ప్రధానమంత్రి నరేంద్రమోదీ శనివారం నాడు విశాఖపట్నంలో పలు అభివృద్ధి
ప్రాజెక్టులను ప్రారంభించారు.
సుమారు రూ. 15
వేల కోట్ల విలువైన కేంద్ర ప్రభుత్వ ప్రాజెక్టు పనులకు.. ఆంధ్రా యూనివర్సిటీలోని ఇంజనీరింగ్
సభా వేదిక నుంచి ప్రధాని మోదీ వర్చువల్ మోడల్ ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు.వీటిలో రెండు
రైల్వే ప్రాజెక్టులు, పెట్రోలియం, సహజ
వాయువు, మూడు రోడ్డు రవాణా, హైవేలు,
ఫిషింగ్ ప్రాజెక్ట్ ఉన్నాయి.
ప్రధాని సభ కోసం బస్సులు, ఆటోల్లో జనాన్ని భారీగా తరలించారు.
‘‘కొన్ని నెలలక్రితం నేను విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు 125వ జయంత్యుత్సవాలకోసం వచ్చాను.
ఇపుడు ఇలా మరోసారి రాగలిగాను. విశాఖ దేశంలోనే ఒక ప్రత్యేక నగరం. వాణిజ్య నగరంగా దీనికి చారిత్రక ప్రాధాన్యం ఉంది.
ఒకపుడు విశాఖరేవునుంచి పశ్చిమాసియా, తూర్పు ఆసియాలకు ఓడల ద్వారా వ్యాపారం జరిగింది’’ అని ప్రధాని అన్నారు.
‘‘ఇక్కడి వారు అనేక రంగాలలో ప్రపంచ వ్యాప్తంగా ప్రతిభ చూపుతున్నారు.
విద్య, వ్యాపారం, టెక్నాలజీ, వైద్య రంగాల్లో ఏపీ యువతది ప్రత్యేకత.
ఇది కేవలం విద్యార్జన ద్వారా రాలేదు. స్నేహ, సేవా స్వభావాలు అందుకు కారణం.
తెలుగు వారు నిత్య నూతన ఆవిష్కరణలకు, విధానాలకు చొరవ చూపుతారు.
నేటి ప్రాజెక్టులు తెలుగువారికే కాక దేశ పురోభివృద్ధికి దోహదపడతాయి’’ అన్నారు ప్రధాని.
‘‘రైల్వేలు, రోడ్లు వంటి మౌలిక సదుపాయాలు అత్యాధునిక వసతులతో కల్పిస్తున్నాము. వీటి వల్ల సప్లయి చైన్, మార్కెటింగు సదుపాయాలు మెరుగుపడతాయి.
మల్టీ మోడల్ లాజిస్టిక్సు వల్ల వీటి అభివృద్ధి సాధ్యమవుతుంది.’’ అని ప్రధాని పేర్కొన్నారు.
ఈ సందర్భంగా మాట్లాడిన ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి, రాష్ట్రానికి కేంద్రం నుంచి మరింత సాయం కావాలని విజ్జప్తి చేశారు.
‘‘కేంద్రంతో మా అనుబంధం రాజకీయాలకు అతీతం. రాష్ట్ర అభివృద్ధి తప్ప మాకు మరో అజెండా లేదు. దానికి కేంద్రం సహకారం కావాలి. విభజన నుంచి ఏపీ ఇంకా కోలుకోలేదు. కేంద్రం మమ్మల్ని ఆశీర్వదించి తగిన సహకారం అందించాలి. మేము కేంద్రానికి చేసుకున్న విజ్ఞప్తులన్నీ పరిశీలించి, పరిష్కరించాలని కోరుతున్నాం’’ అని సీఎం జగన్మోహన్ రెడ్డి సభాముఖంగా ప్రధానమంత్రిని కోరారు.
అయితే, రాష్ట్రాభివృద్ధి పేరుతో ఇవాళ నిర్వహించిన సభలో రాజకీయ ప్రయోజనాల గురించి తప్ప రాష్ట్ర ప్రయోజనాల గురించి ముఖ్యమంత్రి, ప్రధానమంత్రి ఆలోచించలేదని ప్రతిపక్షాలు విమర్శించాయి.
‘‘రాష్ట్రానికి సంబంధించిన డిమండ్లను జగన్ గట్టిగా ప్రస్తావించ లేదు. ప్రధానమంత్రిని రిక్వెస్ట్ చేయడమే తప్ప డిమాండ్ చేసే స్థితిలో జగన్మోహన్ రెడ్డి లేరు. ప్రధాని పర్యటన రాజకీయంగా పవన్ కల్యాణ్ కు బూస్ట్ ఇవ్వడానికే ఉపయోగపడింది తప్ప రాష్ట్ర ప్రజలకు ఏమాత్రం ఉపయోగపడలేదు. పవన్ కల్యాణ్ ను పిలిపించడం ద్వారా అందరితో సఖ్యంగా ఉన్నామని బీజేపీ చెప్పుకునే ప్రయత్నం చేసింది’’ అని విశాఖపట్నానికి చెందిన కాంగ్రెస్ నాయకుడు సుబ్బారావు విమర్శించారు.
‘‘పవన్ కల్యాణ్‌తో మాట్లాడాలనుకుంటే హైదరాబాద్‌లోనే మాట్లాడొచ్చు. ఇక్కడికి పిలిపించడం ద్వారా మోదీ అందరూ నావాళ్లే అని చెప్పుకునే ప్రయత్నం చేశారు’’ అని ఆయన అన్నారు.
‘‘ప్రజలు కోరుతున్న డిమాండ్లను ముఖ్యమంత్రి ప్రస్తావించారు. కానీ, ఈ విషయంలో బీజేపీ శ్రేణులు ఫెయిలయ్యాయి. ప్రధానమంత్రి వస్తున్నప్పుడు, ఇక్కడి వాళ్లకు ఏదో హామీలాంటిది వచ్చేలా పార్టీ నాయకులు ప్రయత్నించి ఉంటే పార్టీకి, రాష్ట్రానికి బాగుండేది’’ అని ఆంధ్రా యూనివర్సిటీ జర్నలిజం ప్రొఫెసర్ ప్రొఫెసర్ రామకృష్ణ వ్యాఖ్యానించారు.
ప్రధాని విశాఖపట్నం పర్యటన నేపథ్యంలో డ్రోన్ల వినియోగంపై పోలీసులు నిషేధం విధించారు. ఆంధ్రా యూనివర్సిటీ నుంచి 5 కిలోమీటర్ల పరిధిలో డ్రోన్లు ఎగరవేయొద్దనే ఆంక్షలు ఈ నెల 10వ తేదీ నుంచి 13వ తేదీ వరకు అమల్లో ఉంటాయి.
విశాఖలో కార్యక్రమం ముగిసిన తర్వాత ప్రత్యేక విమానంలో హైదరాబాద్‌లోని బేగంపేట విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడ పార్టీ కార్యకర్తలు, నేతలతో సమావేశం తర్వాత రామగుండం వెళతారు.
స్టీల్ ప్లాంటు ప్రైవేకీరణ పట్ల నిరసనలు.. అడ్డుకున్న పోలీసులు
విశాఖ స్టీల్ ప్లాంట్‌ను ప్రైవేటీకరణ చేయడాన్ని వ్యతిరేకిస్తూ కొందరు కార్మికులు ప్రధానమంత్రి నరేంద్రమోదీ పర్యటన సందర్భంగా ఆందోళనకు దిగారు. వారంతా సీపీఎం పార్టీకి చెందిన కార్యకర్తలుగా చెప్తున్నారు.
మోదీ సభా ప్రాంగణానికి 200 మీటర్ల దూరంలోనే ఆందోళన చేస్తుంటే పోలీసులు వారిని అడ్డుకున్నారు.