మంగళవారం ఉదయ్‌పూర్‌లో టైలర్ కన్నయ్యలాల్ హత్య సంచలనం సృష్టించింది. రాష్ట్రవ్యాప్తంగా ఉద్రిక్తతలు నెలకొన్నాయి.
రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ ఈరోజు ఉదయపూర్ చేరుకోనున్నారు. వీరితో పాటు హోం శాఖ సహాయ మంత్రి రాజేంద్ర యాదవ్, డీజీపీ ఎంఎల్ లాటర్, ఇతర ఉన్నతాధికారులు కూడా ఉదయ్‌పూర్‌లో పర్యటించనున్నారు.
మంగళవారం మధ్యాహ్నం ఇద్దరు వ్యక్తులు కన్నయ్యలాల్ దుకాణంలోకి ప్రవేశించి, ఆయన్ను గొంతు కోసి హత్య చేశారు.
ఇద్దరు ప్రధాన నిందితులను అరెస్టు చేశారని, బుధవారం మొత్తం నలుగురిని అదుపులోకి తీసుకున్నారని రాజస్థాన్ పోలీస్ డీజీపీ ఎంఎల్ లాటర్ బీబీసికి చెప్పారు.
ఈ హత్యపై నేషనల్ ఇన్వెస్టిగేషన్ బృందం విచారణ జరుపుతోంది.
మరోవైపు, జైపూర్‌లో హిందూ సంస్థలు ఒకరోజు బంద్‌కు పిలుపునిచ్చాయి. ఈరోజంతా బంద్ కొనసాగుతుంది.
జూలై 3 ఆదివారం భారీ స్థాయిలో నిరసన ప్రదర్శనలు జరిపేందుకు హిందూ సంస్థలు సిద్ధమవుతున్నాయి. సుమారు లక్ష మంది వీధుల్లోకి వచ్చి ఈ నిరసనల్లో పాల్గొంటారని అంచనా.
కాగా, అన్ని రాజకీయ పార్టీలు, మత సంస్థలు, సాధారణ ప్రజలు సంయమనం పాటించాలని, రాష్ట్రంలో శాంతిభద్రతలు కాపాడాలని సీఎం గెహ్లాట్ కోరారు. అశాంతిని, భయానక వాతావరణాన్ని ప్రేరేపించే వీడియోలను షేర్ చేయవద్దని విజ్ఞప్తి చేశారు.
హత్య తరువాత, ముందు జాగ్రత్త చర్యగా రాజస్థాన్ అంతటా ఇంటర్నెట్ సేవలను నిలిపివేసారు. ఉదయపూర్‌లో 144 సెక్షన్ విధించారు.