ఎలక్ట్రిక్ బైక్ చార్జింగ్ పెట్టడం వల్లే ఆ ఇంట్లో అగ్ని ప్రమాదం సంభవించిందా? - Newsreel

ఫొటో సోర్స్, NSW FIRE AND RESCUE
ఓ మూడంతస్తుల భవనం మంటల్లో చిక్కుకుంది. ఇల్లంతా భీకరంగ తగలబడిపోతోంది. 20 మంది అగ్నిమాపక సిబ్బంది రంగంలోకి దిగినా మంటలు ఉధృతి తగ్గడం లేదు.
ఎలాగోలా ఆ ఇంట్లో ఉన్న ఏడుగురు కుటుంబ సభ్యులు మాత్రం ప్రమాదం నుంచి తప్పించుకోగలిగారు.
ఆస్ట్రేలియాలోని సిడ్నీ నగరంలో ఈ ప్రమాదం జరిగింది. ఎలక్ట్రిక్ బైకుకు రాత్రంతా చార్జింగ్ పెట్టి వదిలేయడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని అగ్నిమాపక సిబ్బంది అనుమానిస్తున్నారు.
ఇంట్లోని నలుగురు వ్యక్తులు ముందుగానే సురక్షితంగా బయటపడ్డారని, ముగ్గురు బాల్కనీలో, ఒకరు ఇంట్లోని ఒక గదిలో చిక్కుకున్నారని ఫైర్ ఫైటర్స్ వారిని కాపాడారని 'న్యూ సౌత్ వేల్స్ ఫైర్ అండ్ రెస్క్యూ' శాఖ తెలిపింది. ఇద్దరిని మాత్రం ఆస్పత్రిలో చేర్పించాల్సి వచ్చింది.
ఈ ఘటన జరిగిన తరువాత అగ్నిమాపక శాఖ ఓ హెచ్చరిక చేసింది. ఎలక్ట్రిక్ బైకులను ఎవరైనా సరే కంపెనీ ఇచ్చిన చార్జర్లతోనే చార్జి చేయాలని, పైగా చార్జింగ్ చేసే వాహనాన్ని మనుషులకు చాలా దూరంగా ఉంచాలని సూచించింది. ఎలక్ట్రిక్ వాహనంలో బ్యాటరీలు ఏమైనా పాడైపోతే అధీకృత సర్వీస్ సెంటర్లోనే బాగు చేయించుకోవాలని కూడా చెప్పింది.
"అదృష్టవశాత్తు ఆ ఇంట్లో ఫైర్ అలారం ఉంది. పొగ రాగానే అలారం మోగడంతో ఇంట్లోని మనుషులు సురక్షితంగా బయటకు రాగలిగారు" అని అగ్నిమాపక శాఖ అధికారులు తెలిపారు.
చంద్రబాబుకు ఏపీ హైకోర్టులో ఊరట... ఏపీ సీఐడీ విచారణ వాయిదా

ఫొటో సోర్స్, TeluguDesamParty/FB
తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుకు ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ఊరట లభించింది. అమరావతి భూముల సమీకరణ సమయంలో అసైన్డ్ భూములకు సంబంధించి ఆయన మీద నమోదయిన ఎఫ్ఐఆర్ పై విచారణను నాలుగు వారాల పాటు నిలిపివేస్తూ కోర్టు ఉత్తర్వులిచ్చింది. ఈనెల 23న ఏపీ సీఐడీ ముందు విచారణకు హాజరుకావాలంటూ ఇచ్చిన నోటీసులను నిలుపుదల చేశారు. చంద్రబాబుతో పాటుగా ఆయన మంత్రివర్గ సహచరుడు పి నారాయణకు కూడా ఈ కేసులో కోర్టు ఉపశమనం కలిగించింది.
రాజధాని కోసం అసైన్డ్ భూముల కొనుగోలు వ్యవహారంలో ఎస్సీ, ఎస్టీలకు అన్యాయం జరిగిందంటూ మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఫిర్యాదుతో సీఐడీ కేసు నమోదు చేసింది. నాటి ముఖ్యమంత్రి , సీఆర్డీయే చైర్మన్ గానూ వ్యవహరించిన చంద్రబాబు, పట్టణాభివృద్ధి మంత్రిగా పనిచేసిన పి. నారాయణతో పాటు ఫిర్యాదుదారు ఆళ్ల రామకృష్ణారెడ్డి, రాజధాని కోసం భూములిచ్చిన ఎస్సీ, ఎస్టీ రైతులకు కూడా సీఐడీ నోటీసులు జారీ చేసింది. ఇప్పటికే ఎమ్మెల్యే ఆర్కేతో పాటు రైతులు కూడా సీఐడీ ముందు హాజరయ్యారు.
చంద్రబాబు, నారాయణలను ఈనెల 23న సీఐడీ కార్యాలయానికి రావాలంటూ నోటీసులు ఇచ్చిన తరుణంలో ఈ కేసుని క్వాష్ చేయాలంటూ వారిరువురూ హైకోర్టులో పిటీషన్లు వేశారు. చంద్రబాబు తరపున సుప్రీంకోర్టు న్యాయవాది సిద్ధార్థ లూథ్రా వాదనలు వినిపించారు. నారాయణ తరఫున దమ్మాలపాటి శ్రీనివాస్ వాదించారు. ఎస్సీ, ఎస్టీల భూములు బలవంతంగా తీసుకున్నారంటూ చేసిన ఆరోపణలకు సంబంధించిన ప్రాథమిక సాక్ష్యాల గురించి సీఐడీ న్యాయవాదిని కోర్టు ప్రశ్నించింది. పూర్తి వివరాలు అందించేందుకు అనుగుణంగా నాలుగు వారాల గడువునిచ్చింది. సీబీఐ కౌంటర్ దాఖలు చేసే వరకు విచారణ నిలుపుదల చేస్తూ కోర్టు స్టే విధించింది. దాంతో ఈనెల 23న సీఐడీ ముందుకు వెళ్లాల్సిన అవసరం లేకుండా చంద్రబాబు, నారాయణకు ఊరట లభించింది.

సామియా సులుహు హసన్: టాంజానియా కొత్త అధ్యక్షురాలు

ఫొటో సోర్స్, TANZANIA STATE HOUSE
టాంజానియా కొత్త అధ్యక్షురాలిగా సామియా సులుహు హసన్ శుక్రవారం బాధ్యతలు చేపట్టారు. అధ్యక్షుడు జాన్ మగుఫులి అనారోగ్యం వల్ల చనిపోయినట్లు బుధవారం సాయంత్రం ఉపాధ్యక్షురాలి హోదాలో సామియా స్వయంగా ప్రకటించాల్సి వచ్చింది. ఇప్పుడు ఆయన స్థానంలో ఆమె ప్రభుత్వాధినేత అయ్యారు.
సామియా 2015లో తొలిసారి ముగుఫులితో జోడీగా ఉపాధ్యక్షురాలిగా పోటీ చేసి ఎన్నికయ్యారు. మళ్లీ గత ఏడాది మగుఫులి అధ్యక్షుడిగా, సామియా ఉపాధ్యక్షురాలిగా ఎన్నికయ్యారు.
టాంజానియా రాజ్యాంగం ప్రకారం.. అధ్యక్ష పదవిలోని వ్యక్తి ఏదైనా కారణం వల్ల వైదొలగినా, మరణించినా.. ఉపాధ్యక్ష పదవిలో ఉన్న వ్యక్తి అధ్యక్షులవుతారు. మిగతా పదవీ కాలం మొత్తం అధ్యక్ష పదవిలో కొనసాగుతారు.
అధ్యక్ష పదవీ కాలం ఐదేళ్లు కాగా.. సామియా మరో నాలుగేళ్లు అధ్యక్షురాలిగా ఉంటారు.
ప్రస్తుతం ఆఫ్రికా ఖండం మొత్తంలోకీ ఒక దేశాధినేతగా ఉన్న మహిళ సామియా ఒక్కరే. ఇథియోపియా అధ్యక్షురాలిగా మహిళ ఉన్నప్పటికీ.. ఆ పదవి ప్రధానంగా అలంకార ప్రాయమే.
ఆఫ్రికా ఖండంలో ఒక దేశానికి నాయకత్వం వహించిన అతి కొద్ది మహిళల జాబితాలో సామియా చేరారు.
సామియా వయసు 61 సంవత్సరాలు. జనం ఆమెను 'మామా సామియా' అని అభిమానంగా పిలుచుకుంటారు. టాంజానియా సంస్కృతిలో ఈ మాట.. ఆమెకు గల గౌరవాన్ని ప్రతిబింబిస్తుంది కానీ.. ఆమె మహిళ అనే అంశాన్ని కాదు.

ఫొటో సోర్స్, AFP
టాంజానియాకు 1961లో స్వతంత్రం వచ్చినప్పటి నుంచీ చామా చా మాపిన్డుజీ (సీసీఎం) పార్టీ ఏదో ఒక రూపంలో అధికారంలో కొనసాగుతోంది.
నిజానికి 2015 ఎన్నికల్లో పార్టీ ఉపాధ్యక్ష అభ్యర్థిగా ఆమెకన్నా ప్రముఖులైన నాయకులను కాదని సామియాను ఎంపిక చేయటం ఆశ్చర్యం కలిగించింది.
సామియా మొదటిసారి 2000 సంవత్సరంలో ప్రజాప్రతినిధిగా ఎన్నికయ్యారు. 2014లో కొత్త రాజ్యాంగం ముసాయిదాను తయారు చేయటానికి ఏర్పాటు చేసిన రాజ్యాంగ సభ వైస్ చైర్‌పర్సన్‌గా నియమితులు కావటంతో ఆమె ప్రాచుర్యంలోకి వచ్చారు.
ఆ పదవిలో ఉండగా.. సభలో అప్పుడప్పుడూ తలెత్తే గందరగోళాలను శాంతింపచేయటంలో, అతిగా మాట్లాడే కొందరు సభ్యులను నియంత్రించే విషయంలో ఆమె వ్యవహార శైలి ప్రశంసలు అందుకుంది.
వ్యక్తిత్వం విషయంలో మగుఫులి తీరుకి, ఆమె తీరుకి చాలా తేడా ఉంటుంది.
మగుఫులి తన భావావేశాలను బాహాటంగా వ్యక్తం చేయటానికి సంకోచించరు. సామియా ఆలోచించి మాట్లాడతారు.
ఆమె మంచి శ్రోత అని కూడా అంటారు. సరైన విధివిధానాలను పాటించటాన్ని ఆమె నమ్ముతారని కూడా చెప్తారు.
సామియా 2015 నుంచి ఉపాధ్యక్షురాలిగా ఉన్నప్పటికీ, అంతకు ముందటి ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసినప్పటికీ ఆమె వ్యక్తిగత జీవితం గురించి ఎక్కువ వివరాలు తెలియవు.
ఆమె 1960లో టాంజానియాకు దూరంగా సముద్రంలో ఉండే జాంజిబార్ దీవుల్లో జన్మించారు. టాంజానియాలో పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ విద్యను అభ్యశించారు. అనంతరం బ్రిటన్‌లోని మాంచెస్టర్ యూనివర్సిటీలో అదే అంశంపై పోస్టు గ్రాడ్యుయేషన్ చేశారు.
1978లో.. వ్యవసాయ విద్యావేత్తగా తెలిసిన హఫీద్ అమీర్‌తో ఆమె వివాహం జరిగింది. సామియా ఉపాధ్యక్షురాలిగా ఎన్నికైనప్పటి నుంచీ వీరిద్దరూ కలిసి ఉన్న ఫొటోలు కనిపించలేదు.
వీరికి నలుగురు పిల్లలు ఉన్నారు. వారిలో ఒకరు ప్రస్తుతం జాంజిబార్ ప్రతినిధుల సభ సభ్యుడు.

తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికలు: 'దొంగ ఓటు వేసిన టీఆర్ఎస్ మున్సిపల్ చైర్ పర్సన్ తాటికొండ స్వప్న రాజీనామా చేయాలి'

ఫొటో సోర్స్, TatikondaSwapna/FB
వికారాబాద్ జిల్లా తాండూరు మున్సిపల్ చైర్మన్, టీఆర్ఎస్ నాయకురాలు తాటికొండ స్వప్న పరిమళ్ దొంగ ఓటు వేశారు.
బూత్ నంబర్ -283లో, ఓటరు క్రమ సంఖ్య 528గా తాటికొండ స్వప్న అనే పేరు నమోదై ఉంది. అయితే, తాండూర్ మున్సిపల్ చైర్ పర్సన్ తాటికొండ స్వప్న, ఈ స్వప్న ఒకరు కాదు. మున్సిపల్ చైర్ పర్సన్ భర్త పేరు పరిమళ్. 528 సీరియల్ నంబర్లో ఉన్న స్వప్న భర్త పేరు తాటికొండ అశ్విన్. ఆమె మున్సిపల్ చైర్ పర్సన్ స్వప్నకు తోటి కోడలు.
తాండూరు మున్సిపల్ చైర్మన్ తాటికొండ స్వప్న తన బంధువు పేరు మీద నమోదు అయిన ఓటును తన ఓటుగా వేయడం కాంగ్రెస్ ఎన్నికల ఏజెంట్ దృష్టికి వచ్చింది. ఓటు హక్కు లేని స్వప్న ఎలా ఓటు హక్కు వినియోగించుకున్నారంటూ ఆరా తీసి ఎన్నికల అధికారికి ఫిర్యాదు చేశారు.
ఎన్నికల కమిషనర్ ఆదేశాలతో ఈ విషయంపై విచారణ జరిపిన జిల్లా కలెక్టర్ ఆమె దొంగ ఓటు వేసినట్లు నిర్ధారించారు. దొంగ ఓటు వేసిన మున్సిపల్ చైర్ పర్సన్ తాటికొండ స్వప్న రాజీనామా చేయాలని బల్దియా కార్యాలయం ముందు కాంగ్రెస్, సీపీఐ, తెలంగాణ జన సమితి కౌన్సిలర్లు ఆందోళనకు దిగారు.

'నాతో లైవ్ చర్చకు సిద్ధమా?' జో బైడెన్‌కు పుతిన్ సవాల్

ఫొటో సోర్స్, Getty Images
తనను 'కిల్లర్'గా అభివర్ణిస్తూ బహిరంగంగా విమర్శలు చేసిన అమెరికా అధ్యక్షుడు జోబైడెన్‌పై రష్యా అధ్యక్షుడు పుతిన్ మండిపడ్డారు. బైడెన్ తీరు ఒక హంతకుడే ‘హంతకుడు..హంతకుడు’ అని అరిచినట్లుగా ఉందని పుతిన్ విమర్శించారు.
రష్యా అధికార టీవీ చానల్‌లో మాట్లాడిన పుతిన్, బైడెన్‌కు చేతనైతే తనతో టీవీ లైవ్‌లో చర్చకు రావాలని సవాల్ విసిరారు. ఆయన చర్చకు వస్తానంటే శుక్రవారం లేదా సోమవారం తాను అందుబాటులో ఉంటానని పుతిన్ అన్నారు.
ప్రతిపక్ష పార్టీకి చెందిన అలెక్సీ నావల్నీ హత్యకు తన భద్రతా సిబ్బంది ప్రయత్నించారన్న ఆరోపణలను కూడా పుతిన్ ఖండించారు. 2020 అమెరికా ఎన్నికల్లో జోక్యం చేసుకున్నందుకు మూల్యం చెల్లించాల్సి ఉంటుందని ఏబీసీ న్యూస్ చానల్‌లో బైడెన్ పుతిన్ ను హెచ్చరించారు.
రష్యా అధ్యక్షుడు పుతిన్ అమెరికా అధ్యక్ష ఎన్నికల వ్యవహారంలో జోక్యం చేసుకున్నారంటూ అమెరికా ఇంటెలిజెన్స్ ఇచ్చిన రిపోర్ట్ ఆధారంగా బైడెన్ పుతిన్‌పై విమర్శలు చేశారు. ఈ ఎన్నికల్లో ట్రంప్ మళ్లీ విజయం సాధించేలా రష్యా ప్రయత్నాలు చేసిందని ఇంటెలిజెన్స్ రిపోర్ట్ పేర్కొంది.
రష్యాను ఏం చేయబోతున్నారు అన్న ప్రశ్నకు 'త్వరలో మీరే చూస్తారు' అని బైడెన్ సమాధానమిచ్చారు. ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఆధారంగా వచ్చే వారం రష్యాపై ఆంక్షలు విధించాలని అమెరికా భావిస్తున్నట్లు సమాచారం.
రష్యాతో అమెరికా సంబంధాలు ట్రంప్ పాలనా కాలంలోలాగా ఉండబోవని వైట్‌హౌస్ ప్రతినిధి జెన్ సాకీ వ్యాఖ్యానించారు. తాను పాల్పడిన చర్యలకు రష్యా ఫలితం అనుభవించాల్సి ఉంటుందని జెన్ వ్యాఖ్యానించారు.
మరోవైపు అమెరికాతో ఇక సంబంధాలు లేవంటూ అక్కడి తమ రాయబారి అనటోలి ఆంటోనోవ్‌ను రష్యా వెనక్కి పిలిపించింది.

''మా ట్రెడ్‌మిల్ దగ్గరకు పిల్లలను రానివ్వొద్దు.. ప్రమాదాలకు ఆస్కారం ఉంది''

ఫొటో సోర్స్, Getty Images
పిల్లలను వ్యాయామ సాధనాలకు దూరంగా ఉంచడం మంచిదని పెల్టన్ ఎక్సర్‌సైజ్ ఎక్విప్‌మెంట్ కంపెనీ తల్లిదండ్రులకు సూచించింది. ఇటీవల తమ కంపెనీ ట్రెడ్‌మిల్ కింద పడి ఓ చిన్నారి మరణించిన ఘటనను గుర్తు చేస్తూ, ఇది బాధాకరమైన ఘటన అని, తల్లిదండ్రులు జాగ్రత్త వహించాలని ఆ కంపెనీ సీఈవో జాన్ ఫాలీ సూచించారు.
తమ కంపెనీ తయారీ వ్యాయామ పరికరాలతో ఇలాంటి ప్రమాదాలు అప్పుడప్పుడు జరుగుతున్నాయని తెలిపిన ఆయన, ప్రమాదం పూర్తి వివరాలను మాత్రం చెప్పలేదు. ఫిబ్రవరిలో ఓ మూడేళ్ల చిన్నారి పెల్టన్ కంపెనీకి చెందిన ట్రెడ్‌మిల్ కింద పడి తీవ్ర గాయాలపాలయ్యాడు. అయితే తర్వాత ఆ చిన్నారి పూర్తిగా కోలుకున్నాడు.
ఇటీవల జరిగిన ప్రమాదంలో చిన్నారి వీపు మీద ట్రెడ్‌మిల్ ఒత్తుకున్న గుర్తులు కనిపించాయని, కాబట్టి పిల్లలను తమ సంస్థ పరికరాలకు దూరంగా ఉంచాలని ఆయన సూచించారు.
"ప్రమాదాలు జరకుండా, సురక్షితంగా ఉండేలా మా కంపెనీ ఉత్పత్తులను డిజైన్ చేశాం. అయినా పిల్లలను వాటి దగ్గరకు రానివ్వకుండా ఉంచడం మేలు. ఈ విషయంలో మీ సహకారం కావాలి" అని ఓ లేఖలో ఫాలీ పేర్కొన్నారు.
"మీరు ఎక్సర్‌సైజ్ చేయడానికి ముందు పరిసరాలను పరిశీలించండి. పిల్లలు, పెంపుడు జంతువులను ఎక్విప్‌మెంట్ దగ్గరకు రానీయకండి" అని ఆయన కోరారు.
పెల్టన్ కంపెనీ తయారీ వ్యాయామ సాధానాల కారణంగా ఇటీవల జరిగిన ప్రమాదంపై విచారణ జరుపుతున్నామని అమెరికాకు చెందిన కన్స్యూమర్ ప్రోడక్ట్ సేఫ్టీ కమిషన్ వెల్లడించింది.
పెల్టన్ కంపెనీ సైక్లింగ్ మెషిన్‌లను తయారు చేసి అమ్మడంతోపాటు ఆన్‌లైన్‌లో ఫిట్‌నెస్ క్లాసులు నిర్వహిస్తోంది. లాక్‌డౌన్ కాలంలో జిమ్‌లు మూసేయడంతో ఈ కంపెనీ ఉత్పత్తులకు డిమాండ్ విపరీతంగా పెరిగింది.
అధిక డిమాండ్ కారణంగా కస్టమర్ల ఆర్డర్లను సమయానికి అందించలేని పరిస్థితి కూడా ఏర్పడిందని ఆ సంస్థ వెల్లడించింది.

ఫొటో సోర్స్, Getty Images
విషాదం
పదహారేళ్ల వయసు, ఆ పైబడిన వారు ఉపయోగించడానికి వీలుగా పెల్టన్ సంస్థ తమ వ్యాయామ సాధనాలను తయారు చేసి అమ్ముతోంది. ఆ కంపెనీ తయారు చేసే ట్రెడ్‌మిల్ ధర 2400 డాలర్ల( రూ.1,77000లకు పైగా) ఖరీదు, 45కేజీలకు పైగా బరువు ఉంటాయి.
ప్రైవసీ సమస్య కారణంగా తమ ఉత్పత్తుల కారణంగా జరిగిన ప్రమాదాలకు సంబంధించిన సమాచారాన్ని అందించలేమని ఫాలీ తెలిపారు."కొన్ని ప్రమాదాలు జరిగిన మాట వాస్తవమే. అది మమ్మల్ని ఎంతో బాధించింది. విషాదం నిండిన ఆ కుటుంబాలకు మా సంస్థ సానుభూతి తెలుపుతోంది" అన్నారు ఫాలీ.
"కంపెనీ ఎక్విప్‌మెంట్ వాడకంపై జాగ్రత్తలను, ప్రమాదాలను నివారించే రక్షణ చర్యలను సూచించేందుకు ప్రయత్నాలు చేస్తున్నాం" అన్నారు ఫాలీ.
గత ఏడాది ఒక్క అమెరికాలోనే 27,000 బైక్‌లను రీకాల్ (పొరపాట్లను సరిదిద్దేందుకు వస్తువులను కంపెనీకి తిరిగి తెప్పించుకోవడం) చేసింది పెల్టన్ కంపెనీ. సైకిళ్లను వాడుతున్నప్పుడు పెడల్స్ విరిగిపోతున్నట్లు ఆ సంస్థ గుర్తించింది.
ట్రెడ్‌మిల్ కారణంగా సుమారు 22,500 ప్రమాదాలు జరిగినట్లు తమ దృష్టికి వచ్చిందని అమెరికాలోని ఎమర్జెన్సీ డిపార్ట్‌మెంట్స్ వెల్లడించాయి. అందులో 2,000 ఘటనల్లో 8 ఏళ్ల లోపు పిల్లలు ప్రమాదానికి గురయ్యారని కన్స్యూమర్ ప్రోడక్ట్ సేఫ్టీ కమిషన్ వెల్లడించింది.
2018-2020 మధ్య కాలంలో ట్రెడ్‌మిల్ మీద జరిగిన ప్రమాదాలలో 17మంది మరణించారు. అందులో ఐదేళ్ల చిన్నారి కూడా ఉన్నాడు. ఈ ప్రమాదాల నేపథ్యంలోనే పెల్టన్ సంస్థ తల్లిదండ్రులను హెచ్చరించింది.
ఇవి కూడా చదవండి:
- రూ. 2000 నోట్ల ముద్రణను రిజర్వు బ్యాంక్ ఆపేసింది... పెద్ద నోటు మళ్లీ రద్దవుతుందా?
- బ్యాంకుల సమ్మె ఎందుకు? మోదీ ప్రభుత్వం.. ప్రభుత్వ బ్యాంకులను ఎందుకు ప్రైవేటీకరిస్తోంది?
- IPO అంటే ఏమిటి... దరఖాస్తు చేసిన వారందరికీ షేర్లు కేటాయిస్తారా? కేటాయించకపోతే ఏం చేయాలి?
- మ్యూచువల్ ఫండ్స్: మహిళలు పెట్టుబడి పెట్టేందుకు అద్భుతమైన మార్గం ఇదేనా?
- విశాఖపట్నం: సాగర తీరంలో టీయూ-142 యుద్ధ విమానం... దీని చూస్తే ఎందుకు ఉద్వేగం ఉరకలేస్తుంది?
- మియన్మార్‌లో 'సరోంగ్ విప్లవం': మహిళలు నడుముకు కట్టుకునే 'సరోంగ్' వస్త్రం.. నిరసనకారుల ఆయుధంగా మారిన వైనం
- యాంటీకిథెరా: రెండు వేల ఏళ్ల కిందటి 'పురాతన కంప్యూటర్'.. గుట్టు వీడబోతోందా
- చంద్రబాబు నాయుడుకు ఏపీ సీఐడీ నోటీసులు... అమరావతి భూముల సేకరణపై విచారణకు రావాలని ఆదేశం
- గుజరాత్: టీ షర్ట్ ధరించి వచ్చిన కాంగ్రెస్ ఎమ్మెల్యేను సభ నుంచి పంపించేసిన స్పీకర్
- బిర్యానీ పక్కాగా వండాలంటే కచ్చితమైన లెక్కలు ఉంటాయా? దీనికో ఆల్గారిథమ్ ఉందా?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)


























