కొడతా.. ఫేక్ డిగ్రీపై రాజస్థాన్ యూనివర్సిటీకి ఫిర్యాదు చేస్తా- కవిత
నిజామాబాద్ ఎంపీ అరవింద్‌పై తెరాస ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తీవ్ర పదజాలంతో విరుచుకుపడ్డారు. మళ్లీ తన గురించి, పార్టీ మారడం గురించి మాట్లాడితే నిజామాబాద్ చౌరస్తాలో చెప్పు తో కొడతా అని అన్నారు.
‘‘అరవింద్‌ది సంకుచిత మనస్తత్వం. ఆయనవి చిల్లర మాటలు. అనుకోకుండా ఎంపీ అయ్యారు. అరవింద్‌ది ఫేక్ డిగ్రీ. దీనిపై నేను రాజస్థాన్ యూనివర్సిటీ కి పిర్యాదు చేస్తా.
నిన్న ప్రెస్‌మీట్‌లో ఆయన నీచంగా మాట్లాడారు. అరవింద్ భాష చూస్తుంటే ఇలాంటి రాజకీయాలు అవసరమా అనిపిస్తోంది. నేను సమస్యల మీద మాట్లాడతాను. వ్యక్తుల మీద ఎప్పుడూ మాట్లాడలేదు. కానీ, అరవింద్ తీరు చూసి మాట్లాడక తప్పడం లేదు.
మళ్లీ నా గురించి పార్టీ మారడం గురించి మాట్లాడితే నిజామాబాద్ చౌరస్తాలో చెప్పుతో కొడతా. ఇలాంటి మాటలు మాట్లాడాల్సి వచ్చినందుకు తెలంగాణ సమాజానికి క్షమాపణ చెబుతున్నా.
అరవింద్ ఎక్కడ పోటీ చేసినా వెంటాడి ఓడిస్తా. కాంగ్రెస్‌లో చేరేందుకు నేను ఖర్గేతో మాట్లాడాను అనేది శుద్ధ తప్పు. నిజామాబాద్‌లో కాంగ్రెస్‌తో కుమ్మక్కై అరవింద్ నా మీద గెలిచారు’’ అని కవిత వ్యాఖ్యానించారు.
మా సహనాన్ని చేతకానితనం అనుకోవద్దు: బండి సంజయ్
కాగా ఎంపీ అరవింద్ ఇంటిపై దాడిని బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ ఖండించారు.
ప్రజాస్వామ్యబద్ధంగా ఎదుర్కొనే ధైర్యం లేకుండా ఇలా భౌతిక దాడులకు దిగుతారా అని ఆయన ప్రశ్నించారు.
ప్రశ్నించే గొంతులను నొక్కినంతమాత్రాన తాము భయపడేది లేదని ఆయన అన్నరు.
బీజేపీ చూపుతున్న సహనాన్ని చేతకానితనంగా భావించవద్దని.. తమ పార్టీ కార్యకర్తలు బరిలోకి దిగితే టీఆర్ఎస్ తట్టుకోలేదని సంజయ్ హెచ్చరించారు.