డెస్మండ్ టుటు: దక్షిణాఫ్రికా వర్ణ వివక్ష వ్యతిరేక హీరో అస్తమయం

డెస్మండ్ టుటు

ఫొటో సోర్స్, Reuters

ఫొటో క్యాప్షన్, డెస్మండ్ టుటు
ప్రచురణ

దక్షిణాఫ్రికాలో వర్ణ వివక్ష అంతం కావటానికి కృషి చేసిన నోబెల్ శాంతి బహుమతి గ్రహీత ఆర్చ్‌బిషప్ డెస్మడ్ టుటు ఆదివారం కన్నుమూశారు. ఆయన వయసు 90 సంవత్సరాలు.

‘‘విశిష్టమైన దక్షిణాఫ్రికా నేతలకు కన్నీటి వీడ్కోలులో టుటు మరణం మరొక అధ్యాయం’’ అని దేశాధ్యక్షుడు సిరిల్ రామాఫోసా పేర్కొన్నారు.

‘‘విముక్త దక్షిణాఫ్రికా’’ను వారసత్వంగా అందించటానికి ఆర్చిబిషప్ టుటు దోహదపడ్డారని నివాళులర్పించారు.

దక్షిణాఫ్రికా లోపలా వెలుపలా ప్రజలందరికీ బాగా తెలిసిన నేతల్లో టుటు ఒకరు.

వర్ణ వివక్ష వ్యతిరేక ఉద్యమ ప్రతీక అయిన నెల్సన్ మండేలా సమకాలికుడు డెస్మండ్ టుటు. దక్షిణాఫ్రికాలో 1948 నుంచి 1991 వరకు.. దేశంలో మైనారిటీలైన శ్వేతజాతి ప్రజల ప్రభుత్వం నల్లజాతి వారి పట్ల వివక్ష పాటిస్తూ, వారిని సామాజికంగా అన్ని రంగాల్లోనూ వేరు చేస్తూ అధికారికంగా విధానాలను అమలుచేసింది. ఆ వర్ణ వివక్షా విధానాలను అంతం చేయటానికి సాగించిన ఉద్యమానికి చోదక శక్తుల్లో టుటు ఒకరు.

అపార్థీడ్ వ్యవస్థ అంతానికి సాగించిన పోరాటంలో ఆయన పోషించిన పాత్రకు గాను డెస్మండ్ టుటుకు 1984లో నోబెల్ శాంతి బహుమతిని ప్రకటించారు.

డెస్మండ్ టుటు, నెల్సన్ మండేలా

ఫొటో సోర్స్, GETTY IMAGES

ఫొటో క్యాప్షన్, డెస్మండ్ టుటు, నెల్సన్ మండేలా

దక్షిణాఫ్రికా అపార్థీడ్ శకంలో చివరి అధ్యక్షుడు ఎఫ్‌.డబ్ల్యు. డి క్లర్క్ కొన్ని వారాల కిందటే 85 ఏళ్ల వయసులో చనిపోయారు.

‘‘టుటు ఓ విఖ్యాత ఆధ్యాత్మిక నేత, యాంటీ-అపార్థీడ్ కార్యకర్త, ప్రపంచ మానవ హక్కుల ఉద్యమకారుడు’’ అని అధ్యక్షుడు రామాఫోసా అభివర్ణించారు.

‘‘స్థానికంగా, అంతర్జాతీయంగా అన్యాయానికి వ్యతిరేకంగా జరిగే పోరాటాలకు ఆయన అందించిన సాయం అసామాన్యం’’ అని టుటుకు నెల్సన్ మండేలా ఫౌండేషన్ నివాళులర్పించింది.

‘‘ఆయన ఓ అసాధారణ మానవుడు. ఓ మేధావి. ఓ నాయకుడు. ఓ కాపరి’’ అని అభివర్ణించింది.

విముక్త ఉద్యమానికి ఊపిరిలూదిన నేత: ఆండ్రూ హార్డింగ్, బీబీసీ ఆఫ్రికా ప్రతినిధి

స్వాతంత్ర్యం కోసం, స్వాతంత్ర్యం తర్వాతా దక్షిణాఫ్రికా సాగించిన సుదీర్ఘ సాహసోపేత ప్రయాణాన్ని ఆర్చ్‌బిషప్ డెస్మండ్ టుటు లేకుండా ఊహించటం అసాధ్యం. ఈ పోరాటంలో ఇతర నాయకులు హత్యకు గురవటం, ప్రవాసానికి పారిపోవటం, జైళ్లలో మగ్గటం జరిగితే.. ఈ ధిక్కార మతబోధకుడు ప్రతి దశలోనూ పోరాటంలోనే ఉన్నారు.

వివక్షాపూరితమైన ప్రభుత్వ రంగును బయటపెడుతూ, బాధితులకు స్వాంతన కలిగిస్తూ, విముక్త ఉద్యమం బాధ్యతాయుతంగా నడిచేలా చూస్తూ ఆ పోరాటానికి ఊపిరిలూదారు. నాటి శ్వేతజాతీయుల మైనారిటీ ప్రభుత్వాన్ని నాజీ ప్రభుత్వంతో పోలుస్తూ.. వారి విధానాలను మార్చుకునేలా ఒత్తిడి తేవాలంటూ పశ్చిమ దేశాలను సవాలు చేస్తుండేవారు.

ప్రజాస్వామ్యం నెలకొన్న తర్వాత.. శ్వేతజాతీయుల మైనారిటీ ప్రభుత్వం నేరాలను బట్టబయలు చేయటానికి ఏర్పాటైన ట్రూత్ అండ్ రీకన్సీలియేషన్ కమిషన్‌కు సారథిగా ఉన్నారు టుటు. ఆ తర్వాత.. అదే భీకరమైన నిశిత దృష్టిని దక్షిణాఫ్రికా ఏఎన్‌సీ ప్రభుత్వ వైఫల్యాల మీద కూడా కేంద్రీకరించారు.

డెస్మండ్ టుటు

ఫొటో సోర్స్, GETTY IMAGES

ఫొటో క్యాప్షన్, డెస్మండ్ టుటు

ఎన్‌సీపీ ప్రభుత్వం మీద అదే నిశిత విమర్శలు...

డెస్మండ్ టుటు ప్రజల్లో తన భావోద్వేగాలను ప్రదర్శించటానికి భయపడరు. 2010లో దక్షిణాఫ్రికాలో జరిగిన ఫుట్‌బాల్ ప్రపంచ కప్ పోటీల ప్రారంభోత్సవంలో ఆయన హాయిగా నవ్వుతూ, నాట్యం చేశారు.

ఎంతో ప్రజాదరణ ఉన్నాకూడా.. అందరి ప్రేమనూ అందుకున్న వ్యక్తి కాదు. అపార్థీడ్ శకం ముగిసిన తర్వాత ఆఫ్రికన్ నేషనల్ కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఆయన నిశిత విమర్శలు చేసేవారు. కొన్నిసార్లు.. దక్షిణాఫ్రికాకు ఏఎన్‌సీ తప్పుడు ప్రాతినిధ్యం వహిస్తోందని కూడా ఆయన అభిప్రాయపడ్డారు. 2011లో దలై లామా పర్యటనను రద్దు చేసిన విషయంలో.. ఏఎన్‌సీ ప్రభుత్వ పతనం కోసం తాను ప్రార్థనలు చేస్తానని కూడా ఆయన హెచ్చరించారు.

దానికి ప్రతిగా నేషనల్ పోలీస్ కమిషనర్ జనరల్ భీకీ సెలీ.. ‘‘నోరుమూసుకుని ఇంటికి వెళ్లు’’ అని టుటును ఉద్దేశించి వ్యాఖ్యానించారు.

1960లో క్రైస్తవ మత గురువు అయిన డెస్మండ్ టుటు.. 1976-78 మధ్య లెసోతో బిషప్‌గా పనిచేశారు. 1985లో బిషప్ ఆఫ్ జొహెనెస్‌బర్గ్ అయ్యారు. ఆ మరుసటి సంవత్సరం కేప్ టౌన్‌కు తొలి నల్లజాతి ఆర్చిబిషప్ అయ్యారు.

ఉన్నత హోదాలోని తన పదవిని.. తమ దేశంలో నల్లజాతి ప్రజల అణచివేత గురించి గొంతెత్తి మాట్లాడటానికి ఆయన ఉపయోగించుకున్నారు. అయితే.. తన ఉద్దేశాలు మతపరమైనవే కానీ రాజకీయమైనవి కావని ఎప్పుడూ చెప్తుండేవారు.

1994లో నెల్సన్ మండేలా దక్షిణాఫ్రికాకు తొలి నల్లజాతి అధ్యక్షుడైన తర్వాత.. డెస్మండ్ టుటును ట్రూత్ అండ్ రీకన్సీలియేషన్ కమిషన్‌కు చైర్మన్‌గా నియమించారు.

వర్ణ వివక్ష ముగిసిన అనంతర దక్షిణాఫ్రికాలో జాతుల సమ్మిశ్రమాన్ని వివరించటానికి ‘రెయిన్‌బో నేషన్‌’ అనే మాటను కూడా ఆయనే రూపొందించారు. కానీ.. తాను కలలుగన్న రీతిలో దేశం సమైక్యం కాలేదని ఆ తర్వాతి సంవత్సరాల్లో టుటు విచారం వ్యక్తంచేశారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)