You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
హైదరాబాద్ విద్యార్థినిపై ప్లాన్ ప్రకారమే సామూహిక అత్యాచారం: ప్రెస్ రివ్యూ
హైదరాబాద్ శివార్లలో విద్యార్థినిపై అత్యాచారం చేయాలని నిందితులు ముందే ప్లాన్ వేశారని ఈనాడు దినపత్రిక కథనం ప్రచురించింది.
ముందుగా అనుకున్న పథకం ప్రకారమే నిందితులు ఫార్మసీ విద్యార్థినిపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. విషయం బయటకు పొక్కకుండా ఆమెను హత్యచేయాలనీ భావించారని రాసింది.
పోలీసు వాహనాల సైరన్లు నలువైపులా మోగుతుండటంతో వెనకడుగు వేశారు. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా నలుగురు ఆటో డ్రైవర్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
వీళ్లంతా ముఠాగా ఏర్పడి అఘాయిత్యాలకు పాల్పడేవారని, మరికొందర్నీ అత్యాచారం చేశారని విచారణలో తేలినట్టు తెలిసింది. కేసు వివరాలను రాచకొండ పోలీసులు శుక్రవారం అధికారికంగా వెల్లడించే అవకాశముందని ఈనాడు చెప్పింది.
బాధిత విద్యార్థిని (19) మేడ్చల్‌కు సమీపంలోని ఓ కళాశాలలో బీ-ఫార్మసీ ద్వితీయ సంవత్సరం చదువుతోంది. రోజూ కీసర మండలం రాంపల్లి చౌరస్తా వద్ద కళాశాల బస్సు దిగుతున్న యువతి అక్కణ్నుంచి సుమారు 1.5 కి.మీ దూరంలో ఉన్న ఆర్‌ఎల్‌నగర్‌లోని ఇంటికి ఆటోలో వెళ్లేది.
ప్రధాన నిందితుడు తన సెవెన్ సీటర్ ప్యాసింజర్ ఆటోను రాంపల్లి చౌరస్తా దగ్గరున్న అడ్డాలో నిలిపి ఉంచడంతో కొన్నిసార్లు ఆ ఆటోలోనూ ప్రయాణించింది.
ఆ క్రమంలోనే అతడి కన్ను ఆమెపై పడింది. సహచరులైన మరో ముగ్గురు ఆటో డ్రైవర్లకు ఆమె గురించి చెప్పిన అతను, అదనుచూసి కిడ్నాప్ చేయాలనే ఆలోచనతో ఉన్నాడు.
ఎప్పటిలాగే యువతి బుధవారం సాయంత్రం 5.30 గంటల నుంచి 5.45 గంటల మధ్య రాంపల్లి చౌరస్తా దగ్గర కళాశాల బస్సు దిగి ఆటో అడ్డా వద్దకు వచ్చింది.
ఆ సమయంలో అక్కడే ఉన్న ప్రధాన నిందితుడు, ముగ్గురు స్నేహితులకు ఫోన్‌చేసి 'మ్యాటర్ రెడీగా ఉందంటూ' సమాచారం ఇచ్చాడు.
అప్పటికే ఆటోలో ఇద్దరు మహిళలు, యువకుడు ఉండటంతో ఆమె యథావిధిగా అందులో ఎక్కింది. చౌరస్తా నుంచి కి.మీ. దూరంలో ఉన్న సత్యనారాయణ కాలనీ దగ్గర ఇద్దరు, ఆ తర్వాత కొంతదూరంలో మరొకరు దిగారు.
ఇంకొంచెం దూరంలో యువతి దిగాల్సిన ఆర్‌ఎల్‌నగర్ బస్‌స్టాప్ ఉంది. నిందితుడు ఆటోను అక్కడ ఆపకుండా వేగంగా యంనంపేటవైపు పోనిచ్చాడు. అనుమానించిన యువతి 'ఆటోను మన స్టాప్‌లో ఆపకుండా డ్రైవర్ ఎక్కడికో తీసుకెళ్తున్నాడు. నాకు భయమేస్తోందంటూ' తల్లికి ఫోన్ చేసి చెప్పింది.
ఆమె బంధువులకు విషయం చెప్పగా, వాళ్లు డయల్ 100కు సాయంత్రం 6.30 గంటల సమయంలో ఫోన్ చేశారు.
ఆటో యంనంపేటకు చేరుకోగానే మరో ఇద్దరు వ్యక్తులు ఆటోలో ఎక్కి వెనుక సీట్లో యువతికి చెరోవైపు కూర్చున్నారు. మరోవ్యక్తి ఘట్‌కేసర్ శివారులో వ్యాన్‌తో సిద్ధంగా ఉన్నాడు. అక్కడ యువతిని బలవంతంగా వ్యాన్‌లోకి ఎక్కించి మత్తుమందు ఇచ్చారు. అందులోనే అందరూ అత్యాచారం చేశారని ఈనాడులో రాశారు.
అదే సమయంలో పోలీస్ వాహనాల సైరన్ మోగడం, 'ఆటోలో అమ్మాయిని కిడ్నాప్ చేశారు..ఎవరికైనా కనిపిస్తే సమాచారం ఇవ్వాలంటూ' పోలీసులు మైకుల్లో ప్రకటిస్తుండటాన్ని విన్న నిందితులు దొరికితే ఎన్‌కౌంటర్ చేస్తారని భయపడ్డారు.
యువతిని వ్యాన్ నుంచి కిందకు దించి పక్కనే పొదల్లో పడేసి పరారయ్యారు. సెల్‌ఫోన్ టవర్ లొకేషన్ ఆధారంగా పోలీసులు బాధితురాలి జాడను గుర్తించారు.
అపస్మారక స్థితిలో ఉన్న ఆమెను అన్నోజిగూడలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. తదుపరి వైద్యపరీక్షల నిమిత్తం గురువారం నగరంలోని ప్రభుత్వాసుపత్రిలో చేర్పించారు. బాధితురాలి ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు తెలుస్తోందని పత్రిక చెప్పింది.
రాంపల్లి చౌరస్తా దగ్గర సీసీటీవీ ఫుటేజీని పోలీసులు జల్లెడ పట్టారు. ఆ క్రమంలోనే బాధితురాలితోపాటు మరో యువకుడు ఆటోలో ఎక్కినట్లు గుర్తించి విచారించారు. అతను చెప్పిన ఆనవాళ్ల ఆధారంగా అడ్డాలోని ఆటో డ్రైవర్లను ఆరాతీశారు.
సెల్‌ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా నలుగుర్ని గురువారం తెల్లవారుజామున అదుపులోకి తీసుకున్నట్లుగా తెలిసిందని కథనంలో చెప్పారు.
కేసు దర్యాప్తును రాచకొండ సీపీ మహేష్ భగవత్ పర్యవేక్షిస్తున్నారు. బాధితురాలి తల్లి ఫిర్యాదు మేరకు కీసర పోలీసులు నిందితులపై అత్యాచారం, హత్యాయత్నం కేసులు నమోదుచేశారని ఈనాడు వివరించింది.
విమానయానం మరింత భారం
దేశీయ విమాన టికెట్ల ధరలను కేంద్రం పెంచినట్లు ఆంధ్రజ్యోతి దినపత్రిక కథనం ప్రచురించింది.
ఇక నుంచి విమాన ప్రయాణం మరింత భారంకానుంది. దేశీయ విమాన టికెట్ల ధర కనిష్ఠ, గరిష్ఠ పరిమితులను కేంద్ర పౌర విమాయాన మంత్రిత్వ శాఖ 10 శాతం నుంచి 30 శాతం వరకు గురువారం పెంచింది.
ఈ కొత్త పరిమితులు వచ్చే మార్చి 31 వరకు లేదా తదుపరి ఆదేశాలు వెల్లడించే వరకు అమల్లో ఉండనున్నాయని మంత్రిత్వ శాఖ ఆదేశాల్లో పేర్కొందని పత్రిక రాసింది.
గత ఏడాది మే 21న దే శీయ విమాన సర్వీసులను పునరుద్ధరించిన సందర్భంగా మంత్రిత్వ శాఖ విమాన టికెట్ల ధరలపై పరిమితులు విధించింది.
విమాన ప్రయాణ కాలాన్ని బట్టి ఏడు శ్రేణులుగా వర్గీకరించింది. ధరల పెరుగుదల వలన విమాన ప్రయాణికులపై భారం అధికంగా ఉండనుంది.
విమానయాన కంపెనీలు తమ టికెట్లలో కనీసం 40 శాతం టికెట్లు కనిష్ఠ, గరిష్ఠ పరిమితిలోని సగటు ధరకన్నా తక్కువకు విక్రయించాలని గత మే 21న డీజీసీఏ వెల్లడించింది.
కొవిడ్ నేపథ్యంలో విమానయాన సంస్థలు తమ పూర్తి సామర్థ్యంలో 80 శాతం విమానాలు మాత్రమే నడపాలని స్పష్టం చేసిందని ఆంధ్రజ్యోతి వివరించింది.
రాష్ట్రం రాబడి పెరగాలి- సీఎం వై.ఎస్.జగన్
రాష్ట్ర ఆదాయ మార్గాల పెంపుపై దృష్టి పెట్టాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అధికారులకు సూచించారని సాక్షి కథనం ప్రచురించింది.
ఎన్నికల మేనిఫెస్టోలో పేర్కొన్న 'నవరత్నాలు', సంక్షేమ పథకాల అమలుతోపాటు ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చాల్సిన గురుతర బాధ్యత ప్రభుత్వంపై ఉన్నందున ఆదాయ మార్గాల పెంపుపై ప్రత్యేకంగా దృష్టి సారించాలని సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అధికార యంత్రాంగానికి సూచించారు.
ప్రజలపై భారం మోపకుండా రాబడి పెంచడానికి ఉన్న ప్రతి అంశాన్ని పరిశీలించాలని కోరారు. ఆదాయ ఆర్జన శాఖలు, సంస్థల అధికారులతో గురువారం ఆయన తన క్యాంపు కార్యాలయంలో సమీక్షించారు.
ఎక్కడెక్కడ దృష్టి పెడితే ఆదాయం పెరుగుతుందో ఆలోచించుకుని తరచూ సమీక్షించుకుంటూ కార్యాచరణ ప్రణాళికలు రూపొందించుకుని ముందుకెళ్లాలని అధికారులకు సూచించారని పత్రిక పేర్కొంది.
సంక్షేమ పథకాల ద్వారా పేదలు, అల్పాదాయ వర్గాల ప్రజల ఆర్థిక, సామాజిక స్థితిగతులు మెరుగు పరచాల్సిన గురుతర బాధ్యత ప్రభుత్వంపై ఉందని ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలని నొక్కి చెప్పారు.
వీటితోపాటు అభివృద్ధి పనులకు కూడా నిధులు అవసరమైనందున ఆదాయ మార్గాలు అన్వేషించాలన్నారు.
సీఎం ఇంకా ఏమన్నారంటే...
- రాష్ట్రానికి అధిక ఆదాయం వచ్చే మైనింగ్ కార్యకలాపాలపై మరింత అధికంగా దృష్టి నిలపాలి.
- రాష్ట్రంలో ఉన్న ఎర్రచందనం నిల్వలను విక్రయించేందుకు త్వరితగతిన కేంద్ర ప్రభుత్వం నుంచి అనుమతులు తెచ్చేందుకు ప్రయత్నించాలి. ఎక్కడా అవినీతికి ఆస్కారం లేకుండా పారదర్శకంగా ఎర్రచందనం విక్రయించాలి.
- ఆదాయం వచ్చే అంశాలపై అధ్యయనం చేసి, మరింత శ్రద్ధతో పని చేయాలి. నిరంతరం సమీక్షలు నిర్వహించుకుంటూ ఎప్పటికప్పుడు అంచనాలు సిద్ధం చేసుకోవాలి.
గత ఆర్థిక ఏడాది కంటే ఈ ఏడాది రూ.1,800 కోట్ల ఆదాయం తగ్గినప్పటికీ, పరిస్థితి మెరుగు పడుతోందని అధికారులు సీఎంకు వివరించారని సాక్షి వివరించింది.
సామాన్యుల కోసం ఎకానమీ ఏసీ-3 టైర్ కోచ్‌లు
సామాన్యులకు ఏసీ-3 టైర్ ప్రయాణం సౌకర్యాన్ని అందించేందుకు రైల్వే శాఖ ప్రత్యేక కోచ్‌లు ఆవిష్కరించిందని నమస్తే తెలంగాణ దినపత్రిక కథనం ప్రచురించింది.
ఎకానమీ ఏసీ 3-టైర్ కోచ్‌లను రైల్వే శాఖ ఆవిష్కరించింది.
ఏసీ రైలు ప్రయాణాన్ని సామాన్యులకు అందుబాటులోకి తెచ్చేందుకు కొత్త కోచ్‌లను మెయిల్, ఎక్స్‌ప్రెస్ రైళ్ల స్లీపర్ క్లాస్ కోచ్‌ల స్థానంలో ప్రవేశపెట్టనున్నారు.
అత్యుత్తమ ప్రమాణాలతో తయారుచేసిన కొత్త 3-టైర్ కోచ్‌లలో 83 చొప్పున బెర్త్‌లు ఉంటాయి.
ప్రస్తుతమున్న 3-టైర్ కోచ్‌లలో బెర్త్‌లు 64, స్లీపర్ క్లాస్‌లో 72 చొప్పున ఉన్నాయి.
కొత్త కోచ్‌లలో ప్రతి బెర్త్‌కు ప్రత్యేకంగా ఏసీ వెంట్‌లు, రీడింగ్ లైట్లు, యూఎస్‌బీ చార్జర్ ఉంటాయి.
ఫైర్-ప్రూఫ్ బెర్త్‌లు, పై బెర్త్‌లకు ఎక్కేందుకు ఆధునీకరించిన నిచ్చెనలు ఇతర ప్రత్యేకతలు. కొత్త కోచ్‌లను ఇంజనీరింగ్ అద్భుతంగా అభివర్ణిస్తున్నారని నమస్తే తెలంగాణ రాసింది.
ఇవి కూడా చదవండి:
- చమోలీ గ్లేసియర్: ఉత్తరాఖండ్‌లో ఈ 'ప్రళయం' ఎందుకొచ్చింది, నిపుణులు ఏమంటున్నారు
- సైన్యంలో చేరాలని రెండు సార్లు ఫెయిలైన వ్యక్తి ఇప్పుడు దేశాన్నే గుప్పిట్లో పెట్టుకున్నాడు
- బుమ్రా, షమీ, ఉమేశ్, ఇషాంత్... ఇంగ్లండ్‌ను భయపెడుతున్న భారత పేసర్లు
- ఎర్రకోటను షాజహాన్ ఎందుకు కట్టించారు.. చరిత్రలో అక్కడ జరిగిన రాజకీయ కుట్రలెన్ని.. తెగిపడిన తలలెన్ని
- దీప్ సిద్ధూ ఎవరు? ఎర్రకోట ఘటన తరువాత చర్చల్లోకి ఎందుకొచ్చారు?
- ‘18 మందిని చంపిన సీరియల్ కిల్లర్’: ఒంటరి మహిళలతో మాట కలుపుతాడు... కోరిక తీర్చుకుని కడతేరుస్తాడు...
- బడ్జెట్ 2021-22: సామాన్యులకు ఈ బడ్జెట్‌తో చేకూరే ప్రయోజనాలు ఇవే..
- పాకిస్తాన్ గురించి నేపాల్ ప్రజలు ఏమనుకుంటారు?
- తీరా కామత్: రూ.16 కోట్ల ఇంజెక్షన్ ఈ పాపాయిని కాపాడుతుందా?
- పదకొండేళ్ల పర్యావరణ ఉద్యమకారుడిని చంపేస్తామంటూ బెదిరింపులు
- సెక్స్‌కు 'విశ్వగురువు' ప్రాచీన భారతదేశమే
- పేద దేశాలకు దక్కకుండా ధనిక దేశాలు వ్యాక్సీన్‌ను లాగేసుకుంటున్నాయా?
- అంబేడ్కర్ తొలి పత్రిక ''మూక్ నాయక్''కు 101 ఏళ్లు: అప్పట్లో దళితులు మీడియాను ఎలా నడిపించేవారు?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)