మెస్సి వర్సెస్ రొనాల్డో: ఫుట్‌బాల్ ఆటనే మార్చేసిన ఇద్దరి మధ్య పోటీ.. ఎవరు GOAT?

ఫొటో సోర్స్, Angel Martinez/Real Madrid via Getty Images
- రచయిత, ఆండీ క్రైయర్
- హోదా, బీబీసీ స్పోర్ట్ సీనియర్ జర్నలిస్ట్
- ప్రచురణ
- చదివే సమయం: 7 నిమిషాలు
బ్రెజిల్ ఆటగాడు కాకా 2007 ఫిఫా ప్లేయర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు గెలుచుకున్నాడు. అయితే ఆ వేడుకలో స్టేజీపై జరిగిన ఒక సంఘటన వైరల్‌గా మారింది. అది ఒక ఆసక్తికర సమకాలీన పోటీకి మొదటి సంకేతంగా నిలిచింది.
ఆ పోటీలో అప్పటికి యువ ఆటగాళ్లయిన లియోనెల్ మెస్సి, క్రిస్టియానో రొనాల్డో వరుసగా రెండు, మూడు స్థానాల్లో నిలిచారు. జూరిచ్ ఒపెరా హౌస్‌లో జరిగిన ఈ వేడుకలో బ్రెజిల్ దిగ్గజం పీలే పొరపాటున రొనాల్డోకు రెండవ స్థానానికి సంబంధించిన ట్రోఫీ అందించాడు. దీంతో ఫిఫా ప్రెసిడెంట్ సెప్ బ్లాటర్ జోక్యం చేసుకుని, వారిద్దరినీ ట్రోఫీలు మార్చుకోమని కోరవలసి వచ్చింది.
ఆ సమయంలో ఇద్దరి ముఖాల్లోనూ అసంతృప్తి స్పష్టంగా కనిపించింది. ఆ తర్వాత పదేళ్లపాటు ప్రతి బ్యాలన్ డి ఓర్, ఫిఫా అవార్డులను మెస్సి లేదా రొనాల్డో మాత్రమే గెలుచుకున్నారు. నిజానికి 2007 నుంచి ఐరోపా ఉత్తమ ఆటగాడికి ఇచ్చిన 29 అవార్డులలో 20 వీరిద్దరికే దక్కాయి. వీరిద్దరూ కలిసి తమ కెరీర్‌లో దాదాపు 2,000 గోల్స్ సాధించారు. క్లబ్, దేశం తరపున 85 ట్రోఫీలు గెలుచుకున్నారు.
గడిచిన రెండు దశాబ్దాల ఫుట్‌బాల్ రంగాన్ని ఈ పోటీయే శాసించింది. క్లబ్‌లు, దేశాలు, టోర్నమెంట్‌లను దాటి ప్రపంచవ్యాప్తంగా ఈ ఆటను ఆడే విధానాన్ని, చూసే పద్ధతిని ఇది పూర్తిగా మార్చేసింది.
"ఇంతటి ప్రతిభావంతులైన ఇద్దరు ఆటగాళ్లు ఇన్ని సంవత్సరాలపాటు అదే స్థాయిలో పోటీ పడటం మనం మళ్లీ చూడలేమని అనుకుంటున్నాను" అని బీబీసీ స్పోర్ట్ కొత్త డాక్యుమెంటరీ 'రైవల్స్: మెస్సి వర్సెస్ రొనాల్డో'లో అర్జెంటీనా వరల్డ్ కప్ విజేత ఏంజెల్ డి మారియా అన్నారు. అతను వీరిద్దరితో కలిసి ఆడాడు.
"వారిద్దరూ ఫుట్‌బాల్ ఆటనే మార్చేశారు" అని డి మారియా అన్నారు.


ఫొటో సోర్స్, FRANCK FIFE / AFP via Getty Images
ఎవరు గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైం?
'గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైం' ఎవరిని అడిగినా ఒకే సమాధానం దొరకడం కష్టం.
"అది కచ్చితంగా రొనాల్డోనే" అని అతని మాజీ మాంచెస్టర్ యునైటెడ్ సహచరుడు రియో ఫెర్డినాండ్ అంటే, "చరిత్రలో మెస్సినే అత్యుత్తమ ఆటగాడు" అని బార్సిలోనా మాజీ ఆటగాడు, మేనేజర్ జావి చెప్పారు.
రొనాల్డో గతంలో 2012లో ఈ విషయంపై స్పందిస్తూ.. "మీరు ఫెరారీని పోర్షె కారుతో పోల్చలేరు. వాటి ఇంజిన్లు వేరు. కొంతమంది నేను మంచి ఆటగాడినని అంటారు, మరికొందరు అతను అంటారు. ప్రస్తుత పరిస్థితిని బట్టి ఎవరు ఉత్తమమో వారే నిర్ణయిస్తారు, నా వరకైతే అది నేనే అనుకుంటాను" అన్నాడు.
చేసిన గోల్స్ లేదా ఛాంపియన్స్ లీగ్ ట్రోఫీల ఆధారంగా చూస్తే రొనాల్డో ముందున్నాడు. అదే బ్యాలన్ డి ఓర్ లేదా మొత్తం ట్రోఫీల పరంగా చూస్తే మెస్సి ఆధిక్యంలో కనిపిస్తాడు. 2016లో పోర్చుగల్ యూరోపియన్ ఛాంపియన్‌షిప్ గెలవడంలో కీలక పాత్ర పోషించినప్పుడు రొనాల్డోను కొందరు ఉత్తమ ఆటగాడి రేసులో ముందంజలో ఉంచారు. కానీ, ఆ తర్వాత మెస్సి అర్జెంటీనాను రెండు కోపా అమెరికా టైటిళ్లు, ఒక వరల్డ్ కప్ వైపు నడిపించాడు.
"నా దృష్టిలో చరిత్రలోనే మెస్సి బెస్ట్ ప్లేయర్, క్రిస్టియానో బెస్ట్ గోల్‌స్కోరర్" అని వీరిద్దరి జీవిత చరిత్రలను రాసిన స్పానిష్ ఫుట్‌బాల్ నిపుణుడు గిల్లెమ్ బాలాగ్ అన్నాడు.
పోర్చుగల్ జట్టులో రొనాల్డోతో, బార్సిలోనాలో మెస్సితో కలిసి ఆడిన డెకో మాట్లాడుతూ, "వారిద్దరూ ప్రత్యేకమైనవారు. మిగిలిన వారందరికంటే పూర్తిగా భిన్నమైనవారు. ఇన్ని సంవత్సరాలపాటు ఇదే స్థాయిలో కొనసాగడం సాధారణ విషయం కాదు. దాదాపు 20 ఏళ్లపాటు ఇలాగే ఉండటం అసాధారణం" అన్నాడు.

ఫొటో సోర్స్, David Ramos/Getty Images
భిన్న ధ్రువాలు, చిన్ననాటి పోలికలు
చాలామంది వీరిద్దరినీ పరస్పరం భిన్నమైన ధ్రువాలుగా చూస్తారు. ఒకరు సిగ్గరియైన మేధావి అయితే, ఇంకొకరు గర్వపడే అహంభావి. ఒకవైపు పెప్ గార్డియోలా నేతృత్వంలోని బార్సిలోనా ఉంటే, మరోవైపు జోస్ మౌరిన్హో నడిపించే రియల్ మాడ్రిడ్. ఒకరు అడిడాస్ బ్రాండ్‌కు ప్రాతినిధ్యం వహిస్తే, మరొకరు నైకీ బ్రాండ్‌కు ప్రతీక.
అయితే, వారి మధ్య ఉన్న తేడాల ఆధారంగానే ఈ పోటీ ఉన్నప్పటికీ, చిన్న వయస్సు నుంచే వీరిద్దరి మధ్య ఉన్న పోలికలు ఆశ్చర్యం కలిగిస్తాయి. వీరిద్దరూ సామాన్య కుటుంబ వాతావరణంలోనే పెరిగారు. తమ కలలను నిజం చేసుకోవడం కోసం చిన్న వయస్సులోనే ఇళ్లను వదిలి వెళ్లారు. మెస్సి 13 ఏళ్ల వయస్సులో అర్జెంటీనా నుంచి బార్సిలోనాకు రాగా, రొనాల్డో 12 ఏళ్ల వయస్సులో మదీరా నుంచి లిస్బన్‌కు వెళ్లాడు. కుటుంబానికి దూరమయ్యాక ఇద్దరూ హోమ్‌సిక్‌నెస్ ఎదుర్కొన్నారు.
"మెస్సీ, రొనాల్డోలను ఎప్పుడూ పూర్తిగా భిన్నమైన వ్యక్తులుగా చిత్రీకరిస్తారు. కానీ వారి చిన్నతనంలో వారిని తీర్చిదిద్దిన పరిస్థితులు మాత్రం ఒకేలా ఉన్నాయి" అని వాల్ స్ట్రీట్ జర్నల్ రిపోర్టర్ జాషువా రాబిన్సన్ చెప్పారు.
"నేను గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైంగా మారాలంటే అది ఇక్కడి నుంచే మొదలవ్వాలని వారు అనుకున్నారు" అన్నారు.
యువ ప్రతిభావంతులుగా గుర్తింపు తెచ్చుకుంటూ, విజయం సాధించాలనే వారి అచంచలమైన సంకల్పమే వీరిద్దరినీ ఒకేలా నిలబెట్టింది.
"మెస్సిలో అప్పటికే ఏదో ప్రత్యేకత కనిపించేది. కేవలం నైపుణ్యం మాత్రమే కాదు, అతను చేసే పనుల్లోని తీవ్రత కూడా భిన్నంగా ఉండేది. ఆటలో దాడి చేసే విధానంలో అప్పటివరకు నేను చూడని ఒక పట్టుదల అతనిలో కనిపించింది. మెస్సి మరింత మెరుగైన ఆటగాడిగా మారడానికి క్రిస్టియానో ఉనికి కూడా అదనపు ప్రేరణగా నిలిచింది" అని బార్సిలోనా మాజీ ఆటగాడు జావి అన్నారు.
మరోవైపు, రొనాల్డో టీనేజ్ వయస్సులోనే మాంచెస్టర్ యునైటెడ్‌తో ఒప్పందం కుదుర్చుకున్నాడు.
ఆ సమయంలో క్లబ్ సహాయక సిబ్బందిలో ఉన్న రెనే మ్యులెన్‌స్టీన్ మాట్లాడుతూ, "తాను ఏం కావాలో అంత స్పష్టమైన ఆత్మవిశ్వాసంతో ఉన్న యువ ఆటగాడిని నేనెప్పుడూ చూడలేదు. క్రిస్టియానో విషయాలను చాలా వేగంగా నేర్చుకునేవాడు" అన్నారు.

ఫొటో సోర్స్, Nicolò Campo/LightRocket via Getty Images
మైదానంలో మొదటి పోరు, స్పానిష్ లీగ్ వైరం
2008 ఛాంపియన్స్ లీగ్ సెమీ-ఫైనల్ మ్యాచ్‌లో రొనాల్డో, మెస్సీ మొదటిసారి మైదానంలో తలపడ్డారు.
"ఆ ఇద్దరు యువకులను మైదానంలో కలిసి చూడటం భవిష్యత్తులో రాబోయే ఒక గొప్ప కాలానికి సంకేతంగా నిలిచింది" అని స్పానిష్ ఫుట్‌బాల్ జర్నలిస్ట్ గిల్లెమ్ బాలాగ్ అన్నాడు.
ఆ టోర్నమెంట్‌లో మాంచెస్టర్ యునైటెడ్ ట్రోఫీ గెలవగా, రొనాల్డో బ్యాలన్ డి ఓర్ అవార్డు సొంతం చేసుకున్నాడు.
"ఇద్దరూ ఒకే లీగ్‌లో ఉండటం అన్నింటినీ మార్చేసింది" అని 2003 నుంచి 2010 మధ్య బార్సిలోనా ఫుట్‌బాల్ డైరెక్టర్‌గా పనిచేసిన టిసికి బెగిరిస్టెయిన్ అన్నారు.

2009లో రొనాల్డో రియల్ మాడ్రిడ్‌కు మారడం ద్వారా వీరిద్దరూ ఫుట్‌బాల్ ప్రపంచంలోనే అత్యంత తీవ్రమైన క్లబ్ పోటీ అయిన 'బార్సిలోనా వర్సెస్ రియల్ మాడ్రిడ్' కేంద్ర బిందువుగా మారారు. 2018 నాటికి వీరిద్దరూ చెరో ఐదు బ్యాలన్ డి ఓర్ అవార్డులు గెలుచుకున్నారు.
స్పెయిన్‌లో ఉన్న తొమ్మిది సీజన్లలో, రియల్ మాడ్రిడ్ తరపున రొనాల్డో 438 మ్యాచ్‌ల్లో 450 గోల్స్ సాధించాడు. బార్సిలోనా తరపున మెస్సీ 476 మ్యాచ్‌ల్లో 471 గోల్స్ చేశాడు.

ఫొటో సోర్స్, asser Bakhsh/Getty Images
వ్యక్తిగత ప్రతిష్ట, జెర్సీ సంబరాలు
అయితే ఇది కేవలం అంకెలకే పరిమితం కాలేదు. అప్పటికే అది వ్యక్తిగత ప్రతిష్టగా మారింది. సోషల్ మీడియా విస్తృతి వల్ల ప్రపంచమంతా దీనిని గమనించడం మొదలుపెట్టింది.
"క్రిస్టియానోకు లియోనెల్ మెస్సి, అలాగే లియోనెల్ మెస్సికి క్రిస్టియానో లక్ష్యంగా మారారు. 'నేను ఇతనిని ఓడించాలి' అనే భావన వారిలో ఉండేది" అని బెగిరిస్టెయిన్ అన్నారు.
"మౌరిన్హో - గార్డియోలా మధ్య ఉన్న పోరు, రొనాల్డో - మెస్సి పోటీకి ఒక అద్దంలా నిలిచింది" అని స్పానిష్ ఫుట్‌బాల్ రచయిత సిడ్ లోవ్ అన్నారు.
"మనం వీటన్నింటినీ ఫోన్లలోనే చూడగలిగాం. క్రిస్టియానో, లియో మైదానంలో ఒకరిని మించి మరొకరు రాణించాలని తీవ్రంగా ప్రయత్నించేవారు" అన్నారు.
లా లిగా టోర్నమెంట్‌లో మెస్సీ, బార్సిలోనా స్పష్టమైన ఆధిక్యం సాధించగా, ఛాంపియన్స్ లీగ్‌ను రియల్ మాడ్రిడ్, రొనాల్డో శాసించారు.
2012లో రొనాల్డో జట్టును మొదటి లా లిగా టైటిల్ వైపు నడిపించాడు. కానీ, మెస్సి వరుసగా నాలుగోసారి బ్యాలన్ డి ఓర్ అవార్డు అందుకున్నాడు. అయితే, ఆ తర్వాతి ఐదు అవార్డులలో నాలుగింటిని రొనాల్డోనే గెలుచుకున్నాడు.
"వారి మధ్య ఒకరకమైన ద్వేషం ప్రారంభమైంది. వారు ఒకరినొకరు పెద్దగా గుర్తించుకునేవారు కాదు" అని రాబిన్సన్ అభిప్రాయపడ్డారు.
2017లో రియల్ మాడ్రిడ్‌తో జరిగిన మ్యాచ్‌లో 92వ నిమిషంలో మెస్సి గోల్ చేసి బార్సిలోనాను గెలిపించినప్పుడు, అతను తన జెర్సీని విప్పి ప్రేక్షకులకు చూపిస్తూ నిలబడ్డాడు.
"మెస్సి తన ఉనికిని బలంగా చాటుకున్న క్షణం అది" అని రాబిన్సన్ అన్నారు.
కొన్ని నెలల తర్వాత, స్పానిష్ సూపర్ కప్‌లో బార్సిలోనాపై రొనాల్డో గోల్ చేసినప్పుడు, అతను కూడా సరిగ్గా అదే విధంగా జెర్సీని చూపిస్తూ సంబరాలు చేసుకున్నాడు.

ఫొటో సోర్స్, Yasser Bakhsh/Getty Images
ఇద్దరి పేర్లపై వేల కోట్ల బిజినెస్
2018లో రొనాల్డో యువెంటిస్ క్లబ్‌లో చేరడంతో స్పెయిన్‌లో మెస్సి - రొనాల్డోల ప్రత్యక్ష పోటీ ముగిసి ఉండవచ్చు. కానీ, ప్రపంచవ్యాప్తంగా నిరంతరం సాగే ఈ చర్చ మాత్రం అస్సలు తగ్గలేదు.
రొనాల్డో ప్రస్తుతం సౌదీ అరేబియాలోని అల్-నస్ర్ క్లబ్ తరపున ఆడుతున్నాడు. మరోవైపు మెస్సి అమెరికా మేజర్ లీగ్ సాకర్‌లో ఇంటర్ మయామి క్లబ్‌తో ఒప్పందం కుదుర్చుకున్నాడు.
"బ్రాండ్ బెక్‌హామ్ భవిష్యత్తులో సాధ్యమయ్యే వాణిజ్య అవకాశాలకు తలుపులు తెరిస్తే, వీరిద్దరూ ఆ తలుపులను పూర్తిగా బద్దలు కొట్టారు" అని మెటా స్పోర్ట్ హెడ్ రాబ్ పిల్‌గ్రిమ్ అన్నాడు.
ఇటాలియన్ ఫుట్‌బాల్ నిపుణురాలు మినా రజౌకి మాట్లాడుతూ "మీరు ఇక్కడ కేవలం ఒక ఆటగాడి ప్రతిభను మాత్రమే కొనడం లేదు, ఒక వ్యక్తి చుట్టూ నడిచే పూర్తి ఆర్థిక వ్యవస్థను కొనుగోలు చేస్తున్నారు" అన్నారు.
2018లో రొనాల్డో యువెంటిస్ క్లబ్‌లో చేరిన మొదటి 24 గంటల్లోనే 5,20,000 జెర్సీలు అమ్ముడయ్యాయి. 2021లో మెస్సి పారిస్ క్లబ్‌కు మారినప్పుడు కేవలం ఏడు నిమిషాల్లోనే 1,50,000 జెర్సీలు అమ్ముడయ్యాయి.
2021లో మాంచెస్టర్ యునైటెడ్ రొనాల్డోను తిరిగి ఆహ్వానించినప్పుడు, అతని జెర్సీల మొత్తం అమ్మకాలు (సుమారు రూ.2,375 కోట్లు) మెస్సి సాధించిన అమ్మకాల కంటే దాదాపు రెట్టింపుగా ఉన్నాయి. ఇన్‌స్టాగ్రామ్‌లో రొనాల్డోకు దాదాపు 70 కోట్ల మంది ఫాలోవర్లు ఉండగా, మెస్సికి 50 కోట్ల మంది ఉన్నారు. మెస్సి వరల్డ్ కప్ ట్రోఫీని ఎత్తిన ఫోటోకు 7.5 కోట్ల కంటే ఎక్కువ లైకులు వచ్చాయి.
ఆర్థికంగా చూస్తే ఫోర్బ్స్ జాబితాలో రొనాల్డో వరుసగా నాలుగోసారి అగ్రస్థానంలో నిలిచాడు. అతని మొత్తం సంపాదన 300 మిలియన్ డాలర్లు (రూ. 2,848 కోట్లు). మెస్సి 140 మిలియన్ డాలర్లతో (రూ. 1,329 కోట్లు) మూడో స్థానంలో ఉన్నాడు. మెస్సి అడిడాస్ బ్రాండ్‌తో, రొనాల్డో నైకీ బ్రాండ్‌తో ఒప్పందంలో ఉన్నారు.
"ప్రపంచంలోనే అత్యంత పెద్ద బ్రాండ్ ప్రమోటర్లుగా మారడానికి వారు పెద్దగా మాట్లాడాల్సిన అవసరం కూడా లేదు" అని రాబిన్సన్ అన్నారు.
2022 ఖతార్ వరల్డ్ కప్‌నకు ముందు లూయిస్ విటన్ కంపెనీ ప్రకటనలో, సూట్‌కేస్‌పై వీరిద్దరూ ఒకరితో ఒకరు చెస్ ఆడుతున్నట్లు ఉన్న ఫోటో వచ్చింది.
"అది ఇంటర్నెట్‌ను ఊపేసిన చిత్రంగా గుర్తింపు పొందింది" అని మెలానీ రోప్ అన్నారు.
ఆఖరి ఘట్టం
కాబట్టి, మనం ఎక్కడ మొదలుపెట్టామో మళ్లీ అక్కడికే వద్దాం.
రాబిన్సన్ మాట్లాడుతూ, "మెస్సి సాధించడానికి ఇక ఏమీ మిగలలేదు. రొనాల్డోకు లేని ఒకే ఒక్కటి మెస్సీ దగ్గర ఉంది, అదే వరల్డ్ కప్. మరి, ఈ మొత్తం ఫుట్‌బాల్ శకాన్ని మెస్సి గెలుచుకున్నట్లా?" అన్నారు.
ఈ కథ ఇంకా ముగిసిపోలేదనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. ఈ వేసవి వరల్డ్ కప్ చివరి దశల్లో అర్జెంటీనా, పోర్చుగల్ జట్లు తలపడే అవకాశం ఉండటంతో, ఈ సుదీర్ఘ పోరాటానికి సంబంధించిన ఆఖరి ఘట్టం త్వరలోనే ఆవిష్కృతం కావచ్చు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్, ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)
































